స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం–1949 వచ్చింది. ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, డిపాజిటర్‌లు అడిగిన వెంటనే నగదు చెల్లింపులు చేయడం బ్యాంకుల బాధ్యత అని ఆ చట్టం నిర్దేశించింది. ఇప్పటి బ్యాంకులు అంతకు మించే చేస్తున్నాయి. ఒక్కో ఏటీఎం ఒక్కో బ్యాంకులా మారిపోయింది. స్వాతంత్య్రానంతరం.. ముఖ్యంగా ఈ ఇరవై, ఇరవై ఐదేళ్లలో భారతీయ బ్యాంకింగ్ రంగం సాధించిన ప్రగతి, పురోగతి ఇది. కస్టమర్ల సౌకర్యమే బ్యాంకుల ధర్మం అయింది. ఇదంతా వ్యక్తిగత స్థాయిలో మౌలికంగా.
మరి దేశ స్థాయిలో? అంటే.. దేశంలోని మిగతారంగాలను ప్రభావితం చేసే స్థాయిలో? బ్యాంకింగ్ రంగంలోని అనేక మార్పులు, పరిణామాలు ఆర్థిక రంగాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తూ వస్తున్నాయి. 1969లో నాడు దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. తర్వాత పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్‌సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణలు బ్యాంకింగ్ రంగ స్వరూపాన్నే మార్చేశాయి.
ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీ కరణం అనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు అపరిమితమైన ప్రాధాన్యం చేకూర్చాయి. ఇక వచ్చే ఇరవై ఐదేళ్లలో లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని అంశాలు నూరేళ్ల భారతావని ప్రతిష్టను మరింతగా పెంచేవే. కొత్త పరిశ్రమలు, వ్యాపారాలను ప్రారంభించే వ్యవస్థాపకులను బ్యాంకులు ప్రోత్సహించి, ఉపాథి కల్పనకు ఊతం ఇవ్వబోతు న్నాయి. ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రాధికార సంస్థను.. ప్రభాత్ కుమార్ కమిటీ సూచన మేరకు.. ప్రభుత్వం నెలకొల్పబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment