ఆచరణే సిద్ధాంతం: ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ (1909–1998) | Azadi Ka Amrit Mahotsav: Kerala EMS Namboodiripad Communist | Sakshi
Sakshi News home page

ఆచరణే సిద్ధాంతం: ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ (1909–1998)

Published Sat, Jun 11 2022 1:24 PM | Last Updated on Sat, Jun 11 2022 1:28 PM

Azadi Ka Amrit Mahotsav: Kerala EMS Namboodiripad Communist - Sakshi

ప్రపంచంలోనే మొదటిసారిగా, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మార్క్సిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్‌ 1957లో చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి ప్రకటన.. సోషలిజం తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించగలదని స్పష్టం చేయడం కాదు. దానికి బదులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తగ్గించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఆ రోజుల్లోనే ఇ.ఎం.ఎస్‌. కేరళలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రైవేట్‌ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. సనాతన సంప్ర దాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పురిగిన ఇ.ఎం.ఎస్‌. తన సొంత వర్గ తిరోగమన విధానాలపై పోరాడటం ద్వారా ప్రజాహిత జీవనంలోకి అడుగుపెట్టారు. బాల్యంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. సంపన్న భూస్వామ్య పెత్తందారీ విధానాన్ని అంతం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అక్షరాస్యత, స్త్రీ పురుష వివక్ష లేకుండా చూడటం, ప్రజారోగ్యం, సమగ్ర భూ సంస్కరణలు ఆయన మొదటి ప్రభుత్వ ఘన విజయంగా చెప్పాలి.

చదవండి: (శతమానం భారతి: ఆహార భద్రత)

కాంగ్రెస్‌ తన ప్రజాస్వామిక ముసుగును వదిలి, నియంతృత్వ పోకడలను బయట పెడుతూ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు సి.పి.ఐ. భ్రమలు తొలగిపోయాయి. సి.ఐం.ఐ.(ఎం) బలంగా ఉన్న చోటల్లా నక్సలైట్‌ తీవ్రవాద రాజకీయాలు బయట పడటంతో ఆ ఉద్యమమూ సడలిపోయింది. ఇ.ఎం.ఎస్‌. 1978 నుంచి 1980ల చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కాలంలో పార్టీ అనేక ఒత్తిడులను, సంక్షోభాలను ఎదుర్కొంది. 1980ల చివరిలో ఆయన విశ్రాంత జీవితం మొదలైంది.

అయితే, ఆయన ఖాళీగా ఉండకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిందిగా తన రచనల ద్వారా కేరళీయులకు పిలుపునిచ్చారు. సమగ్ర వికేంద్రీకరణ కార్యక్రమమైన ప్రజా ప్రణాళికా విధానాన్ని రూపొందించడం ప్రారంభించారు. ఆయన రచనలు 150 సంపుటాలుగా వెలువడ్డాయి. భారతీయ కమ్యూనిస్టు విధానాల ఆచరణకు తోడ్పడిన నవీన ప్రయోగాలను సిద్ధాంతీకరించడానికి ఇ.ఎం.ఎస్‌. విముఖత చూపడం విమర్శలకు లోనైంది. సిద్ధాంతం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ఇ.ఎం.ఎస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement