![Azadi Ka Amrit Mahotsav: Sepoy Mutiny In Meerut - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/19/Mangal-Pandey.jpg.webp?itok=Cglsmt1V)
మంగళ్ పాండే
మీరట్‌లో తొలిసారి సిపాయిలు తిరగబడిన రెండు నెలల తర్వాత ఆనాటి ఘటనలపై బ్రిటన్ ప్రధాని బెంజమిన్ దిస్రేలీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 1857 జూలై 27న ‘హౌస్ ఆఫ్ కామన్స్’ని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ఆ ప్రసంగం మూడు గంటల పాటు సాగింది. ‘‘ఇంతకీ అది సిపాయిల తిరుగుబాటా? స్వాతంత్య్ర పోరాటమా? అకస్మాత్తుగా పెల్లుబికిన ఆగ్రహమా? కుట్రలో ఒక భాగమా? అని దిస్రేలీ ప్రశ్నించారు.
కార్ల్ మార్క్స్ కూడా ఇదే సంశయంలో పడ్డారు. సిపాయిల తిరుగుబాటు పరిణామాలను న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు ధారావాహికగా రాసిన మార్క్స్ తరచు ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తుండేవారట. చివరికాయన అది స్వాతంత్య్ర సమరమేనన్న అభిప్రాయాన్ని స్థిరపరచుకున్నారు. ఇక జె.డబ్లు్య.కాయే వంటి బ్రిటిష్ చరిత్రకారులు ఈ పోరాటం సిపాయిల తిరుగుబాటు తప్ప ఇంకోటి కాదని నిర్థరించారు! హైందవ జాతీయత సంస్థాపకులలో ఒకరైన వి.డి.సావర్కర్ తను రాసిన ‘ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ పుస్తకంలో (1909) సిపాయిల తిరుగుబాటుకు జాతీయభావ కోణాన్ని కల్పించారు.
అటువంటి అన్వయాన్ని ఇచ్చిన పుస్తకాలలో ఇది మొట్టమొదటిది. దీని ద్వారా సావర్కర్ హిందూ ముస్లిం ఐక్యతను, దేశభక్తిని అంతర్లీనంగా ప్రబోధించారు. అయితే ఇదంతా చారిత్రక వాస్తవాలను విస్మరించి, జాతీయ భావ విశ్వాసాలతో అల్లిన కాల్పనిక రచన అని మజుందార్ విమర్శించారు. అయితే తిరుగుబాటుపై తొలి తిరుగుబాటు శతాబ్ది నాటికి 1957లో విడుదలైన అనేక గ్రంథాలు ఏదో ఒక కోణంలో సావర్కర్ భావాలనే ప్రతిఫలించడం విశేషం. ఎంతగానంటే ఆయన పుస్తకం కూడా ఒక వీర సిపాయి అయింది. తిరుగుబాటు గొప్పతనాన్నంతా సావర్కర్.. మంగళ్ పాండేకే ఆపాదించారని ఇప్పటికీ డాల్రింపుల్‌వంటి కొందరు బ్రిటిష్ చరిత్రకారులు ఆరోపిస్తున్నారు. అయితే పుస్తక ప్రచురణ సంస్థలు, బాలివుడ్ చిత్ర పరిశ్రమ ఈ విమర్శలకు, చరిత్రకారుల భిన్న దృక్కోణాలకు ప్రాముఖ్యం ఇవ్వలేదు. సావర్కర్ పుస్తకం ఆధారంగా పాండే, ఝాన్సీలక్ష్మీబాయ్ తదితర పోరాట యోధులపై అనేక హిందీ సినిమాలు, అమర్ చిత్ర కథ కామిక్స్ కూడా విరివిగా వచ్చాయి.
భారత చరిత్రలో 1857 నాటి పరిణామాలకు ఉన్న ప్రాముఖ్యం వల్ల దేశ విదేశ చరిత్రకారుల మధ్య ఎడతెగని చర్చ మొదలైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అంతకు ముందు కూడా తిరుగుబాట్లు జరిగాయి కానీ, పాలకులు పాలితుల సంబంధాలలో మౌలికమైన మార్పులు తీసుకువచ్చింది మాత్రం సిపాయిలేనని సావర్కర్‌ను సమర్థించేవారు అంటారు. భారత ప్రభుత్వమూ ఇలాగే భావిస్తోంది కనుక 1857 కు 150 ఏళ్లు అయిన సందర్భంగా కోట్ల రూపాయల వ్యయంతో 2007లో ఆ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 60 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ జరిగింది. ఆ ఏడాది మే 10న లాంఛనంగా వేడుకలు మొదలయ్యాయి.
ఎవరిది తొలి తిరుగుబాటు?
1857 తిరుగుబాటు జరిగిన సమయ సందర్భాలపై నెలకొని ఉన్న అస్పష్టత 165 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది! మార్చి 29 నాటి ఒక ఉక్కపోత మధ్యాహ్నపు వేళ బరక్‌పూర్ (ప.బెం) లోని 34వ నేటివ్ ఇన్‌ఫాంట్రీ దళ సభ్యుడు, 26 ఏళ్ల సిపాయి.. పరేడ్ గ్రౌండ్‌లో బ్రిటిష్ అధికారులకు ఎదురు తిరగడం వల్లనా లేక మే 10న మీరట్ (ఉ.ప్ర)లో సిపాయిలంతా ఒక్కసారిగా తిరగబడటం వల్లనా ఎలా పడింది బీజం ఒక మహా స్వాతంత్య్ర సంగ్రామానికి? ఉత్తర భారతదేశం పొడవునా ఆనాడు వ్యాపించిన మీరట్ దావానలం బూడిద జాడలను వెదుక్కుంటూ వెనక్కు వెనక్కు వెళ్లిన చరిత్రకారుల అన్వేషణ ఆఖరికి బరక్‌పూర్‌లోనే ఆగిపోతోంది. తొలి నిప్పుకణంలా మంగళ్‌పాండే మొదట కనిపించాడు. మార్చి 29న అసలేం జరిగిందన్న విషయమై అప్పటి బ్రిటిష్ అధికారులు చెప్పిన లిఖితపూర్వక వివరాలే నేటికీ మనకు అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు.
Comments
Please login to add a commentAdd a comment