పునాదిలోనే పగుళ్లు
పాఠశాల విద్యలో నానాటికీ పెరుగుతున్న అంతరాలు
♦ సర్కారీ బడులు, ప్రైవేటు స్కూళ్లుగా చీలిక
♦ ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన బోధన
♦ సమాన విద్య కరువవడంతో సమాజంలో పెరుగుతున్న వ్యత్యాసం
♦ దేశంలో ‘కామన్ స్కూల్’ విధానం ఉండాలని యాభై ఏళ్ల కిందటే చెప్పిన కొఠారీ కమిషన్
♦ కనీసం ఐదో తరగతి వరకైనా ఆ విధానం అమలు చేయాలి: చుక్కా రామయ్య
♦ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వారి పిల్లల్ని
♦ సర్కారు బడులకే పంపాలి: ప్రొఫెసర్ హరగోపాల్
♦ చాలా దేశాల్లో పేద, ధనిక తేడా లేకుండా చదువులు
సాక్షి, హైదరాబాద్:
అందరికీ సమాన విద్య.. ఇది ప్రతి విద్యార్థి హక్కు! కానీ నేడు అది గగనమైపోయింది. చదువులు పేద, ధనికగా నిలువునా చీలిపోయాయి. బుడిబుడి నడకల బడి అడుగుల్లోనే విభజనకు బీజాలు పడుతున్నాయి. విద్యా విధానంలో ఈ అసమానతల పునాదులు, అశాస్త్రీయ విధానాలు క్రమేణా సమాజంలో అంతరాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను పూర్తిగా గాలికొదిలేసి.. ప్రైవేటుకు బాటలు పరచడంతో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒక్కో స్కూల్లో ఒక్కో రకమైన విద్యా బోధన ఉండటంతో విద్యార్థుల సామర్థ్యాల్లో వ్యత్యాసం పెరిగిపోతోంది. ఇది చివరకు విద్యార్థుల్లో మానసిక ఒత్తిళ్లకు, అవాంఛనీయ పరిస్థితులకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
అంతరాలకు ఆదిలోనే బీజం: అన్నివర్గాల పిల్లలకు సమాన విద్యావకాశాలు అందించాల్సిన ప్రభుత్వాలు ఆ బాధ్యతను విస్మరించడంతో.. కాస్త స్థోమత కలిగిన వారికి ప్రైవేటు స్కూళ్లు, పేద, బడుగు వర్గాలకు సర్కారీ బడులు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. చివరకు ప్రభుత్వ స్కూళ్లంటే అట్టడుగువర్గాలకే పరిమితం అన్న భావన నెలకొంది. చదువులకు పునాది పడే దశలోనే విద్యార్థుల మధ్య ఈ విభజన మొగ్గ తొడగడంతో అది పెరిగి పెద్దదై చివరకు సమాజంలో అంతరానికి దారితీస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఒక్క పాఠశాల విద్యనే తీసుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో 29.84 లక్షల మంది, ప్రైవేటు స్కూళ్లలో 32.70 లక్షల మంది (ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు 4,500 ప్రైవేటు స్కూళ్లలో 13 లక్షల మంది చదువుతున్నారు) చదువుతున్నారు. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో లక్ష మంది విద్యార్థులు తగ్గిపోతుంటే.. ప్రైవేటు స్కూళ్లలో ఆ మేరకు పెరుగుతున్నారు.
సమాన విద్య ఎందుకందడం లేదు?
ప్రభుత్వ స్కూళ్లలో ఎన్నో రకాలు. మోడల్ స్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు, బీసీ గురుకులాలు, గిరిజన గురుకులాలు, విద్యాశాఖ గురుకులాలు, మైనారిటీ గురుకులాలు.. ఇలా చాలానే ఉన్నాయి. వాటితోపాటు ప్రముఖుల పిల్లల కోసం పబ్లిక్ పాఠశాలలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం నవోదయ విద్యాలయాలున్నాయి. ఇవన్నీ మొత్తం స్కూళ్లలో 40 శాతం మాత్రమే. మిగతా 60 శాతం కనీస వసతులకు నోచుకోని ప్రభుత్వ, పురపాలక, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు. ఇక ప్రైవేటులో అరకొర వసతులు, ఓ మోస్తరు ఫీజులతో పేద, దిగువ మధ్యతరగతికి కొన్ని స్కూళ్లు అందుబాటులో ఉండగా, పేద, మధ్య తరగతి ప్రజలకు అందని ఖరీదైనవి స్కూళ్లు మరికొన్ని. ఇక మూడోరకం స్కూళ్లు లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేస్తూ పోటీ పరీక్షల కోసమే నడిచే కార్పొరేట్ స్కూళ్లు. ఇలాంటివి కొద్దిమంది స్థితిమంతులకే అందుబాటులో ఉన్నాయి. ఇలా ఎన్నో వైవిధ్యాలు, వైరుధ్యాలతో కూడిన విద్యాబోధన వల్ల పిల్లలకు సమాన విద్య అందడం లేదు.
రెండింటా సమస్యలే..
ప్రభుత్వ స్కూళ్లను సక్రమంగా నడుపుతూ ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాల్సిన విద్యాశాఖ తన బాధ్యతను గాలికొదిలేయడంతో సర్కారీ బడుల్లో నాణ్యత దెబ్బతింది. మౌలిక వసతుల లేమి, టీచర్ల కొరత.. బాధ్యతారాహిత్యం.. ఒక్కటేమిటి సవాలక్ష సమస్యలతో ప్రభుత్వ బడులు సతమతమవుతున్నాయి. అటు ప్రైవేటు పాఠశాలలపై అజామాయిషీ కరువవడంతో అవి కూడా ఇష్టారాజ్యంగా తయారయ్యాయి. ఆ స్కూళ్లకు ప్రభుత్వ విధానాలు పట్టవు. నిబంధనలు ఎన్నో ఉన్నా.. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. విద్యార్థుల సమగ్ర వికాసానికి దోహదపడే ఆటలు, పాటలు, వ్యాసరచన, వకృ్తత్వం వంటి సహ పాఠ్య కార్యక్రమాలైతే అమలుకే నోచుకోవు. కేవలం కొన్ని పేరున్న స్కూళ్లు మినహా మిగతా 90 శాతం ప్రైవేటు స్కూళ్లు కేవలం మార్కులు, ర్యాంకులే పరమావధిగా తయారయ్యాయి. విద్యార్థులను సమగ్ర వికాసానికి దూరం చేసి మర యంత్రాలుగా మార్చేస్తున్నాయి. ఫలితంగా అనేక మంది పిల్లల్లో సామాజిక స్పృహ కొరవడుతోంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో సమాన విద్య
అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో పాఠశాల విద్య అందరికీ సమానమే. కార్మికుల పిల్లలకు.. ఉన్నతాధికారుల బిడ్డలకు సమాన వసతులతో, ఒకే రకమైన విద్య అందుతోంది. అక్కడే కాదు.. ఫిన్‌ల్యాండ్, స్కాట్‌ల్యాండ్ వంటి దేశాల్లోనూ అంతే. భిన్న సమాజాలున్న మనదేశంలో కూడా కామన్ స్కూలు విధానం ఉంటే ఒకే రకమైన సామర్థ్యం, మానసిక స్థాయితో పిల్లలు ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీలతో పోల్చుకుంటే పక్కనున్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల విద్యావిధానం కాస్త మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ విద్యా వ్యవస్థకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లు మౌలిక వసతుల కల్పనలో ప్రైవేటుతో పోటీపడుతున్నాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు తిష్ట వేయగా.. ప్రైవేటు స్కూళ్లు మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం పెంచి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడికి కారణం అవుతున్నాయి.
నాడే చెప్పిన కొఠారీ కమిషన్..
దేశంలో పేద, ధనికుల వారీగా విద్య అందడంపై యాభై ఏళ్ల కిందటే కొఠారీ కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిణామం అటు పేద పిల్లలకు, ఇటు వేలు, లక్షలు పోసి ప్రైవేటులో చదివించే ఉన్నత వర్గాలకు కూడా హాని చేస్తుందని హెచ్చరించింది. ‘‘విద్యాపరంగా ఉన్నత వర్గాల పిల్లలు, పేద పిల్లలు వేర్వేరుగా ఉండడంతో వారి మధ్య దూరం పెరుగుతుంది. ధనికులైన పిల్లలు పేద పిల్లలతో కలవరు. దీంతో వారిలో సామాజిక పరిణతి, సమగ్ర వికాసం లోపిస్తుంది. అలాంటి విద్య అసంపూర్ణం’’ అని కేంద్రానికి 1966లో సమర్పించిన నివేదికలో కొఠారీ కమిషన్ స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా కామన్ స్కూల్ సిస్టం(సీఎస్ఎస్)ను తీసుకురావాలన్నది కమిషన్ చేసిన ప్రధానమైన సిఫారసు. అన్ని సౌకర్యాలు, వసతులు, సరిపడా టీచర్లతో ప్రతి వాడలో ప్రభుత్వ స్కూలు అవతరించాలని కమిషన్ సూచించింది. అందులో కుల, మత, ఆర్థిక, సామాజిక బేధాలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని పేర్కొంది. తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపాలన్న భావన తల్లిదండ్రుల్లో ఏ కోశానా రానీయకుండా వీటి నిర్వహణ ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ, స్థానిక, ప్రైవేటు, ఎయిడెడ్ ఏ పాఠశాల అయినా.. కచ్చితంగా పాటించాల్సిన కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. కానీ రాజకీయ సంకల్పం లోపించడం వల్లే కామన్ స్కూలు విధానం మనదేశంలో అమలుకు నోచుకోవడం లేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఐదో తరగతి వరకైనా కామన్ స్కూల్ విధానం తేవాలి: చుక్కా రామయ్య, విద్యావేత్త
అనేక దేశాల్లో 12వ తరగతి వరకు కామన్ స్కూల్ విధానం ఉంది. దాంతో పేద, ధనిక తేడా లేకుండా అందరికీ నాణ్యమైన, ఒకే ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. ఇక్కడ 12వ తరగతి వరకు కాకపోయినా కనీసం ప్రాథమిక స్థాయి (5వ తరగతి వరకు) వరకైనా అన్ని వర్గాల పిల్లలు ఒకే గొడుగు కింద చదువుకునేలా కామన్ స్కూల్ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఐదో తరగతి వరకు బోధన కేవలం ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. ప్రైవేటు స్కూళ్లు బోధించడానికి వీల్లేకుండా ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఐదో తరగతి తర్వాతే ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు ఇవ్వాలి.
వారి పిల్లలంతా సర్కారీ బడుల్లోనే చదవాలి: ప్రొఫెసర్ హరగోపాల్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సర్కారు నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయం పొందే ఎవరైనా తమ పిల్లల్ని కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా నిబంధన తీసుకురావాలి. అప్పుడే అన్ని వర్గాల పిల్లలకు సమాన విద్య అందడంతోపాటు ప్రభుత్వ విద్యారంగం పరిపుష్టం అవుతుంది.
అభివృద్ధి చెందిన దేశాల్లో కామన్ విద్య
అమలు తీరులో కాస్త అటూ ఇటూ తేడాలున్నా సమాన విద్యే లక్ష్యంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ప్రాథమిక స్థాయిలో ‘కామన్ స్కూలు’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, స్కాండినేవియన్ దేశాలుగా పేర్కొనే డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్లతోపాటు కెనడా, జపాన్ కామన్ విద్యను అందిస్తున్నాయి.
- అమెరికాలో 87 శాతం విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు 10 శాతం మంది మాత్రమే వెళ్తున్నారు.
- స్వీడన్లో స్థానిక మున్సిపాలిటీల ఆధ్వర్యంలోనే మెజారిటీ స్కూళ్లు నడుస్తున్నాయి.
- జపాన్‌లో ప్రాథమిక విద్య పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంది.
- నార్వేలో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య చాలా తక్కువ. మెజారిటీ విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకే వెళ్తారు.
- డెన్మార్క్‌లో ప్రభుత్వ స్కూళ్లు 75 శాతం ఉండగా.. ప్రైవేటు స్కూళ్లు 25 శాతమే ఉన్నాయి.
- బ్రిటన్‌లో ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువ. 80 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుతున్నారు.