
వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (వి.వి.ఎస్. అయ్యర్) భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళ భారతీయ విప్లవకారుడు. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, వి.ఒ. చిదంబరం పిళ్లై వంటి వారు ఉన్నారు, వీరందరూ బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక భావాలు కలవారు. అయ్యర్ తమిళ రచయిత. ఆధునిక తమిళ చిన్న కథకు పితామహుడిగా ఆయన్ని భావిస్తారు. అయ్యర్ 1925 జూన్ 3న.. పాపనాశం జలపాతంలో మునిగిపోతున్న తన కూతురిని రక్షించే ప్రయత్నంలో తనూ చనిపోయారు.
వీవీఎస్ ధీశాలి. సునిశిత దృష్టి కలిగినవారు. ఆయన లండన్‌లోని విద్యార్థి వసతిగృహం ‘ఇండియా హౌస్’ లో ఉన్నప్పుడు మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. అతన్ని హౌస్‌లోనే ఉంచుకుని అతడి ద్వారా చాలాకాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు అయ్యర్
-వి.వి.ఎస్. అయ్యర్