మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ : అమరజీవి పొట్టిశ్రీరాములు త్యాగఫలంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలదేనని వైఎస్‌ఆర్ సీపీ వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ దామసాని క్రాంతికుమార్ విమర్శించారు. స్థానిక బొగ్గరపు శేషయ్య నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పొట్టిశ్రీరాములు ఆశయాలకు తూట్లు పొడుస్తూ కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు, కిరణ్ పాలనలో ఆర్యవైశ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.
పన్నులు పెరిగి నష్టపోయారని తెలిపారు. వైఎస్‌ఆర్ హయాంలో వైశ్యుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వివరించారు. ప్రస్తుతం అధికారం కోసం అమలు సాధ్యంకాని హామీలిస్తూ చంద్రబాబునాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ పథకాల అమలుకు, ఆశయాల సాధనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్‌ఆర్ సీపీ వాణిజ్య విభాగం మార్కాపురం పట్టణ అధ్యక్షునిగా బొగ్గరపు శేషయ్య, ప్రధాన కార్యదర్శిగా రెంటచింతల మధులను నియమించారు. ముందుగా స్థానిక ఆర్యవైశ్యులంతా కలిసి క్రాంతికుమార్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కాపురం మున్సిపాలిటీలోని 17, 20, 23 వార్డుల వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులు బుశ్శెట్టి నాగేశ్వరరావు, ఇమ్మడిశెట్టి సుబ్రహ్మణ్యం, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పార్టీ మండల కన్వీనర్ గాయం కొండారెడ్డి, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదే
Published Fri, Mar 28 2014 3:06 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement