Rajaji
-
హ్యాట్సాఫ్ బ్రదర్.. మెట్రో సిబ్బందిని కడిగిపారేశాడు
Viral Video: మన దేశంలో రైతులకు దక్కే గౌరవం ఇదేనా? అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ పెద్దాయన వేసుకున్న దుస్తులు గలీజుగా ఉన్నాయంటూ.. మెట్రో రైలు ఎక్కనివ్వకుండా అడ్డుకోబోయారు సిబ్బంది. అయితే ఓ వ్యక్తి నిలదీతతో చివరకు అనుమతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సిలికాన్ వ్యాలీ సిటీగా చెప్పుకునే బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఓ రైతు తన బ్యాగ్‌తో రాజాజీనగర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎక్కడానికి వచ్చాడు. టికెట్ తీసుకున్నాక సెక్యూరిటీ చెకింగ్ దగ్గరకు రాగానే రైతును మెట్రో సిబ్బంది నిలిపేశారు. దుస్తులు బాగోలేవంటూ మెట్రో ఎక్కడానికి ఆయన్ని అనుమతించలేదు. అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేశాడు. ఈలోపు వెనకాలే వస్తున్న మరో ప్రయాణికుడు.. మెట్రో సిబ్బంది తీరుపై పశ్నించాడు. అతని వాగ్వాదం తర్వాతే.. చివరికి రైతు మెట్రో ఎక్కడానికి అనుమతించారు. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి పేరు కార్తీక్‌గా తెలుస్తోంది. చివరకు నెట్టింట దీనిపై చర్చ జరగడంతో.. సదరు సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించి మరీ దర్యాప్తునకు ఆదేశించినట్లు బెంగళూరు మెట్రో ప్రకటించింది. #Bengaluru metro refuses to allow farmer inside train cuz he wasn't dressed "Appropriately" despite purchasing a ticket Passengers had to step up, argue on behalf of him with security officers & ensured passage for the farmer BMRCL suspends the security supervisor, regretting… pic.twitter.com/FYWEF0NClH — Nabila Jamal (@nabilajamal_) February 26, 2024 -
మహోజ్వల భారతి ఉద్యమ రత్నం రాజాజీ
రాజాజీగా ప్రఖ్యాతి గాంచిన చక్రవర్తి రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశ తొలి, చివరి గవర్నర్ జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు ఇది. ఆయన 1948 జూన్ 21న ఆ పదవిని చేపట్టి, 1950 జనవరి 26 వరకు కొనసాగారు. అక్కడితో గవర్నర్ జనరల్ పదవి రద్దయి, రాష్ట్రపతి హోదా మొదలైంది. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కొన్ని దశాబ్దాల పాటు రాజాజీ భారత దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించారు. ప్రాథమికంగా ఆయన కాంగ్రెసువాది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ సోషలిస్టు విధానాల పట్ల వ్యతిరేకతతో స్వంతంగా పార్టీ కూడా నెలకొల్పారు. మద్రాసుకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజాజీ రాజకీయ ప్రస్థానం సేలం పట్టణం నుంచి ప్రారంభమైంది. 22 ఏళ్ల వయసులో జాతీయవాది బాలగంగాధర తిలక్ పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పుడే సేలం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. లాయర్ కూడా అయిన రాజాజీ 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్య్ర పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించారు. జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై, రాజాజీ మంచి స్నేహితులు. అనిబిసెంట్ కూడా రాజాజీని అభిమానించేవారు. మహాత్మాగాంధీ స్వాతంత్య్రోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ ఆయన్ని అనుసరించారు. ఉద్యమం కోసం న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశారు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు. 1930 లో తమిళనాడు కాంగ్రెస్‌లో నాయకుడయ్యారు. అదే సమయంలో మహాత్మాగాంధీ దండియాత్ర నిర్వహించినపుడు రాజాజీ నాగపట్టణం దగ్గర్లోని వేదారణ్యం అనే ప్రాంతంలో ఉప్పు పన్నును వ్యతిరేకించి జైలుకి వెళ్లారు. తరువాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన తొలివ్యక్తులలో రాజాజీ ఒకరు. సేలం జిల్లా, తోరపల్లి గ్రామంలో 1878 డిసెంబరు 10 న జన్మించిన రాజాజీ, 1972 డిసెంబర్ 25న తన 94 ఏళ్ల వయసులో కన్నుమూశారు. (చదవండి: చైతన్య భారతి నెహ్రూ యోగా గురువు) -
స్వతంత్ర భారతి: భారత రత్నాలు
తొలి భారత రత్నలు రాజాజీ (సి.రాజగోపాలాచారి) సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్‌లు కాగా.. తాజా (2019) భారత రత్నలు.. ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్ . భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం.. భారతరత్న. తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ 1954లో ఈ అవార్డును నెలకొల్పారు. కళ, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, తదితర రంగాలలోని వ్యక్తుల అత్యుత్తమ కృషికి భారత రత్నను ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై తొమ్మిది మంది ఈ పురస్కారాన్ని అందుకు న్నారు. వారిలో ఇద్దరు విదేశీయులు. జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం లభిస్తుంది. పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు. 1954లో ఆ ఏడాది జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది భారతరత్న కాగా రెండవది ఆ తర్వాత స్థానంలోని మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. 1955 జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు. భారతరత్నను కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరిసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రదానం చేశారు. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు ఆయన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో సచినే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు ఆయన 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో ఆయనే అతి పెద్ద వయస్కులు. చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు అయింది. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌర పురస్కారాలను ఆయన రద్దు చేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరణ అయ్యాయి. 1992లో ఈ పురస్కారాల ‘రాజ్యాంగ సాధికారత‘ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో అప్పుడు ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది. -
అభివృద్ధి పథకాలకు ఆద్యుడు సంజీవయ్య
భారతదేశంలో కెల్లా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వారిలోను, అఖిల భారత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నలంకరించిన వారిలోనూ అతిపిన్న వయస్కుడు దామోదరం సంజీవయ్య. ఒక హరిజనుడు రాష్ర్టంలో ముఖ్యమంత్రి కావడం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం దేశ చరిత్రలో సంజీవయ్యతోనే మొదలైంది. ఆయన అనేక కష్టాలకోర్చి పట్టుదలతో చదువుకుని ఎదిగివచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రాజాజీ మంత్రి వర్గంలో చేరే నాటికి ఆయన వయసు 31 ఏళ్ళు మాత్రమే. 1950లోనే 29వ ఏట పార్లమెంటుకు ఎంపికై ఏడాది పాటు సభ్యుడిగా వ్యవహరించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో మద్రాసు శాసన సభకు కర్నూలు రిజర్వుడ్ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది రాజగోపాలాచారి ప్రభుత్వంలో సహకారశాఖకు మంత్రిత్వం వహించారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రి వర్గంలో కూడా సాంఘిక సంక్షేమ, ప్రజారోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1955 మధ్యంతర ఎన్నికలలో ఎమ్మిగ నూరు నుండి ఎన్నికై బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలో రవాణా, సహకార శాఖల మంత్రిగా, రాష్ట్రావతరణ (1956) జరిగిన తదుపరి నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో స్థానిక సంస్థలు, కార్మికశాఖల మంత్రిగా పనిచేశారు. 1960లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం దేశంలోనే ఒక సంచలనం. 1960 జనవరి 11వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం (1960-1962) రెండేళ్ళ స్వల్పకాలమే అయినా సామాజికాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టారు. ఆనాడు ఆయన చేపట్టిన పలు విధానాలు ముందు తరాలకు మార్గదర్శకాలైనాయి. పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వీరే. అవినీతి నిరోధక శాఖల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి వీరే ఆద్యులు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేసి ఆరులక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టారు. చట్టాలను సమన్వయ పర్చడానికి ‘లా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు లోనే విధిగా ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమాభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమల విభాగాలు, గనుల అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్లను స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు వేరుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాదు కార్పొరేషన్లను ఏకం చేసి ‘గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) కార్పొరేషన్’ గా రూపొందించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో కోడుమూరు నుండి ఎంపికైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయలేదు. సంజీవరెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. తర్వాత నెహ్రూ జాతీయ కాంగ్రెస్ పదవిని సంజీవయ్యకు కట్టబెట్టారు. సంజీవయ్యను రెండేళ్ళు దాటి ముఖ్య మంత్రిగా అంగీకరించలేకపోయిన సమాజం మనది. ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయి ఆపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శ్రీమతి ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల మంత్రి వర్గాల్లో కూడా పనిచేశారు. దామోదరం సంజీవయ్య స్వయంగా కవి, సాహితీప్రియుడు, నటుడు. కాలేజి రోజుల్లోనే ‘కృష్ణలీలలు’లో పద్యాలు రాశారు. భీష్మజననం, శశిరేఖాపరిణయం, గయోపాఖ్యానం వంటి నాట కాలు కొన్నింటికి పద్యాలు వాశారు. సంజీవయ్య కందం ఎంత తేలికగా చెప్పగలరో, ఆటవెలదిని అంత తియ్యగా అల్లగలరు. ప్రసిద్ధి నటులచే ప్రదర్శనలిప్పించారు. తానుగా స్వయంగా ‘‘షాజహాన్ నాటకంలో’’ షాజహాన్ పాత్రను అద్భుతంగా పోషించినట్లు వినికిడి. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధ్యక్షతలోనే అఖిలభారత తెలుగు రచయితల మహాసభ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగినది. ఆనాటి భారత ఉప రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ మహాసభలను ప్రారంభించారు. అప్పటి కేరళ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు, కేంద్రమంత్రి బెజవాడ గోపాలరెడ్డి వంటి వారు ఈ మహాసభల్లో పాల్గొని సంజీవయ్య కృషిని అభినందించారు. ఆయన స్వయంగా వేదాలు, భారత, భాగవత, రామాయణాది గ్రంథాలను అధ్యయనం చేసి ఉండటం ఆ రోజుల్లో అంత సామాన్య విషయంకాదు. నేటి భారత రాజకీయ పరిస్థితుల్లో షెడ్యూల్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి జీవన పరిస్థితులు మెరుగు పడాలంటే, ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులు కనీసం శతాబ్దం పాటైనాఈ వర్గాలకు రిజర్వేషన్ చేయాలి. యుగయుగాలు బాధలకు, అవమానాలకు గురైన ఈ వర్గాలకు ఆపాటి రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీతో ముందుకు వస్తేనే అసలుసిసలైన సామాజిక న్యాయం జరుగుతుంది. రాజాకీయ పార్టీలు మాటలుగాక, చేతల ద్వారా తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. దేశంలో మార్పును నిజంగా కోరుకునే వారు, బడుగుల ఆత్మగౌరవం కాపాడుతామనే వారు, బడుగులకు రాజ్యాధికారం కట్టబెడతామనేవారు తమ బడుగుల మెజారిటీ, వారిదే అధారిటీ అనేవారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవుల రిజర్వేషన్‌కు అంగీకరిస్తేనే వారి అంకితభావానికి అర్దం, పరమార్ధం ఉంటాయి. దళితులు తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకునే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను రిజర్వేషన్ కిందకు తీసుకురావాలి. దళితులకు, తాము దళితులమనే భావన నుంచి దూరం చేయాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులు వారిని వేధిస్తున్నాయి. కుల వ్యవస్థను తొలగించడానికి ఆరున్నర దశాబ్దాల్లో జరిగినది శూన్యం. చట్టపరంగా సమానహక్కులు వున్న ఈ చట్టాలు అమలుకు నోచుకోనులేదు. సామాజిక న్యాయానికి కట్టుబడివు న్నామని గొప్పలు చెప్పుకునే పాత్రలు ఈ దశగా ఆలోచించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఉద్యమాలకు తావులేని విధంగా రాజకీయ పార్టీలు స్పందించాలి. దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో (కర్నూలుకు 8 కి.మీ. దూరం) మాలదాసరులైన మునెయ్య, సుంకలమ్మ దంపతులకు కడపటి (5వ) సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు సంగీతం, కళాత్మక సాంప్రదాయ కుటుంబ నేపథ్యము కలిగియుండుట వలన ఆయన నావి జీవతంలో సాహితీ, కళల రంగాలపట్లా ఆసక్తి కలగటానికి ప్రేరణ కలిగిందాయనకు. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సమాజంలో తాను ఉన్నతస్థ్థితికి ఎదగాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని సంజీవయ్య నిరూపించారు. ప్రతి పదవిలోను ఆయన రాణించారు. ఎన్నో పదవులలో ఎంతో కాలంపాటు కొనసాగినప్పటికీ ఆయన నిర్దనుడే. ఏదో ఒక ప్రాంతమునకు ఒక వర్గమునకు చెందిన వ్యక్తిగాదు. రాజకీయ రంగంలో అతి చిన్నవయసులో అత్యున్నత శిఖరాలను అందుకుని ప్రజాసేవాయే పరమావదిగా, నిస్వార్ధపరునిగా స్వలాభపేక్ష లేకుండా ప్రజల మనిషిగా ఎదిగిన దామోదరం సంజీవయ్య లాంటి జనాదరణ కలిగిన దళిత నేత నేడు సీమాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా కావాలి. (నేడు దామోదరం సంజీవయ్య 95వ జయంతి) వ్యాసకర్త విశ్రాంత ఉద్యోగి, భారత ప్రభుత్వ అణుఇంధన సంస్థ మొబైల్ : 80081 89979 - వి. సర్వేశ్వరరావు