chipco movement
-
సర్వోదయ నేత మురారీ లాల్ కన్నుమూత
గోపేశ్వర్: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్య మాల నేత మురారీ లాల్(91) కన్నుమూశారు. శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మురారీ లాల్ తుదిశ్వాస విడిచారు. చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మురారీ లాల్ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. -
Sunderlal Bahuguna: ‘చిప్కో’ ఉద్యమ కర్త ఇకలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, చిప్కో ఉద్యమానికి ఊపిరిపోసిన సుందర్‌లాల్ బహుగుణ(94) కన్నుమూశారు. సుందర్‌లాల్ బహుగుణకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ నెల 8వ తేదీన రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మధ్యాహ్నం 12.05 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. బహుగుణ మృతికి ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిషికేశ్‌లో గంగానదీ తీరాన పూర్ణానంద్ ఘాట్‌లో బహుగుణకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. 13 ఏళ్లకే స్వాతంత్య్ర పోరాటంలోకి ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో 1927 జనవరి 9వ తేదీన జన్మించిన బహుగుణ 13 ఏళ్ల వయస్సులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ అహింసా వాదాన్ని జీవితాంతం ఆచరించారు. 1947లో లాహోర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని తెహ్రీ సంస్థాన రాచరికానికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో ఏర్పడిన ప్రభుత్వంలో ప్రచారశాఖ మంత్రి అయ్యారు. 1974లో హిమాలయ ఘర్వాల్ ప్రాంతంలో చెట్ల నరికివేతను అడ్డుకొనేందుకు శాంతియుత నిరసన ఉద్యమం చిప్కోను ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు చెట్లను నరికివేసే సమయంలో వాటిని కౌగిలించుకోవడం ద్వారా కాపాడుకోవడమే దీని లక్ష్యం. ఇలా వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. 84 రోజుల నిరశన దీక్ష చెట్లను నరికివేయడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ 1981లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీని తీసుకోవడానికి బహు గుణ నిరాకరించారు. సొంత జిల్లా తెహ్రీలో ప్రభుత్వం తలపెట్టిన డ్యాంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదముంది. దీంతో తెహ్రీ డ్యామ్ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ 84 రోజులపాటు ఉపవాస దీక్ష సాగించారు. హిమాలయాల పర్యావరణ పరి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన పలు పర్యాయాలు పాదయాత్రలు కూడా చేపట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ సహా పలు అవార్డులు ఆయన్ను వరించాయి. బహుగుణ మరణం మన జాతికి తీరని నష్టం. ప్రకృతితో మమేకం కావాలనే మన వారసత్వ విలువల ను పరిరక్షించేందుకు ఆయన కృషి చేశారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సుందర్‌లాల్ బహుగుణ ‘అద్భుతమైన సంఘ సేవకుడు’అని ప్రముఖ పర్యావరణవేత్త చండీప్రసాద్ భట్ అభివర్ణించారు. -
పర్యావరణ యోధుడు
ఎవరి ఔన్నత్యాన్నయినా చెప్పాలంటే వారిని హిమ శిఖరాలతో పోలుస్తారు. అటువంటి పర్వతసానువుల్లో పుట్టి, ఆ శిఖరాల పరిరక్షణకు పోరాటాలు రగిల్చి దేశంలోనే పర్యావరణ ఉద్యమాలకు ఆద్యుడిగా నిలిచిన సుందర్‌లాల్ బహుగుణ 94వ యేట శుక్రవారం కరోనా వైరస్ మహమ్మారికి బలయ్యారు. ప్రకృతిని గాఢంగా ప్రేమించి, దాని పరిరక్షణ కోసం తన యావజ్జీవి తాన్నీ అంకితం చేసిన యోధుడొకరు... మనిషి ప్రకృతి పట్ల సాగించే అపచారం పర్యవసానంగా పుట్టుకొస్తున్న అనేకానేక వ్యాధుల్లో ఒకటైన కరోనాకు బలికావడం దురదృష్టకరం, ఊహకందని విషయం. బ్రిటిష్ వలసపాలకులకు వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘకాలం సాగిన పోరాటాల పరం పరలో గాంధీజీ ఆధ్వర్యంలో సాగిన అహింసాయుత ఉద్యమం ఒక భాగం కాగా... అందులో సంగమించిన అనేకానేక పాయల్లో సుందర్‌లాల్ బహుగుణ ఒకరు. ప్రపంచంలో ఎత్తయిన పర్వత ప్రాంతాలనుంచి వచ్చిన బహుగుణ వ్యక్తిత్వం కూడా అదే స్థాయిలో శిఖరాయమానంగా వున్న దని గాంధీజీ అన్నారంటే అది బహుగుణ క్రియాశీలతకు దక్కిన అపురూపమైన ప్రశంస. గాంధీజీ స్ఫూర్తితో బహుగుణ హిమాలయాల్లో 4,700 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయడాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమాలు పాశ్చాత్య ప్రభావిత ప్రహసనాలనీ, వెనక బడిన దేశాలు ఎప్పటికీ ఎదగరాదన్న కుట్ర అందులో దాగి వున్నదనీ కొందరు నిందిస్తుంటారు. కానీ ప్రపంచంలో ఈ మాదిరి ఉద్యమాలు రావడానికి చాన్నాళ్లముందే సుందర్ లాల్ బహుగుణ హిమాలయ శిఖరాల పరిరక్షణకు ఉద్యమించారు. ఏదీ శూన్యం నుంచి ఊడిపడదు. తన చుట్టూ వుండే పరిస్థితులనూ, పరిణామాలనూ లోచూపుతో వీక్షిస్తే... వాటి పూర్వాపరాలను గ్రహిస్తే ఎవరైనా ఎంతటి శక్తిమంతమైన ఉద్యమ నాయకులవుతారో చెప్పడానికి సుందర్‌లాల్ బహుగుణ జీవితమే ఉదాహరణ. ఆయన కళ్లు తెరవ డానికి దశాబ్దాల ముందే బ్రిటిష్ వలసపాలకులు హిమాలయ పరిసరాల్లో వున్న అపార ప్రకృతి సంపద కబళించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా 19వ శతాబ్ది చివరిలో, 20వ శతాబ్ది మొదట్లో దేశంలో విస్తరించిన రైల్వేలకు అవసరమైన కలప కోసం హిమ వనాలపైనే పడ్డారు. 1887లో అప్పటి వలసవాద ప్రభుత్వం తీసుకొచ్చిన భారత అటవీ చట్టం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూకబ్జాకు నాంది పలికింది. కోట్లాది వృక్షాలు కూల్చి పాలకులు సాగించిన విధ్వంసం ఫలితంగా ఆ ప్రాంత ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆ తర్వాత కాలంలో తెహ్రీ సంస్థానాధీశుడు సైతం తన వంతుగా అడవుల్ని తెగనరికించాడు. దీన్ని ప్రతిఘటించినందుకు 1930లో వందమందిని కాల్చి చంపారని చరిత్ర చెబుతోంది. అడవుల రక్షణ కోసం ఇలా ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్రగల ప్రాంతంలో పుట్టిన బహుగుణ పర్యావరణ పరిరక్షణే తన జీవిత ధ్యేయంగా మలుచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఏ ఉద్యమానికైనా బలమైన నినాదం ప్రాణం. సుందర్‌లాల్ బహుగుణ ప్రారం భించిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వేలాది గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించడానికి కారణం ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ అన్న నినాదమే. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మాన వాళిని అన్నివిధాలా కాపాడగల శక్తిమంతమైన ఉపకరణమవుతుందన్న చైతన్యాన్ని రగల్చడంలో ఆ నినాదం తోడ్పడింది. గఢ్వాల్ ప్రాంతంలో వృక్షాలను కూల్చడాన్ని నిరసిస్తూ 1972లో చిప్కో ఉద్యమం ప్రారంభమైనప్పుడు అందులో గ్రామీణ మహిళలను భాగస్వాముల్ని చేయడంలో బహు గుణ దంపతులు విజయం సాధించారు. అడవుల విధ్వంసాన్ని అంగీకరించబోమంటూ వృక్షాలను హత్తుకుని వేలాదిమంది తెలియజేసిన నిరసన ఆరోజుల్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆయన హిమాలయ పరిరక్షణోద్యమంతోనే నిలిచిపోలేదు. నదీ సంరక్షణకు నడుంబిగించాడు. ఆనకట్టలకు వ్యతిరేకంగా పోరాడాడు. అంతకు చాన్నాళ్లముందే అస్పృశ్యత నివారణకూ, మద్యపాన దుర్వ్యసనా నికీ వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాడు. దేశంలోని యువత, విద్యార్థిలోకం తిరగ బడుతున్న 70వ దశకంలో సుందర్‌లాల్ బహుగుణ సాగించిన అహింసాయుత చిప్కో ఉద్యమంపై అసహనం వ్యక్తం చేసినవారు లేకపోలేదు. ఆకలి, దారిద్య్రాల కోరల్లో చిక్కుకున్న ప్రజల కోసం పోరాడకుండా చెట్ల పరిరక్షణ కోసం జనసమీకరణ చేయడమేమిటన్న ప్రశ్నలూ తలెత్తాయి. కానీ పాలకుల అభివృద్ధి నమూనాలు ప్రకృతి విధ్వంసానికి దారితీసి, అంతిమంగా ప్రజల జీవికను దెబ్బతీస్తాయన్న స్పృహను కలిగించడంలో చిప్కో ఉద్యమం విజయం సాధించింది. ప్రకృతిని అమ్మగా భావించి కొలవడం దేశ కాలాలకు అతీతంగా సాగుతున్నదే. కానీ ఆ ప్రకృతిలో భాగమైన కొండకోనల్ని, వృక్ష, జంతుజాలాలనూ ప్రాణప్రదంగా భావించి వాటి సంరక్షణ లోనే తన ఉనికి కూడా ఆధారపడి వున్నదనే చైతన్యాన్ని పొందడమే అసలైన ఆధ్యాత్మికతగా భావిం చిన బహుగుణ చివరివరకూ అందుకోసమే దృఢంగా నిలబడ్డారు. ఉద్యమక్రమంలో ఆయన పట్టు విడుపులు ప్రదర్శించి వుండొచ్చు. పాలకుల వాగ్దానాలు విశ్వసించి ఆనకట్టల నిర్మాణం ఆగిపోతుంద నుకుని వుండొచ్చు. ఆయన ఉద్యమ ఫలితంగా తీసుకొచ్చిన అనేక చట్టాలు ఆచరణలో సక్రమంగా అమలు కాకపోయి వుండొచ్చు. కానీ అవేవీ ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేవు. దేశంలో పర్యా వరణ పరిరక్షణ భావన ఇంతగా పెరిగిందంటే అది ఆయన నిరంతర కృషి పర్యవసానంగానే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. -
చెట్లతో చిప్కో.. కష్టాలు చెప్కో..
చిప్కో అంటే అతుక్కుని ఉండటం లేదా సమీపంలో ఉండటం అని అర్థం. అడవులు, చెట్ల సంరక్షణకు నాడు చేసిన చిప్కో ఉద్యమం మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు కూడా చిప్కో అంటున్నారు.. చెట్లను చుట్టుకో అంటున్నారు. వాటి సంరక్షణ కోసం కాదు.. మన సంరక్షణ కోసం.. మన మనోసంరక్షణ కోసం.. శిన్రిన్–యోకు.. అర్థం కాలేదా.. జపనీస్లెండి.. పైన మనం చెప్పుకున్నదానికీ దీనికీ లంకె ఉంది.. ప్రస్తుతం నగరంలోనూ శిన్రిన్–యోకుకు క్రేజ్ పెరుగుతోంది.. ఇంతకీ ఏంటీ శిన్రిన్–యోకు.. సాక్షి, హైదరాబాద్ : శిన్రిన్–యోకు.. సింపుల్‌గా చెప్పాలంటే.. ఫారెస్ట్ థెరపీ.. నగరవాసుల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనకు చికిత్స ప్రకృతే అన్నది ఈ థెరపీ సిద్ధాంతం. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం లో ఉంది. చికాకుగా, ఆందోళనగా ఉన్నప్పుడు పచ్చని పరిసరాల్లో నడిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. దీన్నే ఫారెస్టు థెరపీగా జపాన్ అవలంబిస్తోంది. అడవుల్లో చెట్ల మధ్య జపనీయులు చేసే ధ్యాన విధానం ఇది. దీనిని ఆ దేశం తమ జాతీయ ప్రజారోగ్య కార్యక్రమంగా గుర్తించింది. దీంతో కలిగే ఉపశమనం, సానుకూల ప్రభావం దృష్ట్యా చాలా దేశాల్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మన దేశంలో పుణే వర్సిటీలో ఈ తరహా ధ్యానం బాగా ప్రాచుర్యంలో ఉంది. వారాంతాల్లో పచ్చని చెట్ల నీడల్లో వనస్నానాలు చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. ఈ థెరపీలో స్వస్థత కలిగించే లక్షణాలున్నాయని వీరు నమ్ముతున్నారు. లాభాలేంటి? ఫారెస్ట్ థెరపీలో నడక, ధ్యానం, వ్యాయమాలు వంటివి ఉంటాయి. జీవన విధానంలో లోటుపాట్ల వల్ల వచ్చే రోగాలను ఈ థెరపీ నిరోధిస్తుంది. అడవిలో ఉండే నిశ్శబ్దమైన వాతావరణం మన శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలై కోలుకున్న వారికి ఈ రకమైన థెరపీ మరింత ఉపయోగకారి. అడవి లేదా వనాల్లో చెట్ల మధ్య చిన్న చిన్న పనులు చేయడం కూడా చక్కటి థెరపీగా పనిచేస్తుంది. ఇక కౌన్సిలింగ్‌కు అడవి మంచి చోటు. అడవిలోని వాతావరణం వల్ల మనసు నిదానించి, సున్నితమైన అంశాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అంటారు జపాన్ కౌన్సిలర్లు. వివిధ పరిశోధనలు కూడా దీనికే పచ్చజెండా ఊపుతున్నాయి. ప్రకృతిలో గడిపినా, కనీసం ఆ ఫొటోలు చూసినా, మనం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం యువత ఒక గంట సేపు పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల వారిలో ఆందోళన స్థాయి తగ్గి, జ్ఞాపకశక్తి పెరిగింది. పచ్చని ప్రకృతి ఫొటోలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని మరో పరిశోధన వెల్లడించింది. చెట్టును చుట్టుకుని సేద తీరితే.. ఇక చెట్టుని చుట్టు కుని సేద తీరితే ఎలా ఉంటుంది, అంటే మీరు చేసి చూస్తే తప్ప ఎవరు చెప్పినా అది అనుభవంలోకి రాదు. మనలో ఉన్న ప్రతికూల భావావేశాలను పక్కకు నెట్టి, ప్రశాంతతను నింపుతుంది ఈ ప్రక్రియ అంటున్నారు నగరానికి చెందిన లైఫ్ కోచ్ శీలా రామ్మోహన్. ఇటీవల కేరళలోని వయనాడ్‌లో ఆమె ఫారెస్ట్ మెడిటేషన్ నిర్వహించారు. మనలో విచ్చలవిడిగా తాండవిస్తున్న నెగటివ్ ఆలోచనలను నియం త్రించేందుకు, పాజిటివ్ ఆలోచనల్ని ఒక దోవలోకి తీసుకురావడానికి ఈ విధమైన మెడిటేషన్ ఉపయోగపడుతుందంటారు ఆమె. ‘‘మనం ప్రకృతిలో భాగమే. ఒక చెట్టుగా మనల్ని మనం భావించి మెడిటేషన్ ప్రారంభించాలి. ఆకాశంలో ఏదైనా ఎటైనా గింగిర్లు తిరుగుతుంది. కానీ చెట్టు వేర్లు భూమిలో పరుచుకుంటాయి. ఒక పెద్ద చెట్టు ఎలా దృఢంగా, సంపూర్ణంగా, విశాలంగా, నీడని, శక్తిని ఇస్తూ, పాజిటివ్‌గా ఉంటుందో అదే విధంగా మన ఆలోచనలు, ఒక దిశలో, బలంగా, పాజిటివ్‌గా మలుచుకునేందుకు దోహదం చేస్తుంది ఫారెస్ట్ మెడిటేషన్. ఇక అడవిలో సహజమైన వాతావరణం, ప్రకృతిలో ఉన్న అపారమైన శక్తి, మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగించి, సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఫారెస్ట్ థెరపీ అందించే పునరుత్తేజాన్ని పొందేందుకు అడవుల వరకూ వెళ్లలేని వారు, ఇంటి దగ్గర్లో ఉన్న పార్క్‌లు, ఉద్యానవనాల్లోనూ దీనిని ప్రాక్టీస్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చని ’’ అన్నారు. –శీలా రామ్మోహన్, లైఫ్ కోచ్ ఒకలాంటి తన్మయత్వం కలిగింది.. ‘‘జపనీస్ ప్రాక్టీస్ గురించి తెలియదు. కాని ప్రకృతి అన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. ఫారెస్ట్ మెడిటేషన్ డిఫరెంట్‌గా అనిపించింది. ఏదో చెట్ల మధ్య కాసేపు సైలెంట్‌గా గడిపి వస్తాం అని అనుకున్నాను. కానీ ఇది చాలా రిలాక్సింగ్ మెథడ్. మనలో నిండిన కోపం, చికాకు, విసుగు లాంటి ప్రతికూల భావనల తీవ్రత తగ్గి ఉపశమనం కలగడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నా సెన్సెస్ మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది. చెట్టుని వాటేసుకోవటం, తర్వాత ఆ చెట్టు పక్కనే కూర్చోవటం, చెట్టుని తడుతున్నప్పుడు ఒకలాంటి తన్మయత్వం కలిగింది’’ – సునీత గ్రేస్, యోగా థెరపిస్ట్ -
మూడు రోజులుగా చెట్టు మీదే మహిళలు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ముగ్గురు మహిళలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చెట్టెక్కి కూర్చున్నారు. పోలీసులు బతిమాలినా బామాలినా, గడ్డం పట్టుకొని ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారు వినడం లేదు. కిందకు దిగి రావడం లేదు. బల ప్రయోగం చేసి వారిని దించుదామంటే వారు ఎక్కిన చెట్టు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనిది మరి! భూమా రావత్, సావిత్రి నేగి, భువనేశ్వరి నేగి అనే ముగ్గురు మహిళలు బుధవారం ఈ చెట్టెక్కి కూర్చున్నారు. ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమించిన కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం నుంచి గురువారం వరకు ప్రభుత్వంతో చర్చోపచర్చలు జరిపిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు వారి డిమాండ్లను అంగీకరించారు. ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ రవినాథ్ రామన్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ పుష్పక్ జ్యోతి, ప్రభుత్వ కార్యదర్శి వినోద్ కుమార్ గురువారం ప్రత్యక్షంగా వెళ్లి ఆందోళన చేస్తున్న మహిళలకు తెలిపారు. అయినా వారి వైఖరిలో మార్పులేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడితే తప్ప దిగేది లేదని ఖరాకండిగా చెప్పారు. సరే, ప్రస్తుతానికి మంచి నీళ్లు తాగండి! మగతనిద్రలో తూలి చెట్టు పైనుంచి కింద పడకుండా చెట్టుకు కట్టేసుకోమంటూ అధికారులు ఇచ్చిన వాటర్ బాటిళ్లను, తాళ్లను మాత్రం తీసుకున్నారు. శుక్రవారం మీడియాకు కడపటి వార్తలు అందేవరకు కూడా వారు చెట్టుదిగి రాలేదు. స్థానిక ప్రజల సుదీర్ఘపోరాటం అనంతరం 2000 నవంబర్ 19వ తేదీన ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇలా డిమాండ్ల పరిష్కారం కోసం మహిళలు చెట్టెక్కి ఆందోళన చేయడం చూస్తుంటే ‘చిప్కో’ ఉద్యమంలోని ఓ కీలక ఘట్టం మనకు గుర్తుకు రావాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో 1974లో ఆ ఉద్యమం ఉప్పెనలా సాగింది. అప్పటి యూపీలోని చమోలీ జిల్లాలో రాష్ట్ర అటవీశాఖ లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్లు చెట్లను కొట్టేయకుండా మహిళలంతా చెట్లను కౌగిలించుకున్నారు. తమను నరకండి గానీ చెట్లను నరకొద్దంటూ వారు చేసిన నినాదం పర్యావరణ పరిరక్షకుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.