విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులకు వారి పరిభాషలోనే అడగాలంటే కీలకవైరుధ్యం ఏమిటి? ఏపీలో నయవంచక చంద్రబాబు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే కీలకవైరుధ్యం. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పరాజయం పొందాలి. వైఎస్సార్ సీపీకి ప్రస్తుత పాలకపార్టీని ఓడించే పరిస్థితి ఉంది. ఆ కీలకవైరుధ్యాన్ని ప్రజలకు అనుకూలంగా కమ్యూనిస్టులు పరిష్కరించాలంటే చంద్రబాబు పార్టీని ఓడించాలి. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు అంతిమంగా చంద్రబాబు ఓటమికి తోడ్పడాలి. పవన్ కల్యాణ్ జనసేనకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే స్థితి మాత్రమే ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమికి వ్యతిరేక పొత్తులపైనే వామపక్షాలు దృష్టి నిలపాలి.
ఎలాంటి సైద్ధాంతిక సారూ ప్యత లేకున్నా దేశంలో రాజకీయ పక్షాలు ఎన్ని కల్లో పొత్తులు పెట్టుకుంటు న్నాయి. పొత్తుల రాజకీ యాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆరితేరారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం పదవి చేపట్టినప్పటి నుంచీ ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం అనేక పార్టీ లతో కలిసి ఎన్నికల్లో పోటీచేసింది. సీపీఐ, సీపీఎం, బీజేపీతో ఆయన గడచిన 23 ఏళ్లలో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం వచ్చే లోక్‌సభ, రెండు తెలుగు శాసనసభ ఎన్నికల్లో అదే కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి, అధికారం పంచుకోవడానికి సైద్ధాంతిక సారూప్యం అవసరం లేదనీ, రాజకీయ పరిస్థితులే వీటిని నిర్ణయిస్తాయని ఏడు దశాబ్దాల రాజకీయ అనుభవం నిరూపిస్తోంది.
ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చాక తమ ప్రకటిత విధానాలు, కార్యక్రమాలు అమలు చేయడమే కమ్యూనిస్ట్‌పార్టీ లక్ష్యం. 1957లో కేరళలో, 1967లో పశ్చిమబెంగాల్‌లోనూ ఐక్యంగా నిలబడి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కమ్యూనిస్టు పార్టీల కూటమి నుంచి నక్సలిజం భావాలున్న పార్టీ నేతలు సైద్ధాంతిక కారణాలతో విడిపోయినా, తర్వాత కాలంలో ఎన్నికలకే పరిమి తమైన కమ్యూనిస్టు పార్టీలు తోటి వామ పక్షాలతోనే గాక ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కూటముల్లో చేరాయి. వాటితో కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. కాంగ్రెస్, బీజే పీలకు వ్యతిరేకంగా ఎన్నికల పొత్తులు కుదుర్చుకుని కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తొలిసారి వెన్నుపోటుకు గురైన సందర్భంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఎన్టీ ఆర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి.
కానీ 1995లో అదే చంద్రబాబు సొంతమామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పదవీచ్యుతుడిని చేసి నప్పుడు, చంద్రబాబుకు అదే సీపీఎం మద్దతుని వ్వడం ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ఆ తర్వాత బాబుతో, ఆ పిదప కాంగ్రెస్ పార్టీతో.. ఇలా ఎప్పటి కెయ్యది ప్రస్తుతమన్నట్లు పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? అంతకుమించి 2009 ఎన్నికల్లో వైఎస్సార్‌ను ఓడించడమే తమ తక్షణ కర్తవ్యమన్నట్లుగా.. తమ పార్టీలను కాలం చెల్లిన పార్టీలంటూ అవహేళన చేసిన బాబుతో మళ్లీ కలిసి మహాకూటమి కట్టి ఎన్నికల పొత్తుకు సిద్ధపడిన కమ్యూనిస్టులు తమ ప్రత్యేకత కోల్పోయి, చివరకు కుల రాజకీయాలకు ఆలవాలమయ్యారన్న అప ప్రథను కూడా కోరి తెచ్చుకున్నారు.
2014 ఎన్నికల్లో తెలంగాణలో తలో అసెంబ్లీ స్థానానికి పరిమితమైన కమ్యూనిస్టు పార్టీలు ఏపీలో ఒక్క సీటూ గెలవలేకపోయాయి. దేశంలో తొమ్మిది దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు తెలుగునాట ప్రస్తుత దుస్థితికి చేరుకు న్నాయి. ఏపీలో మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన ఏడేళ్ల క్రితం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు టీడీపీని గద్దె దించే స్థాయికి ఎదిగింది. పేదలు, సామాన్య ప్రజానీకానికి నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలనకు ప్రమాణాలుగా నిలి చిపోయాయి. అదే జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి మూల ధనం. ఆయన రాజకీయ అవగాహన కూడా ఈ పునాది మీదే ఏర్పడి ముందుకుసాగుతోంది.
ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు పాలన ఎంత అవినీతికరంగా మారిందో, ఎంత నిరంకుశ ప్రభు త్వంగా మారి అంగన్‌వాడీ కార్యకర్తలపై, మొన్నటికి మొన్న ముస్లిం యువతపై, నిన్న ఉపాధ్యాయులపై దమనకాండ జరిపిందో చూస్తే ఏం సూచిస్తోంది? అలవిమాలిన ఆత్మస్తుతి, పరనింద, పోలీస్ వ్యవ స్థను వాడుకుని ప్రత్యర్థులను అణచివేసే చర్యలకు చంద్రబాబు దిగజారారు. ఈ పరిస్థితిలో ఏపీలో కమ్యూనిస్టులకు వారి పరిభాషలోనే అడగాలంటే కీలక వైరుధ్యం ఏమిటి? ఏపీలో నయవంచక బాబు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వైరుధ్యమే కీల కవైరుధ్యం. అందుకే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందాలి. అలా పరాజయం పాలయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వాన వైఎస్సార్‌సీపీకి ప్రస్తుత పాలకపార్టీని ఓడించే పరిస్థితి ఉంది. ఆ కీలకవైరు ధ్యాన్ని ప్రజలకు అనుకూలంగా కమ్యూనిస్టులు పరి ష్కరించాలంటే చంద్రబాబు పార్టీని ఓడించాలి. వైఎ స్సార్‌సీపీకి, కమ్యూనిస్టులకు కూడా వైరుధ్యం ఉండ వచ్చు కానీ అది ఇప్పుడు కేంద్ర వైరుధ్యం కాదు. అందుకే వైఎస్ జగన్‌ను చంద్రబాబుతో జతకట్టి నేడు ఎన్నికల బరిలోకి దిగడం కమ్యూనిస్టులకు కూడని పని. ప్రజల దృష్టిలో దుష్టపాలనను వ్యతిరేకిస్తున్న ప్రతీకగా వైఎస్సార్‌సీపీ ఉంది. పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ జనసేన ఆ స్థానాన్ని పొందడం నేడు అసా ధ్యం. జనసేనకు, కమ్యూనిస్టులకు మధ్య కూడా వైరుధ్యం ఉంది. పైగా జనసేనకు పడే ఓట్లన్నీ సహ జంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా పడే ఓట్లే.
జన సేన రంగంలో లేకుంటే జగన్‌కే ఆ ఓట్లు లభించే అవకాశాలు ఎక్కువ. కనుక పవన్‌తో కలిపి తృతీయ ప్రత్యామ్నాయం పేరుతో కమ్యూనిస్టులుగానీ మరె వరైనా గానీ ఎన్నికల రంగంలో ఉంటే వారికి ఎంత సదుద్దేశం ఉన్నా, ఆచరణలో చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చడమే అవుతుంది. దానివల్ల చంద్రబాబు గెలవక పోవచ్చు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజానీకాన్ని తమతో తీసుకు వెళ్లాల్సిన కమ్యూ నిస్టులు అందులో విఫలమవుతారు. కీలకమైన వైరు ధ్యాన్ని పరిష్కరించకుండా మౌలిక వైరుధ్యాన్ని రంగం మీదకు తెస్తే ఏ వైరుధ్యాన్నీ ప్రజానుకూ లంగా పరిష్కరించలేని స్థితి ఏర్పడుతుంది.
ఇక తెలంగాణలో కూడా సీపీఎం పవన్ కల్యాణ్‌తో చర్చలు జరుపుతోంది. అక్కడ భౌతిక పరిస్థితి వేరేగా ఉంది.
రాబోయే ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ను ఏ పార్టీ గానీ, కూటమి గానీ ఓడించగల స్థాయి లేదు. అలాంటప్పుడు సీపీఎం ప్రధాన కర్తవ్యం తనవెంట సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజానీకాన్ని సమీకరించుకోవడమే. బహుజన వామ పక్ష సంఘటన ద్వారా ఇప్పటికే లాల్–నీల్ ఐక్యతా దిశగా తెలంగాణలో సీపీఎం నిజాయితీగా పనిచే స్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశంతో ఉన్న మహాకూటమిని ఏ పార్టీలు బలపర్చినా అది వారికీ, ప్రజలకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు అంతిమంగా చంద్ర బాబు ఓటమికి తోడ్పడాలి. తృతీయ ఫ్రంట్ నేటి ప్రాధాన్యత కాదు. తెలంగాణలో సీపీఎం బీఎల్‌ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్)ను బలోపేతం చేసుకునే దృష్టితో జనసేనతో చెలిమియత్నం చేయడం సరైనదే అవుతుంది.
ఏపీ విఠల్
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్ : 98480 69720
Comments
Please login to add a commentAdd a comment