మౌంట్‌బాటన్‌తో గాంధీ తప్ప ముఖ్యులంతా!!
‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్’ సమయంలో స్మరించుకోవలసిన మరొక తేదీ జూన్ 3, 1947. భారతదేశానికి ‘అధికార బదలీ’ చేస్తున్నట్టు ఇంగ్లండ్ ప్రకటించిన రోజు. దాదాపు తొమ్మిది దశాబ్దాల స్వరాజ్య సమరం ఆ రోజుతో ముగిసింది. అధికార బదిలీ, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని భారత్ అని, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని ఇంగ్లిష్ ప్రభుత్వమే నామకరణం చేసింది.
ఆ ముందు ఏడాది 1946 సెప్టెంబరు 2న ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్‌పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానీ, ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థికమంత్రి), అబ్దుల్ రబ్ నిష్తార్ (మరొక మంత్రి), సిక్కుల తరఫున బలదేవ్ సింగ్ (రక్షణ మంత్రి) జూన్ 3న సమావేశం అయ్యారు. లార్డ్ మౌంట్‌బాటన్, ఆయన సలహాదారు ఎరిక్ మీవిల్లె ఆ సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం తొమ్మిది మంది. విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ పథకం లేదా జూన్ 3 పథకానికి వీరే ఆమోదముద్ర వేశారు.
విభజనతో కూడిన అధికార బదలీ గురించి జూన్ 3న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్‌దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. ఒక్కడొక సందేహం రావచ్చు.
భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో స్వతంత్ర సమర సారథి గాంధీజీ ఎక్కడ? గాంధీ ఆ సమావేశంలో ఉండడం మౌంట్ బాటన్ కు ఇష్టంలేదు. ఆయన అంతరంగాన్ని బట్టే కాంగ్రెస్ నేతలు వ్యవహరించి గాంధీజీని దూరంగా ఉంచారని అంటారు.
Comments
Please login to add a commentAdd a comment