నేను చూసిన వక్తలలోకెల్లా గొప్ప వక్త జయప్రకాశ్ నారాయణ్. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఆయన ప్రసంగాలు వినడానికి వేల మంది ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ, అదంతా ఆయన జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. మరొక వైపు చూస్తే ఆయన చాలా ప్రశాంతమైన వ్యక్తి. మార్క్సిజం మీద పుస్తకాలను అధ్యయనం చేయడమంటే ఆయనకు ఎంతో ప్రీతి. అనుభవాలు ఆయనను మలిచాయి.
బిహార్‌లోని ఒక చిన్న గ్రామం లాలోటిలో జన్మించిన జేపీ పైచదువుల కోసం అమెరికా వెళ్లడంతో కొత్త ప్రపంచం ఆయన కళ్ల ముందు నిలిచింది. కళాశాలలో చదివేటప్పుడు, తన చదువుకయ్యే ఖర్చుల కోసం ఆయన ఒక ప్యాకేజింగ్ కంపెనీలో పని చేసేవారు. ఎం.ఎన్.రాయ్ రాసిన పుస్తకాల ద్వారా మార్క్సిజం ఆయనకు అక్కడే పరిచయం అయింది. భారతదేశానికి తిరిగి వచ్చి, మహాత్మాగాంధీని కలుసుకున్న మీదట, ఆయనను గురువుగా చేసుకున్నారు. అయితే చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ తన ఆదర్శాలకు, కాంగ్రెస్ ఆదర్శాలకూ పొత్తు కుదరడం లేదని భావించారు.
ఎట్టకేలకు తన మిత్రులు యూసఫ్ దేశాయ్, రామ్ మనోహర్ లోహియాలతో కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా ఏర్పాటు చేశారు. రాడికల్ మార్క్సిజానికి సమర్థించిన జేపీని గాంధీ అహింసావాదం ప్రభావితం చేయడం ఆశ్చర్యమే. 1975లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజల అసంతృప్తి అంతటినీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దింది. ఆ సమయంలో బిహార్ అంతటా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ప్రజ్వరిల్లడం కన్నా జేపీ పలుకుబడికి వేరే నిదర్శనం అక్కర్లేదు.
దేశంలో పెరిగిపోయిన అవినీతి, నిరుద్యోగం, అమానుషాలే ప్రజల ఆగ్రహావేశాలకు కారణమని జేపీ అనేవారు. అప్పుడు నేను కళాశాలలో చదువుతున్నాను. వాతావరణం అంతా ఉద్రిక్తంగా ఉంది. ఒక ధర్నాలో ఆయనకు నన్నొకరు పరిచయం చేశారు. ‘నీ గురించి చాలా విన్నానయ్యా’ అని ఆయన నాతో అన్నారు. అవి బహుశా నా జీవితంలో చాలా గొప్ప క్షణాలు. కెరటాలకు ఎదురీదిన జయప్రకాశ్ నారాయణ్ చాలామందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన తన నమ్మకాల కోసం జీవించారు. వాటి కోసం మరణించడానికి కూడా ఆయన వెనుకాడలేదు.
(దివంగత సోషలిస్టు రాజకీయవేత్త రఘువంశ్ ప్రసాద్ సింగ్ మాటల్లో..)
Comments
Please login to add a commentAdd a comment