ఉత్తర బిహార్‌లోని ఒక కుగ్రామం నుంచి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మహాత్మా గాంధీకి అకుంఠితమైన అనుచరుడిగా పేరు పొందారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కి, చక్రవర్తి రాజగోపాలాచారికి సన్నిహితంగా మెలిగారు. ఆ ముగ్గురినీ కలిపి తక్కినవారు కాంగ్రెస్‌లోని మితవాద పక్షంగా వ్యవహరించేవారు. జవహర్‌లాల్ నెహ్రూ, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు అనుసరించిన వామపక్ష అనుకూల రాజకీయాలను ఈ ముగ్గురూ వ్యతిరేకించేవారు.
చాలా విషయాలలో రెండు వర్గాల విభేదాలు చరిత్ర ప్రసిద్ధి పొందాయి. ఉదాహరణకు, మంత్రి అయిన సర్దార్ పటేల్ అంత్యక్రియలకు రాష్ట్రపతి హాజరు కావడం సముచితం కాదని నెహ్ర ఇచ్చిన సలహాను తోసిరాజని, రాష్ట్రపతి హోదాలో ఆయన 1950లో పటేల్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక రాజ్యాంగ నిర్ణాయక సభ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ నిర్ణాయక సభలో మెజారిటీ అభిప్రాయం సరిపోదనీ, ఏకాభిప్రాయం తప్పనిసరి అనీ ప్రారంభంలోనే సూత్రీకరించారు. దీంతో మెజారిటీ వాదులు మైనారిటీల ఆక్షేపణలను అర్థం చేసుకుని, సర్దుబాట్ల ద్వారా వారిని కూడా కలుపుకుని పోవలసిన పరిస్థితి అభివృద్ధి చెందింది.
ఏకాభిప్రాయాన్ని సాధించే వరకు నిర్ణయాన్ని నిలిపేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని వల్ల రాజ్యాంగాన్ని ఖరారు చేయడానికి మూడేళ్లకు పైగా ఆలస్యమైపోయింది. ఎట్టకేలకు 1950 నాటికి భారతీయులకు రాజ్యాంగం లభించింది. అది భారతీయులందరూ గర్వించదగిన స్థాయిలో ఉందంటే, ఆ ఖ్యాతి రాజేంద్ర ప్రసాద్‌కు దక్కవలసిందే. రెండు పర్యాయాలు భారత రాష్ట్రపతిగా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్, తన హయాంలో రాష్ట్రపతి వ్యవస్థ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా అభివృద్థి చెందకుండా సకల జాగ్రత్తలూ వహించారు. అయితే జాగృతమైన, అప్రమత్తమైన వ్యవస్థగా రాష్ట్రపతి పదవీ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆర్భాటానికి తావివ్వని మృదు స్వభావిగా, నిరాడంబరునిగానే ప్రసాద్ తన జీవితమంతా గడిపారు.
– సలీల్ మిశ్రా, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చరిత్ర అధ్యాపకులు
Comments
Please login to add a commentAdd a comment