చిప్కో అంటే అతుక్కుని ఉండటం లేదా సమీపంలో ఉండటం అని అర్థం. అడవులు, చెట్ల సంరక్షణకు నాడు చేసిన చిప్కో ఉద్యమం మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు కూడా చిప్కో అంటున్నారు.. చెట్లను చుట్టుకో అంటున్నారు. వాటి సంరక్షణ కోసం కాదు.. మన సంరక్షణ కోసం.. మన మనోసంరక్షణ కోసం.. శిన్రిన్–యోకు.. అర్థం కాలేదా.. జపనీస్‌లెండి.. పైన మనం చెప్పుకున్నదానికీ దీనికీ లంకె ఉంది.. ప్రస్తుతం నగరంలోనూ శిన్రిన్–యోకుకు క్రేజ్ పెరుగుతోంది.. ఇంతకీ ఏంటీ శిన్రిన్–యోకు..
సాక్షి, హైదరాబాద్ : శిన్రిన్–యోకు.. సింపుల్‌గా చెప్పాలంటే.. ఫారెస్ట్ థెరపీ.. నగరవాసుల్లో ఉండే ఒత్తిడి, ఆందోళనకు చికిత్స ప్రకృతే అన్నది ఈ థెరపీ సిద్ధాంతం. ఇది జపాన్‌లో బాగా ప్రాచుర్యం లో ఉంది. చికాకుగా, ఆందోళనగా ఉన్నప్పుడు పచ్చని పరిసరాల్లో నడిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. దీన్నే ఫారెస్టు థెరపీగా జపాన్ అవలంబిస్తోంది. అడవుల్లో చెట్ల మధ్య జపనీయులు చేసే ధ్యాన విధానం ఇది. దీనిని ఆ దేశం తమ జాతీయ ప్రజారోగ్య కార్యక్రమంగా గుర్తించింది. దీంతో కలిగే ఉపశమనం, సానుకూల ప్రభావం దృష్ట్యా చాలా దేశాల్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక మన దేశంలో పుణే వర్సిటీలో ఈ తరహా ధ్యానం బాగా ప్రాచుర్యంలో ఉంది. వారాంతాల్లో పచ్చని చెట్ల నీడల్లో వనస్నానాలు చేస్తూ కనిపిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. ఈ థెరపీలో స్వస్థత కలిగించే లక్షణాలున్నాయని వీరు నమ్ముతున్నారు.
లాభాలేంటి?
- ఫారెస్ట్ థెరపీలో నడక, ధ్యానం, వ్యాయమాలు వంటివి ఉంటాయి.
- జీవన విధానంలో లోటుపాట్ల వల్ల వచ్చే రోగాలను ఈ థెరపీ నిరోధిస్తుంది.
- అడవిలో ఉండే నిశ్శబ్దమైన వాతావరణం మన శరీరానికి, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
- ఇక ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలై కోలుకున్న వారికి ఈ రకమైన థెరపీ మరింత ఉపయోగకారి.
- అడవి లేదా వనాల్లో చెట్ల మధ్య చిన్న చిన్న పనులు చేయడం కూడా చక్కటి థెరపీగా పనిచేస్తుంది.
- ఇక కౌన్సిలింగ్‌కు అడవి మంచి చోటు. అడవిలోని వాతావరణం వల్ల మనసు నిదానించి, సున్నితమైన అంశాలను వినడానికి, అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అంటారు జపాన్ కౌన్సిలర్లు.
- వివిధ పరిశోధనలు కూడా దీనికే పచ్చజెండా ఊపుతున్నాయి. ప్రకృతిలో గడిపినా, కనీసం ఆ ఫొటోలు చూసినా, మనం సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం యువత ఒక గంట సేపు పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల వారిలో ఆందోళన స్థాయి తగ్గి, జ్ఞాపకశక్తి పెరిగింది. పచ్చని ప్రకృతి ఫొటోలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని మరో పరిశోధన వెల్లడించింది.
చెట్టును చుట్టుకుని సేద తీరితే..
ఇక చెట్టుని చుట్టు కుని సేద తీరితే ఎలా ఉంటుంది, అంటే మీరు చేసి చూస్తే తప్ప ఎవరు చెప్పినా అది అనుభవంలోకి రాదు. మనలో ఉన్న ప్రతికూల భావావేశాలను పక్కకు నెట్టి, ప్రశాంతతను నింపుతుంది ఈ ప్రక్రియ అంటున్నారు నగరానికి చెందిన లైఫ్ కోచ్ శీలా రామ్మోహన్. ఇటీవల కేరళలోని వయనాడ్‌లో ఆమె ఫారెస్ట్ మెడిటేషన్ నిర్వహించారు. మనలో విచ్చలవిడిగా తాండవిస్తున్న నెగటివ్ ఆలోచనలను నియం త్రించేందుకు, పాజిటివ్ ఆలోచనల్ని ఒక దోవలోకి తీసుకురావడానికి ఈ విధమైన మెడిటేషన్ ఉపయోగపడుతుందంటారు ఆమె.
‘‘మనం ప్రకృతిలో భాగమే. ఒక చెట్టుగా మనల్ని మనం భావించి మెడిటేషన్ ప్రారంభించాలి. ఆకాశంలో ఏదైనా ఎటైనా గింగిర్లు తిరుగుతుంది. కానీ చెట్టు వేర్లు భూమిలో పరుచుకుంటాయి. ఒక పెద్ద చెట్టు ఎలా దృఢంగా, సంపూర్ణంగా, విశాలంగా, నీడని, శక్తిని ఇస్తూ, పాజిటివ్‌గా ఉంటుందో అదే విధంగా మన ఆలోచనలు, ఒక దిశలో, బలంగా, పాజిటివ్‌గా మలుచుకునేందుకు దోహదం చేస్తుంది ఫారెస్ట్ మెడిటేషన్. ఇక అడవిలో సహజమైన వాతావరణం, ప్రకృతిలో ఉన్న అపారమైన శక్తి, మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తొలగించి, సరికొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఫారెస్ట్ థెరపీ అందించే పునరుత్తేజాన్ని పొందేందుకు అడవుల వరకూ వెళ్లలేని వారు, ఇంటి దగ్గర్లో ఉన్న పార్క్‌లు, ఉద్యానవనాల్లోనూ దీనిని ప్రాక్టీస్ చేసుకుంటూ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చని ’’ అన్నారు.
–శీలా రామ్మోహన్, లైఫ్ కోచ్
ఒకలాంటి తన్మయత్వం కలిగింది..
‘‘జపనీస్ ప్రాక్టీస్ గురించి తెలియదు. కాని ప్రకృతి అన్నా, చెట్లన్నా చాలా ఇష్టం. ఫారెస్ట్ మెడిటేషన్ డిఫరెంట్‌గా అనిపించింది. ఏదో చెట్ల మధ్య కాసేపు సైలెంట్‌గా గడిపి వస్తాం అని అనుకున్నాను. కానీ ఇది చాలా రిలాక్సింగ్ మెథడ్. మనలో నిండిన కోపం, చికాకు, విసుగు లాంటి ప్రతికూల భావనల తీవ్రత తగ్గి ఉపశమనం కలగడాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నా సెన్సెస్ మీద పాజిటివ్ ప్రభావాన్ని చూపించింది. చెట్టుని వాటేసుకోవటం, తర్వాత ఆ చెట్టు పక్కనే కూర్చోవటం, చెట్టుని తడుతున్నప్పుడు ఒకలాంటి తన్మయత్వం కలిగింది’’
– సునీత గ్రేస్, యోగా థెరపిస్ట్
Comments
Please login to add a commentAdd a comment