
రామ్ ప్రసాద్ బిస్మిల్ విప్లవకారుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. 1918 మణిపురీ కుట్ర, 1925 కాకోరీ కుట్ర కేసులలో నిందితుడు. స్వాతంత్య్ర సమరయోధుడు కావడంతో పాటుగా రామ్, ఆగ్యాత్, బిస్మిల్ వంటి కలంపేర్లతో హిందీ, ఉర్దూ భాషల్లో దేశభక్తి కవితలు రాశారు. స్వామి దయానంద సరస్వతి రాసిన సత్యార్థ్ ప్రకాష్ పుస్తకం ఆయనకు స్ఫూర్తినిచ్చింది. అలాగే ఆర్య సమాజ్ సంస్థతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.
ఆర్య సమాజ్ బోధకులు స్వామి సోమ్ దేవ్ ఆయన గురువు. హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో బిస్మిల్ కూడా ఒకరు. భగత్ సింగ్ ఆయనను ఉర్దూ, హిందీ భాషల్లో గొప్ప కవిగా ప్రశంసించేవారు. కవిత్వ రచనతో పాటుగా ఆయన ఆంగ్లం నుంచి కేథరీన్, బెంగాలీ నుంచి బోల్షెవికోం కీ కర్తూత్ పుస్తకాలను హిందీలోకి అనువదించారు. ‘సర్ఫరోషీ కీ తమన్నా’తో సహా అనేక స్ఫూర్తిదాయ కమైన దేశభక్తి గీతాలు రచించారు.
రాం ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11లో బ్రిటిష్ ఇండియాలో వాయవ్య సరిహద్దు ప్రావిన్సులోని షాజహాన్ పూర్‌లో జన్మించారు. ఇంట్లో తండ్రి నుండి హిందీ నేర్చుకొని ఒక మౌల్వీ నుండి ఉర్దూ అభ్యసించారు. రామ్ ప్రసాద్ తండ్రికి ఇంగ్లిష్ అంటే ఇష్టం లేకున్నా తన కుమారుడిని ఆంగ్ల భాష పాఠశాలలో చేర్పించారు. విప్లవ యోధుడిగా మారాక, ముప్పై ఏళ్ల వయసులో ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబర్ 19న ఉరి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment