ఇందిరాగాంధీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి. జనాకర్షకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, పాశ్చాత్య వ్యతిరేక విధానాల సమ్మేళనంతో పరిపాలన కొనసాగించారు. మధ్య తరగతి జీవితాలను సుస్థిరం చేయడానికి ఆమె ప్రవేశపెట్టిన చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పన్ను మినహాయింపులు ఇప్పటికీ కొనసాగడమే కాదు, రాజకీయార్థిక కోణంలో వాటికున్న ఆకర్షణ ఎంతగానో పెరిగింది. బంగ్లాదేశ్ ఏర్పాటు ఆమె నాయకత్వ సామర్థ్యానికి ఒక మచ్చుతునకగా మిగిలిపోతుంది. ఆ ప్రాంతంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆమె యుద్ధం అనే సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే, అమెరికా నాయకత్వానికి ఎదురొడ్డి నిలవడం, అంతరిక్ష పరిశోధన, శాస్త్ర పరిశోధన, సైన్యం వంటి రంగాలకు ఆమె ఇచ్చిన ఇతోధిక ప్రాధాన్యం దేశానికి బలమైన దిశా నిర్దేశం చేసింది.
చాలామంది చెప్పినట్లు, ఇందిరా గాంధీ వ్యక్తిత్వంలో, విశ్వాసాలలో వైరుధ్యాలు బాగా కనిపిస్తాయి. ఆమెలోని వైరుధ్యాలు చాలా వరకు అత్యవసర పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చాయి. స్వతంత్ర భారత దేశంలో ఏకైక అత్యవసర పరిస్థితిని విధించి, ప్రజాస్వామ్యయుతమైన హక్కులను కాలరాసిన ప్రధానిగా ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతారు.
అందుకు ఆమె పట్ల వ్యక్తమైన నిరసన కూడా ఎప్పటికీ భరతజాతికి గుర్తుండిపోతుంది. అయితే అత్యవసర పరిస్థితిని తొలగించి, ఎన్నికల బరిలోకి దిగాలని 1977లో ఆమె స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం, ‘ఇంతటితో ప్రజాస్వామ్యం సమాధి అయిపోయినట్లే’నని భావించిన నిపుణుల అంచనాలను తలకిందులు చేసింది. ఆమె లోని దేశభక్తిని, దేశం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో సిక్కులను చేర్చుకోవడం మంచిది కాదని ఎందరో సూచించినా ఆమె దానిని లెక్క చేయలేదు. చివరికి ఆ కారణం వల్లే ఆమె మరణించారు. అలా ఆమె మరణం కూడా ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా వివరించింది. ఆమె సంక్లిష్ట సాహసిక నాయకురాలని చాటి చెప్పింది.
– దీపేశ్ చక్రవర్తి , చికాగో యూనివర్సిటీలో చరిత్ర అధ్యయనాల ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment