సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్ణయం
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జనవరి 3న అధికారికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ బడ్జెట్ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం
సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆ మహనీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment