
ఫొటో : నెహ్రూ ఢిల్లీ ఎయిమ్స్ సందర్శన (1959)
గత 75 ఏళ్లలో ఆరోగ్య రంగంలో భారతదేశం అనేక విజయాలు సాధించింది. వచ్చే 25 ఏళ్లలో మరింతగా ప్రజలకు ఆరోగ్య భద్రతను ఇచ్చేందుకు లక్ష్యాలను ఏర్పరచుకుంది. ‘హెల్త్ సర్వే–డెవలప్‌మెంట్’ అనే అంశంపై సర్ జోసెఫ్ విలియం భోర్ కమిటీ 1946లో సమర్పించిన నివేదిక ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న వైద్య కేంద్రాల సంఖ్య చిన్నవి, పెద్దవి కలిపి దాదాపుగా 10 వేలు! నాటి జనాభా 34 కోట్లు. అంటే.. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లకు వైద్యం, చికిత్స అన్నట్లు ఉండేది. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం అలక్ష్యానికి గురయ్యేది. అందుకే భోర్.. ప్రజలందరికీ వైద్యం అందుబాటులోకి రావడం అనేదాన్ని ప్రాధాన్యతా లక్ష్యంగా నిర్దేశించారు.
స్వాతంత్య్రం వచ్చాక ఆరోగ్య రంగంలో అభివృద్ధికి అవసరమైన సూచనలు కోసం భారత ప్రభుత్వం మొదలియార్ కమిటీని నియమించింది. 1983లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. ఇక ఈ రంగంలో దేశం సాధించిన విజయాల విషయానికి వస్తే.. ప్లేగు, మశూచి వ్యాధులను సమూలంగా నిర్మూలించగలిగాం. కలరా మరణాలు తగ్గాయి. మలేరియా దాదాపుగా అదుపులోనికైతే వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తొలి మూడు దశాబ్దాలలోనే సగటు ఆయఃప్రమాణం 33 నుంచి 53 ఏళ్లకు పెరిగింది. మరణాల రేటు 28 నుంచి 13 శాతానికి తగ్గింది. 2002లో విడుదలైన రెండో జాతీయ విధానం పోలియో, బోదకాలు, కుష్టు వంటి వ్యాధుల పూర్తి నిర్మూలనకు; క్షయ, మలేరియా, అతిసార మరణాల తగ్గింపునకు సూచనలు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వావలంబన తర్వాత ఇతర దేశాలకు ఆలంబనగా ఉండేందుకు కూడా భారత్ తన ఆరోగ్య ప్రణాళికలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment