సాక్షి, విశాఖ: రానున్న రోజుల్లో పలువురు కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేత అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం ఆనందపురం జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే.. గంటా శ్రీనివాసరావు తమను టీడీపీలోకి తీసుకెళ్లారని అన్నారు. వైఎస్ జగన్‌కు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని తెలిపారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చెప్పినా.. ప్రజల కోసమే పోరాటానికి చేశారని అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గెలిపించిన నాయకుల భూములను కబ్జా చేసే వ్యక్తిత్వం గంటా శ్రీనివాసరావుదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో భీమిలి సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన గంటా ... ఆ తర్వాత ఆయనే అక్కడ నుంచి పోటీ చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌లపై అధికార టీడీపీ ఐదేళ్లలో 50సార్లు మాట మార్చిందని అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరికి మంత్రి గంటా శ్రీనివాసరావు కారణమని ఆరోపించారు. డబ్బులకు ఓట్లు వేసే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. భీమిలిలో పంటలు పాడైతే మంత్రి గంటా కనీసం పట్టించుకోలేదని, కరువు మండలంగా కూడా ప్రకటించలేదన్నారు.
ఈ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు, విశాఖ పార్లమెంటు అధ్యక్షులు తైనాల విజయ్ కుమార్, సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ, అనకాపలి పార్లమెంట్ సమన్వయకర్త సరగడం చిన్న అప్పలనాయుడు, అసెంబ్లీ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, పార్టీ సమన్వయకర్తలు అదీప్‌రాజ్, డాక్టర్ రమణమూర్తి, కరణం ధర్మశ్రీ, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి, సిటీ మహిళ కన్వీనర్ గరికిన గౌరి, పార్లమెంట్ కన్వీనర్ పీలా వెంకట లక్ష్మీతో పాటు పెద్ద ఎత్తున్న కార్యకర్తలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment