
స్వాతంత్య్రం వచ్చిన వెనువెంటనే బ్రిటిష్ కాలం నాటి విద్యుత్ చట్టాలను రద్దు చేసి, 1948 లో కొత్త స్వదేశీ చట్టాన్ని అమల్లోకి తేవడంతో జాతీయ ప్రాధికార సంస్థ, విద్యుత్ బోర్డులు ఏర్పడ్డాయి. దాంతో మన విద్యుత్ వ్యవస్థ విస్తృతం అయింది. అనంతరం 1998 విద్యుత్ నియంత్రణ చట్టంతో విద్యుత్ చార్జీలు, విద్యుత్ బోర్డుల కార్యకలాపాల నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో మండళ్లు ఏర్పాటయ్యాయి.
విద్యుత్ సరఫరా, పంపిణీల రంగంలోకి ప్రైవేటు సంస్థలకూ ప్రభుత్వం స్థానం కల్పించింది. ఈ మార్పులన్నీ కూడా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికే అయినప్పటికీ.. ఈ లక్ష్యం పూర్తిగా నెరవేరిందని చెప్పలేం. వచ్చే పాతికేళ్లలో శతవర్ష స్వాతంత్య్ర వేడుకల నాటికి విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం ద్వారా దేశ అభివృద్ధి ప్రమాణాలను పెంచే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం 1300 మెగావాట్లు కాగా, తలసరి వార్షిక వినియోగం 17 యూనిట్లుగా ఉండేది! నేడు ఉత్పత్తి సామర్థ్యం నాలుగు లక్షల మెగావాట్లకు పెరిగి, తలసరి వినియోగం 1000కి పైగా యూనిట్లకు చేరుకుంది. భవిష్యత్తులోని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉత్త్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, అదే సమయంలో వినియోగాన్ని తగ్గిస్తూ విద్యుత్ కొరతను అధిగమించడం అన్నది కూడా స్వతంత్ర భారతి ఏర్పచుకున్న లక్ష్యాలలో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment