మత సహనం మన సహజ గుణం
మనది, మతాల మధ్య నిరంతర యుద్ధాలు, అప్పుడప్పుడూ శాంతి విరామాలతో సాగిన చరిత్ర కాదు. నిజానికి అందుకు విరుద్ధంగానే మన చరిత్ర సాగింది. మత సహనం భారత ఉపఖండం స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం.. దాన్ని పాటించిందనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవరైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరిస్తాను.
‘‘షారుఖ్, సల్మాన్, అమీర్‌లతో కూడిన బాలీవుడ్ ఖాన్ల త్రయం విస్తృత జనాదరణను పొందడం... భారతీయులు స్వాభావికంగా లౌకిక వాదులేననీ, రాజకీయ ఉద్దేశాలతో లేదా వంచనతో పెడదోవ పట్టిస్తే తప్ప వారందుకు విరుద్ధంగా ప్రవర్తించరని సూచించడం లేదా?’’ audiomatic.in అనే వెబ్సైట్లో నేను వారం వారం నిర్వహించడం ప్రారంభించిన వీడియో ఆడియో పాడ్‌కాస్ట్‌లో ఓ మహిళ అడిగిన ప్రశ్న ఇది. అది నేను తరచుగా ఆలోచిస్తున్న విషయం కూడా. నిజాయితీగా చెబుతున్నా.. ఆ విషయంలో నేనెప్పుడూ ఇదమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నేను పాకిస్తాన్లో ఉండగా, ప్రత్యేకించి హిందువుల సాంగత్యం తక్కువగా ఉండే పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సైతం నాకు తరచూ ఇంచుమిం చుగా ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యేది. బాలీవుడ్ ప్రేమ కథలకు హిందూ-ముస్లిం కోణం ఉండేట్టయితే, తప్పనిసరిగా అది హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయే అవుతుందని పాక్ పత్రికా సంపాదకుడు, క్రికెట్ నిర్వాహకుడు, రాజకీయవేత్త నజామ్ సేథీ ఒకసారి వ్యాఖ్యానించారు. ఉదాహరణకు మణి రత్నం ‘బొంబాయి’. నాకు సరిగ్గానే గుర్తుండినట్టయితే, భారతీయులు అందుకు విరుద్ధమైనదాన్ని... అంటే ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమను ఆదరించరన్నట్టు సేథీ మాట్లాడినట్టున్నారు.
నిజమేనా? కాదంటాను. బాలీవుడ్ డెరైక్టర్లు, రచయి తలు కొందరు పూర్తిగా అలాంటి అలోచనతోనే స్క్రిప్టును సరిగ్గా అలాగే తయారుచేస్తారనడంలో సందేహం లేదు. కానీ వాస్తవాన్ని చూడాలి. ముగ్గురు ఖాన్లూ హిందువులను పెళ్లి చేసుకున్నవారు లేదా సహజీవన బంధంలో ఉన్నవారే. వారి స్థాయిలో విజయవంతం కాలేకపోయిన సైఫ్ అలీఖాన్‌ను కూడా కలిపితే నలుగురు ఖాన్లవుతారు. సైఫ్, కరీనా కపూ ర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిళ్లు, ప్రేమలతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. దీన్నే మనం వెండి తెరకు కూడా వర్తింపజేసి... హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమ కథైతే ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమేమీ ఉండదని ఊహించవచ్చు.
దీనికి సంబంధించి రెండో పార్శ్వం కూడా ఉంది. అది బాలీవుడ్ సినిమాల ఇతివృత్తాలు, మన స్టార్ల వ్యవస్థ. భారీ చిత్రాలు సహా చాలా వరకు హిందీ సినిమాల్లో ప్రత్యేకించి కథా నాయకుడి పాత్ర స్వభావంలో ఏ మంత పస ఉండదు. మూసపోతలో చదునుగా, కేవలం ద్విముఖమైనదిగానే ఉం టుంది. సల్మాన్‌ఖాన్ ఏ పాత్రనైనా అలాగే పోషిస్తాడు. అదే, మనిషిగా సల్మాన్ నిజస్వభావమని ఊహిస్తుంటారు. ప్రేక్ష కులు ఆ మనిషికి ఆకర్షితులవుతుం టారే తప్ప ఆ పాత్రకు కాదని ఇది విదితం చేస్తుంది. దశాబ్దాల తరబడి మీడియా ఆ నటుడి స్వభావంలోని భిన్న కోణాలు, అంచులు, చీకటి ప్రాంతాల గురించి చెప్పినదంతా నిజమేనని ప్రేక్షకులు ఊహిస్తారు. అతడు ఎవరు, ఏమిటనేదానితో సహా ప్రేక్షకులు అతన్ని అలాగే అభి మానిస్తారు. వెండితెరపై ముస్లిం అబ్బాయిగా సల్మాన్ హిం దూ అమ్మాయిని ప్రేమించినా వారికి సమస్యేమీ కాదు. దిలీప్కుమార్లాంటి ముస్లిం నటులు హిందూ పేర్ల వల్ల తమకు ఆమోదనీయత లభిస్తుందని భావించిన రోజులనాటి గతం నుంచి బాలీవుడ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటోం ది. అది సమంజసమైనదేనా? గొప్ప ఖాన్ల త్ర యంతో మన అనుభవాన్ని బట్టి కాదనే మనకు అనిపిస్తుంది. ప్రపంచంలో ఒక భాగంగా ఉన్న మన ప్రాంతంలోని సమాజాలు కొన్ని దశాబ్దాల్లోనే అంత గొప్పగా మారిపోయిందేమీ లేదు. నేటి కంటే 1950ల నాటి బాలీవుడ్ ప్రేక్షకులు ఏమంత భిన్నంగా ఉండేవారేమీ కారు.
బాలీవుడ్ కేవలం ఒక సూచికేనని, దానికున్న విస్తృత వ్యాప్తి దృష్ట్యా ఉత్తమ సూచిక కూడానని నేనూ అంగీకరి స్తాను. అయితే మన దేశంలో రెండు మతాల మధ్య సంబం ధాల చరిత్ర అతుకులమయమని కూడా ఆమోదిస్తాను. అప్పుడప్పుడు విరుచుకుపడేవే అయినా తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మాట వాస్తవం. దశాబ్దాల తర్వాత అవి తగ్గినట్టనిపిస్తుంది. ఒకే పరిసరాల్లోని భిన్న మతాల ప్రజలు భిన్న ఆవాస ప్రాంతాలవారుగా విడిపోయి ఉండటం కనబ డుతుంది. ప్రత్యేకించి అహ్మదాబాద్, బరోడావంటి సనా తనవాద నగరాల్లో ఇది ఎక్కువ. అలాంటి చోట్ల ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల చట్టం లాంటి చట్టాల ద్వారా ఈ విభజనను ప్రోత్సహించింది.
దేశంలోని అన్ని మతాలవారిలోనూ పరమత సహనం ఉన్నమాట వాస్తవం. లౌకికత అనేది సంక్షిష్టమైన పదం. ఈ సందర్భంగా దాన్ని వాడవచ్చా, లేదా? నాకు తెలీదు. మత సహనం భారత ఉపఖండపు స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం దాన్ని పాటించిం దనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవ రైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరి స్తాను. ఎవరైనా మనల్ని మోసగించి, రెచ్చగొడితే తప్ప స్వాభావికంగానే భారతీయులం పరమత సహనం గలవా రం/ లౌకికవాదులం. అది నాకు చాలా హాయి గొలిపే యోచన.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత - ఆకార్ పటేల్ ఈమెయిల్: aakar.patel@icloud.com)