‘‘మీరు షెడ్యూల్డ్ కులాల వారికే కాకుండా మొత్తం భారతదేశానికి నాయకులవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు డాక్టర్ అంబేడ్కర్‌నుద్దేశించి సోషలిస్టు నాయకుడు డాక్టర్ రామమనోహర్ లోహియా. 1955 డిసెం బరులో ఈ మేరకు అంబేడ్కర్‌కు లేఖ రాశారు. బాబాసాహెబ్‌తో చర్చించి ఆయన నాయకత్వంలో నూతన పార్టీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఉత్తర ప్రత్యుత్తరాలూ కొనసాగించారు. అంబేడ్కర్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ సమావేశాల్లోనూ, సన్నిహి తుల సంభాషణల్లోనూ ఇదే అలోచన చేశారు. లోహియా, ఎం.ఎన్. రాయ్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావులనీ, వారితో కలసి పని చేయాలనీ ఆయన అనేవారు.
1956 సెప్టెంబరులో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అఖిల భారత కార్యవర్గ సమావేశం జరిగింది. కొత్త పార్టీ ఏర్పాటు చేయబోయే ముందు (రిపబ్లికన్ పార్టీ) లోహియాతో తప్పని సరిగా చర్చించాలని ఈ సందర్భంగా బాబాసాహెబ్ తన సహచరు లతో అన్నారు. అయన హఠాన్మరణంతో ఈ మహత్తర ప్రయోగానికి గండిపడింది. సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులను ఒక వేదిక మీదికి తీసుకురావాలనేది లోహియా చిరకాల ఆకాంక్ష.
ఆరు దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ అటువంటి ఆశలు చిగురి స్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ‘హత్య’, తదనంతర పరిణామాలూ దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో కమ్యూనిస్టు, అంబే డ్కర్ విద్యార్థి సంఘాల్ని దగ్గర చేశాయి. కొన్నేళ్లుగా ఏబీవీపీ ఉన్నత విద్యాలయాల్లో పట్టుకోసం విద్వేష రాజకీయాల్ని మొదలెట్టింది. అంబేడ్కర్, కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలపై జాతిద్రోహులు, కులతత్వవాదులనే ముద్ర వేసింది.
పర్యవసానాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిగా ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కర్ - కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. జేఎన్‌యూ విద్యార్థి సంఘ నాయకుడు కన్హయ్యకుమార్ ఉపన్యాసంలో జైభీం, లాల్ సలామ్ నినాదాలు అంతర్భాగాలయ్యాయి.
‘‘నేను జై భీం అంటాను. లాల్ సలామ్ అంటాను. అన్ని నినా దాలు భగత్‌సింగ్ ఇచ్చిన ఇంక్విలాబ్ జిందాబాద్‌తో మమేకమవు తాయి. దేశంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కొనేందుకు అంబేడ్కరిస్టులు -కమ్యూనిస్టుల కలయిక తక్షణ అవసరం. నూతన భారత ఆవిష్కా రానికి ఇది మనందరి కర్తవ్యం’’ అన్నారు చెన్నైలో జరిగిన అంబేడ్కర్ సంస్మరణ సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.
1980-90లలో శరద్‌పాటిల్ అంబేడ్కర్-కమ్యూనిస్టు సిద్ధాంతాల సమ్మేళనంగా సత్యశోధక్ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేశారు. ఇది చిన్న ప్రయోగం. ఇప్పుడు యూనివర్సిటీల్లో ప్రారంభమైన ఐక్య ఉద్య మాన్ని రాజకీయ పోరాటంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు విజయవంతం కావడానికి కొన్ని సవాళ్లున్నాయి. ఇప్పటికీ అంబేడ్కర్ వాదులు కమ్యూనిస్టుల నిబద్ధతను పూర్తిగా నమ్మడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కాలం నాటి నుంచీ ఆ దూరం, అనుమానం కొనసాగుతూనే ఉంది. భారతదేశ సమస్యల పరిష్కారానికి వర్గ దృక్పథమే ముఖ్యమనీ, కులం ఉపరితలాంశమనీ కమ్యూనిస్టులు ఇప్పటికీ భావిస్తున్నారు.
ఇందుకు భిన్నంగా కులం ఒక ఘనీభవించిన వర్గమని లోహియా చెప్పారు. మన సమాజానికి అవసరమైన విధంగా కమ్యూనిజాన్ని అన్వ యించి నూతన ఆలోచనను తెరపైకి తెచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సరైన విశ్లేషణలు చేయడంలో వెనకబడ్డాయి. ఈ ధోరణి మారాలి. అంబేడ్కర్‌వాద ఉద్య మాల్ని కేవలం అస్తిత్వ రాజకీయాలుగా చూడడం సరికాదు. ఇదొక సరి కొత్త న్యాయబద్ధమైన ప్రజాతంత్ర ఆకాంక్ష.
కమ్యూనిస్టు పార్టీల్లో దళి తులు ఉన్నత నాయకత్వ స్థానాల్లో లేకపోవడాన్ని గుర్తించినట్లు, దీన్ని సరిచేయనున్నట్లు సీపీఎం కోల్‌కతా ప్లీనం ప్రకటించింది. అంబేడ్కర్ వాదులు మొదటి నుంచీ చేస్తున్న విమర్శల్లో నాయకత్వ అంశం ప్రధాన మైంది. సైద్ధాంతిక-ఆచరణపరమైన ఇలాంటి సమస్యల్ని కమ్యూని స్టులు, అంబేడ్కరిస్టులు పరిష్కరించుకోవాలి. సానుకూల గత తప్పి దాల్ని అంగీకరించగలగాలి. రోహిత్ వేముల ‘ఆత్మ త్యాగం’ భారతదేశ రాజకీయాలపై సరికొత్త వెలుగులు ప్రసరింపచేయాలి. అప్పుడే అంబే డ్కర్ ఆకాంక్షించిన ప్రజాస్వామ్య భారతదేశం రూపుదిద్దుకుంటుంది.
వ్యాసకర్త: బి. భాస్కర్
సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 9989692001
అంబేడ్కరిస్టులు-మార్క్సిస్టుల ఐక్యత కొనసాగేనా..!
Published Fri, Apr 29 2016 1:00 AM | Last Updated on Fri, Aug 17 2018 8:12 PM
Advertisement
Advertisement