
మూసాపేట: ఎటు చూసినా పచ్చదనం పరిచినట్లుగా...రంగు రంగుల పూలు మనసును పులకరింపజేస్తూ... ఎన్నో రకాల, అరుదైన మొక్కలు మనకు స్వాగతం చెబుతాయి. అక్కడికి వెళితేఇంటికి వచ్చామా..?పార్కుకా.. అన్నట్లు ఉంటుంది. రాత్రిళ్లు వికసించే పూల మొక్కలు, ఉదయం 11గంటల వరకు పరిమళం వెదజల్లే పుష్పాలు, పూల సువాసనలతోనే నిద్రలేపే మొక్కలు ఇలా ఎన్నో రకాల మొక్కలు ఆ ఇంటిలో కొలువై ఉన్నాయి. ప్రకృతిపై ప్రేమతో లక్షలు ఖర్చుపెట్టి ఇంటినే మొక్కలపై పరిశోధనలు చేసే ల్యాబ్‌లా మార్చేశాడు మూసాపేటలోని ఆంజనేయనగర్‌కాలనీకి చెందిన పాండు గౌడ్. వ్యాపారంలో బిజీగా ఉన్నా మొక్కల కోసం రోజూ సమయం కేటాయిస్తున్నాడు.
కట్టిపడేస్తున్న పూల మొక్కలు...
ఇంటిలోకి అడుగుపెట్టడంతోనే మొక్కల మధ్యలో గణపతి విగ్రహం ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. బాల్కనీలో, ఇంటి ముందు, గోడలకు, గుమ్మాలకు బెడ్రూంలు, కిచెన్, హాల్, వాటర్ ట్యాంక్ పైన ఇలా ఖాళీ స్థలం కన్పించకుండా మొక్కలతో నింపేశాడు. చివరికి బాత్రూంలో కూడా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాడంటే మొక్కలపై అతనికున్న మమకారం అర్థం చేసుకోవచ్చు. రకరకాల రంగుల పుష్పాలు, రాతికి రాణి, మార్నింగ్ గ్లోరి, సన్‌రైస్, సంక్రాంతి చెట్లు, బోగిన్‌విలియా, బోస్లే మొక్కలతో పాటు ఔషద, పండ్లు జామ, దానిమ్మ, ఇంటికి అవసరమైన ఆకుకూరలు, పచ్చిమిర్చి ఇలా ఎన్నో రకాల మొక్కలు మనల్ని కట్టిపడేస్తాయి. ఒకసారి ఆ ఇంటికి వెళ్లామంటే అక్కడే ఉండిపోవాలి అని మనస్సు కోరుకుంటుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ ఇంటి వాతావరణం చూసిన ఎవరైనా మేం కూడా ఇలాగే మొక్కలు పెంచుకోవాలనిస్తుదంటారు. కాంక్రీట్ జంగిల్‌లో మొక్కలు పెంచుకోవాలని ఆసక్తి ఉన్నా స్థలం లేదు అన్న వారికి ఆ ఇల్లు ఓ ఆదర్శం. 150 రకాల మొక్కలు, 600 కుండీలలో ఏర్పాటు చేసి వాటి సంరక్షణ చూస్తున్నాడు. మొక్కల ఏర్పాటుకే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశానని చెబుతున్నాడు. కొన్ని రకాల మొక్కలను ఒక్కో మొక్కకు రూ. 5వేల వరకు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాడు. కొన్ని సీజన్‌లో వచ్చే పూలు వచ్చాక వాటి స్థానంలో కొత్త మొక్కలను పెంచుతుంటాడు.
చిన్నతనంనుంచే ప్రకృతిపై మమకారం....
పాండుగౌడ్‌కు చిన్నప్పటి నుంచే మొక్కలు, ప్రకృతిపై మమకారం ఎక్కువ. పదవ తరగతి నుంచే ప్రకృతిపై ప్రేమ పెంచుకున్నాడు. 12 సంవత్సరాల క్రితమే సేంద్రియ వ్యవసాయంపై టెర్రస్ గార్డెన్ చేసి తన ఇంటికి కావాల్సిన కూరగాయాలను పండించాడు. నగరంలోని తన తోటి మిత్రులకు, బంధువులకు సేంద్రియ పంటను అందించాడు. ఎక్కడ వెరైటీ మొక్కలు కన్పించినా పరిశీలించి ఇంటికి తెచ్చుకుంటాడు. ఎవరైనా ఎంజాయ్ అంటూ పార్టీలు..., బీచ్‌లు, మంచు పర్వతాల వెంట వెళ్తారు. కానీ పాండుగౌడ్ అడవులు, వనాలుగా ఉన్న రీసార్ట్‌లోనే ఎంజాయ్ ఉంటుందని అంటున్నాడు.ఆ ప్రేమే ఇంటిని పూలవనంగా మార్చాడు.