
భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. సిపాయిల తిరుగుబాటుపై వచ్చిన ప్రతి రచనా ఒక పరిశోధన. 2007లో సిపాయిల తిరుగుబాటుకు 150 ఏళ్లు నిండేనాటికి తొలి స్వాతంత్య్ర సంగ్రామంపై పుస్తకాలు రావడం బాగా తగ్గిపోయింది! అయితే రోజీ లెవలిన్ జోన్స్ అనే బ్రిటన్ రచయిత్రి మాత్రం నూట యాభై ఏళ్ల సందర్భంతో నిమిత్తం లేకుండా ఒక పుస్తకం రాయడం మొదలు పెట్టారు. అందులో 1857 తిరుగుబాటు, అనంతర పరిణామాలను, అప్పటికి పేరింకా పెట్టని ఆ పుస్తకంలో ఆమె రాయదలిచారు. బ్రిటిష్ రచయిత్రికి మన చరిత్ర మీద ఆసక్తి ఏమిటి?
నిజానికి లక్నో పై ఆమె ఆసక్తి. 2007 నాటికే ఆ నగరంపై ఆమె అనేక పుస్తకాలను రాశారు. ఆ వరుసలో 1857 తిరుగుబాటు గురించి రాయదలిచారు. మే నెలలో నూటాయాభై ఏళ్ల ఉత్సవాలు అయ్యాక, ఏడాది చివర్లో ఆ పుస్తకం విడుదలయింది. పుస్తకం పేరు : ‘ది గ్రేట్ అప్‌రైజింగ్ ఇన్ ఇండియా’. తిరుగుబాటుపై ఆనాటి వరకు కాస్త ప్రామాణికంగా ఉన్న పుస్తకం.. కాన్పూర్ ఘటనల ఆధారంగా ఆండ్రూ వార్డ్ రాసిన ‘ది బ్లడ్ సీడ్’ (1985).
ఇన్ని పుస్తకాలు రాలేదు!
భారతదేశంలో వలస పాలనలోని మరే ఘటన పైనా రానన్ని పుస్తకాలు 1857 తిరుగుబాటుపై వచ్చాయి. ఆ ఉద్ధృతి 20 వ శతాబ్దారంభం నాటికి తగ్గుముఖం పట్టింది. 1947లో సి.ఎల్.రీడ్ ‘మాస్క్ ఆఫ్ ది మ్యూటినీ’ వెలువడింది. అందులో తిరుగుబాటు నాయకుడికి రీడ్ గాంధీ మహాత్ముని స్వభావ శక్తులను ఆపాదించారు. 1947 తర్వాత కొత్తగా వచ్చిన తిరుగుబాటు రచనలు దాదాపుగా లేవు! అప్పటికి ప్రాచుర్యం పొందివున్న వాటిల్లో ‘ది నైట్ రన్నర్స్ ఆఫ్ బెంగాల్’ (జాన్ మాస్టర్స్), ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ (జె.జి.ఫార్వెల్) ముఖ్యమైనవి. ‘ది సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’ బుకర్ బహుమతి పొందిన నవల. సిపాయిల తిరుగుబాటు పరిసమాప్తమయిందని బ్రిటిష్ పాలకులు 1859 మధ్యలో అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రభావం నుంచి కొన్నేళ్లపాటు పూర్తిగా బయట పడలేకపోయారు.
ఆధారం ఆత్మకథలు
1857 తర్వాత తిరుగుబాటు నేపథ్యంగా అనేక మంది రచయితలు, చరిత్రకారులు పుస్తకాలు రాశారు. అప్పట్లో సమకాలీన రాజకీయ పరిణామాలపై ఈస్ట్ ఇండియా అధికారులు ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు, స్మృతి రచనలు, డైరీలు, ప్రత్యక్ష సాక్షుల ఆత్మకథలు ఆ రచనలకు ముఖ్య ఆధారం. వాటిల్లో జె.డబ్లు్య. కాయే ‘హిస్టరీ ఆఫ్ ది సిపాయ్ వార్’ ఒక ప్రామాణిక గ్రంథం అయింది. ‘లండన్ టైమ్స్’ కరస్పాండెంట్ విలియం హోవార్డ్ రసెల్ వార్తా కథనాలు కూడా రచయితలకు బాగా ఉపయోగపడ్డాయి.
ఇక 1857 ఘటనలపై ఆనాటి ప్రసిద్ధ కవి ఆల్‌ఫ్రెడ్ టెన్నిసన్ రాసిన ప్రతి వాక్యమూ భావోద్వేగ భరితమైనదే. మొత్తం మీద ఓ 70 వరకు ‘తిరుబాటు’ రచనలు వెలువడ్డాయి. సహ రచయితగా చార్లెస్ డికెన్స్ రాసిన ‘పెరిల్స్ ఆఫ్ సర్టెన్ ఇంగ్లిష్ ప్రిజనర్స్’ వీటన్నిటిలో అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఇదొక చిన్న నవల. తొలిసారిగా 1857లో ‘హౌస్‌హోల్డ్ వర్డ్స్’ పత్రిక క్రిస్మస్ సంచికలో వచ్చింది. అందులోని కథంతా మధ్య అమెరికాలో నడిచినప్పటికీ, ప్రధానంగా భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఘటనల ఆధారంగా సాగింది. తిరుగుబాటుపై పూర్తిస్థాయిలో వచ్చిన మొదటి నవల ఎడ్వర్డ్ మనీ రాసిన ‘ది వైఫ్ అండ్ ది వార్డ్’ (1859). ‘కాన్పూర్ ఊచకోతతో తిరుగుబాటు నాయకులు మిగలకుండా పోయారు’ అనే ముగింపుతో ఈ పుస్తకం పూర్తవుతుంది.
నవలలకు ఆదరణ
1890ల నాటికి తిరుగుబాటు కథాంశంతో 19 నవలలు వచ్చాయి. వీటిల్లో ‘ఆన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్’ (ఫ్లోరా యానీ స్టీల్), ‘ఇన్ ది టైమ్స్ ఆఫ్ పెరిల్’ (జి.ఎ.హెన్టీ) మంచి ఆదరణ పొందాయి. హెన్టీని అప్పట్లో జేమ్స్ హాడ్లీ ఛేజ్ అనేవారు. వేర్వేరు కల్లోలిత సందర్భాలను నేపథ్యంగా తీసుకుని బాలుడైన కథానాయకుడితో ఆయన వంద వరకు నవలలు రాశారు. ‘ది ఇండియన్ మ్యూటినీ అండ్ ది బ్రిటిష్ ఇమాజినేషన్’ గ్రంథకర్త గౌతమ్ చక్రవర్తి.. ఈ తిరుగుబాటు నవలలన్నీ ఒక చారిత్రక వ్యవధిలో యాదృచ్ఛికంగా వెలువడినవి కావని అంటారు. ‘‘1890–1990 మధ్య సామ్రాజ్యవాద ధోరణులు బలీయంగా ఉన్నాయి. ఆ సమయంలో వలస పాలక దళాలపై జరిగిన భారతీయ సైనిక తొలి తిరుగుబాటు కార్మిక వర్గాలకు స్ఫూర్తి నిచ్చింది. ఆ స్ఫూర్తికి రచయితలూ ప్రభావితం అయ్యారని గౌతమ్ అంటారు.
(చదవండి: సామ్రాజ్య భారతి 1887/1947)