
మహాత్మాగాంధీ గురించి ఎరిక్ ఎరిక్సన్ అన్న మాటలు అమర్త్య సేన్‌కు కూడా వర్తిస్తాయి. ఇతర ప్రపంచ దేశాల ప్రజలను దిగువ నుంచి లేదా పైనుంచి కాక సమాంతరంగా కళ్లలోకి కళ్లు పెట్టి చూడగల సామర్థ్యం ఆయనది. అమర్త్యసేన్ వయసు స్వతంత్ర భారతదేశ వయసు కన్నా కేవలం 14 ఏళ్లు ఎక్కువ. కాబట్టి సహజంగానే ఆయనకున్న స్థాయి స్వతంత్ర యువ భారత ఆశలు, ఉద్వేగాలతో ముడివడి ఉంటుంది. విస్తృత స్థాయిలో చూస్తే ఆయన వ్యక్తిగత విజయాలన్నీ జాతీయ విజయాలే. ఇతర రంగాల వృత్తి నిపుణులను ఆయన పేదరికం, అసమానత్వం, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారించేలా చేశారు. అందుకే ఆయన విజయాలు భారతదేశానికి, భారత పౌరులకు ఎంతో ముఖ్యమైనవిగా మారాయి. అంతకుముందు ఆ అంశాలను ఏదో పైపైన పట్టించుకునేవారు. ఆయన భారతదేశ పాస్‌పోర్టును వదులుకోని ప్రపంచ పౌరుడు. దేశభక్తి కలిగిన విశ్వమానవుడు.
సంక్లిష్టతను ప్రాచుర్యంతో మేళవించిన సేన్‌ను జాన్ మేనార్డ్ కీన్స్‌తో మాత్రమే పోల్చగలం. ఆయనకు ప్రాచుర్యం లభించడానికి చాలా కారణాలే ఉన్నాయి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలలో చదువుకున్న సేన్ 22 ఏళ్లకే జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు! ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీలలో వివిధ హోదాలలో పని చేశారు. ఎన్నో సత్కారాలు, గౌరవ డాక్టరేట్‌లు అందుకున్న సేన్ 1998లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఆయన చరిత్రను, నైతిక, రాజకీయ తత్వ శాస్త్రాలను కూడా బాగా అధ్యయనం చేశారు. హార్వర్డ్‌లో తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రాల ప్రొఫెసర్‌గా ఉన్నారు. సేన్ కృషికి తగినట్లుగా ఎన్నో పురస్కారాలు లభించాయి.
భారతదేశం ఆయనకు అత్యున్నత భారత రత్న పురస్కారాన్ని ఇచ్చింది. స్వతంత్ర భారత ప్రజ్ఞావంతుల చరిత్రలోని ముఖ్యులలో ఒకరైన సేన్ ఈ స్థాయిని అందుకోవడానికి ప్రధాన కారణం ఆయన వైయక్తిక ఆలోచనా విధానంతో విద్యా సంబంధమైన వాతావరణంలో ఒక ఆర్థికవేత్తగా వికసించడమే. ఆర్థిక శాస్త్రమనేది సామాజిక శాస్త్రానికి, సాంకేతిక శాస్త్రానికి మధ్యలో ఉంటుందని చెప్పాలి. ఇది సాధారణంగా గణితశాస్త్ర పద్ధతిలో హేతుబద్ధమైన సంక్లిష్టమైన క్రమశిక్షణను ఉపదేశి స్తుంది. కానీ, సేన్ రచించిన పుస్తకాలు ప్రజాదరణ పొందిన ఇతర ఆర్థికవేత్తల్లాగా వ్యక్తుల విశ్లేషణకు పరిమితం కాలేదు. ఆయన తన రచనల్లో సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రధానంగా చర్చించారు.
– ఎస్. సుబ్రహ్మణ్యన్, ఆర్థిక శాస్త్రవేత్త, అమర్త్యసేన్ శిష్యుడు