marxist
-
Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్ తలకు వెలకట్టింది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు. 1964 మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు. ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్ స్పష్టం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్)లో అయినా ఎమ్సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే... ఓంకార్ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్ 17న అమరులైన కామ్రేడ్ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం) – వనం సుధాకర్ ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు (అక్టోబర్ 17న ఓంకార్ వర్ధంతి సందర్భంగా) -
ఆచరణే సిద్ధాంతం: ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (1909–1998)
ప్రపంచంలోనే మొదటిసారిగా, కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మార్క్సిస్టు ప్రభుత్వానికి నాయకత్వం వహించడం ద్వారా, భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా నంబూద్రిపాద్ 1957లో చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొదటి ప్రకటన.. సోషలిజం తీసుకురావడానికి తన ప్రభుత్వం ప్రయత్నించగలదని స్పష్టం చేయడం కాదు. దానికి బదులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను తగ్గించడానికి తన ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఇ.ఎం.ఎస్. కేరళలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రైవేట్ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. సనాతన సంప్ర దాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పురిగిన ఇ.ఎం.ఎస్. తన సొంత వర్గ తిరోగమన విధానాలపై పోరాడటం ద్వారా ప్రజాహిత జీవనంలోకి అడుగుపెట్టారు. బాల్యంలో ప్రాచీన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. సంపన్న భూస్వామ్య పెత్తందారీ విధానాన్ని అంతం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అక్షరాస్యత, స్త్రీ పురుష వివక్ష లేకుండా చూడటం, ప్రజారోగ్యం, సమగ్ర భూ సంస్కరణలు ఆయన మొదటి ప్రభుత్వ ఘన విజయంగా చెప్పాలి. చదవండి: (శతమానం భారతి: ఆహార భద్రత) కాంగ్రెస్ తన ప్రజాస్వామిక ముసుగును వదిలి, నియంతృత్వ పోకడలను బయట పెడుతూ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు సి.పి.ఐ. భ్రమలు తొలగిపోయాయి. సి.ఐం.ఐ.(ఎం) బలంగా ఉన్న చోటల్లా నక్సలైట్ తీవ్రవాద రాజకీయాలు బయట పడటంతో ఆ ఉద్యమమూ సడలిపోయింది. ఇ.ఎం.ఎస్. 1978 నుంచి 1980ల చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన కాలంలో పార్టీ అనేక ఒత్తిడులను, సంక్షోభాలను ఎదుర్కొంది. 1980ల చివరిలో ఆయన విశ్రాంత జీవితం మొదలైంది. అయితే, ఆయన ఖాళీగా ఉండకుండా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎదగాల్సిందిగా తన రచనల ద్వారా కేరళీయులకు పిలుపునిచ్చారు. సమగ్ర వికేంద్రీకరణ కార్యక్రమమైన ప్రజా ప్రణాళికా విధానాన్ని రూపొందించడం ప్రారంభించారు. ఆయన రచనలు 150 సంపుటాలుగా వెలువడ్డాయి. భారతీయ కమ్యూనిస్టు విధానాల ఆచరణకు తోడ్పడిన నవీన ప్రయోగాలను సిద్ధాంతీకరించడానికి ఇ.ఎం.ఎస్. విముఖత చూపడం విమర్శలకు లోనైంది. సిద్ధాంతం కన్నా ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు ఇ.ఎం.ఎస్. -
సీపీఎం పగ్గాలు మళ్లీ తమ్మినేనికే?
సాక్షి, హైదరాబాద్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం వరుసగా మూడోసారి ఎన్నిక కానున్నారని సమాచారం. పార్టీ నిబంధనల ప్రకారం మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఒక నేతను ఎన్నుకొనే అవకాశం ఉన్నందున ఈసారి కూడా ఖమ్మం కామ్రేడ్కే పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ నాయకత్వం యోచిస్తోందనే చర్చ జరుగుతోంది. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం కూడా సుముఖంగానే ఉందని, వచ్చే మహాసభల్లో గా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ్మినేనినే మరోమారు కార్యదర్శిగా కొనసాగించాలనే ప్రతిపాదన పెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో ఆదివారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభలు మంగళవారంతో ముగియనున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, కార్యదర్శివర్గంతోపాటు కార్యదర్శిని కూడా చివరిరోజు ఎన్నుకోనున్నారు. ఒకవేళ తమ్మినేని కాకపోతే నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీఐటీయూ నేత ఎస్. వీరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బి. వెంకట్లలో ఒకరిని ఎన్నుకొనే అవకాశం ఉందని ఎంబీ భవన్ వర్గాలంటున్నాయి. రాష్ట్ర కార్యదర్శివర్గంలో మార్పులు! రాష్ట్ర కార్యదర్శివర్గంలో కూడా రెండు, మూ డు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా చెరుపల్లి సీతారాములు, నంద్యాల న ర్సింహారెడ్డి, సి.రాములు, సాయిబాబా, పోతి నేని సుదర్శన్, జాన్‌వెస్లీ, జ్యోతి, డి.జి.నర్సింహారావు, జి.రాములు, డాక్టర్. మిడియం బా బూరావులు కొనసాగుతున్నారు. వీరిలో జి. రాములు, మాజీ ఎంపీ మిడియం బాబూరావులు రిటైర్ అవుతారని అంటున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఢిల్లీ సెంటర్‌కు వెళ్తారని, ఆయన స్థానంలో మరో ట్రేడ్ యూనియన్ నేత పాలడుగు భాస్కర్‌ను కార్యదర్శివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. జి.రాములు, బాబూరావుల స్థానం లో మరో ఇద్దరు నేతలకు అవకాశం వ స్తుందని, అందులో మరో మహిళానేతకు అ వకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. సీఐటీయూ నాయకురాలు రమ, ఐద్వానేత మల్లు లక్ష్మిలో ఒకరిని కార్యదర్శివర్గంలోకి తీసుకొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. వామపక్ష ఐక్య కూటమి ఎటువైపు..? సీపీఎం రాష్ట్ర కమిటీ ఎన్నిక ఒక ఎత్తయితే పార్టీ మహాసభల్లో ఆమోదించే రాజకీయ తీర్మానంపై అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తితో ఉన్నాయి. తమకు ప్రధాన శత్రువైన బీజేపీని తెలంగాణలో బలపడకుండా చూడటమే తక్షణ రాజకీయ కర్తవ్యమని శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అలా అని ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్తో కలిసివెళ్లేది లేదని కూడా వెల్లడించారు. గత ఎన్నికల్లో లాల్, నీల్ ఎజెండాతో ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) వైఫల్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో వామపక్ష ఐక్య కూటమి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర మహాసభల్లో ఎలాంటి రాజకీయ తీర్మానం చేస్తారన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్పై ప్రజాసమస్యల గురించి పోరాటాలు చేస్తూనే బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ సమయానికి కలిసి వెళ్తారా? కాంగ్రెస్‌ను కలుపుకుంటారా? లేక వామపక్ష ఐక్య కూటమితో ముందుకెళ్తారా? అన్నది వేచిచూడాల్సిందే! -
‘ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు’
సాక్షి, విజయవాడ: ప్రముఖ కాలమిస్ట్, కమ్యూనిస్ట్ నేత డాక్టర్ ఏపీ విఠల్ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం విఠల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విఠల్ గొప్ప మేధావి. కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్యకి ప్రియమైన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైద్యుడిగా పేదప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించారు. కమ్యూనిస్టు భావాలను నరనరాలలో జీర్ణించుకున్న వ్యక్తిగా.. నిబద్ధత గల కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. అలాంటి వారు ప్రస్తుతం మన మధ్య నుంచి దూరం కావడం తీరని లోటు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందుండి అనేక వ్యాసాలు రాశారు. జీవితంలో చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన' అంటూ విఠల్‌తో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా షుగర్, హృద్రోగంతో బాధపడుతున్న ఏపీ విఠల్ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. (సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత) -
సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత
సాక్షి, అమరావతి: ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వరహాపురంలో ఆయన జన్మించారు. తల్లితండ్రులు సీతారామచంద్రరావు, శ్రీలక్ష్మి. తండ్రి ఉపాధ్యాయులు. ఇంటికి పెద్దకుమారుడైన ఏపీ విఠల్‌కి ఏడుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు. సాంప్రదాయక కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన తండ్రి ప్రభావంతో అభ్యుదయ భావాలతో పెరిగారు. గుంటూరులో మెడిసిన్ చదువుతున్నప్పుడు వామపక్ష భావాలతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో అరెస్టయి మొదటి ముద్దాయిగా చరిత్రకెక్కారు. అభ్యుదయ పంధాలో ఆజన్మాంతం.. తొలినుంచి సీపీఎం పార్టీని అభిమానించేవారు. మార్క్స్, ఎంగెల్స్ రచనలు విస్తృతంగా చదివారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ఇంటర్న్‌షిప్ చేశారు. అక్కడే పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు ఆయనకు పరిచయం అయ్యారు. ప్రజావైద్యశాలలో డాక్టరుగా పనిచేశాక నెల్లూరులోని బత్తినపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా ఉద్యోగంలో చేరారు. పేదల డాక్టర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. తర్వాత తన భావాలకు, తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి మధ్య వైరుధ్యం ఏర్పడినట్లు అర్థమై నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో 1972లో ప్రజావైద్యశాల ప్రారంభించారు. విఠల్ దవాఖానా అని పేరుపడిన ఆ ఆసుపత్రిలో కేవలం మూడు రూపాయల ఫీజుతో వైద్యసేవలందించారు. అప్పుడే పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రోత్సాహంతో పార్టీ పూర్తికాలం కార్యకర్తగా మారి సూర్యాపేట నుంచి విజయవాడకు వచ్చేశారు. అక్కడే ప్రజాశక్తి దినపత్రికలో చాలాకాలం పనిచేశారు. చిరుమువ్వల సవ్వడి అనే ఆయన రచన పేరొందింది. ఆ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. సురవరం సుధాకరరెడ్డి, మధు, నారాయణ, బీవీ రాఘవులు వంటి సీపీఐ, సీపీఎం నేతలు ఈయన సమకాలికులు. మోటూరు హనుమంతరావు దంపతులు ఈయనకు ఆరాధ్యులు. 1991 వరకు సీపీఎంలో ఉన్న ఏపీ విఠల్ తర్వాత ఆ పార్టీనుంచి బయటకు వచ్చేశారు. 1993 నుంచి 2015 వరకు ఆయన చుక్కపల్లి కుశలవ ట్రస్ట్ ఆసుపత్రిలో పనిచేశారు. 2012 నుంచి రచనావ్యాసంగానికి పరిమితమై వివిధ దినపత్రికల్లో వ్యాసాలు రాసి ప్రచురించారు. సాక్షి ఆయనకు ఎంతో ఇష్టమైన పత్రిక. వైఎస్ రాజశేఖరరెడ్డిపై విపరీతమైన అభిమానం. గత ఆరేళ్లుగా ఆయన సాక్షి పత్రికలో రెగ్యులర్ కాలమిస్టుగా వ్యాసాలు పంపుతూ వచ్చారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా 2019 డిసెంబర్లో సాక్షి పత్రికకు తన చివరి కథనం పంపారు. వామపక్ష, అభ్యుదయ వాదుల మధ్య ఐక్యతను దశాబ్దాల తరబడి ఆయన కోరుకుంటూ వచ్చారు. సీపీఎం నేతగా, ఉద్యమకారుడిగా, రచయితగా పలు పుస్తకాలు రాసి ప్రచురించారు. విప్లవపథంలో నా పయనం, మార్క్స్-ఎంగెల్స్ మైత్రి, మార్క్సిజం పరిణామ సంధ్యలో, యుద్ధం హృదయం, వియత్నాం వీరుల వీరోచిత పోరాటం, లోకం తీరు వంటివి ఆయన రచనలలో కొన్ని. జీవితమంతా అభ్యుదయ భావాల వ్యాప్తికి పాటుపడిన ఏపీ విఠల్ పార్థివదేహాన్ని ఆయన కోరికమేరకు విజయవాడలోనే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. -
అంబేడ్కరిస్టులు-మార్క్సిస్టుల ఐక్యత కొనసాగేనా..!
‘‘మీరు షెడ్యూల్డ్ కులాల వారికే కాకుండా మొత్తం భారతదేశానికి నాయకులవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డాక్టర్ అంబేడ్కర్నుద్దేశించి సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా. 1955 డిసెం బరులో ఈ మేరకు అంబేడ్కర్‌కు లేఖ రాశారు. బాబాసాహెబ్‌తో చర్చించి ఆయన నాయకత్వంలో నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఉత్తర ప్రత్యుత్తరాలూ కొనసాగించారు. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ సమావేశాల్లోనూ, సన్నిహి తుల సంభాషణల్లోనూ ఇదే అలోచన చేశారు. లోహియా, ఎం.ఎన్. రాయ్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావులనీ, వారితో కలసి పని చేయాలనీ ఆయన అనేవారు. 1956 సెప్టెంబరులో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోయే ముందు (రిపబ్లికన్ పార్టీ) లోహియాతో తప్పని సరిగా చర్చించాలని ఈ సందర్భంగా బాబాసాహెబ్ తన సహచరు లతో అన్నారు. అయన హఠాన్మరణంతో ఈ మహత్తర ప్రయోగానికి గండిపడింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులను ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది లోహియా చిరకాల ఆకాంక్ష. ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ అటువంటి ఆశలు చిగురి స్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ‘హత్య’, తదనంతర పరిణామాలూ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో కమ్యూనిస్టు, అంబే డ్కర్ విద్యార్థి సంఘాల్ని దగ్గర చేశాయి. కొన్నేళ్లుగా ఏబీవీపీ ఉన్నత విద్యాలయాల్లో పట్టుకోసం విద్వేష రాజకీయాల్ని మొదలెట్టింది. అంబేడ్కర్, కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలపై జాతిద్రోహులు, కులతత్వవాదులనే ముద్ర వేసింది. పర్యవసానాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిగా ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కర్ - కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యకుమార్ ఉపన్యాసంలో జైభీం, లాల్ సలామ్ నినాదాలు అంతర్భాగాలయ్యాయి. ‘‘నేను జై భీం అంటాను. లాల్ సలామ్ అంటాను. అన్ని నినా దాలు భగత్‌సింగ్ ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్‌తో మమేకమవు తాయి. దేశంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కరిస్టులు -కమ్యూనిస్టుల కలయిక తక్షణ అవసరం. నూతన భారత ఆవిష్కా రానికి ఇది మనందరి కర్తవ్యం’’ అన్నారు చెన్నైలో జరిగిన అంబేడ్కర్ సంస్మరణ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. 1980-90లలో శరద్‌పాటిల్ అంబేడ్కర్-కమ్యూనిస్టు సిద్ధాంతాల సమ్మేళనంగా సత్యశోధక్ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు. ఇది చిన్న ప్రయోగం. ఇప్పుడు యూనివర్సిటీల్లో ప్రారంభమైన ఐక్య ఉద్య మాన్ని రాజకీయ పోరాటంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి కొన్ని సవాళ్లున్నాయి. ఇప్పటికీ అంబేడ్కర్ వాదులు కమ్యూనిస్టుల నిబద్ధతను పూర్తిగా నమ్మడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కాలం నాటి నుంచీ ఆ దూరం, అనుమానం కొనసాగుతూనే ఉంది. భారతదేశ సమస్యల పరిష్కారానికి వర్గ దృక్పథమే ముఖ్యమనీ, కులం ఉపరితలాంశమనీ కమ్యూనిస్టులు ఇప్పటికీ భావిస్తున్నారు. ఇందుకు భిన్నంగా కులం ఒక ఘనీభవించిన వర్గమని లోహియా చెప్పారు. మన సమాజానికి అవసరమైన విధంగా కమ్యూనిజాన్ని అన్వ యించి నూతన ఆలోచనను తెరపైకి తెచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సరైన విశ్లేషణలు చేయడంలో వెనకబడ్డాయి. ఈ ధోరణి మారాలి. అంబేడ్కర్‌వాద ఉద్య మాల్ని కేవలం అస్తిత్వ రాజకీయాలుగా చూడడం సరికాదు. ఇదొక సరి కొత్త న్యాయబద్ధమైన ప్రజాతంత్ర ఆకాంక్ష. కమ్యూనిస్టు పార్టీల్లో దళి తులు ఉన్నత నాయకత్వ స్థానాల్లో లేకపోవడాన్ని గుర్తించినట్లు, దీన్ని సరిచేయనున్నట్లు సీపీఎం కోల్‌కతా ప్లీనం ప్రకటించింది. అంబేడ్కర్ వాదులు మొదటి నుంచీ చేస్తున్న విమర్శల్లో నాయకత్వ అంశం ప్రధాన మైంది. సైద్ధాంతిక-ఆచరణపరమైన ఇలాంటి సమస్యల్ని కమ్యూని స్టులు, అంబేడ్కరిస్టులు పరిష్కరించుకోవాలి. సానుకూల గత తప్పి దాల్ని అంగీకరించగలగాలి. రోహిత్ వేముల ‘ఆత్మ త్యాగం’ భారతదేశ రాజకీయాలపై సరికొత్త వెలుగులు ప్రసరింపచేయాలి. అప్పుడే అంబే డ్కర్ ఆకాంక్షించిన ప్రజాస్వామ్య భారతదేశం రూపుదిద్దుకుంటుంది. వ్యాసకర్త: బి. భాస్కర్ సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 9989692001