ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం | Protests and movements continue for Samaikyandhra regions | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం

Published Fri, Aug 9 2013 1:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం - Sakshi

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రదర్శనలు  పదునెక్కుతున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వినూత్న రీతిలో వేషధారణలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక నినాదంతో తొమ్మిదో రోజున కూడా పోరు కొనసాగించారు. ఈ ఆందోళనలు అన్ని వర్గాలనూ కదిలిస్తున్నాయి. జేఏసీలుగా ఏర్పాటయ్యేందుకు ఒకొక్కరుగా ముందుకు వస్తూ ఉద్యమంలో క్రియాశీలురవుతున్నారు. సమైక్య పోరులో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో గురువారం నాటి ఉద్యమ ఘట్టాలివి..
 
 విశాఖలో మహిళా ఉద్యోగులకు పసుపు, కుంకుమ, జాకెట్ అందించి, వాటిని మంత్రులకు పంపించాలని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన నిర్వహించింది. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే వాళ్ల ఇళ్లలోనే వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అగనంపూడిలో వైఎస్సార్‌సీపీ నేతలు చేపట్టిన 48గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. గురువారం వైఎస్సార్‌సీపీ నేతలు కొణ తాల రామకృష్ణ, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 12న జరగాల్సిన సింహగర్జన 14కు వాయిదా పడింది.
 
 కేంద్రమంత్రి పళ్లంరాజు ఇల్లు ముట్టడి
 తూర్పుగోదావరి జిల్లాలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 జిల్లాల ఉపాధధి హామీ అసిస్టెంట్‌ల సంఘాలు రాజమండ్రిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. చెవిటి, మూగ పాఠశాల విద్యార్థులు పొట్టి శ్రీరాములు చిత్రంతోపాటు, తెలుగుతల్లి కన్నీరు పెడుతున్నట్టు, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దనే అర్థం వచ్చే చిత్రాలతో ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని కాకినాడలో ముట్టడించారు. అమలాపురంలో 400 మీటర్ల జాతీయ జెండాను సమైక్యవాదులు ఊరేగించారు.
 
 ఎంపీ కనుమూరి, మంత్రి పితాని ఇళ్ల ముట్టడి
 పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటిని, పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటిని ఉద్యమకారులు ముట్టడించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ జోరు వానలో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కూరగాయల వర్తకులూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఉద్యమంలో ముందుండి నడవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో డిమాండ్ చేశారు. పాలకొల్లులో డ్వాక్రా మహిళల ర్యాలీలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగి ఒకరు శిరోముండనం చేయించుకున్నారు.  మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడంలేదని.. ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ నేత కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా హిజ్రాలుభజనలు చేస్తూ శవయాత్ర నిర్వహించారు.
 
 భోగాపురం, రామభద్రాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంట వార్పు చేశారు. చీపురుపల్లిలో కుక్కలకు కేసీఆర్ మాస్క్‌లు అమర్చారు.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూమ్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన వంటా వార్పు కార్యక్రమంలో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సోనియాగాంధీపై గూడూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయకుమార్‌రెడ్డి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
 
 ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలని బాపట్లలో జరిగిన సభలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు.
 
 సింహాసనంపై కుక్కతో నిరసన
 అనర్హులను అందలం ఎక్కిస్తే.. అంటూ సింహాసనంపై కుక్కను కూర్చొపెట్టి పశుసంవర్ధక శాఖ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. మేం కూడా వ్యతిరేకం అంటూ గంగిరెద్దులుతో తలలూపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో, పార్టీ జిల్లా కన్వీనర్ జగ్గయ్యపేటలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొదుపు సంఘాల మహిళలు, పాల వ్యాన్లతో డెయిరీ మిల్క్ కార్మికులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు ఉద్యమంలో పాల్గొన్నారు.
 
  కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పుత్తూరులో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  అనంతపురంలో అన్ని వర్గాల వారూ భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. రోడ్లపైనైనా చదువుకుంటాం.. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం.. అని విద్యార్థులు రోడ్లపైనే కూర్చుని చదువుకుంటూ తెలిపిన నిరసన ఆకట్టుకుంది. కర్నూలులో అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం జరిపారు.
 
  వైఎస్సార్ జిల్లా కడపలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టగా రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నిర్మానుష్యంగా మారింది. న్యాయవాదులు మృదంగం వాయిస్తూ, కర్రసాము చేస్తూ నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు తొమ్మిదో రోజూ రోడ్డెక్కలేదు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బద్వేలులో గురువారం బంద్ జరిగింది.  
 
 సమైక్య పావురం
 కొరుక్కుపేట(చెన్నై), న్యూస్‌లైన్: అందరూ సమైక్యంగా ఉండాలని కోరుతూ గురువారం చెన్నైకి చెందిన ఎవర్‌గ్రీన్ విద్యాశ్రమం విద్యార్థులు వినూత్న రీతిలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 3 నుంచి 8వ తరగతికి చెందిన 12 వేల మంది విద్యార్థులు 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో శాంతి పావురం ఆకృతిలో కూర్చుని సమైక్య సందేశాన్ని చాటారు. ‘కలిసి జీవిస్తే కోటి లాభాలు’, ‘దేశం ముక్కలైతే ముప్పు’ అంటూ నినాదాలు చేశారు. హిరోషిమా, నాగసాకి దాడులకు గుర్తుగాను, దేశంలో వినిపిస్తున్న విభజన నినాదాలకు వ్యతిరేకంగా శాంతి కపోతం సందేశాన్ని ఇచ్చినట్లు విద్యాశ్రమం ప్రిన్సిపాల్ కలైఅరసి పేర్కొన్నారు.
 
 ఆగని మరణాలు..
 సాక్షి, ఏలూరు/ఉయ్యూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రంలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తొమ్మిది మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ(55) బుధవారం రాత్రి టీవీలో ఢిల్లీ పెద్దల ప్రకటనలను చూస్తూ భావోద్వేగంతో గుండెపోటుకు గురయ్యూడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్న  మొగల్తూరులో సవర నాగరాజు(29) విభజన ప్రకటన నేపథ్యంలో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రాష్ట్రం విడిపోతే బతుకుదెరువు కష్టమవుతుందన్న ఆందోళనతో గుండెపోటుకుగురై తనువు చాలించాడు. చింతలపూడిలో గుంజి చుక్కమ్మ (45), ఉండి గ్రామానికి చెందిన కిలారి విష్ణు (32), కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన పండ్రాజు వెంకటేశ్వరరావు(58)లు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కల్లూరుకు చెందిన బడిగ హనుమంతప్ప (52), రొద్దం మండలం పెద్దపల్లికి చెందిన ఈడిగ లక్ష్మినారాయణ (40), కంబదూరుకు చెందిన సురేంద్ర శర్మ (50), కూడేరు మండలం పీ.నారాయణపురానికి చెందిన కురుబ ఎర్రిస్వామి(55) విభజన వార్తలు టీవీలో చూస్త్తూ గుండెపోటుతో మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement