Mulk Raj Anand: చైతన్య భారతి.. దేశమే రచన.. ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌ | Azadi Ka Amrit Mahotsav Famous Untouchable Novel Author Mulk Raj Anand | Sakshi
Sakshi News home page

Untouchable Novel: చైతన్య భారతి.. దేశమే రచన.. ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌

Published Wed, Jul 13 2022 1:59 PM | Last Updated on Wed, Jul 13 2022 2:19 PM

Azadi Ka Amrit Mahotsav Famous Untouchable Novel Author Mulk Raj Anand - Sakshi

తొమ్మిదేళ్ల వయసు కలిగిన తన చుట్టాలబ్బాయి ఎందుకు మరణించాడని దేవుణ్ని అడుగుతూ తన 11 ఏళ్ల వయసులో రాసిన లేఖ ఆయన మొట్టమొదటి రచన. సుప్రసిద్ధ నవలా రచయిత చార్ల్స్‌ డికెన్స్‌ను గుర్తుకు తెస్తున్నావంటూ ప్రశంసలు పొందిన భారతీయ ఆంగ్ల నవలా రచయిత  కూడా ఆయనే. ఆయనే ముల్క్‌రాజ్‌ ఆనంద్‌. వార్ధాలో మహాత్మాగాంధీ ఆశ్రమంలో కూర్చొని తాను ప్రారంభించిన నవల ‘అన్‌టచబుల్‌’ ఆఖరి పుటలలో ఆనంద్‌.. భారతీయుల తత్వాన్ని ఒక కవి పాత్ర ద్వారా ఇలా రాశారు:

మాకు జీవితం తెలుసు. దాని రహస్య ప్రవాహం తెలుసు. దాని లయలకు అనుగుణంగా మేం నర్తించాం. దాన్ని మేం ప్రేమించాం. వ్యక్తిగత అనుభూతుల ద్వారా భావావేశాలతో కాదు. హృదయాంతరాల నుంచి వెలుపలికి మా చేతులను చాస్తూ, విశ్వంలోకి వ్యాపిస్తూ ఇప్పటికీ, అవును, ఇప్పటికీ మాకొటే అనిపిస్తుంది. ఆ జీవితానికి హద్దులే లేవని, అపురూపమైన అద్భుతాలు సంభవమనీ’’. ఆనంద్‌ ఇలా రాయడానికి ఒక ప్రేరణ ఉంది. భారతీయులు తమని తాము పరిపాలించుకోలేని అసమర్థులనే వాదనను బ్రిటిష్‌ వారు ప్రచారం చేశారు. దానికి స్పందనగా ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌ ఈ కవితను రాశారు. ఆయనను ప్రత్యేకంగా నిలిపింది స్వతంత్ర భారత నిర్మాణానికి ఆయన దీర్ఘకాలం పాటు నికరమైన ఆలంబనగా నిలవడం. 1905లో పెషావర్‌లో జన్మించిన ఆనంద్, అమృత్‌సర్‌లోని ఖల్సా కాలేజీలో విద్యనభ్యసించారు.

జాతీయవాది అయిన ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు 1920లలో ఒక ప్రసంగం ఇవ్వడానికి అనీబిసెంట్‌ను తమ కళాశాలకు ఆహ్వానించారు. దాంతో బ్రిటిష్‌ పాలకులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. పోలీసులు ఆయనను నెలపాటు జైల్లో ఉంచారు. 1935లో ఆయన రాసిన అన్‌టచబుల్, 1936లో ఆయన రాసిన కూలీ నవలలు ఆయన ప్రతిష్టను పెంచాయి. ఆయన రాసిన లెటర్స్‌ ఆఫ్‌ ఇండియా (1942), అపాలీజ ఫర్‌ హీరోయిజం (1946) అనే కరపత్రాలు బ్రిటిష్‌ వారిలో కలకలం కలిగించాయి. ముల్క్‌రాజ్‌ తన రచనల్లో ప్రధానంగా సాంప్రదాయిక భారతీయ సమాజంలోని పేద ప్రజల జీవిత ఇతవృత్తాలను చిత్రించారు. ఆయన పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత కూడా.  – స్నేహల్‌ షింగవి, టెక్సాస్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement