సాక్షి, అమరావతి: ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వరహాపురంలో ఆయన జన్మించారు. తల్లితండ్రులు సీతారామచంద్రరావు, శ్రీలక్ష్మి. తండ్రి ఉపాధ్యాయులు. ఇంటికి పెద్దకుమారుడైన ఏపీ విఠల్‌కి ఏడుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు. సాంప్రదాయక కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన తండ్రి ప్రభావంతో అభ్యుదయ భావాలతో పెరిగారు. గుంటూరులో మెడిసిన్ చదువుతున్నప్పుడు వామపక్ష భావాలతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో అరెస్టయి మొదటి ముద్దాయిగా చరిత్రకెక్కారు.
అభ్యుదయ పంధాలో ఆజన్మాంతం..
తొలినుంచి సీపీఎం పార్టీని అభిమానించేవారు. మార్క్స్, ఎంగెల్స్ రచనలు విస్తృతంగా చదివారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ఇంటర్న్‌షిప్ చేశారు. అక్కడే పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు ఆయనకు పరిచయం అయ్యారు. ప్రజావైద్యశాలలో డాక్టరుగా పనిచేశాక నెల్లూరులోని బత్తినపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా ఉద్యోగంలో చేరారు. పేదల డాక్టర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. తర్వాత తన భావాలకు, తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి మధ్య వైరుధ్యం ఏర్పడినట్లు అర్థమై నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో 1972లో ప్రజావైద్యశాల ప్రారంభించారు. విఠల్ దవాఖానా అని పేరుపడిన ఆ ఆసుపత్రిలో కేవలం మూడు రూపాయల ఫీజుతో వైద్యసేవలందించారు.
అప్పుడే పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రోత్సాహంతో పార్టీ పూర్తికాలం కార్యకర్తగా మారి సూర్యాపేట నుంచి విజయవాడకు వచ్చేశారు. అక్కడే ప్రజాశక్తి దినపత్రికలో చాలాకాలం పనిచేశారు. చిరుమువ్వల సవ్వడి అనే ఆయన రచన పేరొందింది. ఆ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. సురవరం సుధాకరరెడ్డి, మధు, నారాయణ, బీవీ రాఘవులు వంటి సీపీఐ, సీపీఎం నేతలు ఈయన సమకాలికులు. మోటూరు హనుమంతరావు దంపతులు ఈయనకు ఆరాధ్యులు.
1991 వరకు సీపీఎంలో ఉన్న ఏపీ విఠల్ తర్వాత ఆ పార్టీనుంచి బయటకు వచ్చేశారు. 1993 నుంచి 2015 వరకు ఆయన చుక్కపల్లి కుశలవ ట్రస్ట్ ఆసుపత్రిలో పనిచేశారు. 2012 నుంచి రచనావ్యాసంగానికి పరిమితమై వివిధ దినపత్రికల్లో వ్యాసాలు రాసి ప్రచురించారు. సాక్షి ఆయనకు ఎంతో ఇష్టమైన పత్రిక. వైఎస్ రాజశేఖరరెడ్డిపై విపరీతమైన అభిమానం. గత ఆరేళ్లుగా ఆయన సాక్షి పత్రికలో రెగ్యులర్ కాలమిస్టుగా వ్యాసాలు పంపుతూ వచ్చారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా 2019 డిసెంబర్‌లో సాక్షి పత్రికకు తన చివరి కథనం పంపారు.
వామపక్ష, అభ్యుదయ వాదుల మధ్య ఐక్యతను దశాబ్దాల తరబడి ఆయన కోరుకుంటూ వచ్చారు. సీపీఎం నేతగా, ఉద్యమకారుడిగా, రచయితగా పలు పుస్తకాలు రాసి ప్రచురించారు. విప్లవపథంలో నా పయనం, మార్క్స్-ఎంగెల్స్ మైత్రి, మార్క్సిజం పరిణామ సంధ్యలో, యుద్ధం హృదయం, వియత్నాం వీరుల వీరోచిత పోరాటం, లోకం తీరు వంటివి ఆయన రచనలలో కొన్ని. జీవితమంతా అభ్యుదయ భావాల వ్యాప్తికి పాటుపడిన ఏపీ విఠల్ పార్థివదేహాన్ని ఆయన కోరికమేరకు విజయవాడలోనే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment