సిపాయిల ధిక్కారం.. జాగీర్‌దారుల విద్రోహం.. బద్ధలైన స్వాతంత్య్ర కాంక్ష.. వీటిల్లో ఏది 1857 తిరుగుబాటు చరిత్ర? 165 ఏళ్ల తర్వాత కూడా మనకింకా సంశయమే. ఒక్క విషయంలో మాత్రం స్పష్టత ఉంది. అత్యంత శక్తిమంతమైన ఒక మహా సామ్రాజ్యంతో భారతీయులు తెగించి పోరాడారు. వట్టి చేతులతో, ఉక్కు గుండెలతో బ్రిటిష్ ఫిరంగుల వైపు ప్రతి గర్జన చేశారు. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల గుండా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన ఆ తిరుగుబాటు స్ఫూర్తి 1857–59 మధ్య.. దేశాన్ని యుద్ధభూమిగా మార్చింది. రెండు వైపులా హింస.. రక్తమై ప్రవహించింది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లోని సతీచౌరా ఘాట్‌లో అమాయక ఆంగ్ల వనితలు, పిల్లల ఊచకోత.. తిరుగుబాటు దారుల ఆగ్రహోన్మాదానికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారు కూడా అదే ‘యుద్ధ రీతి’లో ప్రతీకారం తీర్చుకున్నారు.
1757 నుంచి 1857 వరకు
దేశమంతటా శాంతి పునఃస్థాపన జరిగినట్లు 1859 జూలై 8 న అధికార ప్రకటన వెలువడే నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపుగా డీలా పడి ఉంది. ఆ ముందటి ఏడాదే 1858 చివరిలో ఇంగ్లండ్ ప్రభుత్వం ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని రద్దు చేసి, భారతదేశాన్ని పూర్తిగా తన పాలన కిందికి తెచ్చుకుంది. అప్పటికి 250 ఏళ్ల పూర్వమే వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లిమెల్లిగా ఇక్కడి భూభాగాలపైన కూడా ఆధిపత్యం సంపాదించడం మొదలుపెట్టింది. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్‌ను, మరికొందరు ప్రాంతీయ పాలకులను గద్దె దించింది. అలా 1857 నాటికి యావద్భారతాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడు జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటం కూడా అని కొందరు చరిత్రకారులు అంటారు.
మంగళ్ పాండే ధిక్కార స్వరం తర్వాత తొలిసారి మీరట్‌లో (యూపీ) భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్రిటిష్ సైనిక అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (యూపీ) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తదితరులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రారంభంలో పోరు విజయవంతంగా సాగినప్పటికీ చివరికి భారతీయులు ఓడిపోయారు. ఝాన్సీరాణి, తాంతియా తోపే ఆ పోరులో మరణించారు. ఝాన్సీరాణి యుద్ధ క్షేత్రంలో వీర మరణం పొందితే తోపేని బ్రిటిష్ వాళ్లు పట్టి బంధించి ఉరి తీశారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేశారు. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు.
తిరుగుబాటుతో శకం ముగిసింది
సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం.. ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైస్రాయ్‌లను, గవర్నర్ జనరల్స్‌ని పెట్టి భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయోద్యమం సాగింది. మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలలో కాస్త అటు ఇటుగా ఇదీ మన స్వాతంత్య్ర సమరగాథ. అయితే భారతదేశ చరిత్రకారులు కొంతమంది మౌలిక పరిశోధనలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఏవో తమకు లభ్యమైన ఆధారాలతో, తోచిన విధంగా చరిత్రను రాస్తున్నారన్న విమర్శ ఉంది.
1857 తిరుగుబాటు పైన, బహదూర్ షా జఫర్ పైన భారతీయ చరిత్రకారులు ఎన్నో రచనలు చేసినప్పటికీ అందుబాటులో ఉన్న అనేక రికార్డుల వైపు వెళ్లనే లేదని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంటున్నారు! ‘‘వివిధ సిద్ధాంతాలు, దృక్పథాల ప్రభావంతో భారతదేశంలో మౌలిక సూత్రాల నుంచి చరిత్ర రచన దారి తప్పింది. ఇందువల్ల పరిశోధన కొరవడి చరిత్ర వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చే పరిస్థితి ఉండదు. శూన్యస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చరిత్ర వక్రీకరణ జరిగి, అదే నేపథ్యంలో వర్తమాన సమాజం అవాంఛనీయ చర్యలకు, విధానాలకు పాల్పడుతుంది..’’ అంటారు డాల్రింపుల్
1957లో శతాబ్ది ఉత్సవాలు
1957 నాటి ‘తొలి తిరుగుబాటు శతాబ్ది’ వేడుకల సమయానికి స్వతంత్ర భారతదేశం వయసు 10 ఏళ్లు. 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని జవహర్‌లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్.. ‘కులమతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివర్ణించారు. స్వాతంత్య్రానంతర స్వార్థపూరిత పోకడలకు వ్యతిరేకంగా తిరిగి ఆ స్థాయిలో ఉద్యమించవలసిన అవసరం ఉందని కూడా నెహ్రూ ఓ మాట అన్నారు. కలకత్తా యూనివర్సిటీ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్‌తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంధాన్ని ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించింది.
‘‘మతాన్ని కాపాడుకొనేందుకు మొదలైన పోరాటం స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించారు. పుస్తకం రాస్తున్నప్పుడు పాలక్షపక్షం ఒత్తిళ్ల మేరకు ఆయన తన అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చిందని అంటారు. అలాంటి అనుభవమే సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్‌కూ ఎదురైంది. ‘ది సిపాయ్ మ్యూటినీ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857’ గ్రంథ రచన విషయంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ కార్యదర్శితో ఆయనకు అభిప్రాయభేదాలు వచ్చాయి.
బ్రిటిష్ వారిని ఇండియా నుంచి వెళ్లగొట్టేందుకు ఒక పథకం ప్రకారం సిపాయిల తిరుగుబాటు జరిగినట్లు రాయాలని ఆ కార్యదర్శి కోరడం మజుందార్‌కు నచ్చలేదు. చరిత్రను వక్రీకరించడం తన వల్ల కాదని చెప్పి, బోర్డు నుంచి బయటికి వచ్చి సొంతంగా పుస్తకం తీసుకువచ్చారు. శతాబ్ది ఉత్సవాలలోనే ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో 1857 నాటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయమై ఈనాటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment