vittal
-
పదవి లేకుంటే పార్టీని తిట్టడమేనా..?
సాక్షి, హైదరాబాద్: పదవీ కాలం పూర్తవగానే టీఆర్ఎస్ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉద్యోగ సంఘం మాజీ నేత విఠల్‌కు సీఎం కేసీఆర్ ఆరేళ్లు అవకాశమిచ్చి గౌరవించారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ద్వారా పదవులు పొంది వాటిని కోల్పోగానే పార్టీపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి బాల్కసుమన్ మంగళవారం టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తోన్న నిరసనను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో విందులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ భార్య జమున పేరిట ఉన్న హేచరీస్ ప్రభుత్వ భూములతో పాటు ఎస్సీ, ఎస్టీల భూములను కబ్జా చేశారని మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా బయట పెట్టినందున ఈటల ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
బీజేపీలో చేరిన విఠల్
సాక్షి, ఢిల్లీ: టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉమ్మడి ఏపీలో ఎన్జీవో నేత సీహెచ్ విఠల్ సోమవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి.. విఠల్‌కు కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వాన్ని ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ పుష్పగుచ్చం అందించి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: బీజేపీపై సంచలన ఆరోపణలు: కేబినెట్ బెర్త్, డబ్బు ఇస్తామన్నారు! విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ భావాలున్న ఆయన మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. టీఆర్ఎస్ ఏర్పడక ముందు నుంచే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకం విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని గళమెత్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా గతేడాది దాకా పనిచేసిన విషయం తెలిసిందే. -
‘ఆయన నిబద్ధత గల కమ్యూనిస్టు’
సాక్షి, విజయవాడ: ప్రముఖ కాలమిస్ట్, కమ్యూనిస్ట్ నేత డాక్టర్ ఏపీ విఠల్ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి మంగళవారం నివాళులర్పించారు. అనంతరం విఠల్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విఠల్ గొప్ప మేధావి. కమ్యూనిస్టు నాయకులలో అగ్రజుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్యకి ప్రియమైన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక వైద్యుడిగా పేదప్రజలకు ఉచితంగా వైద్య సహాయం అందించారు. కమ్యూనిస్టు భావాలను నరనరాలలో జీర్ణించుకున్న వ్యక్తిగా.. నిబద్ధత గల కమ్యూనిస్టుగా ఆయన జీవించారు. అలాంటి వారు ప్రస్తుతం మన మధ్య నుంచి దూరం కావడం తీరని లోటు. తెలంగాణ ఉద్యమకాలంలో ముందుండి అనేక వ్యాసాలు రాశారు. జీవితంలో చివరి క్షణం వరకు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి ఆయన' అంటూ విఠల్‌తో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా షుగర్, హృద్రోగంతో బాధపడుతున్న ఏపీ విఠల్ సోమవారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. (సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత) -
సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత
సాక్షి, అమరావతి: ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు 78 ఏళ్లు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని వరహాపురంలో ఆయన జన్మించారు. తల్లితండ్రులు సీతారామచంద్రరావు, శ్రీలక్ష్మి. తండ్రి ఉపాధ్యాయులు. ఇంటికి పెద్దకుమారుడైన ఏపీ విఠల్‌కి ఏడుగురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు. సాంప్రదాయక కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన తండ్రి ప్రభావంతో అభ్యుదయ భావాలతో పెరిగారు. గుంటూరులో మెడిసిన్ చదువుతున్నప్పుడు వామపక్ష భావాలతో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో అరెస్టయి మొదటి ముద్దాయిగా చరిత్రకెక్కారు. అభ్యుదయ పంధాలో ఆజన్మాంతం.. తొలినుంచి సీపీఎం పార్టీని అభిమానించేవారు. మార్క్స్, ఎంగెల్స్ రచనలు విస్తృతంగా చదివారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో ఇంటర్న్‌షిప్ చేశారు. అక్కడే పుచ్చలపల్లి సుందరయ్య వంటి నాయకులు ఆయనకు పరిచయం అయ్యారు. ప్రజావైద్యశాలలో డాక్టరుగా పనిచేశాక నెల్లూరులోని బత్తినపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరుగా ఉద్యోగంలో చేరారు. పేదల డాక్టర్‌గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. తర్వాత తన భావాలకు, తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి మధ్య వైరుధ్యం ఏర్పడినట్లు అర్థమై నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో 1972లో ప్రజావైద్యశాల ప్రారంభించారు. విఠల్ దవాఖానా అని పేరుపడిన ఆ ఆసుపత్రిలో కేవలం మూడు రూపాయల ఫీజుతో వైద్యసేవలందించారు. అప్పుడే పుచ్చలపల్లి సుందరయ్య గారి ప్రోత్సాహంతో పార్టీ పూర్తికాలం కార్యకర్తగా మారి సూర్యాపేట నుంచి విజయవాడకు వచ్చేశారు. అక్కడే ప్రజాశక్తి దినపత్రికలో చాలాకాలం పనిచేశారు. చిరుమువ్వల సవ్వడి అనే ఆయన రచన పేరొందింది. ఆ పత్రికలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. సురవరం సుధాకరరెడ్డి, మధు, నారాయణ, బీవీ రాఘవులు వంటి సీపీఐ, సీపీఎం నేతలు ఈయన సమకాలికులు. మోటూరు హనుమంతరావు దంపతులు ఈయనకు ఆరాధ్యులు. 1991 వరకు సీపీఎంలో ఉన్న ఏపీ విఠల్ తర్వాత ఆ పార్టీనుంచి బయటకు వచ్చేశారు. 1993 నుంచి 2015 వరకు ఆయన చుక్కపల్లి కుశలవ ట్రస్ట్ ఆసుపత్రిలో పనిచేశారు. 2012 నుంచి రచనావ్యాసంగానికి పరిమితమై వివిధ దినపత్రికల్లో వ్యాసాలు రాసి ప్రచురించారు. సాక్షి ఆయనకు ఎంతో ఇష్టమైన పత్రిక. వైఎస్ రాజశేఖరరెడ్డిపై విపరీతమైన అభిమానం. గత ఆరేళ్లుగా ఆయన సాక్షి పత్రికలో రెగ్యులర్ కాలమిస్టుగా వ్యాసాలు పంపుతూ వచ్చారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉండి కూడా 2019 డిసెంబర్లో సాక్షి పత్రికకు తన చివరి కథనం పంపారు. వామపక్ష, అభ్యుదయ వాదుల మధ్య ఐక్యతను దశాబ్దాల తరబడి ఆయన కోరుకుంటూ వచ్చారు. సీపీఎం నేతగా, ఉద్యమకారుడిగా, రచయితగా పలు పుస్తకాలు రాసి ప్రచురించారు. విప్లవపథంలో నా పయనం, మార్క్స్-ఎంగెల్స్ మైత్రి, మార్క్సిజం పరిణామ సంధ్యలో, యుద్ధం హృదయం, వియత్నాం వీరుల వీరోచిత పోరాటం, లోకం తీరు వంటివి ఆయన రచనలలో కొన్ని. జీవితమంతా అభ్యుదయ భావాల వ్యాప్తికి పాటుపడిన ఏపీ విఠల్ పార్థివదేహాన్ని ఆయన కోరికమేరకు విజయవాడలోనే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. -
కలల రాజధాని X ప్రగతి రాజధాని
రాజధాని మార్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనతో గ్రాఫిక్స్ రాజధాని భ్రమలు తొలగిపోయాయి. టీడీపీ ముందుకు పోతుందన్న నమ్మకం లేని బాబు, ఆ మధ్య వెనక్కి నడవటం ప్రాక్టీసు చేశారు. రెండు రాజధానులా, మూడు రాజధానులా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలి. సామాజిక రాజకీయ వ్యవహారాల్లో ఎంతో కొంత అనుభవం ఉన్న సినీ నటుడు చిరంజీవి సైతం వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రస్తావనను సమర్థిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రజానుకూల పాలనపై నమ్మకం ఉందన్నారు. పైగా, బాబు కంటే జగన్‌పై అత్యధిక ప్రజలలో విశ్వసనీయత ఉంది. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న రాజధాని ప్రగతికి సంబంధించినది కాగా, బాబు ప్రతిపాదించిన రాజధాని కలల రాజధాని మాత్రమే! ఇటీవల చంద్రబాబు కలల రాజధాని గురించి ఆందోళనలు మిన్నంటుతున్నట్లు కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. అసలు చంద్రబాబుకి ఒక మంచి రాజధాని నిర్మించాలన్న ఆలోచన లేనేలేదని నాకు అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బాబు తెలుగుదేశం, మోదీ బీజేపీ, పవన్ కల్యాణ్ జనసేన అన్నీ కలిపి పోటీ చేసినప్పటికీ, ఆ అవకాశవాద రాజకీయ కూటమికి.. ఒంటరిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీపై కేవలం 1.5 శాతం ఓట్ల ఆధిక్యతతో అధికారం దక్కింది. ఆ క్షణంలోనే చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కూడా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడి ఉంటారు. ఇక 2019లో తాను మళ్లీ గెలవడం అసాధ్యం అని దూరదృష్టితో గ్రహించి ఉంటారు. అందుకే అయిదేళ్లపాలనలో సాధ్యమైనంతగా సంపద సృష్టించుకుని, తన వారికి, తన పుత్రునికి తన సామాజిక వర్గం వారికి, బంధుమిత్రులకు తాను సృష్టించిన సంపదను కట్టబెడతామని నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఏ ఒక్కరితోనూ చర్చించకుండా అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి, పూర్తిగా అప్రజాస్వామికంగా అమరావతిని ఏకపక్షంగా రాజధానిగా ప్రకటించారు. విద్యాలయాల పేరుతో ధనాగారాన్ని సృష్టించుకున్న పెద్దమనిషి నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి దానితో అమరావతి రాజధాని అని ‘మమ’ అనిపించారు. అలా అమరావతి చంద్రబాబు ఏకపక్ష నిర్ణయమైంది. ఇందులో ప్రజాస్వామ్య పద్ధతి ఏ కోశానా కనిపించదు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ప్రధానిచేత ప్రతిష్టింపజేసిన రాజధాని ఫలకం అలాగే ఉండిపోయి ఆ ఫలకం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి బాబుగారి సామర్థ్యానికి ప్రతీకగా నిలిచివున్నాయి. ప్రపంచంలోని అయిదు గొప్ప రాజధానులతో సమానంగా అమరావతి నిలిచేటట్టు చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు బాబు. సింగపూర్ నుంచి రాజధాని నమూనా తయారు చేయించారు. ఆకాశ హర్మ్యాలు, 20, 25 బహుళ అంతస్తులు, ఉద్యానవనాలు, నీటిలో విహారాలు, అద్భుతమైన శిల్పాలమయంగా రాజధానిని రూపొంది స్తున్నామని బాబు చెప్పారు. కానీ ఆ నమూనా చూసిన వారెవరూ ఆనందించలేదు. రాజమౌళి బాహుబలి ఎన్నో రెట్లు మెరుగ్గా అని పించిందన్నారు వారు. ఇంకేం.. రాజధాని నిర్మాణానికి రాజమౌళిని కూడా రప్పించేశారు. ఐకాన్ బ్రిడ్జిలూ, పగలు రాత్రి తెలియని జాజ్వల్యమానమైన విద్యుత్ వెలుగులతో ప్రజల కళ్లకు గ్రాఫిక్స్‌తో గంతలు కట్టారు. అదేసమయంలో తన కలల రాజధానికి లక్షకోట్ల రూపాయలు అవసరమవుతాయని బాబు చావుకబురు చల్లగా చెప్పారు. కట్టుబట్టలతో గెంటేశారనీ, అమరావతిలో దాదాపు దిశమొలతో తిరి గామనీ, చివరకు పడుకునే మంచాలు లేక నేలమీదే పడుకున్నామనీ, చెట్లకు వేళ్లాడవలసి వచ్చిందనీ ఒకవైపు దీనంగా అరుస్తూ, మింగమెతుకు లేనివానికి మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఈ పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి ప్రపంచ స్థాయి, గ్రాఫిక్ రాజధాని అవసరమా అని ఆనాడే మాబోటివాళ్లం చెబితే బాబు గారి అహం దెబ్బ తింది. మన తెలుగువారు ప్రపంచ స్థాయి అద్భుత రాజధానికి అర్హులు కారా, మన తెలుగువారి సత్తా చూపించలేమా అంటూ హుంకరించారు. ఇక భూ సమీకరణ మొదలెట్టారు. అదుగో ద్వారక, ఆలమందలవిగో.. యదుసింహుండు వశించు మేడ అదిగో అన్నట్లుగా ప్రజలకు సింగపూర్ డాక్యుమెంట్లు చూపిస్తూ భూసమీకరణకు పురికొల్పారు. తన సామాజిక వర్గానికి చెందిన మోతుబరులను రప్పించి వారిచేత అమరావతి ప్రాంతంలోని సాధారణ రైతులతో చెప్పిం చారు. ‘మీరు కూడా భూసమీకరణకు భూములిస్తే మాలాగే విలాసవంత జీవితం గడపవచ్చు. భూములిచ్చినవారికి రాజధాని ప్రాంతంలో బహుగిరాకీగా ఉండే వ్యావార, వాణిజ్య ప్రాంతంలో ఎకరానికి 1200 చ.అడుగులను బాబు ఇస్తారని అది కోట్ల విలువ చేస్తుంద’ని ఈ మోతుబరులు నమ్మబలికారు. కొందరు అమాయక రైతులు, అగ్రిగోల్డ్ బాధితులు ఆ మాటలకు నమ్మేశారు. కానీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆధారపడలేమని, మా సేద్యం మేం చేసుకుంటామని తిరస్కరించిన సన్నకారు రైతులను వేధించారు. బలవంతంగా అయినా సరే భూసేకరణ చేస్తామని అప్పుడు మేం చెబుతున్న ఈ ప్లాట్లు కూడా రావని బెదిరించి వారినుంచి భూములు లాక్కున్నారు. ఎదిరించిన రైతుల భూముల్లో అరటి, పండ్ల తోటలను బాబు అనుయాయులు తగులబెట్టారు. ఇలాంటి పాశవిక చర్యలన్నింటికీ పూనుకుని రాజధాని పేరుతో 33 వేల ఎకరాలను సేకరించారు. ఇంకా భవిష్యత్ అవసరాలకోసం, రింగ్ రోడ్డులను చూపించి మొత్తం 55 వేల ఎకరాలను బాబు ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకుంది. దారుణమైన విషయం ఏమిటంటే ఎస్సీ,ఎస్టీలకు గతంలో వైఎస్సార్ పాలనలో దఖలుపర్చిన భూములను ఎవరూ కొనరాదని చట్టం చేశారు కానీ దానికి కూడా తూట్లు పొడిచిన చంద్రబాబు ఒక కొత్త చట్టం పేరుతో ఆ దళితుల భూములను కూడా కొనవచ్చని తీర్మానించి వాటిని కూడా తనవారిచేత కొనిపించారు. నిజానికి రాజధానికి అంత భూమి అవసరం లేదు. ఆ పేరుతో బడాబాబులు, బాబుగారి సహజ మిత్రులు, ఆయన బంధువులు, బినామీలు, ఇంకా రియల్ ఎస్టేట్ కోసం భూదాహంతో ఉన్నవారు అలాంటి భూబకాసురులకు కట్ట బెట్టేందుకు ఇంకా ఎన్ని వేల ఎకరాలైనా సరిపోవు మరి. ఇదీ వెన్నుపోటు బాబు గారి కలల రాజధాని. ఇలాంటిది వాస్తవంలో రాజధాని కాలేదు. అయినా రాజధాని నిర్మాణానికి ఈ ఆరు సంవత్సరాల్లో లక్ష కోట్లకుగాను బాబు గారి కలల ప్రభుత్వం ఖర్చు చేసింది 5 వేలకోట్లు. అంటే ఏడాదికి వెయ్యికోట్లు సుమారు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు. ఇలా అయితే బాబుగారి కలల రాజధాని నిర్మాణం పూర్తయేందుకు 1000 సంవత్సరాలు పడుతుంది. 2050 నాటికి ప్రపంచ ప్రఖ్యాత విలాసవంతమైన పెద్ద రాజధానిగా అమరావతి నిర్మాణమవుతుందని బాబు చెప్పారు. అయితే బాబుగారు ఏమోగానీ ఆయన వెన్నుపోటు పార్టీలో ఇప్పుడున్న 23 మందిలో ఎంతమంది వచ్చే ఎన్నికల నాటికి ఉంటారన్నది చెప్పలేం. ఏదేమైనా చంద్రబాబు తన పార్టీ ముందుకు పోతుందని నమ్మటం లేదు. అందుకే ఆయన ఆమధ్య వెనక్కు నడవటం ప్రాక్టీస్ చేశారు కదా. నిజంగా రియల్ ఎస్టేట్స్ ద్వారా 100 రెట్లు ఎక్కువగా ఆదాయం పొందవచ్చని ప్లాన్లు చెబితే సాధారణ రైతులు, కౌలు రైతులు చంద్రబాబు మోసానికి గురైనారు. అయినా అమాయకంగా మనం ఇంకా బాబుగారి మాటలు నమ్మగలమా? చంద్రబాబు నయవంచనతో అమరావతిని కేవలం తన ధన దాహానికే వాడుకున్నారు. ఆయన కట్టించిన భవనాల నాణ్యత ప్రశ్నార్థకం అయ్యాయి. నమ్మదగిన ఒక్క అభివృద్ధి కూడా లేదు. అభివృద్ధిపై ఆయన మాటలు నీటి మూటలే. కనుక ఆయనను విశ్వసించడం ఇకనైనా మానుకోమని అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పడమే మిగిలింది. మిమ్మల్ని మోసం చేసింది చంద్రబాబే అని చెప్పడమే మిగిలింది. ఇక ప్రజల మనిషిగా, మనసున్న నేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయం. ముందు ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ తన అభిప్రాయంగా ఆ సంగతిని ప్రస్తావించారు. తగిన రీతిలో రాజధానిపై అధ్యయనం చేశారు. రాజధానిపై ఒక కమిటీ వేసి దాని తుది నివేదికను ప్రజలకు తెలియజేశారు. మంత్రివర్గం కూర్చుని ఆ కమిటీతో చర్చించి దానిపై వారు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్ణయం చర్చకు వస్తుంది. రెండు రాజధానులా, మూడు రాజధానులా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలి. మూడు రాజధానులు అభివృద్ధి అయితే మంచిదే కదా. సామాజిక రాజకీయ వ్యవహారాల్లో ఎంతోకొంత అనుభవం ఉన్న సినీ నటుడు చిరంజీవి సైతం జగన్ మూడు రాజధానుల ప్రస్తావనను సమర్థిస్తున్నారు. జగన్ ప్రజానుకూల పాలనపై నమ్మకం ఉందన్నారు. అదే సమయంలో రైతులకు న్యాయం జరగాలని సూచించారు. ఆ సూచన ఆచరణీయమేనని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు న్యాయమైన పరిహారం చెల్లిస్తామన్నారు. అన్నింటినీ మించి చంద్రబాబు కంటే జగన్‌పై అత్యధిక ప్రజలలో విశ్వసనీయత ఉంది. వైఎస్ జగన్ ప్రతిపాదిస్తున్న రాజధాని ప్రగతికి సంబంధించినది కాగా, బాబు ప్రతిపాదించిన రాజధాని కలల రాజధాని మాత్రమే! వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ఆరిపోయే దీపానికి వెలుతురు అధికం
ఏమైనా చెప్పండి! మరీ ఇంత మంచితనం పనికిరాదండి అని మామూలు ‘హలో’తో పలకరింపులు అయిన తర్వాత సాక్షిలో నేను రాసిన వ్యాసం ప్రచురితమైన రోజు ఒక పాఠకుడు చెబుతున్నాడు. వివరించండి అన డిగాను. అదేనండి జగన్ గారు... ఏ పార్టీ శాసనసభ్యుడైనా మా పార్టీలోకి రావాలంటే తాను ఉన్న పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చి రావాలని షరతు పెట్టడం ఏమిటండి? పైగా దానికే కట్టుబడి ఉండాలా? రెండు రోజులు గడువు పెట్టి ఉన్నట్లయితే మీరంటుంటారే.. ఆ వెన్నుపోటు పార్టీ దాదాపు ఖాళీ అయ్యేదండీ! చంద్రబాబు కూడా ఇక దిక్కు తోచక బీజేపీలో చేరి ఉండేవాడు... పీడా ఒదిలిపోయేది! అని పూర్తిచేశాడు. నేన న్నాను.. మీరు చెప్పినట్లు నిజాయితీ లేని రాజకీయాలు, మాటతప్పి యూటర్న్ తీసుకోవడం చేస్తే జగన్‌కు ఆ వెన్నుపోటు పార్టీ నేతకు తేడా ఏమంటుంది? అన్నాను. ‘నిజమేనండీ, మాట తప్పకపోవడం జగన్‌కి ఆయన తండ్రి వైఎస్సార్ నుండి సంక్రమించిన సద్గుణమే అనుకోండి. కాకుంటే ఆ చంద్రబాబు, ఆయన శిష్యులుగా నటిస్తున్న వాళ్లు ఏదో గిల్లికజ్జాలు పెట్టుకుని, జగన్ తాను ఎంచుకున్న ప్రజా సంక్షేమ బాటనుంచి దృష్టి, దారి మళ్లించాలని చేస్తున్న కుట్రలు చూస్తుంటే కడుపు రగిలిపోతున్నది’ అన్నాడా పాఠకుడు. ‘నువ్వొక్క డివేనా ఆలోచించగలిగింది? నీకొక్కడికేనా రగిలిపోయే కడుపు ఉన్నది’ అని ప్రశ్నించాను. ‘నిజమేనండి, మొన్న ఎన్నికల్లో బాబుకు ఓటేసిన వాళ్లలో చాలామంది కూడా ఆయన నయవంచక రూపం చూసి అసహ్యించుకుంటున్నారు. ఏదో రకంగా ఇంకా రాజకీయాల్లో తనకేదో ముఖ్యమైన పాత్ర ఉన్నట్లు కాలం నెట్టుకొస్తున్నాడు గానీ బాబుగారు, అది సాధ్యం కాదండి. ఉంటానండి. ‘అది సరేనండీ.. నాకు తెల్వక అడుగుతున్నాను.. చేతికి ఎముక లేనట్లు సామాన్య రైతాంగానికి, యువతీ యువకులకు, చేనేతవారికి, రైతు భరోసాలు, ఉపాధి ఉద్యోగాలు, వాహనమిత్ర.. ఇలా అడిగిన వాడికి, అడగని వాడికి సహాయంగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే... ఎట్టాగండి. ప్రభుత్వం దగ్గర డబ్బులెక్కడివి?’ అన్నాడు మరొక పాఠకుడు. ‘సరే.. గవర్నమెంటుకు, రాష్ట్రానికైనా, కేంద్రానికైనా డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? మన ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కదా? అక్కడ మోదీగారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తమ జేబులోంచి నేరుగా ఇవ్వరు కదా. మరి ఆ డబ్బును అదే ప్రజలకోసం ఖర్చుపెట్టడం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం విధ్యుక్త ధర్మం కదా! జగన్ తాను ప్రజల మనిషినని, ప్రజల కోసమే తాను తన ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని ఆచరణలో నిరూ పిస్తున్నారు. బాబుగారి వెన్నుపోటు పార్టీ పాలనలో, తాను, తన తనయుడు, తన బంధుమిత్రులు, ఇంకా నారాయణ వంటి తమ మంత్రులు, ధనవంతులు అలాంటి ఆమాంబాపతు కోసమే పదవిలో ఉన్నారు కదా! దీపం ఉండగానే అన్నట్లు దొరికిన చోట దొరికిన కాడికి దోచుకుని దాచుకోవడమే.. ఆ ఎజెండా! దాన్ని ఆయన అమలు జరిపాడు’. జగన్ ఎజెండా ప్రజాసంక్షేమం. జగన్ ఎజెండా రాష్ట్ర అభివృద్ధి. జగన్ ఎజెండా నిజాయితీ మార్గం, పారదర్శకంగా పనిచేయడం... అని నేను ఫోన్లో చెబుతుండగానే.. అవతల వ్యక్తి.. అంతే కాదండీ, పేదలకు, కష్టజీవులకు, అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు గతంలో ఎన్నడూ ఎరగనట్లు పాలనలో 50 శాతం భాగస్వామ్యం కూడా ఇస్తున్నారండీ. ఈ సామాజిక న్యాయం గురించి కూడా జనం గొప్పగా చెప్పుకుంటున్నారండీ, ఈసారి ఎన్ని కలు వస్తే ఈ అణగారిన వర్గాల నుండి 10శాతం ఓట్లు కూడా చంద్ర బాబుకు పడటం డౌటేనండీ అన్నారు. వీళ్లందరూ సాధారణ ప్రజలు. ఇలా మరో 10–15 ఫోన్ సంభా షణలు అయ్యాక, పత్రికలు అందులోనూ ఎడిట్ పేజీ వ్యాసాలు చదివే తీరిక, ఓపిక, జిజ్ఞాస ఉన్నవారు చేసే మచ్చుకు ఒక ఫోను.. ‘మీరు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో చెప్పరేమిటి?’ అన్నాడు. మరొకాయన.. నేనన్నాను.. ‘నాయనా నాకు అర్థ శాస్త్రం అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం స్థూలంగా అర్థం అవుతోంది. మన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఆర్థిక మాంద్యానికి అదొక ప్రధాన కారణం. నిరుద్యోగం పెరిగిపోతోంది. వ్యవసాయరంగం బాగా ఇబ్బందుల్లో ఉంది. దేశ జనాభాలో 60 శాతం ప్రజలు వ్యవసా యంపై ఆధారపడుతున్నారు. కానీ ఈరంగంలో ప్రజలకు ఆదాయం లేక సాధారణ ప్రజానీకం తిండీబట్టా కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో కడుపునిండకుండా, అర్ధాకలితో ఉండే ప్రజల్లో 152 దేశాల్లో మన స్థానం 102వ స్థానం. మన కంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, చివరకు పాకిస్తాన్లో సైతం పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉందని అంతర్జాతీయ గణాంకాలు తెలిపాయి. (ఈ మాట చెబితే, నన్ను పాకిస్తాన్‌ని పొగిడానని దేశ ద్రోహ నేరంతో నాపై కేసుకూడా పెడుతుందేమో మోదీ పాలన) ఇలాంటి నేపథ్యంలో తన సంక్షేమ పథకాల ద్వారా ఇలాంటివారికి లాభం చేకూర్చడమే ప్రజల సంక్షేమం’ అని నేను పూర్తి చేయకముందే అవతల ఫోన్లోనుంచి అందుకున్నారు. ‘అది సరే.. చెప్పనివ్వండి.. ఈ డబ్బంతా ప్రత్యక్షంగా ఎవరికి చేరుతోంది? గ్రామీణ రైతు, పేద, కష్ట జీవుల కుటుంబాలకే కదా. చేనేత కుటుంబానికి 25 వేలు సంవత్సరానికి ఇస్తే ఆ కుటుంబం ఏం చేస్తుంది? నోట్లను నమిలి మింగదు కదా. వారి అవసరాలకు గతంలో కంటే కొంచెం మెరుగైన జీవనం కోసం ఖర్చుపెడతారు. అలాగే ప్రజలకు చేరుతున్న ఈ ప్రత్యక్ష నగదుతో ఆ ప్రజానీకం తమకు అవసరమైన సరుకులను కొంటారు తప్ప ఆ డబ్బును ఇనప్పెట్టెల్లో దాచుకోరు కదా. అంటే గత పాలనల్లో కంటే వారి కొనుగోలు శక్తి ఇప్పుడు పెరుగుతుంది కదా. నిజానికి ఎన్ని లక్షల మందికి ఇలా కొనుగోలు శక్తి పెరిగితే అంత మంచిది కదా. అయినా ఎంత సుజనా చౌదరి అయినా, సీఎం రమేష్ అయినా, లోకేష్ అయినా, ఎంత ఖరీదైనవైనా ఒక్కొక్కరు ఎన్ని టీవీ సెట్లు కొంటారు. మహా అయితే గదికి ఒకటికి లేదా మనిషికి ఒక్కొక్కటి. అంతే కదా. అదే 20 లక్షలమందికి కొత్తగా సాధారణమైన టీవీ కొనే స్థితి వస్తే దేశంలో ఎన్ని టీవీలు ఉత్పత్తి కావాలి? ఉదాహరణకు చెప్పాను. అంటే నిజానికి ఇది గ్రామీణ పేదల కొనుగోలు శక్తిని పెంచి సరుకుల ఉత్పత్తికి దోహదపడుతుందా లేదా?’ఇలాంటిదే మరో కాల్. ఏమండీ, అసలు పారిశ్రామికంగా డెవలప్ కాకుండా నిరుద్యోగం పోతుందా? నిరుద్యోగం పోకుండా, దేశ పురోభివృద్ధి సాధ్యమా.. చెప్పండి. పారిశ్రామిక అభివృద్ధి జర గాలి. నిజమే. అందుకే జగన్ నవోదయ పథకం పెట్టారు. ఇది చిన్న, మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి కోసమే అని నేనంటూండగానే, ఎంతయినా పెట్టుబడులు రాకుండా మన అభివృద్ధి సాధ్యమా, పెద్ద పెద్ద కార్పొరేట్ పరిశ్రమలు అత్యంత అవసరం కదా? అన్నారు.. దానికి నేను.. మీకు తెలిసే ఉంటుంది. ఈ తరహా చిన్న పరిశ్రమలు దేశంలో 12 కోట్లమంది జనాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు అది అత్యంత భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా మన దేశానికో, రాష్ట్రానికో ఎందుకు వస్తారు? వాళ్లు మన మేనత్త, మేనమామ పిల్లలు కాదు.. లాభార్జన లక్ష్యంతోనే వస్తారు. తాను తయారు చేసే సరుకులకు మన దేశ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని, ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటుందనుకుం టేనే వస్తారు. ఏదో మన వల్ల వాడికి లాభం ప్రత్యేకించి ఉండాలి. ఉదాహరణకు చౌకగా వనరులు, మానవ వనరులు (కూలీలు, కార్మి కులు) వారి దేశాలలోని శ్రామికుల కంటే బాగా పేదవారు కనుక, కుడుము ఇస్తే పండగ అనుకుంటారు గనుక, వారి శ్రమశక్తికి చాలా తక్కువ చెల్లించవచ్చునని! అయినా నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్నీ మనమే తయారు చేసుకోలేం. కనుక అలాంటి పరిశ్రమలు అవసరమౌతాయి కావున ఆ బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడటం గత్యంతరం లేకుంటే అలా చేయక తప్పకపోవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం చేస్తున్నట్లు అదే ఏకైక మార్గం కాదు. లక్షల కోట్లు ఆ విదేశీ, స్వదేశీ గుత్తాధిపతులకు సబ్సిడీల రూపంలో కట్టబెట్టి, మన సాధా రణ ప్రజానీకాన్ని గ్రామీణ వ్యవసాయ, తత్సంబంధ వృత్తులవారికి మొండి చేయి చూపిస్తే మళ్లీ వలసభారతం వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి పంథాకై తపన పడు తున్నారు. అయినా విదేశీ పెట్టుబడులకు అవసరాన్ని బట్టి ఆహ్వాని స్తూనే ఉంటున్నారు కదా. ఇలా మరికొన్ని అభినందన ఫోన్ల తర్వాత ఇంకొకాయన అడి గారు. ‘జగన్ రైతు భరోసా మంచిదేనండి. కానీ ఒకటిన్నర ఎకరం రైతుకు, అయిదెకరాల రైతుకు తేడా చూడడం లేదండి. ఇలా సంక్షే మాలు ఇస్తూ పోతుంటే, సోమరిపోతులు కూడా పెరుగుతారు’ అన్నారాయన. నేనన్నాను... స్థూలంగా చూస్తే ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తిపరులందరూ చెమటలు పట్టేట్లు కష్టపడి సంపాయించినవా రేనా? నిజానికి వారికంటే సోమరులెవరండీ, వాళ్లు తెలివిగలవాళ్లు అంటారు. మీకు గుర్తుందా, చంద్రబాబు అనేవారు. మనం తెలివి తేటలు ఉపయోగించి సంపదలు సృష్టిద్దాం. ఆ సంపద ప్రజలకు పంచిపెడదాం అని.. కాని అది అంతా వట్టి హుళక్కే. ఆస్తి మూరెడు, ఆశ బారెడు. చివరకు అప్పులు, చేతికి చిప్పలు అన్నట్లు రాష్ట్రాన్ని గత అయిదేళ్లుగా అధోగతికి నడిపించాడు చంద్రబాబు. ఆయన అయి దేళ్లలో కట్టిన రెండు మూడు తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు కూడా వాసిలో నాసి. జగన్మోహన్ రెడ్డి ఎంతో వినమ్రంగా ఇంతవరకు ఏ నేతా చేయనట్లుగా ప్రజల మధ్యలో పాదయాత్రలో ప్రజలనుండి తాను తెలుసుకున్న విషయాల ద్వారా ఆ అనుభవం ద్వారా నేర్చుకుని తన పాలనలో అమలు జరిపేందుకు నిజాయితీగా తీవ్ర కృషి చేస్తున్నారు. మావో చెప్పినట్లు ప్రజలను మించిన గురువులు ఉండరు, ప్రజాజీవితాన్ని మించిన పాఠశాలా ఉండదు. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
పురోగమన దిశలో జగన్ పాలన
ఈ మధ్య సాక్షిలో నేను రాసిన ‘చంద్రబాబు భజనలో బీజేపీ’ వంటి నా వ్యాసాలు చదివిన మార్క్సిస్టు మిత్రుడొకరు ’జై మార్క్సిజం – జై జగన్’ అని ఒక మెసేజ్ పెట్టారు. అలాగే ఆ మధ్య ‘చిరస్మరణీయుడు సుందరయ్య’ అని ఆ మహనీయుని పేరును మన ప్రజలకు, ప్రత్యేకించి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు మన ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పర్చనున్న జిల్లాకో లేక ప్రజలకు ప్రాణప్రదమైన ఒక ప్రాజెక్టుకో, లేదా పోలవరం ప్రధాన కుడి ఎడమల కాలువలలో ఒకదానికో ఆలోచించి పెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చిన్న లేఖ రాశాను. ‘అలా సుందరయ్య పేరు పెడితే సోషలిజం వచ్చేస్తుందా అండీ’ అనీ, ‘మీరు విజ్ఞప్తి చేయకపోయినా వైఎస్ జగన్.. సుందరయ్య గారి పేరు పెడతారు లెండి. ఎలాగూ ఆయనా రెడ్డే కదా!’ అనీ, మరీ తమాషా ఏమిటంటే, ‘మీరు విఠల్ రెడ్డి కదా, సీపీఐ నాయకులేనా’ అనీ వంద అభినందనలతోపాటు వ్యాఖ్యానాలు కూడా పాఠకుల నుండి వస్తుంటాయి. ‘మీరు మార్క్సిస్టు విశ్లేషకులా? అయితే చంద్రబాబుపై విమర్శలేమిటండీ మీ రాతల్లో ? చివరకు తెలుగుదేశం పార్టీ అని కూడా అనకుండా వెన్నుపోటు పార్టీ అని హేళన చేస్తూ రాస్తారు. ఇది పెయిడ్ న్యూస్ కిందికి రాదా?’ అని అడిగేవారూ ఉంటారు. ఏమండీ, మీరు తెలంగాణ వారా? తెలంగాణ సీపీఎం పార్టీ సామాజిక న్యాయ పోరాట వేదికగా ఉన్న బహుజన వామపక్ష సంఘటనను బలపరుస్తూ రాస్తుంటారు. అంటే అంబేడ్కర్ సిద్ధాంతం, మార్క్సిజం రెండూ సమాన ప్రాధాన్యత ఉన్నవేనా’ అని తెలిసో తెలియకో అడిగేవారు కూడా ఉంటారు. వీళ్లకి ఫోన్లోనే జవాబు చెప్పినా వీటన్నింటి మధ్యా ఒక సాధారణ అంశం ఉంది గనుక సంక్షిప్తంగా ఈ వ్యాస పరిధిలోనే సమాధానం ఇవ్వదలిచాను. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇటీవల అమెరికాలో వేలాది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డల్లాస్‌లో చేసిన ప్రసంగం తెల్లవారుజామున 4–5 గంటల మధ్యలో ప్రసారమైనా నేను శ్రద్ధగా విన్నాను. నాకు చాలా ముచ్చటేసింది. అమెరికా జాతివివక్ష పోరాట యోధుడు మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) స్ఫూర్తితో అది నా కల అంటూ ఎంతో నిజాయతీగా, ఉత్తేజకరంగా, జగన్ ప్రసంగం అత్యంత హృద్యంగా, ప్రస్తుత వాస్తవికతకు అద్దంపడుతూ ఆకట్టుకునే రీతిలో సాగింది. ముగింపులో జగన్ ‘నాకు గాంధీజీ ఆదర్శం, అంబేడ్కర్ రచనలతో ప్రభావితుడినయ్యాను. సమాజంలో మతం, కులం, లింగ వివక్ష లేకుండా ఆదివాసీ, గిరిజన, బీసీ, మైనారిటీ మహిళల అభ్యున్నతి నా కల. మనిషిని మనిషి దోచుకోని వ్యవస్థ, సామాజిక న్యాయం జరిగే అసమానతలు, అన్ని రకాల అణచివేతలు లేని సమాజం రూపు దిద్దుకుంటేనే మనకు నిజమైన స్వాతంత్య్రం. బీసీలంటే వెనుకబడిన కులాలు అని కాదు. సమాజ అస్తిత్వానికి బ్యాక్ బోన్ (వెన్నెముక) కులాలు అన్నదే దాని అసలు అర్థం’ అన్నారు. నేను మార్క్సిజాన్ని ఆచరించాలని ఆశించే వ్యక్తిని. మార్క్సిజం కేవలం గాలిలో ఉండదు. మన కోరికలను బట్టి సమాజ పరిణామం జరగదు. భౌతిక వాస్తవ పరిస్థితి ఆధారంగా సమాజ పరిణామ క్రమం జరుగుతుంది. ఆనాటి స్వాతంత్య్రోద్యమం వలస పాల ననుంచి మన దేశానికి స్వాతంత్య్రం సాధించడం అప్పటి సామాజిక పరిణామ క్రమంలో పురోగమనమే! స్వాతంత్య్రం వచ్చెననీ సంబరపడగానే సరిపోదోయి అన్న గీతం చెప్పింది నిజమే! మనదేశంలో పేదరికం పోవాలి! శ్రమజీవుల శ్రమఫలితం వారు సంపూర్తిగా అనుభవించాలి. మార్క్సిజం చెప్పినట్లు దోపిడీపై శ్రమ శక్తి వర్గపోరాటం చెయ్యాలి. ఆవిధంగా దోపిడీలేని సమాజం – కమ్యూనిస్టు సమాజం ఏర్పడుతుంది. వర్గపోరాటం దోపిడీలేని, యజమాని–శ్రామికుడు అనే వర్గ వైరుధ్యాన్ని ఆవిష్కరించి వర్గరహిత సమాజాన్ని నెలకొల్పుతుంది. ఈ సాధారణతా పరిధిలోనే మన భారతదేశ ప్రత్యేకతకు అన్వయింపగలగాలి. వివిధ జాతులున్న మన దేశంలో, మనుçస్మృతి ఆధారిత నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అణచబడుతున్న నిమ్నకులాలుగా పిలువబడుతున్న వారికీ, అగ్రవర్ణాలు అందునా ఆధిపత్యవర్గాల వారికి శతాబ్దాలుగా సాగుతున్న అణచివేత వైరుధ్యం కూడా ఉన్నది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ మాటల్లోనే, యూరప్ దేశాల్లో బానిసవ్యవస్థ అంతమయి తదుపరి దశలకు సమాజం పురోగమించింది. కానీ మన భారతదేశంలో బానిసవ్యవస్థ కులవ్యవస్థ రూపంలో ఘనీ భవించింది. నేటికీ కొనసాగుతోంది. ఆధిపత్య కులాలపై నిమ్న కులాల ప్రజానీకం కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి కుల నిర్మూలన చేసి కులరహిత సమాజానికై పోరాడాలి. ఆర్థిక, సామాజిక, విద్య వంటి సాంస్కృతిక రంగాల్లో వెనుకబడిన కులాలకు చెందిన శ్రామిక శ్రేణులు అధికం. ఆర్థిక వైరుధ్యం పునాది. ఈ కుల అణచివేత ఉపరితలంలోనే ఉంటుంది. కనుక ఆర్థిక అంశాలపై వర్గపోరాటాలే ముఖ్యం. ఈ కుల నిర్మూలన పోరాటం వర్గపో రాటంలో చీలికలు తెస్తుంది అని వాదించే మార్క్సిస్టులకు భారత దేశ ప్రత్యేకత అయిన లాల్–నీల్ ప్రాధాన్యత తెలియనట్లే. పైగా ఇప్పుడు కమ్యూనిస్టులు 33 పార్టీలుగా చీలిపోయారు. వర్గపోరాటం సాయుధమా, పార్ల మెంటరీ మార్గమా దేశవ్యాప్త సర్వ శ్రామిక సమ్మె లేదా గెరిల్లా పోరా టమా అనే పంథాకు సంబంధించిన వర్గపోరాట రీత్యానే కమ్యూని స్టుపార్టీలు చీలిపోయాయి అన్నది వాస్తవం ! కాబట్టి ఈ స్థితిలో, కష్టజీవులైన రైతులకు, తదితర నిరుద్యోగ చిరుద్యోగులకు మేలు చేసే విధంగా నవరత్నాల మేనిఫెస్టోలో తన పాలన సాగాలన్న ఆకాంక్షతో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనారిటీ మహిళలకు తగిన ప్రాధాన్యతతో దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనట్లు వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మహిళలకు ప్రభుత్వ పథకాలన్నింటా పంచాయతీ పదవులకు, అలాగే కాంట్రా క్టులలో కూడా 50 శాతం కేటాయిస్తామన్నారు. ఆచరణలో చేసి చూపిస్తున్నారు. నేటివరకు అనితర సాధ్యమైన తన పాదయాత్రలో కోట్లాది ప్రజానీకంతో మమేకమైన నాయకుడు జగన్. అందుకే ప్రస్తుత పరిస్థితిలో సమాజం పురోగమన దిశగా పరిణామం చెందాలంటే ఏం చెయ్యాలి ? ఆ కృషిని, ఆ పనిని ఎంత అవినీతిరహితంగా నిజాయతీగా, పారదర్శకంగా, మనసు పెట్టి చేయాలో ఒక నిర్ణయానికి రాగలిగారు. ప్రస్తుతం వైఎస్ జగన్ పాలన. మార్క్సిజం దిశలో సమాజ పరిణామ క్రమంలో ఒక పురోగమన దిశ, ఒక ముందడుగు. అది ఆహ్వానించదగినది. అంతేకాదు. ఒక నాయకుడు తన అనుచరులను కూడా అన్ని విధాలా కార్యనిర్వహణలో, తనకు తోడ్పడగలిగిన వారిని తయారు చేసుకోగలగాలి. యువకుడైనా తన కృషితో వైఎస్ జగన్ తన సహచరులకు స్ఫూర్తిదాయకంగా ఎలా నిలిచి, వారిని ఎలా మలుచుకోగలిగాడో మొన్న అమెరికా వెళ్లిన సందర్భంగా మన రాష్ట్రంలో, కృష్ణా, గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్న మంత్రి వర్గ సహచరులు, శాసనసభ్యులు, ఉన్నత స్థాయి అధికారులు, అం తకు ముందు రోజే గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన యువతీయువకులు ఎంత సమష్టిగా, సామర్థ్యంగా ఎంత మానవీయతతో ప్రజలపట్ల వ్యవహరించారో చూసి ఆశ్చర్యానందాలు పొందాను. అలాగే అమెరికాలో ఉన్నప్పటికీ, ప్రతిక్షణం ఇక్కడి వరద పరిస్థితి నష్ట నివారణ చర్యలను ఇతర సాంకేతిక అంశాలను జగన్ పర్యవేక్షించిన తీరు అభినందనీయం. ఈ వరదల్లో ఇంతవరకు ఒక్కరు కూడా మృతి చెందిన సందర్భం లేదు. ప్రజలను హెచ్చరించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, వారికి సాధ్యమైనంతవరకు ఆహారం, మందులు, ఇత్యాది అవసరాలు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఆర్ద్రంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు. మీరు మార్క్సిస్టు విశ్లేషకులు కదా. చంద్రబాబు గొడవ ఎందుకండీ అని అడిగేవారున్నారని చెప్పాను కదా. ఈ వరదల సందర్భంగా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తాను నివాసముంటూ, వరదరాకతో తన ఇంటికి ముప్పు రావచ్చని ఆ ముందురోజే హైదరాబాద్‌కు మకాం మార్చిన పెద్దమనిషి చంద్రబాబు. నిజానికి 40 ఏళ్ల అనుభవం ఉందని అడక్కపోయినా ఎక్కడ పడితే అక్కడ చెప్పుకునే చంద్రబాబు వరదల సమయంలో తన నివాసంలో ఉంటూనే తనకు తోచిన సూచనలుసలహాలు ప్రభుత్వానికి అందించాల్సి ఉండె. ఆపదలో అక్కరకు రాని అనుభవం ఉంటేనేం, పోతేనేం! పోనీ హైదరాబాద్‌కు వెళ్లినవాడు ఊరుకుండినా బావుండేది. నా కొంప ముంచేందుకు వరదలను ప్రభుత్వం తెప్పించిందని ఎంత హాస్యాస్పద రీతిలో ఆయన వ్యవహరించారో చూశాం. అధికారులు, పాలక పక్ష నేతలు స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టారు కనుక సరిపోయింది. లేకుంటే చంద్రబాబుగారి కొంప మునిగేదే. వరద పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్ ఉపయోగిస్తే దానిని చంద్రబాబు తనపై హత్యాప్రయత్నంగా చిత్రించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఆయన అనుచరగణం తానా తందానా అంటూ బాబు వాదనను అందుకుంది. ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీ నేత ఎలా వ్యవహరించకూడదో చూపే ఉదాహరణగా చంద్రబాబు ప్రహసనం నిలిచింది. బాబుగారు, ఆయన అంతేవాసులు సుజనా చౌదరి, సీఎం రమేష్, కోడెల శివప్రసాద్ వంటి వారి వ్యవహారం మనకు తెలిసిందే కదా. నయవంచన, అవినీతి, ధనదాహం, కులతత్వం, అహంకారం ఎలా వెన్నుపోటు పార్టీ నేతను, ఆయన అస్మదీయులను చివరకు ఆయన పార్టీని దిగజార్చాయో తెలుసుకుంటే కదా ఎలా ఉండరాదో తెలిసేది. అందుకే చించేస్తే చిరిగిపోని, చెరిపేస్తే చెరిగిపోని బాబుగారి చరిత్ర ప్రస్తావించక తప్పదు. కమ్యూనిస్టులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భౌతిక వాస్తవికతను గ్రహించగలిగితే, జగన్మోహన్రెడ్డి పాలనావిధానాల సమకాలీన ప్రాధాన్యత గ్రహించగలరు. - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
అమ్మమాట
‘‘ఏమైందన్నా అట్టా మొహం మొటమొటలాడిస్తన్నావు? మన హిట్లర్ లీవ్ ఇవ్వనన్నాడా ఏంటి?’’ విసురుగా వస్తున్న విఠల్‌ని అడిగాడు కండక్టర్ కాంతారావు. ‘‘అవున్రా.. కూతురి పెళ్లికి ఒక్క పదిహేనురోజులుసెలవడితే ఇవ్వనంటాడేమిట్రా? స్టాఫ్ సరిపోకపోతే కొత్తవాళ్లని తీసుకోవాలిగానీ ఒక వారం రోజులు తీసుకో అంటే ఎట్లా? వారం రోజులు ఏమూలకి సరిపోతై చెప్పు?’’ చికాకు పడ్డాడు విఠల్.‘‘అదే అన్నా! సిన్సియర్‌గా పన్జేసేవాళ్లకి ఇట్టాజేస్తారు. పనెగ్గొటి ్టతిరిగేవాళ్లకి రూల్సేమీ అడ్డురావు. సర్సరే పద పద. ఇది మనకి రోజూ ఉండే రపరపే. మళ్లీ టైంకి బస్సు తియ్యలేదంటే అదొక గొడవ వాడితో. అయినా ఇవ్వన్నీ మనసులో పెట్టుకుని బస్సు డ్రైవింగ్ చేసేవు... అసలే మన రూటు చాలా బిజీ’’ హెచ్చరించాడు కాంతారావు.‘‘అదేం లేదులేరా. పద’’ అంటూ బస్సుకేసి నడిచాడు విఠల్. కాంతారావు బస్సులోకి దూరిజనాన్ని నెట్టుకుంటూ చకచకా టిక్కెట్లివ్వటం మొదలుపెట్టాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు. మనసంతా చిరాగ్గా ఉంది. ఒక పక్కన భార్య గొడవ ‘ఇంకో ఇరవై రోజుల్లో చిన్నదాని పెళ్లి ఉంది. ఇప్పటికైనా సెలవు పెట్టరా?’ అని. పెళ్లి పనులు నత్తనడకతో సాగుతున్నాయి. పెళ్లిపత్రికలు అచ్చై ఇంటికొచ్చాయి. అవి బంధువులందరికీ పంచాలి. పెద్దల్లుడు మంచివాడు కాబట్టి మరదలి పెళ్ళికోసం తన భార్యని ముందే పంపాడు. తనూ పది రోజుల ముందు వస్తానన్నాడు. వచ్చీరావటంతోనే తన పెద్దకూతురు అన్నీ తానే అయి ఇంట్లో పనులన్నీ చూస్తోంది. అల్లుడు వస్తే తనకి సహాయంగా ఉండమనొచ్చుగాని మొత్తం బయటి పనులన్నీ అతడి నెత్తిన వేస్తే ఏం బాగుంటుంది? అప్పటికీ శని ఆదివారాల్లో వచ్చి, కొన్ని పనులు చేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆమాత్రంకూడా అతను చెయ్యకపోయివుంటే తనకి ఇంకా కష్టమయ్యేది’. ఇలా ఆలోచనల్లో సతమతమవుతుండగా కాంతారావు విజిల్ వెయ్యటంతో బస్‌ను ముందుకు కదిలించాడు. అసలే ఆ రూట్ చాలా బిజీ. దానికి తోడు మెట్రో పనులకోసమో, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసమో రోడ్లని ఆక్రమిస్తున్న కాంట్రాక్టర్లు. మామూలుగానైతే అతడి చేతి స్టీరింగ్ కృష్ణుడి చేతిలోని చక్రమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.సాధారణంగా కొందరు డ్రైవర్లు బస్టాప్‌కి కాస్త ముందోవెనకో కొంత దూరంలో బస్సుని ఆపి, ప్రయాణీకులు పరిగెత్తుకువచ్చి అందుకునేలోపు బస్సుని దౌడు తీయుస్తుంటారు. తమ కోర్కెలు తీర్చని యాజమాన్యంపై కోపంతోనూ, కసితోనూకొందరలా చేస్తుంటారు. మరికొందరికి ఆ రకంగా ప్రయాణీకుల్ని ఊరించి ఊరించి విసిగించటం వినోదం. నిజాయితీపరులైన ఉద్యోగులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో విధిలేక ఆ పని చేస్తుంటారు. ఆ రోజు విఠల్ కూడా తనకు బాస్ లీవ్ ఇవ్వలేదన్న కసిని ప్యాసింజర్ల మీద చూపించసాగాడు. అంతగా రద్దీ లేకున్నా, ప్యాసింజర్లు ఆపమని అభ్యర్ధిస్తున్నా పట్టించుకోకుండా స్పీడుగా బస్ నడపసాగాడు. ఈ విషయంలో జనం తనని తిట్టుకుంటారని అతనికి తెలుసు. ‘అయినా వాళ్లకు ఇదొక్కటే బస్సు కాదుగదా’ అని తనని తాను సమాధానపరచుకున్నాడు. ఇక చివరి ట్రిప్పుకొచ్చేసరికి ఎంత తొందరగా ఇంటికెళ్దామా అనే ఆత్రంలో బస్సు ఖాళీగా ఉన్నా ఎక్కడా ఆపకుండా వేగంగా నడపసాగాడు. తాను ఆపొద్దని చెప్పినావినకుండా, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదంటూ ప్రతి స్టాప్‌లో బస్సునాపే విఠల్, ఆరోజు అలా బస్సు వేగంగా నడపటం చూసిన కాంతారావు ‘మంచోణ్ణీ కూడా చెడగొట్టావు గదరా!’ అని అనుకున్నాడుం తన బాస్‌ని తలచుకుంటూ. ఆ రోజు ఆఫీసులో చక్రి మనసు మనసులోలేదు. అతని ధ్యాసంతా తన ఇంటిమీదనే ఉంది. ఆ ఇంటిని ఏవిధంగా సరిచేయాలోపాలుపోని స్థితిలో ఉన్నాడతడు. ఆ పరధ్యానంతో అతడు తెచ్చిన ఫైలు చూసి అతని బాస్ ‘‘ఏంటి చక్రీ ఇది? ఎంతో సిన్సియర్‌గా పని చేస్తావని నీకు పేరుంది. నువ్వుగూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఫైల్లో చూడు ఎన్ని తప్పులు చేశావో. ఒకసారి మళ్లీ చూసి సరిచేసి తీసుకురా’’ అంటూ సుతిమెత్తగా మందలించాడు. ఆ ఫైలు పట్టుకుని అతడు తన సీట్లోకొచ్చికూర్చున్నాడు. చక్రి అంటే అతని పై ఆఫీసర్‌కి మంచి అభిప్రాయముంది. కానీ అది జీతం పెంచేంతగాలేకపొవటం వల్ల అతడి జీతం గొర్రెతోకను మించటంలేదు. ఇంట్లో తన తల్లి, భార్య, కూతురు, కొడుకు మొత్తం ఐదుగురి కుటుంబభారం తనే మొయ్యాల్సివుంది. రెండువందల గజాల్లో ఓ మూలగా ఉన్న రెండు గదుల డాబా ఇల్లొక్కటే తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా తనకు సంక్రమించింది. అవీ చిన్న చిన్న గదులు. అదీ నగరం పొలిమేరల్లో ఉన్న ఒక పల్లెటూర్లో. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి ఇప్పటివరకూ ఎలాగో సర్దుకుంటూ వస్తున్నారు. వాళ్లు పెద్దవాళ్లవుతున్నకొద్దీ ఇల్లు మరీ ఇరుకైపోసాగింది. గత వర్షాకాలంలో ఆ ఇల్లు కురవటం మొదలైంది. దాంతో అప్పుడు ఇంట్లోఅందరూ చెట్టుకింద వర్షంలో కూర్చున్నట్లుగా కూర్చుని రాత్రుళ్లు జాగారం చేశారు. ఆ ఇల్లు కట్టి అప్పటికి దాదాపు యాభై ఏళ్లవుతోందిమరి. ఇహ లాభం లేదని తాపీ మేస్త్రీని పిలిచి మాట్లాడాడు. ‘‘ఇల్లు కట్టినప్పుడు డాబా పైన ప్లాస్టరింగ్చేయించివుంటే ఈ సమస్య వచ్చేది కాదు సార్. ఇప్పటికైనా ఆ పని చెయ్యకపోతే వానకి తడిసి తడిసి కొన్నిరోజులకు రూఫ్ కూలినా కూలవచ్చు’’ అని భయపెట్టాడు. వర్షాకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా గడవాలంటే ఆ పని చేయించక తప్పదు. దానికి కనీసం మూడు బస్తాల సిమెంట్, ఒక టిల్లర్ ఇసక తెప్పిస్తే పని మొదలుపెడతానని చెప్పి వెళ్లిపోయాడా మేస్త్రి. అప్పటికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో ఆ పనిని తర్వాతి సంవత్సరానికి వాయిదా వేశాడు. ఎలాగోలా ఆ వర్షాకాలం గడిచి పోయింది. అయితే ఉన్నట్లుండి క్రితంరోజు సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. రాత్రికల్లాకుంభవృష్టి మొదలయ్యింది. మొత్తం కాలనీలన్నీ చెరువులైపోయాయి. పైకప్పు నుంచి నీరు కారటంతో ఆ రాత్రి చాలా ఇబ్బందయ్యింది. దాంతో ఇల్లు కాసారమైపోయింది. తామూ తడుస్తున్నా, తన భార్యతో కలిసి పిల్లలకూ తల్లికీ ఇబ్బంది కాకుండా చూడటానికి ఎంతో కష్టపడ్డాడు. తెల్లారే సరికి మళ్ళీ ఫెళ్ళున ఎండ. హైదరాబాద్ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో తెలీదు. ‘‘అసలిప్పుడీ అకాలవర్షమేమిటి? కురవాల్సిన కాలంలో, కురవాల్సిన చోట కురవకుండా వుండటం చూస్తుంటే కలి ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఆ సిమెంట్ పనేదో చేయించు నాయినా. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావుగా’’ అందతని తల్లి. అతని ఇబ్బంది ఆవిడకు తెలుసు. కానీ ఇంటి పరిస్థితి చూశాక కొడుకుతో ఆ మాట అనకుండా ఉండలేకపోయింది. అతని తల్లి ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అతన్ని అడిగి ఎరగదు. అలాంటిది ఇప్పుడిలా అడిగిందంటే ఆమె ఎంత కలత చెంది ఉంటుందో అర్థమై ‘‘అలాగే అమ్మా. ఈ సారి తప్పకుండా చేయిస్తా.’’ అంటూ మాట ఇచ్చాడు. అందుకే తెల్లారగానే మేస్త్రిని పిలిపించాడు. అతడు వస్తూనే ‘‘నేనెప్పుడో చెప్పాగద సార్. మీరు సిమెంట్, ఇసుక తెప్పించండి. ఒక్కరోజులో పని పూర్తవుతుంది’’ అన్నాడతడు. మెటీరియల్కీ, మేస్త్రికీ కలిపి దాదాపు పదివేలు. కనీసం ఇప్పుడైనా ఆ ప్లాస్టరింగ్ పని చేయించకపోతే వచ్చే వర్షాకాలంలో తాము ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ‘తల్లి కోరిక తీర్చేందుకైనా సరే ఈ పని చేయించాల్సిందే’ అని తీర్మానించుకున్నాడు. అందుకే ఒక స్థిర నిర్ణయానికొచ్చినట్లు తన బాస్ గదిలోకెళ్లి తనకొచ్చిన ఇబ్బందిని గూర్చి చెప్పాడు. తనకి కనీసం పదివేలయినా కావాలని అడిగాడు. ఆయన ఏ కళనున్నాడోగానీ అతని పీఎఫ్ అకౌంట్లోంచి పదివేలు లోన్ శాంక్షన్ చేయించాడు. తన ఇంటిదగ్గర్లో కొత్తగా కడుతున్న ఒక ఇంటిదగ్గర మిగిలిన ఇసుకని ఆ ఇంటివారిని బ్రతిమాలి, తక్కువ ధరకు తెచ్చుకున్నాడు. మర్నాడు రెండో శనివారం కావటంతో ఆ పని పూర్తి చేయించాలనుకుని సిమెంట్ కోసం బయల్దేరాడు. తన ఊర్లో సిమెంట్ షాపులేమీ లేకపోవటంతో సిటీకి వెళ్లక తప్పలేదతనికి. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో సిమెంట్ దాదాపు షాపులన్నీ మూసి ఉన్నాయి. ఏం చెయ్యాలోపాలుపోలేదతనికి. నిరాశగా వచ్చి బస్టాపులో నిల్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఒక సిమెంట్ షాపు ముందు ఆగింది. దానిలోంచి ఓ యాభైఏళ్ల వ్యక్తి దిగి, ఆ షాపు మూసి వుండటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతన్ని చక్రి అంతగా పట్టించుకోకపోయేవాడే. కానీ అతగాడొచ్చిన ఆటోలో మూడు సిమెంట్ బస్తాలు కనిపించటంతో అతడి మనసులో ఏ మూలనో చిన్న ఆశ చిగురించింది. అతని దగ్గరికెళ్లి, ‘‘వర్షం భయానికి షాపులన్నీ మూసేశారు’’ అని అతనితో మాటలు కలిపాడు. ‘‘అవునండీ. మా ఇంటిదగ్గరపనంతా అయిపోయింది. కానీ ఈ సిమెంట్ బ్యాగులు మూడూ మిగిలిపోయినై. ఇంటిదగ్గరే ఉంచితే గడ్డగట్టి పోతాయని తిరిగి ఇచ్చేద్దామని వచ్చా. వీడేమో షాపు బంద్ చేసేశాడు’’ అన్నాడు. చక్రి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ‘‘బస్తా ఎంతకి కొన్నారు?’’అనడిగాడు.‘‘ఒక్కొక్క బస్తా మూడొందల యాభై. మీకు కావాలంటే చెప్పండి. బస్తాకి వంద తగ్గించి ఇస్తా’’ అన్నాడు. ఆ మాట వినటంతోటే ప్రాణం లేచొచ్చిందతనికి. ఇక మరోమాట లేకుండా ఏడొందలయాభై అతని చేతిలో పెట్టాడు. అతడు ఆటోవాలా సాయంతో ఆ మూడు సిమెంట్ బస్తాలూ అక్కడి బస్టాప్ దగ్గర దించేసి, అదే ఆటోలో వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి తన ఇంటికి ఆటో మాట్లాడుకుంటే కనీసం రెండొందలౌతుంది. అంత డబ్బు పెట్టటం దండగ. ఎలాగూ డిస్ట్రిక్ట్ బస్సులతోపాటు సిటీ బస్సులుకూడా తన గ్రామం వరకూ వెళ్తుంటాయి. ఆ బస్సు డ్రైవర్నో కండక్టర్నో బ్రతిమిలాడైనా సరే ఆ సంచులు ఇంటికి తీసుకెళ్లాలని అతని కోరిక. కానీ వచ్చిన బస్సులేవీ అక్కడ ఆగకుండా వెళ్లిపోసాగాయి. దాంతో అతడు నిరాశ పడిపోసాగాడు. అదే ఏ డిస్టిక్ బస్సో అయితే లగేజీ టికెట్ కొట్టకుండా, ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇక సిటీ బస్సులవాళ్లైతే పాల క్యాన్లు, కూరలకైతే ఓకే అంటారుగానీ, సిమెంట్ బస్తాలంటే అస్సలు ఒప్పుకోరు. అయినా అతడిలో ఆశ చావక ‘ఒక్క బస్సయినాఆగకపోతుందా’ అని ఎదురు చూడసాగాడు. ఆలోచనలు ఎంతగా ముప్పిరిగొంటున్నా విఠల్ బస్సుని జెట్ స్పీడ్‌లో లాగించేస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటం మూలాన రోడ్లు ఖాళీ అయిపోసాగాయి. భారీవర్షం పడే సూచనలుండటంతో జనం పలచబడ్డారు. విఠల్ బస్సు స్పీడ్ పెంచేశాడు. తొందరగా డ్యూటీ దిగి ఇంటికెళ్లాలని అతడి మనసు పీకుతోంది. అలా వెళ్తుండగా ఒక బస్టాప్‌లో ఒక ముసలావిడ నిల్చుని ఉండటం చూడగానే అప్రయత్నంగానే అతడి కాలు బ్రేక్ నొక్కింది. అది చూడగానే కాంతారావు ఆశ్చర్యపోయి, ‘‘ఏంటన్నా. సడెన్‌గా ఈ ముసలిదాని కోసం బస్సాపావు?’’అనడిగాడు. అతడు జవాబివ్వకుండా నవ్వి, ఆ ముసలావిడ ఎక్కగానే బస్సుని ముందుకు కదిలించాడు. ఆ తర్వాతి స్టాప్‌లో కూడా ఒక్కరే ఉన్నారు. అది చూసిన కాంతారావు ‘‘ఒక్కడి కోసం బస్సాపటం వేస్ట్. రైట్ రైట్’’ అన్నాడు.కానీ బస్సు ఆ స్టాపులో ఆపటం చూసి, ‘‘ఏమైందన్నా. తొందరగా ఇంటికి పొవాలని లేదా?’’ అన్నాడు. కానీ అతడి నుంచి జవాబుగా అదే నవ్వు. కాంతారావుకి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాతి స్టాప్‌లో ఉన్న ఒకే ఒక ప్యాసింజర్ని చూసి ‘‘అన్నా. ఇక ఆపకు. అసలే వాడి దగ్గర సిమెంట్ బ్యాగులున్నట్లున్నై. అవి లోపలికెక్కిస్తే, బస్సంతా ఖరాబవుతుంది. పోనియ్’’ అన్నాడు. ఆ మాటలు అసలు వినబడనట్లువిఠల్ బస్సుని సరాసరి తీసికెళ్లి ఆ సిమెంట్ బస్తాల దగ్గర ఆపి, ‘‘ఎక్కు’’ అన్నట్లుగా సైగ చేశాడు. అప్పటిదాకా ఏ బస్సూ ఆగకపోవటం, మళ్లీ చినుకులు మొదలైతే తక్కువ రేటుకి కొన్న సిమెంట్ పాడైపోతుందేమోనన్న దిగులులో కూరుకుపోయి ఉన్న చక్రికి, బస్సు తన దగ్గరికే వచ్చి ఆగటం, ఎక్కమని డ్రైవర్ సైగ చెయ్యటంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా సిమెంట్ బస్తాల్ని బస్సులోకి ఎక్కించేసి, ‘‘థాంక్యూ... థాంక్యూ వెరీమచ్ డ్రైవర్‌గారూ’’ అన్నాడు కృతజ్ఞత గుండెలో ఉప్పొంగగా. విఠల్ నవ్వుతూ తలాడించి, గేర్ మార్చి ఏక్సిలేటర్ మీద కాలువేశాడు.‘నక్క తోక తొక్కి వచ్చినట్లున్నావ్’ అన్నట్లుగా చూస్తూ, కాంతారావు అతడికి టికెట్ ఇచ్చాడు. అంతవరకూ ఎవరెంత బ్రతిమాలినా ఆపకుండా బస్సుని లాగించిన విఠల్ వైఖరి ఉన్నట్లుండి ఎందుకు మారిందో అర్థం కాలేదతనికి. అయితే కూతురి పెళ్లికి సెలవివ్వని బాస్ మీద కసితో బస్సు నడుపుతున్న విఠల్‌కి,ఎందుకో తెలీదుగానీ అక్కడ బస్టాపులో నిలబడ్డ ముసలావిడని చూడగానే చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది.తండ్రి లేని తనను ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా పెంచి పెద్దచేసిందావిడ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమె, ఎప్పుడూ పదుగురికి ఆదర్శంగా నిలిచేది. తన కొడుకుకి చదువు పెద్దగా అబ్బకపోవటంతో ఆమె కొంత కలతచెందినా, అతడికి ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఉద్యోగంలో చేరటానికి బయల్దేరుతున్న సమయంలో ‘‘నాయినా! నువ్వు చెయ్యబోయే ఉద్యోగం సామాన్యమైంది కాదు. ఎంతోమంది ప్రాణాలే కాదు, వారి ఆశలూ, ఆశయాలూ నీ చేతిలో ఉంటాయి. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా దరిచేరనీయకూడదు. జనం ఎన్నో కష్టాల్లోనూ, టెన్షన్లలోనూ ఉండీ, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో నమ్మకంతో నీ బస్సెక్కుతారు. వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకు. నీమూలంగా ఏ ఒక్కరూ ఇబ్బందిపాలు కాకూడదు. నీవల్ల నష్టపోయిన వాళ్ల తిట్లు మన కుటుంబానికి శాపాలవుతాయి. వాళ్ల కృతజ్ఞతలు నీ పిల్లలకు ఆశీర్వచనాలై వారి మంచి భవిష్యత్తుకు సోపానాలవుతాయి. స్టీరింగ్ పట్టుకునే ప్రతిసారీ నా ఈ మాటల్ని మననం చేసుకో’’ అంటూ చెప్పింది. తన ప్రవర్తనవల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయనని తల్లికిచ్చిన మాట గుర్తుకొచ్చి ఒక్కసారిగా వీపుపై చెర్నాకోలతో చరిచినట్లైందతనికి. ‘ఎప్పుడూ నిబద్ధతతో మెలిగే తను ఈరోజిలా మారటం తప్పు. తన కూతురి పెళ్లి పనులురోజూ తాను డ్యూటీకి ఎక్కేముందుగానీ, దిగిన తర్వాతగానీ, నిద్రాహారాలు మానుకునైనా చేసుకోవచ్చు. అంతేగానీ ఒకరిమీద కోపాన్ని మరొకరిమీద చూపించటం ఎంతవరకు సమంజసం!?’ అనుకుంటూ ఆ ముసలమ్మకోసం బస్సాపాడు. కాస్త ఆలస్యంగానైనా సరే తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రతి స్టాపులోనూ బస్సుని ఆపసాగాడు. - గండ్రకోట సూర్యనారాయణ శర్మ -
ప్రజల మొగ్గు జగన్ వైపే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్ణయించనున్న ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి తప్పదని జాతీయ స్థాయి సర్వేలు మూకుమ్మడిగా తేల్చి చెప్పడం వాస్తవం. కానీ చంద్రబాబు శకుని రాజకీయ కౌటిల్యంపై ఏమరుపాటుగా ఉండరాదు. ఎలాగైనా ఈసారీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో బాబు ఏస్థాయికైనా వెళ్లి ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఓటమి తన రాజకీయ జీవితానికి సమాధి కానుందన్న భయంతో బాబు చివరి క్షణంలో చేసే కుటిల పన్నాగాల పట్ల.. మార్పు కోరుతున్న రాష్ట్ర ప్రజానీకం అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠకు సాధికారికంగా తెరపడటానికి ఇంకా నెలా పదిహేను రోజులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఉక్రో షం, ఆయన హావభావాలు, అప్రస్తుత ప్రసంగాలు, చెబుతున్న అబద్ధాలు, అన్నీ యూట ర్న్లతో గుంటలు, గతుకుల రోడ్డులో ప్రయాణంలాగా సాగుతూ ఆయన పుట్టి మునగబోతున్నదని అందరికీ అర్థం అవుతోంది. పరాజయం తప్పదని అర్థమవుతున్నా, పాత సినిమాల్లో కీ.శే. పేకేటి గారు ‘మనవాడు తల్చుకుంటే ఏమైనా చేస్తాడు’ అన్నట్లుగా ఇంకా ఏదో దింపుడు కళ్లం ఆశ మినుకు మినుకుమంటున్నట్లుంది! కానీ బాబు ఓటమిపై ఇంత తిరుగులేని ధీమా ఉండినా ఎక్కడో ఒక మూల కొంచెం అనుమానం లేకపోలేదు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో.. బాబును ఓడించాలి, వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించాలి అన్న దృఢ నిశ్చయం పట్ల అనుమానం ఏమీలేదు. కానీ బాబు శకుని రాజకీయ కౌటిల్యంపైనే అనుమానం ఉంది. బాబు చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న పాలనా యంత్రాంగ పెద్దలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచి, ఎన్నికల కమిషన్ తీవ్ర చర్యలకు పూనుకున్నప్పటికీ, వాటితోనే నేటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుందని భావించలేము. బాబు ఎంతో ఆశతో, పథకం పన్ని సాధారణ పాలనా విధానాలకు భిన్నంగా అడ్డదారిన ఇంటెలిజెంట్ ఏజెంటుగా కులదోస్తు ఏబీ వెంకటేశ్వరరావును నియమించుకుంటే, వైఎస్సార్సీపీ ఆరోపణలను పరిశీలించిన ఈసీ ఆయనను బదిలీ చేసింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై ధిక్కారంగా ప్రచారం చేసి, ఒక ఉద్యోగి తరపున బాబు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి అక్కడ కూడా భంగపడి చివరకు ఈసీ ఆదేశానికి తలవంచింది. బాబు తన అతి తెలి వితేటలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే మార్చాల్సిన పరిస్థితిని కల్పించుకున్నారు. ఇంతకీ ఆ ఇంటెలి జెంట్ ఏజెంటు పదవి నుంచి వెంకటేశ్వరరావును తొలగించిన తర్వాత కూడా రెండు రోజుల వరకు ఆయనకే ఆ శాఖలో కింది ఉద్యోగులు తమ వద్ద ఉన్న సమాచారం రూల్స్‌కి విరుద్ధంగా అందజేశారని సమాచారం. వీటన్నిం టినీ వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే బాబు రాజ్యాంగ విరుద్ధమైన దూకుడుకు బ్రేక్ పడింది. ఎన్నికల మేనేజ్మెంట్ పేరిట చాలా దురాలోచనతో కూడిన దూరదృష్టే బాబు కుటిల రాజకీయం! ఈ ఎన్నికల్లో ఓటమి తన రాజకీయ జీవితానికి సమాధి కానుందన్న భయం బాబులో ఎంత తీవ్రంగా ఉందో ఇటీవల ఆయన ప్రసంగాలు వింటుంటే అర్థం అవుతూనే ఉంది. ‘ఈ ఎన్నికల్లో మీకు, కార్యకర్తలకు ఖర్చులకోసం 5 రూపాయలు నా జేబులోంచి ఇచ్చినా ఐటీ దాడులు జరుగుతున్నాయి. అందుకే నేను ఒకటే ఆలోచించాను. నా చేతిలో డబ్బు పైసా తీయకుండానే ప్రభుత్వం ద్వారా (ఈ ఎన్నికల ముందు) మీ బ్యాంకు ఖాతాల్లో పడేట్టు పసుపు కుంకుమ అనో, అన్నదాత సుఖీ భవ అనో వివిధ పథకాల పేరుతో డబ్బు జమ అయ్యేట్టు వేయిస్తున్నాను. (అంటే రేపు ఎన్నికలలో నా పార్టీకి ఓటు వేసేందుకు ముందుగా డబ్బులు పంచుతున్నాను అని స్పష్టం చేసినట్లే) నేనిచ్చిన డబ్బులు తీసుకుని నాకు ఓటెయ్యకుండా ఉంటారా! నా డబ్బులు తీసుకుని ఇళ్లలో తొంగుంటారా!’ అని నిర్లజ్జగా దబాయించి మరీ అడి గారు. అయితే బ్యాంకులలో ఆ డబ్బులు జమ అవుతాయో లేదా ఒకవేళ డబ్బులు పడినా బ్యాంకులు ఆ డబ్బులను చెల్లిస్తాయో చెల్లించవో! లబ్ధిదార్ల గత బకాయిల పేరుతో జమ చేసుకుంటాయోమో? అనే భయాలు ప్రజల్లో ఉన్నందున చివరకు ఈ ప్రయత్నం కూడా వట్టి హుళక్కి అవుతుందేమోనని బాబు దిగులుపడుతున్నారు. ఇక ప్రచార పర్వం ముగిసినట్లే కదా! అయినా బాబు మాత్రం సాధికారికంగా, టీడీపీ ఘోరపరాజ యాన్ని ఈసీ ప్రకటించేవరకూ తన కుటిల ప్రయత్నాలను మానుకోరు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ప్రజలు తమ ఇష్టానుసారం ఓటింగులో పాల్గొనకుండా చూడటం మొదటిది. డబ్బులు పంచేటప్పుడే మాకు ఓటెయ్యకపోయినా సరే, పోలింగులో పాల్గొనకుండా ఉంటే చాలు అని ఒప్పందం చేసుకున్నారు బాబు పార్టీవాళ్లు. డబ్బులు తీసుకున్నవాళ్ల చేత ఒట్టు వేయించుకుని ఉన్నా ఆ ప్రమాణాలను నమ్మే రోజులు కావని తెలుసు కనుక పోలింగ్ బూత్‌కి వెళ్లకుండా భౌతికంగా నిర్బంధించే దుష్ప్రయత్నాలకూ టీడీపీ వెనుకాడదు. స్థానిక వైఎస్సార్సీపీ ముఖ్యులను ఒక పదిమందిని గృహనిర్బంధం చేసే దుర్మార్గానికి కూడా తెరతీయవచ్చు. మారిన పరిస్థితుల్లో పోలీసుల మీద ఆధారపడటం సరిపోదని భావించి తమ పార్టీ వాళ్ల చేతనే దౌర్జన్యానికి ప్రేరేపించవచ్చు. కనుక ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు కీలకమైన ఓటింగ్ సక్రమంగా స్వేచ్ఛగా జరిగేందుకు పోలింగు బూత్ స్థాయిలో యువశక్తి తమ వంతు కృషి చేయాలి. ఎలాగూ తాము గెలిచే పరిస్థితి లేదనీ, ప్రజాతీర్పుతో వైఎస్ జగన్ అధికారంలోకి రావడం అనివార్యమనే నిర్ణయానికి వస్తే బాబు తన చాణక్య అనుభవంతో ప్రజాతీర్పు సవ్యంగా రాకుండా దుర్నీతికి సిద్ధపడినా ఆశ్చర్యం లేదు. తన అర్హతకు మించి స్థానమిచ్చిన తన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచి, పదవీ భ్రష్టుడిని చేసిన కృతఘ్నతా చరిత్ర బాబుది. అలాంటి వాడు జగన్ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఎన్ని పన్నాగాలైనా పన్నే ప్రయత్నం చేస్తారు. తామే అలజడులు, అల్లర్లు, అరాచక పరిస్థితులు సృష్టించి ఎన్నికలు సజావుగా జరిగే వాతావరణం లేనట్లు తప్పుడు ప్రచారం చేసేందుకు వెనుకాడరు. ఇటీవలే జగన్ బాబాయి వివేకానందరెడ్డిని ఇంట్లోనే హత్య చేసి ఆ పాపం జగన్ పార్టీ వారిపై నెట్టే ప్రయత్నం చూశాం కదా. ఇందుకు స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వాడుకున్న తీరు ఎరిగినదే! అయితే అయిదేళ్లలో చంద్రబాబు, ఆయన అంతేవాసుల అధికార అహంకారాన్ని స్వయంగా చవిచూసిన సాధారణ ప్రజానీకం సైతం ఈ అరాచకత్వం పట్ల అసహనంతో అసహ్యంతో ఉన్నారు. కనుక గతంలో వలే కేవలం ప్రేక్షక పాత్రకే వారు పరిమితం కారు. కాబట్టి ప్రజాభీష్టం మేరకు సవ్యంగా ఎన్నికలు జరిగి, అక్రమార్కులను, అవి నీతిపరులను అధికార అహంకారులను, వారికి తోడ్పడే ముసుగువీరులను అందరినీ ఓడించి, ప్రజా సంక్షేమానికి తెలుగు ప్రజల పురోభివృద్ధికి వైఎస్సార్సీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి విజయం చేకూర్చగలరని ఆశ, విశ్వాసమే కాదు. ఆచరణలో అనుభవం కానున్న వాస్తవం. వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
నిబద్ధతకు నిరుపమాన నిదర్శనం
ప్రజావైద్యశాల స్థాపించేం దుకు 1971 ఆరంభంలో సూర్యాపేటకు వెళ్లాను. కీ.శే. వి. బుచ్చిరాములు నాడు సూర్యాపేట డివిజన్ సీపీఎం కార్యదర్శిగా ఉండేవారు. ఆ హాస్పిటల్ స్థాపనలో నాకు స్థానికంగా ఉండి సహకరించిన ఇద్దరిలో ఆయన ఒకరు. ఆ పరి చయం నేను సీపీఎంని వీడి వచ్చేవరకు (1991) కొనసాగింది. ఆ పిదప సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడి నప్పటినుంచి తిరిగి సన్నిహితంగా కొనసాగింది. తర్వాత ఆయన కన్నుమూసేవరకు అరుదుగానైనా కలిసేవారు. ఈ సందర్బంగా సీపీఎం (బీఎన్) పార్టీ గురించి కొంత చెప్పాలి. ఆనాటివరకు సూర్యాపేట డివిజన్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరపున బీఎన్, స్వరాజ్యం, వీఎన్లే పోటీచేసేవారు. వీరందరిదీ ఒకే కుటుంబం. కానీ 1993 ఎన్నికల కమిటీ ఇన్చార్జిగా డివిజన్ కార్యదర్శి బుచ్చిరాములు పేరు ప్రకటించింది పార్టీ. కానీ ఫైనల్‌గా పోటీచేసే అభ్యర్థిగా మల్లుస్వరాజ్యం పేరు ముందుకొచ్చింది. అప్పటికే సీపీఎం పార్టీలో అక్కడక్కడా ‘‘ఎప్పుడూ ఆ కుటుంబమేనా, ఈ రెడ్లోళ్లేనా’’ అనే గుసగుసలు వినిపించేవి. సాధారణ కార్యకర్తల్లో బుచ్చిరాములు నెమ్మదితరహా, నిజాయితీ పట్ల అభిమానం ఉండేది. జిల్లాపార్టీలో వివిధస్థాయిల్లో యువకులు అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు బుచ్చిరాములే ఈ సారి పార్టీ అభ్యర్థిగా నిలబడాలని పట్టుపట్టారు. దాంతో రాష్ట్ర కమిటీ కూడా దిగివచ్చి తమ నిర్ణయాన్ని మార్చుకుని బుచ్చిరాములు అభ్యర్థిత్వాన్నే బలపర్చక తప్పలేదు. పార్టీ తరఫున మోటూరు హనుమంతరావు పార్టీ జనరల్ బాడీలో ‘‘ఇన్నేళ్ల చరి త్రలో స్థానిక నాయకత్వం ‘మొండి’ వైఖరి కారణంగా ఈ ప్రకటన చేయక తప్పలేదు. ఇక గెలిపించుకునే బాధ్యత వారిదే’’ అన్నారు. తీరా ఎన్నికల్లో ఆయన వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. సహజం గానే ఆ ఓటమికి కారణం పార్టీలో ఒక వర్గం, ఆధిపత్య కులాల కుట్ర వల్లేనని ప్రచారమైంది. తన ఓటమి పట్ల బుచ్చిరాములు కిమ్మనలేదు కానీ సమర్థించినవారితో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వీరంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం వేరే పార్టీ పెట్టారు. సీనియర్ అయిన బీఎన్ కూడా ఈ యువకుల తరఫున నిలబడటంతో సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడింది. అణగారిన కులాల తరఫున పోరాడకుండా సీపీఎం తన లక్ష్యాన్ని సాధించలేదు అనే మౌలిక అవగాహన ఈ కొత్త పార్టీకి ఉండేది. ఈ అవగాహతోటే నేనూ ఈ కొత్త పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యాను. సీపీఎం(బీఎన్) నేతృత్వంలో కీ.శే దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా సూర్యాపేటలో సామాజిక న్యాయం కోసం పెద్ద బహిరంగ సభ జరిగింది. బుచ్చిరాములుతోసహా అందరూ ఆ సభ జయప్రదం కావడానికి విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సీపీఎం(బీఎన్)ని రద్దుచేశారు. బీఎన్తోపాటు కొందరు ఎంసీపీఐలో చేరగా కొందరు టీడీపీలో, బుచ్చిరాములుతోపాటు మరి కొందరు తిరిగి సీపీఎంలో చేరారు. ఆనాటికే సామాజికన్యాయం కోసం పోరాడాలనే లక్ష్యం సీపీఎంలో కొందరిలో ఉండేది. ఈ మధ్య బుచ్చిరాములుతో మాట్లాడిన సందర్భంగా, సీపీఎం ప్రస్తుతం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తోం దనీ, తెలంగాణలో సీపీఎం ఆ మార్గంలో మరింత శాస్త్రీయ అవగాహనతో సాగుతోందని అనుకున్నాం. బుచ్చిరాములు ‘రాళ్లెత్తిన కూలీ లెవ్వరు’ అనే పుస్తకం రాశారు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్య మం కోసం తొలినాళ్లలో కృషి చేసిన వారి గురించి సంక్షిప్తంగా వివరించారు. గ్రామస్థాయిలో ఎంతమంది మహిళలు, పురుషులు ఎంత అంకిత భావంతో పనిచేశారో ఆ పుస్తకంలో పొందుపర్చారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు భరించి నిలబడిన నాటి పునాదిరాళ్లను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆ పుస్తకాన్ని ఈ తరానికి తెలియని ‘తమకు తెలియని చరిత్ర’గా భావిస్తాను.అలాంటి చరిత్ర రచనకు అనుభవం, అర్హత ఉన్న వాళ్లు తప్పక ప్రయత్నించాలి. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా నాటి సూర్యాపేట డివిజన్లో ఎర్రజెండా ఔన్నత్యానికి కృషి చేసిన తాను కూడా ఒక ప్రధానమైన పునాది రాయి అని బుచ్చిరాములు నిరూపించుకున్నారు. ఆయన ధన్యజీవి. (నేడు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వర్ధెల్లి బుచ్చిరాములు శ్రద్ధాంజలి కార్యక్రమం సూర్యాపేటలో నిర్వహిస్తున్న సందర్భంగా) వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
ప్రజావ్యతిరేక పాలన పతనమే లక్ష్యం
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులకు వారి పరిభాషలోనే అడగాలంటే కీలకవైరుధ్యం ఏమిటి? ఏపీలో నయవంచక చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే కీలకవైరుధ్యం. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పరాజయం పొందాలి. వైఎస్సార్ సీపీకి ప్రస్తుత పాలకపార్టీని ఓడించే పరిస్థితి ఉంది. ఆ కీలకవైరుధ్యాన్ని ప్రజలకు అనుకూలంగా కమ్యూనిస్టులు పరిష్కరించాలంటే చంద్రబాబు పార్టీని ఓడించాలి. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు అంతిమంగా చంద్రబాబు ఓటమికి తోడ్పడాలి. పవన్ కల్యాణ్ జనసేనకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే స్థితి మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమికి వ్యతిరేక పొత్తులపైనే వామపక్షాలు దృష్టి నిలపాలి. ఎలాంటి సైద్ధాంతిక సారూ ప్యత లేకున్నా దేశంలో రాజకీయ పక్షాలు ఎన్ని కల్లో పొత్తులు పెట్టుకుంటు న్నాయి. పొత్తుల రాజకీ యాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆరితేరారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవి చేపట్టినప్పటి నుంచీ ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం అనేక పార్టీ లతో కలిసి ఎన్నికల్లో పోటీచేసింది. సీపీఐ, సీపీఎం, బీజేపీతో ఆయన గడచిన 23 ఏళ్లలో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం వచ్చే లోక్‌సభ, రెండు తెలుగు శాసనసభ ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి, అధికారం పంచుకోవడానికి సైద్ధాంతిక సారూప్యం అవసరం లేదనీ, రాజకీయ పరిస్థితులే వీటిని నిర్ణయిస్తాయని ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం నిరూపిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చాక తమ ప్రకటిత విధానాలు, కార్యక్రమాలు అమలు చేయడమే కమ్యూనిస్ట్‌పార్టీ లక్ష్యం. 1957లో కేరళలో, 1967లో పశ్చిమబెంగాల్లోనూ ఐక్యంగా నిలబడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీల కూటమి నుంచి నక్సలిజం భావాలున్న పార్టీ నేతలు సైద్ధాంతిక కారణాలతో విడిపోయినా, తర్వాత కాలంలో ఎన్నికలకే పరిమి తమైన కమ్యూనిస్టు పార్టీలు తోటి వామ పక్షాలతోనే గాక ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కూటముల్లో చేరాయి. వాటితో కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. కాంగ్రెస్, బీజే పీలకు వ్యతిరేకంగా ఎన్నికల పొత్తులు కుదుర్చుకుని కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తొలిసారి వెన్నుపోటుకు గురైన సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఎన్టీ ఆర్కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. కానీ 1995లో అదే చంద్రబాబు సొంతమామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసి నప్పుడు, చంద్రబాబుకు అదే సీపీఎం మద్దతుని వ్వడం ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత బాబుతో, ఆ పిదప కాంగ్రెస్ పార్టీతో.. ఇలా ఎప్పటి కెయ్యది ప్రస్తుతమన్నట్లు పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? అంతకుమించి 2009 ఎన్నికల్లో వైఎస్సార్‌ను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమన్నట్లుగా.. తమ పార్టీలను కాలం చెల్లిన పార్టీలంటూ అవహేళన చేసిన బాబుతో మళ్లీ కలిసి మహాకూటమి కట్టి ఎన్నికల పొత్తుకు సిద్ధపడిన కమ్యూనిస్టులు తమ ప్రత్యేకత కోల్పోయి, చివరకు కుల రాజకీయాలకు ఆలవాలమయ్యారన్న అప ప్రథను కూడా కోరి తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో తలో అసెంబ్లీ స్థానానికి పరిమితమైన కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో ఒక్క సీటూ గెలవలేకపోయాయి. దేశంలో తొమ్మిది దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు తెలుగునాట ప్రస్తుత దుస్థితికి చేరుకు న్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన ఏడేళ్ల క్రితం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు టీడీపీని గద్దె దించే స్థాయికి ఎదిగింది. పేదలు, సామాన్య ప్రజానీకానికి నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలనకు ప్రమాణాలుగా నిలి చిపోయాయి. అదే జగన్మోహన్రెడ్డి పార్టీకి మూల ధనం. ఆయన రాజకీయ అవగాహన కూడా ఈ పునాది మీదే ఏర్పడి ముందుకుసాగుతోంది. ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు పాలన ఎంత అవినీతికరంగా మారిందో, ఎంత నిరంకుశ ప్రభు త్వంగా మారి అంగన్వాడీ కార్యకర్తలపై, మొన్నటికి మొన్న ముస్లిం యువతపై, నిన్న ఉపాధ్యాయులపై దమనకాండ జరిపిందో చూస్తే ఏం సూచిస్తోంది? అలవిమాలిన ఆత్మస్తుతి, పరనింద, పోలీస్ వ్యవ స్థను వాడుకుని ప్రత్యర్థులను అణచివేసే చర్యలకు చంద్రబాబు దిగజారారు. ఈ పరిస్థితిలో ఏపీలో కమ్యూనిస్టులకు వారి పరిభాషలోనే అడగాలంటే కీలక వైరుధ్యం ఏమిటి? ఏపీలో నయవంచక బాబు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే కీల కవైరుధ్యం. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందాలి. అలా పరాజయం పాలయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వాన వైఎస్సార్సీపీకి ప్రస్తుత పాలకపార్టీని ఓడించే పరిస్థితి ఉంది. ఆ కీలకవైరు ధ్యాన్ని ప్రజలకు అనుకూలంగా కమ్యూనిస్టులు పరి ష్కరించాలంటే చంద్రబాబు పార్టీని ఓడించాలి. వైఎ స్సార్‌సీపీకి, కమ్యూనిస్టులకు కూడా వైరుధ్యం ఉండ వచ్చు కానీ అది ఇప్పుడు కేంద్ర వైరుధ్యం కాదు. అందుకే వైఎస్ జగన్‌ను చంద్రబాబుతో జతకట్టి నేడు ఎన్నికల బరిలోకి దిగడం కమ్యూనిస్టులకు కూడని పని. ప్రజల దృష్టిలో దుష్టపాలనను వ్యతిరేకిస్తున్న ప్రతీకగా వైఎస్సార్సీపీ ఉంది. పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ జనసేన ఆ స్థానాన్ని పొందడం నేడు అసా ధ్యం. జనసేనకు, కమ్యూనిస్టులకు మధ్య కూడా వైరుధ్యం ఉంది. పైగా జనసేనకు పడే ఓట్లన్నీ సహ జంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పడే ఓట్లే. జన సేన రంగంలో లేకుంటే జగన్‌కే ఆ ఓట్లు లభించే అవకాశాలు ఎక్కువ. కనుక పవన్‌తో కలిపి తృతీయ ప్రత్యామ్నాయం పేరుతో కమ్యూనిస్టులుగానీ మరె వరైనా గానీ ఎన్నికల రంగంలో ఉంటే వారికి ఎంత సదుద్దేశం ఉన్నా, ఆచరణలో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చడమే అవుతుంది. దానివల్ల చంద్రబాబు గెలవక పోవచ్చు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజానీకాన్ని తమతో తీసుకు వెళ్లాల్సిన కమ్యూ నిస్టులు అందులో విఫలమవుతారు. కీలకమైన వైరు ధ్యాన్ని పరిష్కరించకుండా మౌలిక వైరుధ్యాన్ని రంగం మీదకు తెస్తే ఏ వైరుధ్యాన్నీ ప్రజానుకూ లంగా పరిష్కరించలేని స్థితి ఏర్పడుతుంది. ఇక తెలంగాణలో కూడా సీపీఎం పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతోంది. అక్కడ భౌతిక పరిస్థితి వేరేగా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను ఏ పార్టీ గానీ, కూటమి గానీ ఓడించగల స్థాయి లేదు. అలాంటప్పుడు సీపీఎం ప్రధాన కర్తవ్యం తనవెంట సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజానీకాన్ని సమీకరించుకోవడమే. బహుజన వామ పక్ష సంఘటన ద్వారా ఇప్పటికే లాల్–నీల్ ఐక్యతా దిశగా తెలంగాణలో సీపీఎం నిజాయితీగా పనిచే స్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశంతో ఉన్న మహాకూటమిని ఏ పార్టీలు బలపర్చినా అది వారికీ, ప్రజలకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు అంతిమంగా చంద్ర బాబు ఓటమికి తోడ్పడాలి. తృతీయ ఫ్రంట్ నేటి ప్రాధాన్యత కాదు. తెలంగాణలో సీపీఎం బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్)ను బలోపేతం చేసుకునే దృష్టితో జనసేనతో చెలిమియత్నం చేయడం సరైనదే అవుతుంది. ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
విషమించిన విఠల్ ఆరోగ్యం
► వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వైనం ► మెరుగైన వైద్యం కోసం ప్రైపెవేట్ ఆస్పత్రికి తరలింపు అనంతపురం : నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ప్రభుత్వాస్పత్రిలో చేరిన ఎస్కేయూ రిటైర్డ్ డెప్యూటీ రిజిస్ట్రార్ కె.విఠల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నా శనివారం సాయంత్రం వరకు ఆయన తేరుకోలేదు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విఠల్ కుమారుడు వీఎస్ సాయిచైతన్య నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసకున్న సంగతి తెలిసిందే. ఆ జంట ఆజ్ఞాతంలోకి వెళ్లడంతో వారి సమాచారం చెప్పాలంటూ యువతి బంధువులు విఠల్ దంపతులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మనస్థాపానికి గురైన విఠల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి విదితమే. కలకలం రేపుతోన్న వేలిముద్రల సేకరణ ప్రభుత్వాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న విఠల్ వద్దకు శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు వెళ్లి ఖాళీ తెల్లటి కాగితాలపై విఠల్ వేలిముద్రలు తీసుకోవడం కలకలం రేపుతోంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న తన భర్త నుంచి బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారంటూ ఆయన భార్య వాపోయారు. -
కానిస్టేబుల్‌కి గుండెపోటు: పోలీస్‌స్టేషన్‌లోనే మృతి
మెదక్ : మెదక్ జిల్లా మనూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న విఠల్ (45) అనే కానిస్టేబుల్ గురువారం గుండెపోటుతో స్టేషన్లోనే మృతి చెందాడు. రాత్రి డ్యూటీలో ఉన్న విఠల్ గురువారం వేకువజామున కాసేపు విశ్రమించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ రోజు ఉదయం సహాచర కానిస్టేబుళ్లు అతడిని నిద్రలేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి... మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం కల్యాణ మండలంలోని మాడి గ్రామం.అలాగే అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు. -
భిన్నత్వంలో ఏకత్వానికి పట్టం
విశ్లేషణ బిహార్ ఎన్నికల విజయం అగ్రవర్ణ కుటిల రాజకీయాలపై దళితులు, మైనారిటీలు, మహిళలు, వెనుకబడిన కులాల వారి విజయంగా కూడా అభినందించదగినది. ఆహ్వానింప దగినది. భారతదేశంలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని అణగారిన కులాల జనం, శ్రమజీవులందరి తరపున బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు సమర్పింపదగినది ఈ విజయం. ఈ విజయం నిజానికి ఈ దేశాన్ని ఏకశిలా సదృశ్యమైన వ్యవస్థగా చిత్రించి అఖండ భారత జాతి ఔన్నత్యం అంటూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టదలచిన శక్తులకు అపజయం. ఇటీవలి బీహార్ ఎన్నికల ఫలితాలు- భారతదేశ రాజకీయాల్లో సహజంగా నెలకొని ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితిని, తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తు న్నాయి. దీని ప్రభావంతో త్వరలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏఏ పార్టీలు, ఏఏ రాష్ట్రాల్లో ఏఏ విధంగా చేతులు కలిపితే ఏఏ ఫలితాలు రావచ్చు అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ చూస్తున్నాం. ఆ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, భారతదేశ భౌతిక వాస్తవిక పరిస్థితి క్రమేపీ ఆవిష్కృతం అవుతుండటాన్ని ఎల్లకాలమూ అటంకపర్చడం సాధ్యంకాదన్న ఆశ ఈ ఎన్నికల ఫలితాల వలన ఏర్పడుతున్నది. భారతదేశం చారిత్రకంగానే ఏకశిలా సదృశ్యమైనది కాదు. ప్రస్తుతం మనం భారతదేశం అని పిలుచుకుంటున్న ఈ సరిహద్దుల, పాలనా రూపుగల దేశం ఇలా ఎల్లవేళలా లేదనేందుకు ఎంత దూరమో పోనవసరం లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనలోనూ ఇలా లేదు. వారు వెళ్లిన వెంటనే ఉన్న భౌగోళిక చిత్రపటమూ ఇది కాదు. ఇక భాష సంగతి చెప్పనే అక్కరలేదు. ప్రధానిగానీ, రాష్ట్రపతిగానీ, తన మాతృభాషలో మాట్లాడితే అది ఏ భాష అయినా సరే దేశ జనాభాలో సగానికిపైగా ప్రజానీకానికి అర్థం కాదు. ఇంతటి గుణాత్మకమైన వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో, మరే దేశమైనా లేదను కుంటాను. ఇంతకంటే ఎక్కువ జనాభాగల చైనాలో సైతం నూటికి 98 శాతం ఒకే జాతికి చెందినవారు, చైనా భాషనే మాతృభాషగా కలిగినవారు! భారత ప్రభుత్వం అని మనం పిలిచే కేంద్ర ప్రభుత్వమూ, 29 రాష్ట్ర ప్రభుత్వాలూ పాలనా అవసరాల దృష్ట్యా ఆయా రాజకీయ పరిస్థితుల క్రమంలో నేటికి ఏర్పడినాయి. ఈ మొత్తం దేశానికి (కశ్మీర్ అందుకు భిన్నం) ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఈ రాజ్యాంగాన్ని సైతం దాదాపు వంద సార్లు సవరణ చేసుకోవాల్సివచ్చింది. ఇప్పటికీ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అమలు జరపడం సాధ్యం కావడం లేదు. ప్రజా ఉద్యమాలలో, ప్రజాచైతన్యం ఆసరాగా, ఈ దేశ స్వరూప స్వభావాలు, ఎలా మారవచ్చో నిన్నమొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నిరూపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడిన కేంద్రీకృత అధికా రంతో, ప్రస్తుత భారత రాజకీయ స్వరూపం ఇలాగే కొనసాగడం అంతి మంగా అసాధ్యం. కేంద్ర ప్రభుత్వం, దానితో వ్యవహరించే రాష్ట్ర ప్రభు త్వాలు అనే ధోరణి మనదేశ సహజ చర్రితకు భిన్నమైనది. అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆంధ్రజాతికి స్వభావ సిద్ధమైన ఆవేశంతోనూ, సత్యాగ్రహంతోనూ 'ఈ కేంద్రం' ఏమిటి? ఎక్కడ? 'కేంద్ర మిథ్య' అని గర్జించి భారతదేశంలోని వివిధ జాతీయతలను గుర్తు చేయడమేకాకుండా 'ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు అవుతున్నది' అని మన తెలుగు జాతీయతను చారిత్రకంగా మరొక మారు స్ఫురింపజేశారు. దురదృష్టవశాత్తు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు పరాయి వాళ్లు భూమిని అన్యాక్రాంతంగా ఆక్రమించు కున్నట్టే ఆక్రమించుకున్నారు. ఆ తెలుగుదేశం పార్టీయే నేడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని .. తిరిగి ఢిల్లీ దర్బారు అనాగరిక పాలన పాదాలవద్ద తాకట్టు పెడుతున్నది. అందుకు నిదర్శనం ఇటీవలే జరిగిన మన రాజధాని శంకుస్థాపన! ఢిల్లీ నుంచి దేశ ప్రధానిని రప్పించి ఆయన ముందు అతివినయం నటిస్తూ (పైగా, పెద్దల ముందు అలా ప్రవర్తించడం గొప్పగా కూడా చెప్పారు) ఆయన రాష్ట్రానికి విదిల్చిన నాలుగు మెతుకులకు, అక్కరలేని ప్రశంసలు కురిపించారు. ఆ అభ్యర్థనా స్థితిలో అతి ప్రధానమైన, రాష్ట్రానికి రావలసిన ‘ప్రత్యేకహోదా’ విషయం ప్రస్తావించనేలేదు. పైగా ప్రధాని మోదీ తెచ్చిన 'మట్టి, నీరు' వీటినే మహద్భాగ్యంగా చెప్పుకున్నారు. ఇంకా కేంద్ర ప్రభుత్వంతో మంచిగా, వారి అనుగ్రహం కోసం అంగలారుస్తున్నట్టు ఉంటేనే తగిన సాయం కేంద్రం అందిస్తుందని చెబుతున్నారు. ఒక్కసారి స్వర్గీయ ఎన్టిఆర్ పదహారణాల ఆంధ్రజాతి ప్రతీకను ఎరిగిన వారెవరైనా ఇలాంటి పరిస్థితిపై ఆయన ఎలా స్పందించగలరో తమ తమ ఆరాధనను, ఆలోచనలను బట్టి ఎవరైనా ఇట్టే గ్రహించుకోగలరు. 'అసలు ప్రత్యేక హోదా ఒకరిచ్చేదేమిటి? మనమేమైనా ఈ కేంద్ర ప్రభు త్వానికి సామంతులమా? మన జనం లేకుండా కేంద్రానికి ప్రత్యేక జనం ఉన్నారా? మనం కట్టే పన్నుల రూపంలోని డబ్బులు లేకుండా కేంద్రానికి ప్రత్యేకంగా ఖజానా ఎక్కడండి? వీరట.. మనపై జాలితలచి నిధులిస్తారట! మేము యాచకులవలే చేయిచాచి భృత్యులవలే వంగివంగి నంగినంగి పొగడ్తలు చేయాలటా...'ఇలా అని వుంటారని అనుకుంటాను. బిహార్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో వార్డువార్డు తిరిగి ప్రచారం చేసుకునే స్థాయి స్థానిక రాజకీయ నేతగా 30 భారీ బహిరంగ సభల్లో స్వయంగా దేశ ప్రధానిగా తన గౌరవాన్ని కూడా మరచి 'నమో' ప్రచా రం సాగింది. ఆయన ఏమన్నారంటే 'బిహార్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మంచిది. బిహార్ అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే ఎన్నుకోండి' అని చెవిలో జోరీగలా బిహార్ ప్రజల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంలో గుర్తించుకోవాల్సింది ఆ ఎన్డీయేలో చంద్రబాబు తెలుగుదేశం కూడా భాగస్వామి అనే.! నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షులు అమిత్‌షాలు ఇరువురూ కనీసం స్థానిక బిహారీ నేతలను కూడా లెక్కచేయకుండా ప్రచారం చేశారు. దానికి భిన్నంగా, దీటుగా అక్కడి జేడీయూ నేతలు ప్రత్యేకించి నితీశ్‌కుమార్.. మీకు బిహారీ నేత కావాలో, బహారీ (బిహార్‌కు చెందని బయటివారి) నాయకత్వం కావాలో తేల్చుకోండి? అని మౌలికమైన, సహజమైన ప్రశ్న సంధించి వారిని ఆలోచింపజేశారు. బిహార్ ప్రజలు తమకు తమ బిహారీ నేతే కావాలని తిరు గులేని రీతిలో జవాబు చెప్పారు. ఈ విజయం నిజానికి ఈ దేశాన్ని ఏకశిలా సదృశ్యమైన వ్యవస్థగా చిత్రించి అఖండ భారత జాతి ఔన్నత్యం అంటూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టదలచిన శక్తులకు అపజయం. భారతదేశం వివిధ జాతుల సమాహారం. ఏకశిలా సదృశ్యమైన జాతి ఔన్నత్యం అన్నది వాస్తవం కాదన్న శక్తుల చైతన్యయుతమైన సమాధానమే వారి అపజయంగా మారింది. కొందరు విశ్లేషకులు బిహార్ విజయాన్ని తక్కువ చేస్తూ - ఇది కులాల సమీకరణ ఆలోచన సంకుచిత విజయం అన్నట్లు ప్రచారం చేశారు. తమాషా ఏమంటే బిహార్ వంటి రాష్ట్రాల్లో కులతత్వం, కులరాజకీయాలు ఉన్నాయని మాట్లాడడం ఇలాంటి వారికి మామూలే. ఇక్కడ శతాబ్దాల తరబడి ఆర్థికంగానేగాక, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా దోపిడీ, దౌర్జన్యాలకు గురవడమే కాదు కొన్ని సందర్భాల్లో పశువులకన్నా హీనంగా బతుకుతున్న దళిత, ఆదివాసీ, మహిళ, మైనార్టీ, ఇతర వెనుకబడిన కులాలు ఐక్యమవడం ప్రత్యేకించి గమనార్హం. మన నేతలంతా మహా నీతివంతులై నట్లు.. అవినీతి పరుడంటూ లాలూ ప్రసాద్ యాదవ్‌ను అవహేళన చేసిన ఆ నేతల ఆధ్వర్యంలోనే ఈ అణగారిన ప్రజానీకం తమ సత్తా ఏమిటో చూపిం చారు. ఓట్లు మావి సీట్లు మీవా? అంటూ అగ్రకులాలను ప్రశ్నించిన కాన్షీరాం ప్రశ్నకు సీట్లు కూడా మనవే అంటూ పైన పేర్కొన్న దళిత బహుజనులు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చారు. బిహార్‌లో కుల రాజకీయాల గురించి తల్లడిల్లేవారు మన ఆంధ్రప్రదేశ్‌లోని కుల రాజకీయాలపై అంతగా విమర్శిం చరెందుకో! అగ్రకుల నేతలు గెలిస్తే అక్కడ సకలవర్ణాల సమభావం వర్థిల్లినట్లు- అణగారిన కులాల అభ్యర్థులు గెలిస్తే కులతత్వం ప్రబలినట్లూనా? మార్క్సిస్టులు తగినంత శ్రద్ధ కనబర్చక చాలాకాలం అలక్ష్యం చేసిన ఒక తీవ్రమైన దోపిడీరూపం మనుస్మృతి ఆధారంగా ఏర్పడిన నిచ్చెనమెట్ల లాంటి కులవ్యవస్థ దుర్మార్గం. కుల వ్యవస్థను ఏదో వృత్తుల సంబంధంగా భావించడం తర్కానికి కొంత దోహదపడినా అది ఎక్కడాలేనంత విచ్ఛిన్నం కాని శిలగా మన దేశంలో ఘనీభవించింది. అందుకే వృత్తులు, ఉద్యోగ హోదాలు, ఆర్థిక ప్రగతులు జరిగినా చెదురుమదురుగా తప్పా ఈ కుల వ్యవస్థ దాని అమానవీయత అలాగే నిలిచి ఉంది. ఈ కుల వ్యవస్థలో అణ గారిన కులాల వారు ఆర్థికంగా కూడా దోపిడీకి గురవుతున్నారు అంటే వారి ఆర్థికరీత్యా, వారి అణగారిన కుల రీత్యాకూడా. ఈ రెండూ ఎంతగా పెనవేసు కుపోయాయంటే వర్గరీత్యా చూసినా ఈ కుల అణచివేత కనబడుతుంది. పైన పేర్కొన్న కులాల్లోని వారు ఎంత మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగగలిగారు? జనాభాలో 75 శాతం పైగా వీరే ఉన్నా పారిశ్రామిక వర్గాల్లో వీరు కనీసం 7.5 శాతం కూడా లేరు. పైగా ఆ హోదాలో వారు పెట్టుబడిదారీ వర్గంలో చేరినా వారు కులరీత్యా అణగారిన కులాల వారే. ఈ దౌర్భాగ్య కుల వ్యవస్థ తీవ్రత ఎంత లోతుగా ఉందంటే ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితి మారవచ్చు, నివాసం మారవచ్చు, మతం మార్చుకోవచ్చు కానీ కులం మారదు. ఈ కుల వ్యవస్థలో అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతిపై వారిని సమీకరించి వారి నాయకత్వాన పోరాటం సల్పటం మనదేశంలో ప్రధానమైన అంశం. అందువలన బిహార్ విజయం అగ్రవర్ణ కుటిల రాజకీయాలపై దళిత బహుజనుల (మైనార్టీ, మహిళలు, వెనుకబడిన కులాల వారు) విజయంగా కూడా అభినందనీయం, ఆహ్వానింపదగినది. నువ్వానేనా అన్నట్టు జరిగిన ఈ ఎన్నికల్లో సైతం ముగ్గురు సీపీఐ(ఎంఎల్ లిబరేషన్) వారు గెలవడం గమనించదగినది. పెట్టుబడిదారీ అగ్రవర్ణ శక్తులు విడదీయలేనంత బలీయంగా ఈ కష్టజీవుల, అణగారిన కులాల దళిత బహుజనుల సమైక్య ప్రజా ఉద్యమ నిర్మాణం అత్యంత ఆవశ్యకం. మొత్తం మీద భారతదేశంలోని అన్ని జాతుల ప్రజలు, అన్ని అణగారిన కులాల జనం, శ్రమజీవుల అందరి తరపున బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు సమర్పింపదగినది ఈ విజయం. వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు: డా॥ఎ.పి. విఠల్ ఫోన్ నెంబర్: 98480 69720