Indian Rebellion of 1857
-
ప్రథమ సంగ్రామ గ్రంథాలు! సిపాయిల తిరుగుబాటు పై వచ్చిన గ్రంథాలు
భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. సిపాయిల తిరుగుబాటుపై వచ్చిన ప్రతి రచనా ఒక పరిశోధన. 2007లో సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు నిండేనాటికి తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై పుస్తకాలు రావడం బాగా తగ్గిపోయింది! అయితే రోజీ లెవలిన్ జోన్స్ అనే బ్రిటన్ రచయిత్రి మాత్రం నూట యాభై ఏళ్ల సందర్భంతో నిమిత్తం లేకుండా ఒక పుస్తకం రాయడం మొదలు పెట్టారు. అందులో 1857 తిరుగుబాటు, అనంతర పరిణామాలను, అప్పటికి పేరింకా పెట్టని ఆ పుస్తకంలో ఆమె రాయదలిచారు. బ్రిటిష్ రచయిత్రికి మన చరిత్ర మీద ఆసక్తి ఏమిటి? నిజానికి లక్నో పై ఆమె ఆసక్తి. 2007 నాటికే ఆ నగరంపై ఆమె అనేక పుస్తకాలను రాశారు. ఆ వరుసలో 1857 తిరుగుబాటు గురించి రాయదలిచారు. మే నెలలో నూటాయాభై ఏళ్ల ఉత్సవాలు అయ్యాక, ఏడాది చివర్లో ఆ పుస్తకం విడుదలయింది. పుస్తకం పేరు : ‘ది గ్రేట్ అప్రైజింగ్ ఇన్ ఇండియా’. తిరుగుబాటుపై ఆనాటి వరకు కాస్త ప్రామాణికంగా ఉన్న పుస్తకం.. కాన్పూర్ ఘటనల ఆధారంగా ఆండ్రూ వార్డ్ రాసిన ‘ది బ్లడ్ సీడ్’ (1985). ఇన్ని పుస్తకాలు రాలేదు! భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. ఆ ఉద్ధృతి 20 వ శతాబ్దారంభం నాటికి తగ్గుముఖం పట్టింది. 1947లో సి.ఎల్.రీడ్ ‘మాస్క్ ఆఫ్ ది మ్యూటినీ’ వెలువడింది. అందులో తిరుగుబాటు నాయకుడికి రీడ్ గాంధీ మహాత్ముని స్వభావ శక్తులను ఆపాదించారు. 1947 తర్వాత కొత్తగా వచ్చిన తిరుగుబాటు రచనలు దాదాపుగా లేవు! అప్పటికి ప్రాచుర్యం పొందివున్న వాటిల్లో ‘ది నైట్ రన్నర్స్ ఆఫ్ బెంగాల్’ (జాన్ మాస్టర్స్), ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ (జె.జి.ఫార్వెల్) ముఖ్యమైనవి. ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ బుకర్ బహుమతి పొందిన నవల. సిపాయిల తిరుగుబాటు పరిసమాప్తమయిందని బ్రిటిష్ పాలకులు 1859 మధ్యలో అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రభావం నుంచి కొన్నేళ్లపాటు పూర్తిగా బయట పడలేకపోయారు. ఆధారం ఆత్మకథలు 1857 తర్వాత తిరుగుబాటు నేపథ్యంగా అనేక మంది రచయితలు, చరిత్రకారులు పుస్తకాలు రాశారు. అప్పట్లో సమకాలీన రాజకీయ పరిణామాలపై ఈస్ట్ ఇండియా అధికారులు ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు, స్మృతి రచనలు, డైరీలు, ప్రత్యక్ష సాక్షుల ఆత్మకథలు ఆ రచనలకు ముఖ్య ఆధారం. వాటిల్లో జె.డబ్లు్య. కాయే ‘హిస్టరీ ఆఫ్ ది సిపాయ్ వార్’ ఒక ప్రామాణిక గ్రంథం అయింది. ‘లండన్ టైమ్స్’ కరస్పాండెంట్ విలియం హోవార్డ్ రసెల్ వార్తా కథనాలు కూడా రచయితలకు బాగా ఉపయోగపడ్డాయి. ఇక 1857 ఘటనలపై ఆనాటి ప్రసిద్ధ కవి ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసిన ప్రతి వాక్యమూ భావోద్వేగ భరితమైనదే. మొత్తం మీద ఓ 70 వరకు ‘తిరుబాటు’ రచనలు వెలువడ్డాయి. సహ రచయితగా చార్లెస్ డికెన్స్ రాసిన ‘పెరిల్స్ ఆఫ్ సర్టెన్ ఇంగ్లిష్ ప్రిజనర్స్’ వీటన్నిటిలో అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇదొక చిన్న నవల. తొలిసారిగా 1857లో ‘హౌస్‌హోల్డ్ వర్డ్స్’ పత్రిక క్రిస్మస్ సంచికలో వచ్చింది. అందులోని కథంతా మధ్య అమెరికాలో నడిచినప్పటికీ, ప్రధానంగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఘటనల ఆధారంగా సాగింది. తిరుగుబాటుపై పూర్తిస్థాయిలో వచ్చిన మొదటి నవల ఎడ్వర్డ్ మనీ రాసిన ‘ది వైఫ్ అండ్ ది వార్డ్’ (1859). ‘కాన్పూర్ ఊచకోతతో తిరుగుబాటు నాయకులు మిగలకుండా పోయారు’ అనే ముగింపుతో ఈ పుస్తకం పూర్తవుతుంది. నవలలకు ఆదరణ 1890ల నాటికి తిరుగుబాటు కథాంశంతో 19 నవలలు వచ్చాయి. వీటిల్లో ‘ఆన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్’ (ఫ్లోరా యానీ స్టీల్), ‘ఇన్ ది టైమ్స్ ఆఫ్ పెరిల్’ (జి.ఎ.హెన్టీ) మంచి ఆదరణ పొందాయి. హెన్టీని అప్పట్లో జేమ్స్ హాడ్లీ ఛేజ్ అనేవారు. వేర్వేరు కల్లోలిత సందర్భాలను నేపథ్యంగా తీసుకుని బాలుడైన కథానాయకుడితో ఆయన వంద వరకు నవలలు రాశారు. ‘ది ఇండియన్ మ్యూటినీ అండ్ ది బ్రిటిష్ ఇమాజినేషన్’ గ్రంథకర్త గౌతమ్ చక్రవర్తి.. ఈ తిరుగుబాటు నవలలన్నీ ఒక చారిత్రక వ్యవధిలో యాదృచ్ఛికంగా వెలువడినవి కావని అంటారు. ‘‘1890–1990 మధ్య సామ్రాజ్యవాద ధోరణులు బలీయంగా ఉన్నాయి. ఆ సమయంలో వలస పాలక దళాలపై జరిగిన భారతీయ సైనిక తొలి తిరుగుబాటు కార్మిక వర్గాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆ స్ఫూర్తికి రచయితలూ ప్రభావితం అయ్యారని గౌతమ్ అంటారు. (చదవండి: సామ్రాజ్య భారతి 1887/1947) -
ప్రేరణకు ::: ప్రాణత్యాగాలకు దక్షిణాదే పునాది!
ప్రథమ స్వాతంత్య్ర సమరంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటు జరిగి నూట అరవై ఐదేళ్లు అయ్యాయి. అయితే 1857కు దాదాపు ఒక శతాబ్దం ముందు నుండే తిరుగుబాట్లు అనేవి తమ తర్వాతి ఉద్యమాలకు ప్రేరణ కల్పించడమే కాకుండా ‘సైద్దాంతిక నేపథ్యాన్ని’ కార్యాచరణకు అవసరమైన ‘దశ–దిశ’లను నిర్దేశించగలిగాయి. ఆ తొలి పోరాటాలు భావి తరాల ఉద్యమాలకు బీజాంకురాలుగా పరిణమించి క్రమేణ జాతీయోద్యమ స్పూర్తితో స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగింప జేయడానికి దోహదపడ్డాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో జరిగిన బ్రిటిష్ వ్యతిరేక తొలి తిరుగుబాట్లే 1857 సిపాయిల తిరుగుబాటుకు పునాదులు అయ్యాయని చెప్పాలి. ‘మన ముందు వాళ్లెంత?!’ తొలి దక్షిణ భారత తిరుగుబాట్లు ప్రధానంగా జమీందార్లు, స్థానిక నాయకులు, పాలెగాళ్లు, సిపాయిలు తాము సనాతన కాలం నుంచి అనుభవిస్తూ వచ్చిన అధికారాలను బ్రిటిష్ వారు హరించేస్తున్నందుకు ప్రతిగా మొదలయ్యాయి. కొనసాగాయి. బ్రిటిష్ వారికి శక్తిమంతమైన, సమర్థమైన సైనిక, అధునాతన యుద్ధ సామగ్రి ఉందని తెలిసినా, స్థానిక నాయకులు ‘బ్రిటిష్‌వారు తక్కువమంది – మనకున్నది ఎక్కువ మంది’ అన్న ఆత్మ విశ్వాసంతో, ఎప్పటికైనా వలస పాలకులను తిప్పికొట్టొచ్చనే నమ్మకంతో ఈ తిరుగుబాట్లు చేశారు. కాకతీయ రుద్రమ పాలనలో మొదలైన ‘నాయంకర’ వ్యవస్థకు విజయనగర సామ్రాజ్యపు ‘పాలెగాళ్ల వ్యవస్థ’ తోడయింది. విజయనగర సామ్రాజ్యంలో పలు విధాలుగా పాలన విభజన ఉండేది. రాజధాని, ఇతర ముఖ్యప్రాంతాలను చక్రవర్తి స్వయంగా పరిపాలించేవాడు. రాజధాని నుంచి దూరంగా ఉన్న ముఖ్య కేంద్రాలను చక్రవర్తి కుటుంబ సభ్యులతో లేదా ఇతర బంధువులతో పాలించేవాడు. సామంతులకు మిగిలిన వారికన్నా కొంత స్వయం ప్రతిపత్తి ఉండేది. చిన్న ప్రాంతాలను ‘అమరం’ గా సైన్యంలోని కొందరు ముఖ్యులకు, మంత్రులకు ఇచ్చేవారు. వారిని అమరనాయకులు అంటారు. వీరు స్వయంగా సైన్యాన్ని ఏర్పరచుకొని చక్రవర్తికి మద్దతుగా యుద్ధాల్లో పాల్గొంటారు. అమరనాయక ప్రాంతంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, వీరికి సైన్యం కోసం పెట్టే ఖర్చును బట్టి చక్రవర్తి వీరి కప్పం లేదా శిస్తు లేదా పన్నును నిర్ణయించేవాడు. పాలెగాళ్లు, అమరనాయక ప్రాంతం కన్నా చిన్న ప్రాంతాల్లో ముఖ్యంగా.. అడవులు, కొండలు , రాజధాని సరిహద్దులో ఉండే ప్రాంతాల్లో శాంతి భద్రతలు, పన్ను వసూలు; బాటసారులు, యాత్రికుల రక్షణ, బందిపోట్ల దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పరిచేవారు. పాలెగాళ్లు నామమాత్రపు ‘కప్పాన్ని’ చక్రవర్తికి కట్టేవాళ్ళు. వీళ్లు రాజులు లేక సామంతులు కాకపోయినా ఆయా ప్రాంతాలలో సొంత పాలన నడిచేది. అలాంటి కొందరు బ్రిటిష్ వారి పై చేసిన తిరుగుబాట్లే దేశ స్వాతంత్య్ర సాధనకి తొలి పునాదులు. వీరే తొలి విప్లవ వీరులు. ఖడ్గం ఝుళిపించిన టిప్పు వర్తకానికై భారతదేశం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు క్రమంగా స్థానిక పాలకుల నుండి శిస్తులు వసూలు చేసుకుని అధికారం పొంది, క్రమేణా తమ వలస సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమితో ఉత్తర భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారం సుస్థిరం చేసుకుంది. తర్వాత దక్షిణ భారతదేశం వైపు దృష్టి పెట్టింది. ఇక్కడ టిప్పు సుల్తాన్ 23 సంవత్సరాల యువకుడు. ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడి 1799 ‘శ్రీరంగ పట్నం’ యుద్ధ రంగంలో వీరమరణం పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే దక్షిణాన మరొక వీరుడు, ఆవిర్భవించాడు. అతడే వీరపాండ్య కట్టబ్రహ్మన. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ పాంచాలపురం కోట పాలకుడు. తొలి విప్లవ వీరుడు. గొప్ప దేశ భక్తుడు. వణికించిన వీరపాండ్య వీరపాండ్య కట్టబ్రహ్మన ఆంగ్లేయుల అక్రమాలకు అడ్డుకట్టగా నిలిచి తన సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. కట్టబ్రహ్మన శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేని బ్రిటిష్ వారు అదనపు సైన్యంతో పాంచాలపుర కోటపై దాడిచేశారు. కట్టబ్రహ్మన వారిని వీరోచితంగా ఎదుర్కొన్నాడు. బ్రిటిష్ ఫిరంగి దాడిలో కట్టబ్రహ్మన అనుచరుడు పిళ్లై పట్టుబడ్డాడు. పిళ్లై శవాన్ని బ్రిటిష్‌వాళ్లు కోట గుమ్మానికి వేలాడ తీశారు. బ్రహ్మన మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి బ్రిటిష్ వారు సర్వ శక్తులు ధారపోశారు. తన ఆచూకీ చెప్పిన వారికీ, లేదా తల తెచ్చిన వారికి బహుమానం ప్రకటించారు. వీర పాండ్య కట్టబ్రహ్మన అనేక ప్రాంతాలలో అజ్ఞాత జీవితం గడిపాడు. చివరికి ‘కోలార్ పట్టి’ లో రాజగోపాల్ నాయకర్ ఇంటిలో ఉండగా సైనికులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. కట్టబ్రహ్మన్న నేర్పుతో కాల్పులు జరుపుతూ, ఆంగ్లేయ సైనిక వల నుండి బయటపడి ‘కుడుకుట్టార్’’ అడవులకు చేరాడు. అడవులను చుట్టు ముట్టిన కంపెనీ సైనికులు అణవణువూ గాలించి ఎట్టకేలకు బ్రహ్మనను పట్టుకున్నారు. విచారణ జరిపి 1799 అక్టోబర్16 న చింత చెట్టుకు కట్టబ్రహ్మనను ఉరి తీశారు. సాహసవీరుడిగా, దేశ భక్తుడిగా కట్టబ్రహ్మన చరిత్ర వీరగాథ తరతరాల యువతకు ఉత్తేజం కల్పిస్తుంది. తాను మరణించినా మరెందరో విప్లవ వీరులు మాతృభూమి దాస్య శృఖలాలు ఛేదిస్తారని ఉద్వేగ ప్రసంగం చేసి, ఉరితాటిని ముద్దాడి ప్రాణత్యాగం చేసాడు కట్ట బ్రహ్మన. – డాక్టర్ మురళి పగిడిమర్రి పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలో చరిత్ర శాఖాధిపతి (చదవండి: విదురాశ్వత్థ) -
జైహింద్ స్పెషల్: తొలి నిప్పుకణం ఇతడేనా?
మీరట్‌లో తొలిసారి సిపాయిలు తిరగబడిన రెండు నెలల తర్వాత ఆనాటి ఘటనలపై బ్రిటన్ ప్రధాని బెంజమిన్ దిస్రేలీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 1857 జూలై 27న ‘హౌస్ ఆఫ్ కామన్స్’ని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ఆ ప్రసంగం మూడు గంటల పాటు సాగింది. ‘‘ఇంతకీ అది సిపాయిల తిరుగుబాటా? స్వాతంత్య్ర పోరాటమా? అకస్మాత్తుగా పెల్లుబికిన ఆగ్రహమా? కుట్రలో ఒక భాగమా? అని దిస్రేలీ ప్రశ్నించారు. కార్ల్ మార్క్స్ కూడా ఇదే సంశయంలో పడ్డారు. సిపాయిల తిరుగుబాటు పరిణామాలను న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు ధారావాహికగా రాసిన మార్క్స్ తరచు ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తుండేవారట. చివరికాయన అది స్వాతంత్య్ర సమరమేనన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకున్నారు. ఇక జె.డబ్లు్య.కాయే వంటి బ్రిటిష్ చరిత్రకారులు ఈ పోరాటం సిపాయిల తిరుగుబాటు తప్ప ఇంకోటి కాదని నిర్థరించారు! హైందవ జాతీయత సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ పుస్తకంలో (1909) సిపాయిల తిరుగుబాటుకు జాతీయభావ కోణాన్ని కల్పించారు. అటువంటి అన్వయాన్ని ఇచ్చిన పుస్తకాలలో ఇది మొట్టమొదటిది. దీని ద్వారా సావర్కర్ హిందూ ముస్లిం ఐక్యతను, దేశభక్తిని అంతర్లీనంగా ప్రబోధించారు. అయితే ఇదంతా చారిత్రక వాస్తవాలను విస్మరించి, జాతీయ భావ విశ్వాసాలతో అల్లిన కాల్పనిక రచన అని మజుందార్ విమర్శించారు. అయితే తిరుగుబాటుపై తొలి తిరుగుబాటు శతాబ్ది నాటికి 1957లో విడుదలైన అనేక గ్రంథాలు ఏదో ఒక కోణంలో సావర్కర్ భావాలనే ప్రతిఫలించడం విశేషం. ఎంతగానంటే ఆయన పుస్తకం కూడా ఒక వీర సిపాయి అయింది. తిరుగుబాటు గొప్పతనాన్నంతా సావర్కర్.. మంగళ్ పాండేకే ఆపాదించారని ఇప్పటికీ డాల్రింపుల్‌వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. అయితే పుస్తక ప్రచురణ సంస్థలు, బాలివుడ్ చిత్ర పరిశ్రమ ఈ విమర్శలకు, చరిత్రకారుల భిన్న దృక్కోణాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. సావర్కర్ పుస్తకం ఆధారంగా పాండే, ఝాన్సీలక్ష్మీబాయ్ తదితర పోరాట యోధులపై అనేక హిందీ సినిమాలు, అమర్ చిత్ర కథ కామిక్స్ కూడా విరివిగా వచ్చాయి. భారత చరిత్రలో 1857 నాటి పరిణామాలకు ఉన్న ప్రాముఖ్యం వల్ల దేశ విదేశ చరిత్రకారుల మధ్య ఎడతెగని చర్చ మొదలైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అంతకు ముందు కూడా తిరుగుబాట్లు జరిగాయి కానీ, పాలకులు పాలితుల సంబంధాలలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చింది మాత్రం సిపాయిలేనని సావర్కర్‌ను సమర్థించేవారు అంటారు. భారత ప్రభుత్వమూ ఇలాగే భావిస్తోంది కనుక 1857 కు 150 ఏళ్లు అయిన సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో 2007లో ఆ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 60 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ జరిగింది. ఆ ఏడాది మే 10న లాంఛనంగా వేడుకలు మొదలయ్యాయి. ఎవరిది తొలి తిరుగుబాటు? 1857 తిరుగుబాటు జరిగిన సమయ సందర్భాలపై నెలకొని ఉన్న అస్పష్టత 165 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది! మార్చి 29 నాటి ఒక ఉక్కపోత మధ్యాహ్నపు వేళ బరక్‌పూర్ (ప.బెం) లోని 34వ నేటివ్ ఇన్ఫాంట్రీ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి.. పరేడ్ గ్రౌండ్లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడం వల్లనా లేక మే 10న మీరట్ (ఉ.ప్ర)లో సిపాయిలంతా ఒక్కసారిగా తిరగబడటం వల్లనా ఎలా పడింది బీజం ఒక మహా స్వాతంత్య్ర సంగ్రామానికి? ఉత్తర భారతదేశం పొడవునా ఆనాడు వ్యాపించిన మీరట్ దావానలం బూడిద జాడలను వెదుక్కుంటూ వెనక్కు వెనక్కు వెళ్లిన చరిత్రకారుల అన్వేషణ ఆఖరికి బరక్పూర్లోనే ఆగిపోతోంది. తొలి నిప్పుకణంలా మంగళ్‌పాండే మొదట కనిపించాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు చెప్పిన లిఖితపూర్వక వివరాలే నేటికీ మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు. -
Azadi Ka Amrit Mahotsav: ఆక్రమణ.. నిష్క్రమణ
సిపాయిల ధిక్కారం.. జాగీర్దారుల విద్రోహం.. బద్ధలైన స్వాతంత్య్ర కాంక్ష.. వీటిల్లో ఏది 1857 తిరుగుబాటు చరిత్ర? 165 ఏళ్ల తర్వాత కూడా మనకింకా సంశయమే. ఒక్క విషయంలో మాత్రం స్పష్టత ఉంది. అత్యంత శక్తిమంతమైన ఒక మహా సామ్రాజ్యంతో భారతీయులు తెగించి పోరాడారు. వట్టి చేతులతో, ఉక్కు గుండెలతో బ్రిటిష్ ఫిరంగుల వైపు ప్రతి గర్జన చేశారు. ఉత్తర భారతదేశంలోని మీరట్, ఢిల్లీ, లక్నో, కల్పి, కాన్పూర్, బెనారస్, రాణీగంజ్, కలకత్తాల గుండా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలకు వ్యాపించిన ఆ తిరుగుబాటు స్ఫూర్తి 1857–59 మధ్య.. దేశాన్ని యుద్ధభూమిగా మార్చింది. రెండు వైపులా హింస.. రక్తమై ప్రవహించింది. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్‌లోని సతీచౌరా ఘాట్‌లో అమాయక ఆంగ్ల వనితలు, పిల్లల ఊచకోత.. తిరుగుబాటు దారుల ఆగ్రహోన్మాదానికి నిదర్శనంగా చరిత్రలో నిలిచిపోయింది. బ్రిటిష్ వారు కూడా అదే ‘యుద్ధ రీతి’లో ప్రతీకారం తీర్చుకున్నారు. 1757 నుంచి 1857 వరకు దేశమంతటా శాంతి పునఃస్థాపన జరిగినట్లు 1859 జూలై 8 న అధికార ప్రకటన వెలువడే నాటికి బ్రిటిష్ సామ్రాజ్యం దాదాపుగా డీలా పడి ఉంది. ఆ ముందటి ఏడాదే 1858 చివరిలో ఇంగ్లండ్ ప్రభుత్వం ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని రద్దు చేసి, భారతదేశాన్ని పూర్తిగా తన పాలన కిందికి తెచ్చుకుంది. అప్పటికి 250 ఏళ్ల పూర్వమే వాణిజ్య ప్రయోజనాల కోసం భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లిమెల్లిగా ఇక్కడి భూభాగాలపైన కూడా ఆధిపత్యం సంపాదించడం మొదలుపెట్టింది. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాను ఓడించింది. మైసూరులో టిప్పు సుల్తాన్‌ను, మరికొందరు ప్రాంతీయ పాలకులను గద్దె దించింది. అలా 1857 నాటికి యావద్భారతాన్నీ తన అధీనంలోకి తెచ్చుకుంది. అప్పుడు జరిగిందే సిపాయిల తిరుగుబాటు. అదే మన ప్రప్రథమ స్వాతంత్య్ర పోరాటం కూడా అని కొందరు చరిత్రకారులు అంటారు. మంగళ్ పాండే ధిక్కార స్వరం తర్వాత తొలిసారి మీరట్‌లో (యూపీ) భారతీయ సిపాయిలు బ్రిటిష్ వారిపై విరుచుకుపడ్డారు. ఇద్దరు బ్రిటిష్ సైనిక అధికారులను హతమార్చి, ఢిల్లీ వైపు కదిలారు. ఝాన్సీ (యూపీ) నుంచి లక్ష్మీబాయి, మరాఠా పీష్వా నానా సాహెబ్, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ తదితరులు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రారంభంలో పోరు విజయవంతంగా సాగినప్పటికీ చివరికి భారతీయులు ఓడిపోయారు. ఝాన్సీరాణి, తాంతియా తోపే ఆ పోరులో మరణించారు. ఝాన్సీరాణి యుద్ధ క్షేత్రంలో వీర మరణం పొందితే తోపేని బ్రిటిష్ వాళ్లు పట్టి బంధించి ఉరి తీశారు. బహదూర్ షాను తీసుకెళ్లి బర్మా జైల్లో పడేశారు. హైదరాబాద్ నిజాం, గ్వాలియర్ సింధియాలు బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా ఉండిపోయారు. తిరుగుబాటుతో శకం ముగిసింది సిపాయిల తిరుగుబాటు తర్వాత సంభవించిన కీలక పరిణామం.. ఈస్టిండియా కంపెనీ శకం ముగియడం. దాని స్థానంలో ఇంగ్లండ్ ప్రభుత్వం వైస్రాయ్‌లను, గవర్నర్ జనరల్స్‌ని పెట్టి భారతదేశాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 1885 నుంచి 1947 వరకు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత జాతీయోద్యమం సాగింది. మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలలో కాస్త అటు ఇటుగా ఇదీ మన స్వాతంత్య్ర సమరగాథ. అయితే భారతదేశ చరిత్రకారులు కొంతమంది మౌలిక పరిశోధనలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఏవో తమకు లభ్యమైన ఆధారాలతో, తోచిన విధంగా చరిత్రను రాస్తున్నారన్న విమర్శ ఉంది. 1857 తిరుగుబాటు పైన, బహదూర్ షా జఫర్ పైన భారతీయ చరిత్రకారులు ఎన్నో రచనలు చేసినప్పటికీ అందుబాటులో ఉన్న అనేక రికార్డుల వైపు వెళ్లనే లేదని ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ అంటున్నారు! ‘‘వివిధ సిద్ధాంతాలు, దృక్పథాల ప్రభావంతో భారతదేశంలో మౌలిక సూత్రాల నుంచి చరిత్ర రచన దారి తప్పింది. ఇందువల్ల పరిశోధన కొరవడి చరిత్ర వాస్తవాలు ప్రజల దృష్టికి వచ్చే పరిస్థితి ఉండదు. శూన్యస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా చరిత్ర వక్రీకరణ జరిగి, అదే నేపథ్యంలో వర్తమాన సమాజం అవాంఛనీయ చర్యలకు, విధానాలకు పాల్పడుతుంది..’’ అంటారు డాల్రింపుల్ 1957లో శతాబ్ది ఉత్సవాలు 1957 నాటి ‘తొలి తిరుగుబాటు శతాబ్ది’ వేడుకల సమయానికి స్వతంత్ర భారతదేశం వయసు 10 ఏళ్లు. 1857 మే 10న బ్రిటిష్ పాలకులపై భారతీయ సిపాయిలు తిరగబడిన సందర్భాన్ని జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్.. ‘కులమతాలకు అతీతమైన సమైక్య పోరాటం’గా అభివర్ణించారు. స్వాతంత్య్రానంతర స్వార్థపూరిత పోకడలకు వ్యతిరేకంగా తిరిగి ఆ స్థాయిలో ఉద్యమించవలసిన అవసరం ఉందని కూడా నెహ్రూ ఓ మాట అన్నారు. కలకత్తా యూనివర్సిటీ చరిత్రకారుడు ఎస్.ఎన్.సేన్‌తో తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై రాయించిన అధికారిక గ్రంధాన్ని ప్రభుత్వం ఆ ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరించింది. ‘‘మతాన్ని కాపాడుకొనేందుకు మొదలైన పోరాటం స్వాతంత్య్ర సమరంగా సమాప్తమయింది’’ అని సేన్ తన పుస్తకాన్ని ముగించారు. పుస్తకం రాస్తున్నప్పుడు పాలక్షపక్షం ఒత్తిళ్ల మేరకు ఆయన తన అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చిందని అంటారు. అలాంటి అనుభవమే సుప్రసిద్ధ చరిత్రకారుడు ఆర్.సి.మజుందార్‌కూ ఎదురైంది. ‘ది సిపాయ్ మ్యూటినీ అండ్ రివోల్ట్ ఆఫ్ 1857’ గ్రంథ రచన విషయంలో బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ కార్యదర్శితో ఆయనకు అభిప్రాయభేదాలు వచ్చాయి. బ్రిటిష్ వారిని ఇండియా నుంచి వెళ్లగొట్టేందుకు ఒక పథకం ప్రకారం సిపాయిల తిరుగుబాటు జరిగినట్లు రాయాలని ఆ కార్యదర్శి కోరడం మజుందార్‌కు నచ్చలేదు. చరిత్రను వక్రీకరించడం తన వల్ల కాదని చెప్పి, బోర్డు నుంచి బయటికి వచ్చి సొంతంగా పుస్తకం తీసుకువచ్చారు. శతాబ్ది ఉత్సవాలలోనే ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ చరిత్రలో 1857 నాటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలనే విషయమై ఈనాటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
1857 సిపాయిల తిరుగుబాటు
శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలరేగింది. యూరోపియన్లలో కొందరు దీన్ని ‘సిపాయిల తిరుగుబాటు’ అని పేర్కొనగా, మరికొందరు దీన్ని మత దురభిమానులు సాగించిన యుద్ధం, జాతుల మధ్య పోరాటం, నాగరికత-ఆటవికత మధ్య సాగిన సంఘర్షణ అని పేర్కొన్నారు. భారతదేశంలోని జాతీయవాదులు, చరిత్రకారులు దీన్ని ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేర్కొన్నారు. వారిలో వి.డి.సావర్కర్ ప్రథములు. ఆర్.సి. మజుందార్ దీన్ని ‘ఒక తిరుగుబాటు’గా పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ చారిత్రక సంఘటనల్లో 1857 తిరుగుబాటుకు ప్రత్యేక స్థానం ఉంది. తిరుగుబాటు స్వభావం గురించి చరిత్రకారులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం దీన్ని 5 విధాలుగా వర్గీకరించొచ్చు. అవి.. 1. సిపాయిల పితూరీ 2. జాతి సంఘర్షణ 3. హిందువులు, మహ్మదీయులు కలిపి పన్నిన కుట్ర 4. ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం 5. స్వాతంత్య్ర సమరానికి నాందీ (లేదా) మొదటి మెట్టు తిరుగుబాటుకు కారణాలు ఆంగ్ల చరిత్రకారులు భావించినట్లు కేవలం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాల కారణంగానే 1857లో తిరుగుబాటు జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి.. డల్హౌసీ విధానాలు (లేదా) రాజకీయ కారణాలు సాంఘిక కారణాలు మత సంబంధమైన కారణాలు ఆర్థిక కారణాలు సైనిక కారణాలు తక్షణ కారణం ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలు డల్హౌసీ విధానాలు(లేదా) రాజకీయ కారణాలు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా సతారా, నాగ్‌పూర్, భరత్పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ వంటి హిందూ రాజ్యాలు ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఆ విధంగా రాజ్యాలను కోల్పోయిన స్వదేశీ రాజులు తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించారు. సాంఘిక కారణాలు పాశ్చాత్య నాగరికత పట్ల భారతీయులు విముఖత చూపారు. దాని వ్యాప్తి వల్ల తమ ప్రాచీన సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన చెందారు. నరబలి, సతీసహగమనం, బాల్య వివాహాలను ఆంగ్లేయులు రద్దు చేయడం, వితంతు వివాహాలను చట్టబద్ధం చేయడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం వంటివన్నీ భారతీయులకు వింతగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా తోచాయి. మత కారణాలు హిందువులను క్రైస్తవులుగా మార్చనిదే వారు నాగరికులు కాలేరని, తమకు విశ్వాసపాత్రులై ఉండరని భావించి ఆంగ్లేయులు క్రైస్తవ మత బోధన సాగించారు. విద్యా సంస్థల్లో నిర్బంధ బైబిల్ బోధనను ప్రవేశపెట్టారు. అయితే ఖురాన్, హిందూ మత గ్రంథాల బోధనకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆర్థిక కారణాలు ఆంగ్లేయులు స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడంతో ఆయా రాజ్యాల్లోని ప్రభుత్వోద్యోగులు, సైనికులు నిరుద్యోగులుగా మిగిలారు. ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం ఫలితంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. విదేశీ వస్తువులు చౌకగా లభించడం వల్ల స్వదేశీ పరిశ్రమలపై ఆధారపడిన వారు నిరుద్యోగులయ్యారు. క్షామ కాలంలో ప్రజలకు తగిన రీతిలో సాయం లభించలేదు. ప్రజా సంక్షేమంపై ఆంగ్లేయులు సరైన దృష్టి సారించలేదు. సైనిక కారణాలు ఆంగ్ల సైనికులతో పోల్చితే భారత సిపాయిల జీతభత్యాలు చాలా తక్కువగా ఉండేవి. అర్హత, శక్తి సామర్థ్యాల ప్రాతిపదికన కాకుండా కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారికి, ఆంగ్లేయుల ఆదరాభిమానాలు చూరగొన్న వారికి మాత్రమే ఉన్నత పదవులు లభించాయి. తక్షణ కారణం కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్స్‌లో ఉపయోగించే తూటాల చుట్టూ ఆవు, పంది కొవ్వు పూస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. ఆవు హిందువులకు పవిత్రం కాగా, పంది మహ్మదీయులకు నిషిద్ధ జంతువు. దాంతో హిందూ, ముస్లిం సిపాయిలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటుకు ఉపక్రమించారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుబాటు నాయకులు కాన్పూర్: ఇక్కడ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించాడు. రావుసాహిబ్, తాంతియాతోపే, అజీముల్లాఖాన్ (సలహాదారు) అతడికి మద్దతుగా నిలిచారు. కాన్పూర్ను 1857, డిసెంబర్లో బ్రిటిష్ సైన్యాధికారి కొలిన్ క్యాంప్‌బెల్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. నానాసాహెబ్ నేపాల్‌కు పారిపోయాడు. 1859లో ప్రభుత్వం ఇతడిని కాల్చి చంపింది. లక్నో: ఇది అవథ్ రాజధాని. 18 నెలల తన కుమారుడి తరఫున తల్లి ‘బేగం హజ్రత్ మహల్’ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. ఆమె సలహాదారు అహ్మదుల్లా. కొలిన్ క్యాంప్‌బెల్ 1858, మార్చి 18న లక్నోను స్వాధీనం చేసుకున్నాడు. బేగం హజ్రత్ మహల్ నేపాల్‌కు పారిపోయింది. ఝాన్సీ, గ్వాలియర్: లక్ష్మీబాయి ముందుగా ఝాన్సీలో పోరాటం చేసింది. ఝాన్సీని జనరల్ హ్యూరోస్ స్వాధీనం చేసుకున్నాడు. గ్వాలియర్ రాజు సింధియా బ్రిటిష్ పక్షాన నిలిచాడు. కానీ అతని సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయిని నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. గ్వాలియర్‌లో యుద్ధం చేస్తున్న లక్ష్మీబాయి 1858, జూన్ 17న బ్రిటిష్ జనరల్ హ్యూరోస్ చేతిలో చనిపోయింది. తాంతియాతోపే ఝాన్సీ, గ్వాలియర్ రెండు చోట్ల లక్ష్మీబాయికి మద్దతుగా నిలిచాడు. బిహార్: బిహార్‌లోని అర్రా అనే ప్రాంతంలో 70 ఏళ్ల జమీందారు కున్వర్సింగ్, అతని సోదరుడు అమర్‌సింగ్‌లు తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. రాయ్‌బరేలి: ఖాన్ బహమర్ ఖాన్ ఫైజాబాద్ : మౌలానా అహ్మదుల్లా ఢిల్లీ: ఇక్కడ తిరుగుబాటుకు నామమాత్రపు నాయకుడు రెండో బహదూర్షా. ఇతను తిరుగుబాటుదారులపై పెద్దగా నమ్మకం చూపకుండా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాడు. అతని భార్య బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వారితో కుమ్మక్కైంది. ఢిల్లీలో తిరుగుబాటుకు నిజమైన నాయకుడు రాయ్‌బరేలీలో సుబేదార్‌గా పనిచేసిన ‘జనరల్ భక్త్‌ఖాన్’. ఢిల్లీని ‘జాన్ నికల్సన్’ అనే బ్రిటిష్ సైన్యాధికారి 1857, సెప్టెంబర్‌లో తిరుగుబాటుదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. లెఫ్టినెంట్ హడ్సన్ అనే బ్రిటిష్ సైన్యాధికారి రెండో బహదూర్షా కుమారుడు ఫకీరుద్దీన్‌తోపాటు అతని కుమారుణ్ని కాల్చి చంపాడు. బ్రిటిష్ ప్రభుత్వం రెండో బహదూర్షా, అతని భార్య జీనమహల్‌ను దేశాంతర వాస శిక్ష కింద బర్మాలోని రంగూన్‌కి పంపించింది. వారు అక్కడే మరణించారు. ‘జనరల్ భక్త్‌ఖాన్’ అవధ్‌కు వెళ్లి బేగం హజ్రత్ మహల్‌కు అండగా నిలిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయిన అతణ్ని ప్రభుత్వం1859లో పట్టుకుని కాల్చి చంపింది. తిరుగుబాటు ప్రారంభం కాకముందే బెంగాల్‌లోని బారక్పూర్లో ‘మంగళ్ పాండే’ ఎన్ఫీల్డ్ తూటాలు ఉపయోగించేందుకు నిరాకరించి, లెఫ్ట్‌నెంట్ బాగ్ అనే అధికారిని 1857, మార్చి 29న కాల్చిచంపాడు. మంగళ్‌పాండేను 1857 సిపాయి తిరుగుబాటు కాలం నాటి తొలి హీరోగా వీడీ సావర్కర్ పేర్కొన్నారు. తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు ఇది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో మాత్రమే దీనికి సామాన్య ప్రజల మద్దతు లభించింది. సర్ జాన్ లారెన్స మంచి పాలన అందించి పంజాబ్ ప్రజలు, సిక్కులు తిరుగుబాటులో చేరకుండా చూశాడు.గ్వాలియర్ రాజు సింధియా, ఇండోర్ రాజు హోల్కర్, నేపాల్ రాణా, హైదరాబాద్ నవాబు తదితర స్వదేశీ సంస్థానాధీశులు తిరుగుబాటును అణచివేయడంలో బ్రిటిష్ వారికి మద్దతిచ్చారు. తిరుగుబాటు నాయకుల మధ్య సమన్వయం, ముందుచూపు కొరవడ్డాయి. పూర్వ యుద్ధ అనుభవం లేకపోవడం కూడా వైఫల్యానికి మరో కారణం. బ్రిటిష్ వారికి అధునాతన సైన్యం, ఆయుధాలు, రైల్వే, టెలిగ్రాఫ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఫలితాలు 1958 చట్టం ప్రకారం కంపెనీ పాలన రద్దయి అధికారం బ్రిటిష్ పార్లమెంట్ వశమైంది. బ్రిటన్ రాణి దేశాధినేత అయ్యారు. గవర్నర్ జనరల్ పదవి.. వైశ్రాయ్ పదవిగా మారింది. లార్డ కానింగ్ మొదటి వైశ్రాయ్ అయ్యాడు. తిరుగుబాటు తర్వాత స్వదేశీ సంస్థానాధీశుల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం స్నేహపూర్వక ధోరణిని ప్రదర్శించింది. సైన్యంలో దేశభక్తి భావాలు ఏర్పడకుండా సైన్యాన్ని కులం, ప్రాంతం పేరుతో విడగొట్టారు. ఉదా: సిక్కు రెజిమెంట్, గూర్ఖా రెజిమెంట్, మద్రాసు రెజిమెంట్. తిరుగుబాటులో పాల్గొన్న రాజపుత్రులు, బ్రాహ్మణులను సైన్యంలోకి తీసుకోవడం తగ్గించారు. తిరుగుబాటులో పాల్గొనని సిక్కులు, గూర్ఖాలు, మద్రాసీలను సైన్యంలోకి తీసుకున్నారు. తిరుగుబాటుతో ప్రభుత్వ ఆర్థిక స్థితి దెబ్బతింది. దాంతో జేమ్స్ విల్సన్ కమిటీని నియమించి దీని సూచన మేరకు ఆదాయపు పన్ను (ఐటీ), పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టారు.