నిజానికి శాస్త్రవేత్త అంటే న్యూటన్ మాత్రమే అనేంత ప్రచారం ఉంది! చెట్టు మీద నుంచి ఆపిల్ పడటం అనే కథకుండే ఆకర్షణ కారణంగా న్యూటన్‌కు అంత గ్లామర్ నడుస్తోంది. కేంబ్రిడ్జిలో జరిగిందని చెప్పే ఈ వృత్తాంతం గురించి న్యూటన్ మహాశయుడు ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం. అయితే ఆయన కేంబ్రిడ్జిలో చదువుతున్నప్పుడే జోహన్నెస్ కెప్లర్ వివరించిన సూర్యుడు, భూమి గమనాల గురించి లోతయిన విషయాలు అవగతం చేసుకున్నారు. అంటే గురుత్వాకర్షణ భావనను పూర్తిగా పట్టుకున్నది కేంబ్రిడ్జిలోనే. కనుక ఈ ‘ఊహాత్మక యాపిల్’ వ్యవహారం దీనితో ముడిపడిందేమో!
1642 క్రిస్మస్ రోజున అర్ధరాత్రి తర్వాత ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండులో జన్మించారు. అదే సంవత్సరంలో నెలల క్రితమే ప్రాయోగిక విజ్ఞానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్త గెలీ లియో గెలీలి చనిపోవడం ఒక చారిత్రక విశేషం. గెలీలియో, న్యూటన్ కృషి అవిభాజ్యమైనదిగా పరిగణించారు అల్బర్ట్ ఐన్‌స్టీన్. ఎవరు ఎలా పరిగణించినా తను మాత్రం విజ్ఞాన సముద్రం చెంత ఇసుకలో బుల్లిగవ్వలు, ముచ్చటైన శంఖాలు ఏరుకొనే పిల్లవాడినని న్యూటన్ మరో సందర్భంలో చెప్పడం గమనించాలి. గెలీలియో వంటి వారు ప్రతిపాదించిన భావనలను ఎంతో ప్రతిభావంతంగా ‘మెకా నిక్స్’ అనే ఫిజిక్స్ చట్రంలో తన సూత్రీకరణతో అమర్చిన సూక్ష్మమేధావి, ఆలోచనాశీలి న్యూటన్. కాంతి, ఉష్ణం, దృశా శాస్త్రం, కలనగణితం, గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇలా విస్తృత మైన కృషి చేసినవారు న్యూటన్.
బాలుడిగా చాలా పరికరాలతో ఆడుకుంటూ, కొత్తవి తయారు చేస్తూ ఉండేవాడు. చదువులో పెద్దగా ప్రతిభా వంతుడిగా చిన్నతనంలో కనిపించకపోయినా తర్వాత దశలో ఆశ్చర్యకరంగా ఎదిగి 26 సంవత్సరాలకే గణితశాస్త్ర ఆచార్యు డయ్యాడు. ధనాగారం అధిపతిగా సేవలందించి, శాస్త్ర పరి జ్ఞానంతో దొంగలను పట్టారు. 1703లో రాయల్ సంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికయి, చివరివరకు ఆ పదవిలో కొన సాగారు.
1668లో మెర్కర్ రాసిన సంగతులన్నీ తను అంతకు ముందే కనుగొన్నట్టు న్యూటన్‌కు అనిపించింది. గ్రంథకర్త అయిన తన పేరు లేకుండా తన గణితశాస్త్ర పరిశీలనలను రాసి లండన్, యూరప్ ప్రముఖులకు పంపారు. వారి ఆమోదం పొందాక ఆ పరిశీలనలు పుస్తకంగా వెలువడి, మంచి పేరు తెచ్చాయి. కటకాల గురించి ఆయన చేసిన పరిశోధనలు కళ్ళ జోళ్ళు, దూరదర్శినులు మెరుగు కావడానికి తోడ్పడ్డాయి. రాయల్ సొసైటీలో చేరిన తర్వాత మరో శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ బెడద ఎక్కువయ్యింది. అతని నోరు మూయిం చడానికి 1686 ఏప్రిల్ 28న ప్రఖ్యాతమైన పుస్తకం ‘ప్రిన్సిపియా మేథమెటికా’ వెలువడింది. తన కాంతి కణ సిద్ధాంతాన్ని విభేదించి హెగెన్స్ ‘తరంగ సిద్ధాంతం’ వచ్చినా అది ప్రాచుర్యంలోకి రాలేదు.
1727 మార్చి 20న కనుమూసిన న్యూటన్ కృషి కారణంగానే ఓడల ప్రయాణం, వంతెనల నిర్మాణం సులువు కావడమే కాదు; పారిశ్రామిక విప్లవానికి తెరలేచింది. న్యూటన్ వల్లనే వంద సంవత్సరాల లోపు జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం ఆవిష్కరించగలిగారు!
- డా. నాగసూరి వేణుగోపాల్
వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment