Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు | Maddikayala Omkar: Comrade, Marxist, Narsampet Former MLA | Sakshi
Sakshi News home page

Maddikayala Omkar: సామాజిక న్యాయ యోధుడు

Published Tue, Oct 18 2022 12:46 PM | Last Updated on Tue, Oct 18 2022 12:46 PM

Maddikayala Omkar: Comrade, Marxist, Narsampet Former MLA - Sakshi

మద్దికాయల ఓంకార్‌

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, మాజీ శాసన సభ్యులు, ఎంసీపీఐ (యూ) వ్యవస్థాపకులు, కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ ప్రజా ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. 1924లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం, ఏపూర్‌లో మద్దికాయల రామయ్య, అనంతలక్ష్మి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్ల వయస్సులోనే నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ‘ఆంధ్ర మహా సభ’లో వలంటీర్‌గా చేరి... ఆ తరువాత భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తికై సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. నిజాం సైన్యాలపై, యూనియన్‌ సైన్యాలపై ఆయన తుపాకీ చేతపట్టి అలుపెరుగని పోరాటం చేశారు. ఆ నాటి నిజాం పాలన ఓంకార్‌ తలకు వెలకట్టింది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పలు బాధ్యతలు చేపట్టి, 1964లో ఏర్పడ్డ మార్క్సిస్ట్‌ పార్టీలో ముఖ్య నాయకునిగా పేరుగాంచారు. 1972 నుండి 1994 వరకు వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రజలు ఐదుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసన సభ్యునిగా చట్టసభకు పంపినారు. ప్రజలు ‘అసెంబ్లీ టైగర్‌’గా ఆయన్ని అభివర్ణించారు. నక్సలైట్లు, భూస్వాములు ఆయనపై అనేకసార్లు హత్యా ప్రయత్నం చేయగా ప్రాణాపాయం నుండి బయట పడిన ఓంకార్‌ను అన్ని వర్గాల ప్రజలు ‘మృత్యుం జయుడు’గా పిలిచారు.

1964 మార్క్సిస్ట్‌ కార్యక్రమాన్ని నిబద్ధతతో నడపడానికి 1984లో ఎమ్‌సీపీఐ (యూ)ను ఏర్పాటు చేసి దేశమంతా విస్తరణకు పూనుకున్నారు. వర్గ వ్యవస్థలో భాగం గానే భారతదేశంలో కుల వ్యవస్థ ఉందని ఆయన భావించారు. అగ్రవర్ణ ఆధిపత్యంలో వివక్షకులోనై ఉన్న అణగారిన ప్రజలను సాంఘిక వ్యత్యాసాల నుండి బయట పడేయడానికి ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యపరచి ఆధిపత్య వర్గాల చెంతన ఉన్న దోపిడీ, పెట్టుబడిదారీ వర్గాలపై తిరుగు బాటు చేయించినప్పుడే శ్రామిక వర్గ రాజ్యస్ధాపన సులువు అవుతుందని ఆయన చెప్పారు.

ఆర్థిక, రాజకీయ రంగాలపై అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యం సాగదంటూ... ‘జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకం కావాలి, వారే రాజ్యాధికారం చేపట్టాలంటూ 1999 లో 14 కుల సంఘాలను కలుపుకొని ఉమ్మడి రాష్ట్రంలో ‘మహాజన ఫ్రంట్‌’ ఏర్పాటు చేశారు. జనాభాలో 93 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణలలోని పేదలు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సమానత్వాన్ని సాధించలేకపోతున్నారు. అందుకే ‘వర్గ వ్యవస్థలోనే కుల వ్యవస్థ’ ఉన్నదని ఓంకార్‌ స్పష్టం చేశారు. 

భారతదేశ నిర్దిష్ట పరిస్థితులపై అంచనా ఉన్న ఓంకార్‌ ఆశయాలకు అనుగుణ్యంగానే ఎమ్‌సీపీఐ (యూ) కార్యక్రమం ముందుకు సాగుతుంది. ‘ఓట్లు మావే సీట్లు మావే’, ‘ఓట్లు మావి అధికారం మీదంటే’ ఇక చెల్లదంటూ ఏర్పడిన ఆనాటి ‘మహాజన ఫ్రంట్‌’లో అయినా, 2018లో ‘సామాజిక న్యాయం, బహుజనులకే రాజ్యాధికారం’ అంటూ ఏర్పడిన ‘బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌’ (బీఎల్‌ఎఫ్‌)లో అయినా ఎమ్‌సీపీఐ (యూ) భాగస్వామి అయిందంటే...  ఓంకార్‌ ఆశయ సాధన కోసమే. 2008 అక్టోబర్‌ 17న అమరులైన కామ్రేడ్‌ ఓంకార్‌కు... నేటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ బహుజన రాజ్యస్థాపనకై పాటుపడడమే ఘనమైన నివాళి. (క్లిక్ చేయండి: ఆయన జీవితమే ఒక సందేశం)

– వనం సుధాకర్
ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 
(అక్టోబర్‌ 17న ఓంకార్‌ వర్ధంతి సందర్భంగా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement