ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబుగారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములుగారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి’’ అని ఎక్స్ ఖాతాలో కోరారాయన.
పొట్టి శ్రీరాములుగారి అహింసా దీక్షతో, ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవంకోసం అలుపెరగని పోరాటం చేశారాయన. పొట్టి శ్రీరాములుగారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2025
భాషా ప్రతిపాదికన.. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటి నుంచి 58 ఏళ్లపాటు ఆ తేదీనే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు. 2014, జూన్ 2వ తేదీన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలోనూ ఆ వేడుకలు జరిగాయి. అయితే 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం లేదు. అందువల్ల కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో..
శనివారం తాడేపల్లిలోని YSRCP కేంద్ర కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వం వేడుకలను నిర్వహించకపోవడాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అలాంటిది ఆయన త్యాగానికి చంద్రబాబు విలువ లేకుండా చేశారు. ప్రభుత్వం తరపున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో ఆర్యవైశ్యలే చందాలు వసూలు చేసుకుని పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టుకోమని లోకేష్ సూచించారు. అందుకే మండలాలు, జిల్లాల వారీగా టార్గెట్ పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టలేని స్థితిలో ఉందా?. ఎన్టీఆర్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు పెడతారుగానీ.. పొట్టి శ్రీరాములుని మాత్రం విస్మరిస్తారా?. ఇది సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వమే పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైశ్యుల దగ్గర చందాలు వసూలు చేస్తామంటే సహించం’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


