సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి
ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది.
84 రోజుల నిరశన దీక్ష
చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు.
ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment