నేడు సావిత్రిబాయి ఫూలే జయంతి
మన దేశంలో ఆడపిల్లల చదువు, వారి అభ్యున్నతి గురించి మాట్లాడుకోవాలంటే ముందుగాగుర్తుకు వచ్చేది సావిత్రిబాయి ఫూలే కృషేనని చెప్పవచ్చు. మహిళల అభివృద్ధికి పాటు పడిన మొట్ట మొదటి బహుజన మహిళ ఆమె. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు. మహారాష్ట్ర, సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న ఒక సామాన్య రైతు కుటుంబంలో సావిత్రిబాయి (Savitribai Phules) మహిళా చైతన్య దీప్తి జన్మించారు.
నిరక్షరాస్య అమాయక బాల్యంలో జీవిస్తున్న ఆమెకు 9వ యేటనే 12 సంవత్సరాల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. సావిత్రిబాయి, భర్త ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలై, అహ్మద్‌నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. అనంతరం బాలికా విద్య ఉద్య మానికి పునాది వేశారు.
విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రిబాయి 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణెలో మొట్ట మొదటి పాఠశాలను నెలకొల్పి, చదువు చెప్పటం ప్రారంభించారు. మహిళా హక్కులే మానవ హక్కులని నినదించి అనేక సామాజిక సమస్యలపై కూడా అలుపెరుగని పోరాటం చేశారు. స్త్రీలను చైతన్యపరచడానికి 1852లో ‘మహిళా సేవా మండల్‘ అనే మహిళా సంఘాన్ని స్థాపించారు. లింగ వివక్ష, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సామాజిక అణిచివేతలను, మూఢత్వాన్ని పారద్రోలి సత్యాన్ని శోధించడానికి 1873లో భర్తతో కలిసి సత్య శోధక సమాజాన్ని ప్రారంభించారు. భర్త మరణంతో అంతులేని దుఃఖసాగరంలో ఉండి కూడా ఆయన చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు.
పుణె నగరాన్ని అతలాకుతలం చేసిన తీవ్ర కరువులో ప్లేగు వ్యాధి గ్రస్తులకు సావిత్రిబాయి అసమాన సేవలు అందించారు. చివరకు ఆమె కూడా అదే వ్యాధి బారినపడి 1897 మార్చి10న తుది శ్వాస విడిచారు. 1997లో భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పుణె విశ్వవిద్యాలయానికి ఆమె పేరే పెట్టారు. సావిత్రిబాయి ఫూలే అక్షర ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఆమె జయంతి రోజున గతేడాదే ‘ధర్మ టీచర్ యూనియన్’ ఏర్పాటైంది. సావిత్రి బాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలి. ఇదే ఆమెకు ఇవ్వగలిగిన ఘన నివాళి.
– సంపతి రమేశ్ మహారాజ్ ‘ ధర్మ టీచర్ యూనియన్ తెలం
Comments
Please login to add a commentAdd a comment