అమ్మమాట | Funday news story of the week 27-04-2019 | Sakshi
Sakshi News home page

అమ్మమాట

Published Sun, Apr 28 2019 12:21 AM | Last Updated on Sun, Apr 28 2019 12:21 AM

Funday news story of the week 27-04-2019 - Sakshi

‘‘ఏమైందన్నా అట్టా మొహం మొటమొటలాడిస్తన్నావు? మన హిట్లర్‌ లీవ్‌ ఇవ్వనన్నాడా ఏంటి?’’ విసురుగా వస్తున్న విఠల్‌ని అడిగాడు కండక్టర్‌ కాంతారావు. ‘‘అవున్రా.. కూతురి పెళ్లికి ఒక్క పదిహేనురోజులుసెలవడితే ఇవ్వనంటాడేమిట్రా? స్టాఫ్‌ సరిపోకపోతే కొత్తవాళ్లని తీసుకోవాలిగానీ ఒక వారం రోజులు తీసుకో అంటే ఎట్లా? వారం రోజులు ఏమూలకి సరిపోతై చెప్పు?’’ చికాకు పడ్డాడు విఠల్‌.‘‘అదే అన్నా! సిన్సియర్‌గా పన్జేసేవాళ్లకి ఇట్టాజేస్తారు. పనెగ్గొటి ్టతిరిగేవాళ్లకి రూల్సేమీ అడ్డురావు. సర్సరే పద పద. ఇది మనకి రోజూ ఉండే రపరపే. మళ్లీ టైంకి బస్సు తియ్యలేదంటే అదొక గొడవ వాడితో. అయినా ఇవ్వన్నీ మనసులో పెట్టుకుని బస్సు డ్రైవింగ్‌ చేసేవు... అసలే మన రూటు చాలా బిజీ’’ హెచ్చరించాడు కాంతారావు.‘‘అదేం లేదులేరా. పద’’ అంటూ బస్సుకేసి నడిచాడు విఠల్‌. కాంతారావు బస్సులోకి దూరిజనాన్ని నెట్టుకుంటూ చకచకా టిక్కెట్లివ్వటం మొదలుపెట్టాడు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని ఇంజన్‌ స్టార్ట్‌ చేశాడు. మనసంతా చిరాగ్గా ఉంది. ఒక పక్కన భార్య గొడవ ‘ఇంకో ఇరవై రోజుల్లో చిన్నదాని పెళ్లి ఉంది. ఇప్పటికైనా సెలవు పెట్టరా?’ అని. పెళ్లి పనులు నత్తనడకతో సాగుతున్నాయి. పెళ్లిపత్రికలు అచ్చై ఇంటికొచ్చాయి. అవి బంధువులందరికీ పంచాలి. పెద్దల్లుడు మంచివాడు కాబట్టి మరదలి పెళ్ళికోసం తన భార్యని ముందే పంపాడు. తనూ పది రోజుల ముందు వస్తానన్నాడు. వచ్చీరావటంతోనే తన పెద్దకూతురు అన్నీ తానే అయి ఇంట్లో పనులన్నీ చూస్తోంది. అల్లుడు వస్తే తనకి సహాయంగా ఉండమనొచ్చుగాని మొత్తం బయటి పనులన్నీ అతడి నెత్తిన వేస్తే ఏం బాగుంటుంది? అప్పటికీ శని ఆదివారాల్లో వచ్చి, కొన్ని పనులు చేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆమాత్రంకూడా అతను చెయ్యకపోయివుంటే తనకి ఇంకా కష్టమయ్యేది’. 

ఇలా ఆలోచనల్లో సతమతమవుతుండగా కాంతారావు విజిల్‌ వెయ్యటంతో బస్‌ను ముందుకు కదిలించాడు. అసలే ఆ రూట్‌ చాలా బిజీ. దానికి తోడు మెట్రో పనులకోసమో, ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసమో రోడ్లని ఆక్రమిస్తున్న కాంట్రాక్టర్లు. మామూలుగానైతే అతడి చేతి స్టీరింగ్‌ కృష్ణుడి  చేతిలోని చక్రమే. కానీ ఇప్పటి పరిస్థితి వేరు.సాధారణంగా కొందరు డ్రైవర్లు బస్టాప్‌కి కాస్త ముందోవెనకో కొంత దూరంలో బస్సుని ఆపి, ప్రయాణీకులు పరిగెత్తుకువచ్చి అందుకునేలోపు బస్సుని దౌడు తీయుస్తుంటారు. తమ కోర్కెలు తీర్చని యాజమాన్యంపై కోపంతోనూ, కసితోనూకొందరలా చేస్తుంటారు. మరికొందరికి ఆ రకంగా ప్రయాణీకుల్ని ఊరించి ఊరించి విసిగించటం వినోదం. నిజాయితీపరులైన ఉద్యోగులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో  విధిలేక ఆ పని చేస్తుంటారు.  ఆ రోజు విఠల్‌ కూడా తనకు బాస్‌ లీవ్‌ ఇవ్వలేదన్న కసిని ప్యాసింజర్ల మీద చూపించసాగాడు. అంతగా రద్దీ లేకున్నా, ప్యాసింజర్లు ఆపమని అభ్యర్ధిస్తున్నా పట్టించుకోకుండా స్పీడుగా బస్‌ నడపసాగాడు. ఈ విషయంలో జనం తనని తిట్టుకుంటారని అతనికి తెలుసు. ‘అయినా వాళ్లకు ఇదొక్కటే బస్సు కాదుగదా’ అని తనని తాను సమాధానపరచుకున్నాడు. ఇక చివరి ట్రిప్పుకొచ్చేసరికి ఎంత తొందరగా ఇంటికెళ్దామా అనే ఆత్రంలో బస్సు ఖాళీగా ఉన్నా ఎక్కడా ఆపకుండా వేగంగా నడపసాగాడు. తాను ఆపొద్దని చెప్పినావినకుండా, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడదంటూ ప్రతి స్టాప్‌లో బస్సునాపే విఠల్, ఆరోజు అలా బస్సు వేగంగా నడపటం చూసిన కాంతారావు ‘మంచోణ్ణీ కూడా చెడగొట్టావు గదరా!’ అని అనుకున్నాడుం తన బాస్‌ని తలచుకుంటూ. 

ఆ రోజు ఆఫీసులో చక్రి మనసు మనసులోలేదు. అతని ధ్యాసంతా తన ఇంటిమీదనే ఉంది. ఆ ఇంటిని ఏవిధంగా సరిచేయాలోపాలుపోని స్థితిలో ఉన్నాడతడు. ఆ పరధ్యానంతో అతడు తెచ్చిన ఫైలు చూసి అతని బాస్‌ ‘‘ఏంటి చక్రీ ఇది? ఎంతో సిన్సియర్‌గా పని చేస్తావని నీకు పేరుంది. నువ్వుగూడా ఇలా చేస్తే ఎలా చెప్పు? ఈ ఫైల్లో చూడు ఎన్ని తప్పులు చేశావో. ఒకసారి మళ్లీ చూసి సరిచేసి తీసుకురా’’ అంటూ సుతిమెత్తగా మందలించాడు. ఆ ఫైలు పట్టుకుని అతడు తన సీట్లోకొచ్చికూర్చున్నాడు. చక్రి అంటే అతని పై ఆఫీసర్‌కి మంచి అభిప్రాయముంది. కానీ అది జీతం పెంచేంతగాలేకపొవటం వల్ల అతడి జీతం గొర్రెతోకను మించటంలేదు. ఇంట్లో తన తల్లి, భార్య, కూతురు, కొడుకు మొత్తం ఐదుగురి కుటుంబభారం తనే మొయ్యాల్సివుంది. రెండువందల గజాల్లో ఓ మూలగా ఉన్న రెండు గదుల డాబా ఇల్లొక్కటే తన తండ్రి నుంచి వంశపారంపర్యంగా తనకు సంక్రమించింది. అవీ చిన్న చిన్న గదులు. అదీ నగరం పొలిమేరల్లో ఉన్న ఒక పల్లెటూర్లో. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి ఇప్పటివరకూ ఎలాగో సర్దుకుంటూ వస్తున్నారు. వాళ్లు పెద్దవాళ్లవుతున్నకొద్దీ ఇల్లు మరీ ఇరుకైపోసాగింది. గత వర్షాకాలంలో ఆ ఇల్లు కురవటం మొదలైంది. దాంతో అప్పుడు ఇంట్లోఅందరూ చెట్టుకింద వర్షంలో కూర్చున్నట్లుగా కూర్చుని రాత్రుళ్లు జాగారం చేశారు. ఆ ఇల్లు కట్టి అప్పటికి దాదాపు యాభై ఏళ్లవుతోందిమరి. 

ఇహ లాభం లేదని తాపీ మేస్త్రీని పిలిచి మాట్లాడాడు. ‘‘ఇల్లు కట్టినప్పుడు డాబా పైన ప్లాస్టరింగ్చేయించివుంటే ఈ సమస్య వచ్చేది కాదు సార్‌. ఇప్పటికైనా ఆ పని చెయ్యకపోతే వానకి తడిసి తడిసి కొన్నిరోజులకు రూఫ్‌ కూలినా కూలవచ్చు’’ అని భయపెట్టాడు. వర్షాకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా గడవాలంటే ఆ పని చేయించక తప్పదు. దానికి కనీసం మూడు బస్తాల సిమెంట్, ఒక టిల్లర్‌ ఇసక తెప్పిస్తే పని మొదలుపెడతానని చెప్పి వెళ్లిపోయాడా మేస్త్రి. అప్పటికి డబ్బు సర్దుబాటు కాకపోవటంతో ఆ పనిని తర్వాతి సంవత్సరానికి వాయిదా వేశాడు. ఎలాగోలా ఆ వర్షాకాలం గడిచి పోయింది.
అయితే ఉన్నట్లుండి క్రితంరోజు సాయంత్రం ఆకాశంలో మబ్బులు కమ్మేశాయి. రాత్రికల్లాకుంభవృష్టి మొదలయ్యింది. మొత్తం కాలనీలన్నీ చెరువులైపోయాయి. పైకప్పు నుంచి నీరు కారటంతో ఆ రాత్రి చాలా ఇబ్బందయ్యింది. దాంతో ఇల్లు కాసారమైపోయింది. తామూ తడుస్తున్నా, తన భార్యతో కలిసి పిల్లలకూ తల్లికీ ఇబ్బంది కాకుండా చూడటానికి ఎంతో కష్టపడ్డాడు. తెల్లారే సరికి మళ్ళీ ఫెళ్ళున ఎండ. హైదరాబాద్‌ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో తెలీదు. 

‘‘అసలిప్పుడీ అకాలవర్షమేమిటి? కురవాల్సిన కాలంలో, కురవాల్సిన చోట కురవకుండా వుండటం చూస్తుంటే కలి ఏ స్థాయిలో రెచ్చిపోతున్నాడో తెలిసిపోతుంది. ఇప్పటికైనా ఆ సిమెంట్‌ పనేదో చేయించు నాయినా. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావుగా’’ అందతని తల్లి. అతని ఇబ్బంది ఆవిడకు తెలుసు. కానీ ఇంటి పరిస్థితి చూశాక కొడుకుతో ఆ మాట అనకుండా ఉండలేకపోయింది.
అతని తల్లి ఎప్పుడూ నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అతన్ని అడిగి ఎరగదు. అలాంటిది ఇప్పుడిలా అడిగిందంటే ఆమె ఎంత కలత చెంది ఉంటుందో అర్థమై ‘‘అలాగే అమ్మా. ఈ సారి తప్పకుండా చేయిస్తా.’’ అంటూ మాట ఇచ్చాడు. అందుకే తెల్లారగానే మేస్త్రిని పిలిపించాడు. అతడు వస్తూనే ‘‘నేనెప్పుడో చెప్పాగద సార్‌. మీరు సిమెంట్, ఇసుక తెప్పించండి. ఒక్కరోజులో పని పూర్తవుతుంది’’ అన్నాడతడు. మెటీరియల్‌కీ, మేస్త్రికీ కలిపి దాదాపు పదివేలు. కనీసం ఇప్పుడైనా ఆ ప్లాస్టరింగ్‌ పని చేయించకపోతే వచ్చే వర్షాకాలంలో తాము ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు. ‘తల్లి కోరిక తీర్చేందుకైనా సరే ఈ పని చేయించాల్సిందే’ అని తీర్మానించుకున్నాడు. అందుకే ఒక స్థిర నిర్ణయానికొచ్చినట్లు తన బాస్‌ గదిలోకెళ్లి తనకొచ్చిన ఇబ్బందిని గూర్చి చెప్పాడు. తనకి కనీసం పదివేలయినా కావాలని అడిగాడు. ఆయన ఏ కళనున్నాడోగానీ అతని పీఎఫ్‌ అకౌంట్‌లోంచి పదివేలు లోన్‌ శాంక్షన్‌ చేయించాడు.

తన ఇంటిదగ్గర్లో కొత్తగా కడుతున్న ఒక ఇంటిదగ్గర మిగిలిన ఇసుకని ఆ ఇంటివారిని బ్రతిమాలి, తక్కువ ధరకు తెచ్చుకున్నాడు. మర్నాడు రెండో శనివారం కావటంతో ఆ పని పూర్తి చేయించాలనుకుని సిమెంట్‌ కోసం బయల్దేరాడు. తన ఊర్లో సిమెంట్‌ షాపులేమీ లేకపోవటంతో సిటీకి వెళ్లక తప్పలేదతనికి. అప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో సిమెంట్‌ దాదాపు షాపులన్నీ మూసి ఉన్నాయి. ఏం చెయ్యాలోపాలుపోలేదతనికి. నిరాశగా వచ్చి బస్టాపులో నిల్చున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఒక సిమెంట్‌ షాపు ముందు ఆగింది. దానిలోంచి ఓ యాభైఏళ్ల వ్యక్తి దిగి, ఆ షాపు మూసి వుండటంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్లుగా నిలబడిపోయాడు. అతన్ని చక్రి అంతగా పట్టించుకోకపోయేవాడే. కానీ అతగాడొచ్చిన ఆటోలో మూడు సిమెంట్‌ బస్తాలు కనిపించటంతో అతడి మనసులో ఏ మూలనో చిన్న ఆశ  చిగురించింది. అతని దగ్గరికెళ్లి, ‘‘వర్షం భయానికి షాపులన్నీ మూసేశారు’’ అని అతనితో మాటలు కలిపాడు.     
‘‘అవునండీ. మా ఇంటిదగ్గరపనంతా అయిపోయింది. కానీ ఈ సిమెంట్‌ బ్యాగులు మూడూ మిగిలిపోయినై. ఇంటిదగ్గరే ఉంచితే గడ్డగట్టి పోతాయని తిరిగి ఇచ్చేద్దామని వచ్చా. వీడేమో షాపు బంద్‌ చేసేశాడు’’ అన్నాడు.

చక్రి మొహం సంతోషంతో వెలిగిపోయింది. ‘‘బస్తా ఎంతకి కొన్నారు?’’అనడిగాడు.‘‘ఒక్కొక్క బస్తా మూడొందల యాభై. మీకు కావాలంటే చెప్పండి. బస్తాకి వంద తగ్గించి ఇస్తా’’ అన్నాడు. ఆ మాట వినటంతోటే ప్రాణం లేచొచ్చిందతనికి. ఇక మరోమాట లేకుండా ఏడొందలయాభై అతని చేతిలో పెట్టాడు. అతడు ఆటోవాలా సాయంతో ఆ మూడు సిమెంట్‌ బస్తాలూ అక్కడి బస్టాప్‌ దగ్గర దించేసి, అదే ఆటోలో వెళ్లిపోయాడు. అక్కడ్నుంచి తన ఇంటికి ఆటో మాట్లాడుకుంటే కనీసం రెండొందలౌతుంది. అంత డబ్బు పెట్టటం దండగ. ఎలాగూ డిస్ట్రిక్ట్‌ బస్సులతోపాటు సిటీ బస్సులుకూడా తన గ్రామం వరకూ వెళ్తుంటాయి. ఆ బస్సు డ్రైవర్నో కండక్టర్నో బ్రతిమిలాడైనా సరే ఆ సంచులు ఇంటికి తీసుకెళ్లాలని అతని కోరిక. కానీ వచ్చిన బస్సులేవీ అక్కడ ఆగకుండా వెళ్లిపోసాగాయి. దాంతో అతడు నిరాశ పడిపోసాగాడు. అదే ఏ డిస్టిక్‌ బస్సో అయితే లగేజీ టికెట్‌ కొట్టకుండా, ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటారు. ఇక సిటీ బస్సులవాళ్లైతే పాల క్యాన్లు, కూరలకైతే ఓకే అంటారుగానీ, సిమెంట్‌ బస్తాలంటే అస్సలు ఒప్పుకోరు. అయినా అతడిలో ఆశ చావక ‘ఒక్క బస్సయినాఆగకపోతుందా’ అని ఎదురు చూడసాగాడు.

ఆలోచనలు ఎంతగా ముప్పిరిగొంటున్నా విఠల్‌ బస్సుని జెట్‌ స్పీడ్‌లో లాగించేస్తూనే ఉన్నాడు. అప్పటికే ఆకాశం మేఘావృతమై  ఉండటం మూలాన రోడ్లు ఖాళీ అయిపోసాగాయి. 
భారీవర్షం పడే సూచనలుండటంతో జనం పలచబడ్డారు. విఠల్‌ బస్సు స్పీడ్‌ పెంచేశాడు. తొందరగా డ్యూటీ దిగి ఇంటికెళ్లాలని అతడి మనసు పీకుతోంది. అలా వెళ్తుండగా ఒక బస్టాప్‌లో ఒక ముసలావిడ నిల్చుని ఉండటం చూడగానే అప్రయత్నంగానే అతడి కాలు బ్రేక్‌ నొక్కింది. అది చూడగానే కాంతారావు ఆశ్చర్యపోయి, ‘‘ఏంటన్నా. సడెన్‌గా ఈ ముసలిదాని కోసం బస్సాపావు?’’అనడిగాడు. అతడు జవాబివ్వకుండా నవ్వి, ఆ ముసలావిడ ఎక్కగానే బస్సుని ముందుకు కదిలించాడు. ఆ తర్వాతి స్టాప్‌లో కూడా ఒక్కరే ఉన్నారు. అది చూసిన కాంతారావు ‘‘ఒక్కడి కోసం బస్సాపటం వేస్ట్‌. రైట్‌ రైట్‌’’ అన్నాడు.కానీ బస్సు ఆ స్టాపులో ఆపటం చూసి, ‘‘ఏమైందన్నా. తొందరగా ఇంటికి పొవాలని లేదా?’’ అన్నాడు. కానీ అతడి నుంచి జవాబుగా అదే నవ్వు. కాంతారావుకి ఏమీ అర్థం కాలేదు. 
ఆ తర్వాతి స్టాప్‌లో ఉన్న ఒకే ఒక ప్యాసింజర్ని చూసి ‘‘అన్నా. ఇక ఆపకు. అసలే వాడి దగ్గర సిమెంట్‌ బ్యాగులున్నట్లున్నై. అవి లోపలికెక్కిస్తే, బస్సంతా ఖరాబవుతుంది. పోనియ్‌’’ అన్నాడు. ఆ మాటలు అసలు వినబడనట్లువిఠల్‌ బస్సుని సరాసరి తీసికెళ్లి ఆ సిమెంట్‌ బస్తాల దగ్గర ఆపి, ‘‘ఎక్కు’’ అన్నట్లుగా సైగ చేశాడు.  అప్పటిదాకా ఏ బస్సూ ఆగకపోవటం, మళ్లీ చినుకులు మొదలైతే తక్కువ రేటుకి కొన్న సిమెంట్‌ పాడైపోతుందేమోనన్న దిగులులో కూరుకుపోయి ఉన్న చక్రికి, బస్సు తన దగ్గరికే వచ్చి ఆగటం, ఎక్కమని డ్రైవర్‌ సైగ చెయ్యటంతో ప్రాణం లేచి వచ్చినట్లైంది. గబగబా సిమెంట్‌ బస్తాల్ని బస్సులోకి ఎక్కించేసి, ‘‘థాంక్యూ... థాంక్యూ వెరీమచ్‌ డ్రైవర్‌గారూ’’ అన్నాడు కృతజ్ఞత గుండెలో ఉప్పొంగగా.

విఠల్‌ నవ్వుతూ తలాడించి, గేర్‌ మార్చి ఏక్సిలేటర్‌ మీద కాలువేశాడు.‘నక్క తోక తొక్కి వచ్చినట్లున్నావ్‌’ అన్నట్లుగా చూస్తూ, కాంతారావు అతడికి టికెట్‌ ఇచ్చాడు. అంతవరకూ ఎవరెంత బ్రతిమాలినా ఆపకుండా బస్సుని లాగించిన విఠల్‌ వైఖరి ఉన్నట్లుండి ఎందుకు మారిందో అర్థం కాలేదతనికి. అయితే కూతురి పెళ్లికి సెలవివ్వని బాస్‌ మీద కసితో బస్సు నడుపుతున్న విఠల్‌కి,ఎందుకో తెలీదుగానీ అక్కడ బస్టాపులో నిలబడ్డ ముసలావిడని చూడగానే చనిపోయిన తన తల్లి గుర్తుకొచ్చింది.తండ్రి లేని తనను ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా పెంచి పెద్దచేసిందావిడ. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న ఆమె, ఎప్పుడూ పదుగురికి ఆదర్శంగా నిలిచేది. తన కొడుకుకి చదువు పెద్దగా అబ్బకపోవటంతో ఆమె కొంత కలతచెందినా, అతడికి ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె చాలా సంతోషించింది. ఉద్యోగంలో చేరటానికి బయల్దేరుతున్న సమయంలో  ‘‘నాయినా! నువ్వు చెయ్యబోయే ఉద్యోగం సామాన్యమైంది కాదు. ఎంతోమంది ప్రాణాలే కాదు, వారి ఆశలూ, ఆశయాలూ నీ చేతిలో ఉంటాయి. ఏ క్షణంలోనూ నిర్లక్ష్యమూ, నిర్లిప్తతా దరిచేరనీయకూడదు. జనం ఎన్నో కష్టాల్లోనూ, టెన్షన్లలోనూ ఉండీ, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో నమ్మకంతో నీ బస్సెక్కుతారు. వారి నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకు. నీమూలంగా ఏ ఒక్కరూ ఇబ్బందిపాలు కాకూడదు.  నీవల్ల నష్టపోయిన వాళ్ల తిట్లు మన కుటుంబానికి శాపాలవుతాయి. వాళ్ల కృతజ్ఞతలు నీ పిల్లలకు ఆశీర్వచనాలై వారి మంచి భవిష్యత్తుకు సోపానాలవుతాయి. స్టీరింగ్‌ పట్టుకునే ప్రతిసారీ నా ఈ మాటల్ని మననం చేసుకో’’ అంటూ చెప్పింది. తన ప్రవర్తనవల్ల ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయనని తల్లికిచ్చిన మాట గుర్తుకొచ్చి ఒక్కసారిగా వీపుపై చెర్నాకోలతో చరిచినట్లైందతనికి. ‘ఎప్పుడూ నిబద్ధతతో మెలిగే తను ఈరోజిలా మారటం తప్పు. తన కూతురి పెళ్లి పనులురోజూ తాను డ్యూటీకి ఎక్కేముందుగానీ, దిగిన తర్వాతగానీ, నిద్రాహారాలు మానుకునైనా చేసుకోవచ్చు. అంతేగానీ ఒకరిమీద కోపాన్ని మరొకరిమీద చూపించటం ఎంతవరకు సమంజసం!?’ అనుకుంటూ ఆ ముసలమ్మకోసం బస్సాపాడు. కాస్త ఆలస్యంగానైనా సరే తన తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవటం అతనికెంతో ఆనందాన్నిచ్చింది. అందుకే ఆ తర్వాత వచ్చిన ప్రతి స్టాపులోనూ బస్సుని ఆపసాగాడు.
- గండ్రకోట సూర్యనారాయణ శర్మ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement