మూడు రోజులుగా చెట్టు మీదే మహిళలు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ముగ్గురు మహిళలు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చెట్టెక్కి కూర్చున్నారు. పోలీసులు బతిమాలినా బామాలినా, గడ్డం పట్టుకొని ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వారు వినడం లేదు. కిందకు దిగి రావడం లేదు. బల ప్రయోగం చేసి వారిని దించుదామంటే వారు ఎక్కిన చెట్టు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనిది మరి! భూమా రావత్, సావిత్రి నేగి, భువనేశ్వరి నేగి అనే ముగ్గురు మహిళలు బుధవారం ఈ చెట్టెక్కి కూర్చున్నారు. ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమించిన కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని, 60 ఏళ్లు దాటిన వారికి ప్రత్యేక వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం నుంచి గురువారం వరకు ప్రభుత్వంతో చర్చోపచర్చలు జరిపిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు వారి డిమాండ్లను అంగీకరించారు.
ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ రవినాథ్ రామన్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ పుష్పక్ జ్యోతి, ప్రభుత్వ కార్యదర్శి వినోద్ కుమార్ గురువారం ప్రత్యక్షంగా వెళ్లి ఆందోళన చేస్తున్న మహిళలకు తెలిపారు. అయినా వారి వైఖరిలో మార్పులేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడితే తప్ప దిగేది లేదని ఖరాకండిగా చెప్పారు. సరే, ప్రస్తుతానికి మంచి నీళ్లు తాగండి! మగతనిద్రలో తూలి చెట్టు పైనుంచి కింద పడకుండా చెట్టుకు కట్టేసుకోమంటూ అధికారులు ఇచ్చిన వాటర్ బాటిళ్లను, తాళ్లను మాత్రం తీసుకున్నారు. శుక్రవారం మీడియాకు కడపటి వార్తలు అందేవరకు కూడా వారు చెట్టుదిగి రాలేదు. స్థానిక ప్రజల సుదీర్ఘపోరాటం అనంతరం 2000 నవంబర్ 19వ తేదీన ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే.
ఇలా డిమాండ్ల పరిష్కారం కోసం మహిళలు చెట్టెక్కి ఆందోళన చేయడం చూస్తుంటే ‘చిప్కో’ ఉద్యమంలోని ఓ కీలక ఘట్టం మనకు గుర్తుకు రావాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో 1974లో ఆ ఉద్యమం ఉప్పెనలా సాగింది. అప్పటి యూపీలోని చమోలీ జిల్లాలో రాష్ట్ర అటవీశాఖ లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్లు చెట్లను కొట్టేయకుండా మహిళలంతా చెట్లను కౌగిలించుకున్నారు. తమను నరకండి గానీ చెట్లను నరకొద్దంటూ వారు చేసిన నినాదం పర్యావరణ పరిరక్షకుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.