వ్యక్తులు ::: ఘటనలు ::: సందర్భాలు ::: స్థలాలు :: సమయాలు (ప్రీ–ప్రీడమ్, పోస్ట్ ఫ్రీడమ్)
తెలంగాణ నేడు (జూన్ 2) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దశాబ్దాలుగా వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది. 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆ తీర్మానాన్ని ఆమోదించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు)ను ప్రవేశపెట్టింది. 2014 మార్చి 1న బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 1956 నుంచి 2014 వరకు జరిగిన పోరాట ఫలంగా ఈ అవతరణను చెప్పుకోవాలి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొన్నాళ్లకే మళ్లీ వేర్పాటు ఉద్యమాలు తలెత్తాయి. 2001 ఏప్రిల్ 27న కె.చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2009 లో కె.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింపచేయడానికి కేంద్రప్రభుత్వం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment