న్యూఢిల్లీ: ఉత్తర జర్మనీలోని కీల్‌లో 1943 ఫిబ్రవరి 8 న బోస్ యు–బోట్ ఎక్కారు. ప్రయాణం మధ్యలో ఆయన ఒక జర్మనీ నౌక నుంచి ఒక జపనీస్ జలాంతర్గామిలోకి మారడానికి సముద్ర మధ్యంలో ఒక రబ్బరు తెప్ప మీద నుంచి నడిచి వెళ్లాల్సి వచ్చింది. 90 రోజులు ప్రయాణించి సుమత్రా దీవిలోని సబాంగ్‌కి చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్‌కి విమానంలో వెళ్లారు. అక్కడే ఆయన 1943 జూలై 4–5 తేదీల మధ్య ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) నాయకత్వాన్ని చేపట్టారు. అంతకు క్రితం 1941 జనవరి 16–17 తేదీల మధ్య, కలకత్తాలోని తన ఇంటి నుంచి బోస్ రహస్యంగా నిష్క్రమించారు.
ముహమ్మద్ జియావుద్దీన్ పేరుతో ఉత్తర భారత ముస్లిం బీమా ఏజెంటుగా ఆయన అవతారం ఎత్తారు. జర్మనీ తయారీ అయిన వాండరర్ కారులో బంధువు శిశిర ఆయనను గోమో రైల్వే జంక్షన్‌కి తీసుకెళ్లారు. ఢిల్లీ–కల్కా మెయిల్ ఎక్కిన బోస్, మధ్యలోనే ఫ్రాంటియర్ మెయిల్‌కి మారి పెషావర్‌కి తన ప్రయాణాన్ని మళ్లించారు. మూగ, చెవిటి పఠాన్‌గా నటిస్తూ, వాయవ్య సరిహద్దులో గిరిజన ప్రాంతాలను కాలి నడకన దాటారు. భారతీయ సరిహద్దులను జనవరి 26న దాటి, 1941 జనవరి 31న కాబూల్ చేరుకున్నారు. ఇదంతా హిట్లర్‌ను కలవడం కోసం.
ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా, బ్రిటిష్ సైన్యంలోని సామాన్య భారతీయ సైనికుల విధేయతను బ్రిటిష్ చక్రవర్తి నుంచి మళ్లించడానికి బోస్‌కి మరొక రాజ్యాధినేత అవసరం అయ్యారు. అయితే హిట్లర్ సహకారం అందక పోవడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు 1943, 1945ల మధ్య ఎర్రకోటలో కొందరు ఐ.ఎన్.ఎ. అధికారుల మీద జరిగిన విచారణ బోస్ పేరును, ఐ.ఎన్.ఎ. పేరునూ ఇంటింటికీ తీసుకెళ్లింది. ‘‘దేశమే జాగృతమయింది. సైన్యంలో సైతం కొత్త రాజకీయ స్పృహ కలిగించింది’’ అని మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘దేశ భక్తుల్లో యువరాజు’’ అని నేతాజీని గాంధీజీ కీర్తించారు. తానే ప్రారంభించిన ఆజాద్ హింద్ ప్రభుత్వానికి చెందిన సేనగా బోస్ ఐ.ఎన్.ఎ.ని తీర్చిదిద్దారు. ఐ.ఎన్.ఎ. మహిళా విభాగానికి ఝాన్నీ రాణి రెజిమెంట్ అని ఆయన పేరు పెట్టారు.
– సుగతా బోస్, హార్వర్డ్ యూనివర్సిటీలో చరిత్ర ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment