సయ్యద్ జఫరుల్ హసన్
సయ్యద్ జఫరుల్ హసన్ పాకిస్తానీ ముస్లిం పండితులు. అలీఘర్‌లో ఎం.ఎ., ఎల్.ఎల్.బి. చదువుకున్నారు. జర్మనీలోని ఎర్లాంజెన్, హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయాలు; యు.కె.లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌లను పొందారు. డాక్టర్ జఫరుల్ హసన్ తత్వశాస్త్రంలో ఆక్స్‌ఫర్డ్ నుండి పిహెచ్.డి. పొందిన భారత ఉపఖండంలోని మొదటి ముస్లిం పండితులు. అతని డాక్టోరల్ థీసిస్ అంశం.. రియలిజం ఒక క్లాసిక్ వంటిదని ప్రముఖ తత్వవేత్తలు, విద్యావేత్తలు ప్రశంసించారు. వారిలో జఫరుల్ గురువు ప్రొఫెసర్ జాన్ అలెగ్జాండర్ స్మిత్ (1863–1930), అల్లామా మొహమ్మద్ ఇక్బాల్ కూడా ఉన్నారు.
జఫరుల్ 1911లో భారతదేశంలోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో బోధకునిగా చేరారు. 1913లో పెషావర్‌లోని ఇస్లామియా కళాశాలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1924 నుండి 1945 వరకు అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ లో ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అక్కడ ఫిలాసఫీ విభాగానికి ఛైర్మన్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ డీన్‌గా కూడా పనిచేశారు. 1939లో డాక్టర్ అఫ్జల్ హుస్సేన్ ఖాద్రీతో కలిసి ‘అలీఘర్ స్కీమ్’ని ముందుకు తెచ్చారు.
అందులో మూడు స్వతంత్ర రాష్ట్రాలను ప్రతిపాదిస్తూ ఒక పథకాన్ని (‘భారత ముస్లింల సమస్య‘) ప్రతిపాదించారు. 1945 నుండి ఉపఖండం విడిపోయే వరకు, డాక్టర్ హసన్ అలీఘర్‌లో ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 1947 ఆగస్టులో పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వలసవెళ్లి ఒక పుస్తకాన్ని రాసే పనిలో నిమగ్నం అయ్యారు అయితే 1949లో ఆయన మరణించిన కారణంగా ఒక సంపుటం (‘ఫిలాసఫీ – ఎ క్రిటిక్‘) మాత్రమే బయటికి వచ్చింది. 1988 లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్ ఆ పుస్తకాన్ని ప్రచురించింది. జఫరుల్ 1949 జూన్ 19న కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment