రాజాజీ
తొలి భారత రత్నలు రాజాజీ (సి.రాజగోపాలాచారి) సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్‌లు కాగా.. తాజా (2019) భారత రత్నలు.. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ .
భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్న. తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ 1954లో ఈ అవార్డును నెలకొల్పారు. కళ, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, తదితర రంగాలలోని వ్యక్తుల అత్యుత్తమ కృషికి భారత రత్నను ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై తొమ్మిది మంది ఈ పురస్కారాన్ని అందుకు న్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు. జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం లభిస్తుంది.
పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. 1954లో ఆ ఏడాది జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది భారతరత్న కాగా రెండవది ఆ తర్వాత స్థానంలోని మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారతరత్నను కేవలం భారతీయులకే ప్రదానం
చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు ఆయన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో సచినే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు.
సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో ఆయనే అతి పెద్ద వయస్కులు. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు అయింది.
మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను ఆయన రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరణ అయ్యాయి. 1992లో ఈ పురస్కారాల ‘రాజ్యాంగ సాధికారత‘ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో అప్పుడు ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది.
Comments
Please login to add a commentAdd a comment