Sundarlal Bahuguna
-
పర్యావరణ ఉద్యమాలకు ప్రాతఃస్మరణీయుడు
1981లో నైరోబీ నగ రంలో ప్రపంచ శక్తి సదస్సు జరుగుతోంది. పైజామా– కుర్తా వేసుకొన్న వ్యక్తి కట్టెల మోపు భుజాన వేసు కుని సమావేశ మందిరం లోకి ప్రవేశించడం ఎంద రినో ఆకర్షించింది. అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న వారిని పేదరికం, వెనుకబాటుతనం ఎలా దెబ్బ తీస్తున్నాయో పాశ్చాత్య దేశాల ప్రతినిధులకు చెప్పాలని సుందర్‌లాల్ బహుగుణ ప్రయత్నం! మే 21న రిషీకేశ్‌లోని ఎయిమ్స్‌లో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ చరిత్ర విలువైంది. 1927 జనవరి 9న టెహ్రీ (ఇప్పుడు ఉత్తరా ఖండ్ రాష్ట్ర జిల్లా) ప్రాంతం మరోడ గ్రామంలో బహుగుణ జన్మించారు. వారి పూర్వీకులు బెంగాలీ బందోపాధ్యాయ తెగవారు. పొట్టకోసం ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి (గఢ్వాల్) వచ్చినపుడు, తమ ఆయుర్వేద పరిజ్ఞానంతో రాజుగారి అనారోగ్యాన్ని నయం చేశారట. రాజు సంతోషపడి ‘బహుగుణ’ ప్రాంతాన్ని వారికి దానంగా ఇచ్చారు. క్రమంగా ఇంటిపేరు మారిపోయేంతగా అక్కడ కలసి పోయారు. చెట్లు, ఆకులు, మూలికల విలువ తెలి సిన కుటుంబం నుంచి వచ్చినవాడు సుందర్‌లాల్. లాభం కోసం అడవులను నరికిన చరిత్ర టెహ్రీ సంస్థానాధీశులది. 1930ల్లో ఇలాంటి ఘటనల్లో 17మంది చంపబడ్డారు, 80 మంది జైలు పాల య్యారు. ఈ నేపథ్యంలో 13 ఏళ్ల వయసునుంచే సుందర్‌లాల్ రాజకీయపరంగా చురుకుగా ఉన్నారు. గాంధీజీ శిష్యుడు శ్రీదేవ్ సుమన్ ఇతనికి మార్గదర్శి. స్వాతంత్య్రోద్యమం, సర్వోదయో ద్యమం మాత్రమే కాక మీరాబెన్ పర్యావరణ కార్యక్రమాలు సుందర్‌లాల్‌కు స్ఫూర్తి. భార్య విమలాబెన్.. సరళాబెన్ శిష్యురాలు. మీరాబెన్, సరళాబెన్ ఇద్దరూ గాంధీ స్ఫూర్తితో మనదేశం వచ్చి ఉద్యమంలో పాల్గొన్న మహిళా మణులు. పర్యావ రణ విషయమే కాదు, దళితులు ముఖ్యంగా దళిత స్త్రీలకోసం పోరాడి 1950 దశకంలో బుదకేదార్ దేవాలయంలో తొలిసారి హరిజన ప్రవేశం సాధిం చిన ఘనత సుందర్లాల్ది. పర్వత ప్రాంతాల మద్యపాన సమస్య గురించి, మూఢనమ్మకాల నిర్మూలన గురించి కూడా పని చేశారు. స్త్రీలోకం సాయంతో విజయాలు సాధించ వచ్చునని భావించడమే కాదు... ఫలితాలు సాధిం చిన సమన్వయవాది సుందర్‌లాల్. 1974 మార్చి 26న అనుకోకుండా గౌరదేవి తీసుకున్న నిర్ణయం ప్రపంచానికి దారి చూపింది. అలకానంద నది పైభాగాన ఉన్న 2,500 చెట్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసింది. ఆ చెట్లు కొట్టుకోవడానికి కాంట్రాక్టర్లు రైని గ్రామానికి వచ్చారు. దీనిని గౌర దేవి చూసి, మిగతా గ్రామస్థులకు చెప్పింది. అలా ముగ్గురు మహిళలు–గౌరదేవి, సుదేశదేవి, బిచ్ని దేవి ఒక రాత్రంతా చెట్లను కౌగలించు(చిప్కో)కొని రక్షించడంతో మిగతావారు మరుసటి రోజు నుంచి చెట్లను కావులించుకోవడం ప్రారంభించారు. అలా మొదలైంది చిప్కో ఉద్యమం. విమలాబెన్ భర్తకు చెప్పి, ఈ ఉద్యమంలోకి ప్రవేశించింది. అలా సుందర్‌లాల్ ఈ చిప్కో ఉద్యమం కొనసాగడానికి, ఇతర ప్రాంతాలకు వ్యాపించడానికి దోహద పడ్డారు. పాదయాత్రతో యువకులను, మహిళ లను ఉద్యమంలో భాగస్వాములను చేశారు. ఎమర్జెన్సీ రావడంతో చిప్కో ఉద్యమం కూడా మందగించింది. అయితే 1978లో పోలీసులు చిప్కో ఉద్యమంలో పాల్గొన్న మహిళలపై చేసిన దురాగతాలు మళ్ళీ వార్తల్లోకెక్కాయి. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హెచ్.ఎన్. బహుగుణ దీనిపై కమిటీ వేశారు. ఈ సందర్భంలో 4,800 కిలోమీటర్ల పాదయాత్రను సుందర్‌లాల్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఒక 15 ఏళ్లు చెట్లు కొట్టకుండా నిషేధం విధించేలా చేశారు. ప్రపంచ స్థాయి చిప్కో ఉద్యమంగా జర్మనీ, అమెరికా, ఇంగ్లాండు, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలకు స్ఫూర్తిగా మారింది. రిచర్డ్ సెయింట్ బెర్బ్ బేకర్ రాసిన విషయాలు 108 దేశాలకు వెళ్ళాయని అంచనా. చిప్కో ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా అధ్యయన అంశంగా మారింది. సుగతా కుమారి, బాబా ఆమ్టే, మేధా పాట్కర్ వంటి ఎంతోమందికి చిప్కో ఉద్యమం స్ఫూర్తి. టెహ్రీ డ్యామ్ నిర్మాణ విషయంలో కూడా సుందర్‌లాల్ బహుగుణ చేసిన పోరాటం పెద్దదే! 1978లో స్వాతంత్య్ర సమరయోధులు వి.డి. సక్లాని నాయకత్వాన మొదలైన ఈ ఉద్యమం 1989లో వారు అనారోగ్యం పాలు కావడంతో బహుగుణ నాయకత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా 74 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. పండు వయసులో కనుమూసిన సుందర్‌లాల్ బహుగుణ నిత్యపోరాటయోధుడు. కశ్మీరు నుంచి కోహిమా పాదయాత్ర చేసినపుడు దాదాపు 30 కిలోల బరువు మోసుకుని తిరగడం వారి శారీరక ఆరోగ్యాన్ని చెబుతుంది. ఏ ప్రాంతపు అడవులు, నదులు, పర్వతాలు ఆ ప్రాంతం వారివే. వాటిని మనం నాశనం కాకుండా చూసుకుంటే మన సంక్షే మాన్ని అవి చూసుకుంటాయి. అందుకే ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ (నాశనం కాని జీవావ రణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని పదేపదే చెప్పేవారు. మరి మనకు వినేస్థాయి వివేకం ఉందా! వ్యాసకర్త : డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్ : 94407 32392 -
Sunderlal Bahuguna: ‘చిప్కో’ ఉద్యమ కర్త ఇకలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. 13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 84 రోజుల నిరశన దీక్ష చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు. -
పర్యావరణ యోధుడు
ఎవరి ఔన్నత్యాన్నయినా చెప్పాలంటే వారిని హిమ శిఖరాలతో పోలుస్తారు. అటువంటి పర్వతసానువుల్లో పుట్టి, ఆ శిఖరాల పరిరక్షణకు పోరాటాలు రగిల్చి దేశంలోనే పర్యావరణ ఉద్యమాలకు ఆద్యుడిగా నిలిచిన సుందర్‌లాల్ బహుగుణ 94వ యేట శుక్రవారం కరోనా వైరస్ మహమ్మారికి బలయ్యారు. ప్రకృతిని గాఢంగా ప్రేమించి, దాని పరిరక్షణ కోసం తన యావజ్జీవి తాన్నీ అంకితం చేసిన యోధుడొకరు... మనిషి ప్రకృతి పట్ల సాగించే అపచారం పర్యవసానంగా పుట్టుకొస్తున్న అనేకానేక వ్యాధుల్లో ఒకటైన కరోనాకు బలికావడం దురదృష్టకరం, ఊహకందని విషయం. బ్రిటిష్ వలసపాలకులకు వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘకాలం సాగిన పోరాటాల పరం పరలో గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన అహింసాయుత ఉద్యమం ఒక భాగం కాగా... అందులో సంగమించిన అనేకానేక పాయల్లో సుందర్‌లాల్ బహుగుణ ఒకరు. ప్రపంచంలో ఎత్తయిన పర్వత ప్రాంతాలనుంచి వచ్చిన బహుగుణ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో శిఖరాయమానంగా వున్న దని గాంధీజీ అన్నారంటే అది బహుగుణ క్రియాశీలతకు దక్కిన అపురూపమైన ప్రశంస. గాంధీజీ స్ఫూర్తితో బహుగుణ హిమాలయాల్లో 4,700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమాలు పాశ్చాత్య ప్రభావిత ప్రహసనాలనీ, వెనక బడిన దేశాలు ఎప్పటికీ ఎదగరాదన్న కుట్ర అందులో దాగి వున్నదనీ కొందరు నిందిస్తుంటారు. కానీ ప్రపంచంలో ఈ మాదిరి ఉద్యమాలు రావడానికి చాన్నాళ్లముందే సుందర్ లాల్ బహుగుణ హిమాలయ శిఖరాల పరిరక్షణకు ఉద్యమించారు. ఏదీ శూన్యం నుంచి ఊడిపడదు. తన చుట్టూ వుండే పరిస్థితులనూ, పరిణామాలనూ లోచూపుతో వీక్షిస్తే... వాటి పూర్వాపరాలను గ్రహిస్తే ఎవరైనా ఎంతటి శక్తిమంతమైన ఉద్యమ నాయకులవుతారో చెప్పడానికి సుందర్‌లాల్ బహుగుణ జీవితమే ఉదాహరణ. ఆయన కళ్లు తెరవ డానికి దశాబ్దాల ముందే బ్రిటిష్ వలసపాలకులు హిమాలయ పరిసరాల్లో వున్న అపార ప్రకృతి సంపద కబళించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 19వ శతాబ్ది చివరిలో, 20వ శతాబ్ది మొదట్లో దేశంలో విస్తరించిన రైల్వేలకు అవసరమైన కలప కోసం హిమ వనాలపైనే పడ్డారు. 1887లో అప్పటి వలసవాద ప్రభుత్వం తీసుకొచ్చిన భారత అటవీ చట్టం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూకబ్జాకు నాంది పలికింది. కోట్లాది వృక్షాలు కూల్చి పాలకులు సాగించిన విధ్వంసం ఫలితంగా ఆ ప్రాంత ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ తర్వాత కాలంలో తెహ్రీ సంస్థానాధీశుడు సైతం తన వంతుగా అడవుల్ని తెగనరికించాడు. దీన్ని ప్రతిఘటించినందుకు 1930లో వందమందిని కాల్చి చంపారని చరిత్ర చెబుతోంది. అడవుల రక్షణ కోసం ఇలా ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్రగల ప్రాంతంలో పుట్టిన బహుగుణ పర్యావరణ పరిరక్షణే తన జీవిత ధ్యేయంగా మలుచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ ఉద్యమానికైనా బలమైన నినాదం ప్రాణం. సుందర్‌లాల్ బహుగుణ ప్రారం భించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వేలాది గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించడానికి కారణం ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ అన్న నినాదమే. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మాన వాళిని అన్నివిధాలా కాపాడగల శక్తిమంతమైన ఉపకరణమవుతుందన్న చైతన్యాన్ని రగల్చడంలో ఆ నినాదం తోడ్పడింది. గఢ్వాల్ ప్రాంతంలో వృక్షాలను కూల్చడాన్ని నిరసిస్తూ 1972లో చిప్కో ఉద్యమం ప్రారంభమైనప్పుడు అందులో గ్రామీణ మహిళలను భాగస్వాముల్ని చేయడంలో బహు గుణ దంపతులు విజయం సాధించారు. అడవుల విధ్వంసాన్ని అంగీకరించబోమంటూ వృక్షాలను హత్తుకుని వేలాదిమంది తెలియజేసిన నిరసన ఆరోజుల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన హిమాలయ పరిరక్షణోద్యమంతోనే నిలిచిపోలేదు. నదీ సంరక్షణకు నడుంబిగించాడు. ఆనకట్టలకు వ్యతిరేకంగా పోరాడాడు. అంతకు చాన్నాళ్లముందే అస్పృశ్యత నివారణకూ, మద్యపాన దుర్వ్యసనా నికీ వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాడు. దేశంలోని యువత, విద్యార్థిలోకం తిరగ బడుతున్న 70వ దశకంలో సుందర్‌లాల్ బహుగుణ సాగించిన అహింసాయుత చిప్కో ఉద్యమంపై అసహనం వ్యక్తం చేసినవారు లేకపోలేదు. ఆకలి, దారిద్య్రాల కోరల్లో చిక్కుకున్న ప్రజల కోసం పోరాడకుండా చెట్ల పరిరక్షణ కోసం జనసమీకరణ చేయడమేమిటన్న ప్రశ్నలూ తలెత్తాయి. కానీ పాలకుల అభివృద్ధి నమూనాలు ప్రకృతి విధ్వంసానికి దారితీసి, అంతిమంగా ప్రజల జీవికను దెబ్బతీస్తాయన్న స్పృహను కలిగించడంలో చిప్కో ఉద్యమం విజయం సాధించింది. ప్రకృతిని అమ్మగా భావించి కొలవడం దేశ కాలాలకు అతీతంగా సాగుతున్నదే. కానీ ఆ ప్రకృతిలో భాగమైన కొండకోనల్ని, వృక్ష, జంతుజాలాలనూ ప్రాణప్రదంగా భావించి వాటి సంరక్షణ లోనే తన ఉనికి కూడా ఆధారపడి వున్నదనే చైతన్యాన్ని పొందడమే అసలైన ఆధ్యాత్మికతగా భావిం చిన బహుగుణ చివరివరకూ అందుకోసమే దృఢంగా నిలబడ్డారు. ఉద్యమక్రమంలో ఆయన పట్టు విడుపులు ప్రదర్శించి వుండొచ్చు. పాలకుల వాగ్దానాలు విశ్వసించి ఆనకట్టల నిర్మాణం ఆగిపోతుంద నుకుని వుండొచ్చు. ఆయన ఉద్యమ ఫలితంగా తీసుకొచ్చిన అనేక చట్టాలు ఆచరణలో సక్రమంగా అమలు కాకపోయి వుండొచ్చు. కానీ అవేవీ ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేవు. దేశంలో పర్యా వరణ పరిరక్షణ భావన ఇంతగా పెరిగిందంటే అది ఆయన నిరంతర కృషి పర్యవసానంగానే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. -
చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూత
-
కరోనాతో ‘చిప్కో’ సుందర్‌లాల్ బహుగుణ మృతి
తెహ్రీ డ్యామ్: ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ కరోనాతో కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కొవిడ్ బారినపడ్డ బహుగుణ.. రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు(శుక్రవారం) కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. గతకొంతకాలంగా హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్నారు. ఎనభైవ దశకంలో తెహ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. చెట్లను నరికివేయొద్దనే నినాదంతో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. హిందీలో చిప్కో అంటే కౌగిలించుకోవడం అని అర్థం. సుందర్‌లాల్ బహుగుణ లాంటి పర్యావరణవేత్తను కోల్పోవడం ఈ దేశానికి లోటని పర్యావరణవేత్తలు విచారం వ్యక్తం చేశారు. సుందర్‌లాల్ బహుగుణ 1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించారు. వృక్షాలే కాదు.. అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కడ దాకా పరితపించారాయన.