
డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశం విద్యారంగంలో గణనీయమైన అభివృద్ధినే సాధించింది. రాధాకృష్ణ కమిషన్ , మొదలియార్ కమిటీ, కొఠారి కమిటీ, జాతీయ విద్యా విధానం – 1968, నూతన విద్యా విధానం–1986, స్వర్ణ సింగ్ కమిటీ, రామ్మూర్తి కమిటీ, యశ్‌పాల్, జనార్దన్ కమిటీల సిఫారసులను అనుసరించి అనేక సంస్కణలను చేపట్టింది. ఫలితంగా 1951లో 18 శాతంగా ఉన్న అక్షరాస్యత 75 ఏళ్లలో 74 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ‘2030 నాటికి అందరికీ నాణ్యమైన విద్య’ అనే ఐక్యరాజ్య సమితి లక్ష్యం వైపు దేశం ముందుకు సాగుతోంది.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యారంగాన్ని రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు భారత ప్రభుత్వం బదలాయించింది. 45వ అధికరణలో అందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. నూతన విద్యా విధానం–1986లో భాగంగా పాఠశాల స్థాయి విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు పెంపొందించేలా మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది.
పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ప్రమాణాల మెరుగుదలకు ఆ వ్యవస్థ నాంది పలికింది. ‘యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2019–20’ గణాంకాల ప్రకారం, ప్రాథమిక విద్యలో సగటు విద్యార్థి నమోదు నిష్పత్తి 97.8శాతం గా ఉంది. వచ్చే 25 ఏళ్లలో విద్యారంగంలో మరింత మెరుగైన çఫలితాలను సాధించే దిశగా భారత్ కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment