సంకల్ప బలుడు
అంబేడ్కర్ నినాదం ఒక్కటే.. చదవండి, సంఘటితమవండి, ఉద్యమించండి. భారతీయుల్ని విద్యావంతుల్ని చేయడానికి ఆయన కళాశాలల్లో పాఠాలు బోధించారు. ఆ తర్వాత ముంబైలో, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలలో ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. వారిని సంఘటితం చెయ్యడానికి ఆయన ఒక రచయితగా, ప్రచురణకర్తగా, శ్రామిక నాయకుడిగా మారారు. స్వయంగా రాజకీయ పార్టీలు స్థాపించారు. ఇక ఉద్యమాన్ని నడిపించడానికి తన సమాకాలికులైన ఇతర నేతలతో పోరాడారు. 1930–32 మధ్యకాలంలో ఆయన లండన్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో ‘అస్పృశ్య జనావళి’కి ప్రాతినిధ్యం వహించారు. తద్వారా ఆయన 1932లో హిందువుల నుంచి వేరుగా నిమ్నవర్గాలకు ప్రత్యేక ఓట హక్కు కల్పించడానికి హామీ సంపాదించారు.
నిమ్న కులస్థులకు ప్రత్యేక రాజకీయ హక్కులు ఉండాలని, సామాజిక సంస్కరణలు చేపట్టాలని కోరారు. అందరికీ సమాన హక్కులు ఉండాలని సాగించిన పోరాటం వల్ల ఆయనకు విభిన్న మత విశ్వాసాలతో పరిచయం ఏర్పడింది. బుద్ధుడి బోధనలకు ప్రభావితుడైన అంబేడ్కర్ వైయక్తిక సాధన, సామాజిక సేవలతో సంఘ సంస్కరణలు తేవడానికి బౌద్ధం ఒక గొప్ప సాధనం అని భావించారు. 1956లో నాగపూర్‌లో బౌద్ధ మతాన్ని స్వీకరించడం ద్వారా ఆయన తన కులస్థులకు మార్గదర్శిగా నిలిచారు. సామాజిక మార్పును సాధించడం ఎలాగో తెలుసుకోడానికి ఆయన జీవితమే ఒక పాఠశాల. ఆయన జీవితం నుంచి, సంకల్పం నుంచి ప్రపంచ సమాజం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ భారతదేశంలో దళిత నిమ్నకులం నుంచి పైకి ఎదిగారు.
భారతదేశంలో, పశ్చిమ దేశాలలో విద్యాభ్యాసం చేసి జాతీయ నాయకుడి స్థాయికి చేరుకున్నారు. సమానత్వం, సామాజిక న్యాయ సాధన కోసం ఆలుపెరుగని పోరాటం సాగించారు. స్వతంత్ర భారతదేశంలో అంబేడ్కర్ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన భారత జాతి రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశాన్ని లౌకికవాద దేశంగా చేయడమే కాక, జాతీయ పతాకంలో ఆశోక ధర్మ చక్రం, మూడు సింహాల సూచనా ఆయదే.
– డేవిడ్ బ్లండెల్, తైవాన్ నేషనల్ షెంగ్‌చీ వర్సిటీలో కోర్స్ ఇన్‌స్ట్రక్టర్
Comments
Please login to add a commentAdd a comment