స్వతంత్ర భారతి 1950/2022
భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా, 1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశం స్వతంత్రమైన సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం ఒక మహోత్తేజకరమైన అభిభాషణ కాగా, మరో మూడేళ్లకు 1950 జనవరి 26 వ తేదీన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక రాజ్యంగా ఆవిష్కరణ జరిగిన సందర్భంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రసంగం ఇంతకింతగా జాతి అంతటినీ ఊర్రూతలూగించినదే.
అచంచల విశ్వాసంతో, సత్యంతో, అహింసామార్గంలో ఈ సర్వసత్తాక, స్వతంత్ర రాజ్య నిర్వహణను మనం ప్రారంభిద్దాం.. అంటూ సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామిక రాజ్యంగా భారతదేశ రాజ్యాంగంపై అధికార ముద్ర వేయడానికి ముందు ఆయన చేసిన అభిభాషణ జాతికి స్ఫూర్తిదాయకమైనది. ఆనాటి మహోజ్వల ఘడియలు ఏటా జనవరి 26 వ తేదీన పథనిర్దేశకమైన క్షణాలుగా ఈనాటికీ రిపబ్లిక్ పరేడ్‌గా కళ్లకు కడుతూనే ఉన్నాయి. నూతనమైన అశోక చిహ్నాన్ని ధరించిన అశ్విక రథాన్ని అధిరోహించి, రాజేంద్ర ప్రసాద్ ఐదు మైళ్ల దూరం ప్రయాణించి నేషనల్ స్టేడియం చేరుకున్నారు.
చూడముచ్చటైన కవాతుతో సైనికులిచ్చిన వందనాన్ని స్వీకరించి, మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నాటికీ నేటికీ వేదిక మారి ఉండవచ్చు. కానీ జనవరి 26న జరిగే కవాతు ఈ రోజుకూ జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే సందర్భం. జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకే సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment