Colonial rule
-
Lidia Thorpe: పిడికిలి ఎత్తి.. రాణిగారి పరువు తీసింది!
వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. చాలా దేశాల వలే ఎన్నో ఘోరమైన గాయాలను ఓర్చుకుంది ఆ దేశం. విముక్తి కోసం వేల మంది వీరుల త్యాగాలతో రక్తపుటేరు ప్రవహించింది ఆ గడ్డపై. ఫలితంగా పేరుకు స్వాతంత్రం వచ్చినా.. గణతంత్రంగా మారే అవకాశం ఇంకా దక్కలేదు వాళ్లకు. అందుకే నిరసన గళాన్ని వినిపించేందుకు తన ప్రమాణ కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ప్. విక్టోరియా ప్రావిన్స్ నుంచి ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ తరపున సెనేటర్‌గా ఎన్నికైంది లిడియా థోర్ప్(48). చట్ట సభకు ఎంపికైన అబ్ఒరిజినల్ ఆస్ట్రేలియన్‌గానూ ఆమె మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సోమవారం చట్టసభ్యురాలిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంది. వాస్తవానికి గత వారం నూతన సెనేటర్లు అందరూ ప్రమాణం చేయగా.. ఈమె మాత్రం కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో సోమవారం ఆమె ఒక్కరితోనే ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణ సమయంలో చదవాల్సిన ప్రింటెడ్ కార్డును ముందు ఉంచి లిడియా.. ‘సార్వభౌమాధికారం’ అని కాకుండా.. ‘వలసదారు’ అంటూ క్వీన్ ఎలిజబెత్ 2ను సంభోధించింది. దీంతో సభలో ఉన్న తోటి చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలని, లేకుంటే ప్రమాణం చెల్లదని ఆమెకు సూచించారు. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఓ చూపు చూసింది. ఈలోపు లేబర్ పార్టీ సభ్యురాలు, చాంబర్ ప్రెసిడెంట్ సూ లైన్స్ జోక్యం చేసుకుని.. ప్రమాణం మళ్లీ చేయాలని, ప్రింటెడ్ కార్డు మీద ఏం ఉంటే అదే చదవాలని కోరింది. దీంతో ఈసారి అన్యమనస్కంగా, కాస్త వెటకారం ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిందామె. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్-2ను సెనేటర్ లిడియా థోర్ప్ ఘోరంగా అవమానించిందన్నది పలువురి వాదన. అయితే ఆమె మాత్రం తన చేష్టలను సమర్థించుకుంటోంది. అంతేకాదు మిగతా చట్ట సభ్యులకు లేని దమ్ము ఆమెకు మాత్రమే ఉందంటూ పలువురు పౌరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. Lidia Thorpe, a Djab Wurrung and Gunnai Gunditjmara senator with Australia's Green Party, called the country's symbolic head of state, Queen Elizabeth II, a colonizer while taking her oath of office pic.twitter.com/phS9lUcsDp— NowThis (@nowthisnews) August 2, 2022 క్వీన్ఎలిజబెత్-2 తమకు సార్వభౌమాధికారం ఎప్పుడూ ఇవ్వలేదని, అందుకే తాను ఆ పదం వాడలేదని స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా రాజరికానికి కట్టుబడి ఉండడం ఆస్ట్రేలియా ప్రజలు చేసుకున్న ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్తోంది ఆమె. ► వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. వేల మంది అబ్ఒరిజినల్(అక్కడి తెగలు) ఆస్ట్రేలియన్లను దారుణంగా హతమార్చారు. చాలావరకు తెగలను వేరే చోటుకు బలవంతంగా వెల్లగొట్టారు. ► 1901లో ఆస్ట్రేలియాకు స్వాతంత్రం ప్రకటించారు. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగుతున్నారు. ► 1999లో రాణి సర్వాధికారాలను తొలగించాలంటూ ఆస్ట్రేలియన్ పౌరులు ఓటేశారు. ఆ సమయంలో తొలగింపు హక్కు చట్ట సభ్యులకు ఉంటుందని, ప్రజలకు ఉండదనే చర్చ నడిచింది. ► ప్రజలంతా తమ దేశం రిపబ్లిక్‌గానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రాజ్యాధినేతను ఎలా ఎన్నుకోవడం అనే విషయంలోనే అసలు సమస్య తలెత్తుతోంది. ► మొన్నటి ఎన్నికల్లో ఆంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ‘మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్’గా ఆయన ప్రకటించుకున్నారు. ► అయితే రాజరికపు ఆస్ట్రేలియా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా మారేందుకు మరో రెఫరెండమ్ జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. -
సేవకుల తయారీ విధానమది
వారణాసి: బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా గురువారం వారణాసిలో ఆయన పర్యటించారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుపై ఏర్పాటైన మూడు రోజుల ‘అఖిల భారతీయ శిక్షా సమాగమ్’ సమ్మేళనాన్ని ప్రారంభించారు. బ్రిటిషర్ల విద్యావిధానంలో స్వాతంత్య్రానంతరం కొన్ని మార్పులు జరిగినా చాలా వరకు పాతవే కొనసాగుతున్నాయన్నారు. కేవలం డిగ్రీ హోల్డర్లను తయారు చేయడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించేందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడమే విద్యావిధానం లక్ష్యం కావాలన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని క్యాంపస్‌లలో కల్పించాలి. విద్యావిధానం ద్వారా మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యువతను సంసిద్ధులను చేయడమనే గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. ‘వినూత్నమైన, నవీనమైన కొత్త ఆలోచనలను ఈ వేదికపై చర్చించాలి. వర్సిటీకి 50–100కిలోమీటర్ల పరిధిలోని సమస్యలను, వనరులను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి’ అని విద్యార్థులకు ప్రధాని సూచించారు. విద్యార్థులు క్షేత్ర పర్యటనల ద్వారా ఆధార సహిత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రధాని నొక్కి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా పర్యటించిన ప్రధాని..అక్షయపాత్ర మధ్యాహ్న భోజన వంటశాలను ప్రారంభించారు. ఎల్టీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కిచెన్‌లో లక్ష మంది విద్యార్థులకు భోజనం తయారు చేసేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ప్రధాని రూ.1,774 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంపూర్ణానంద స్టేడియంలో ఏర్పాటైన సభలో ప్రధాని ప్రసంగిస్తూ..అభివృద్ధి అంటే పైపై మెరుగులు కాదు..పేదలు, అణగారిన, గిరిజన వర్గాల సాధికారతేనని అన్నారు. ‘ఎంపీగా సేవచేసేందుకు కాశీ నాకు ఒక అవకాశమిచ్చింది. స్వల్పకాలిక పనులతో కొందరు లాభపడి ఉండొచ్చు. కానీ, అలాంటి వాటితో దేశం అభివృద్ధి చెందదని కాశీ ప్రజలు కోరుకున్నారు. వారి ముందుచూపువల్లే ప్రస్తుతం వారణాసిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ మొత్తం ప్రాంతం దీనివల్ల ప్రయోజనం పొందుతోంది. దివ్య, నవ్య, భవ్య కాశీ అనే రీతిలో ఎనిమిదేళ్లుగా అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని చెప్పారు. మీ ప్రతిభ అమోఘం జాతీయ విద్యావిధానం సమ్మేళనానికి హాజరైన ప్రధాని మోదీ స్కూలు విద్యార్థుల ప్రతిభాపాటవాలను చూసి ముగ్ధులయ్యారు. ఆయన చుట్టూ చేరిన స్కూలు పిల్లలు ఒకరు శివతాండవ స్తోత్రమ్ ఆలపించగా మరొకరు డ్రమ్ వాయించారు. ఒకరు యోగాసనాలు వేసి చూపించగా మరొకరు స్వచ్ఛతా కార్యక్రమం ప్రాముఖ్యంపై పాట పాడారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రతిభ ఉంది. మీ అందరూ చాలా ప్రతిభావంతులైన చిన్నారులు’అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి రోజూ పరిశుభ్రత పాటిస్తున్నారా? వ్యాయామం చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా వారంతా అవునని సమాధానమిచ్చారు. -
అయ్యారే అయ్యర్!
వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (వి.వి.ఎస్. అయ్యర్) భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళ భారతీయ విప్లవకారుడు. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, వి.ఒ. చిదంబరం పిళ్లై వంటి వారు ఉన్నారు, వీరందరూ బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక భావాలు కలవారు. అయ్యర్ తమిళ రచయిత. ఆధునిక తమిళ చిన్న కథకు పితామహుడిగా ఆయన్ని భావిస్తారు. అయ్యర్ 1925 జూన్ 3న.. పాపనాశం జలపాతంలో మునిగిపోతున్న తన కూతురిని రక్షించే ప్రయత్నంలో తనూ చనిపోయారు. వీవీఎస్ ధీశాలి. సునిశిత దృష్టి కలిగినవారు. ఆయన లండన్‌లోని విద్యార్థి వసతిగృహం ‘ఇండియా హౌస్’ లో ఉన్నప్పుడు మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. అతన్ని హౌస్‌లోనే ఉంచుకుని అతడి ద్వారా చాలాకాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు అయ్యర్ -వి.వి.ఎస్. అయ్యర్ -
సెక్షన్ 124ఏ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి దేశద్రోహం చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తుండటాన్ని, చాలా సందర్భాల్లో దీనిని దుర్వినియోగపర్చడాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ, గోఖలే వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతు నొక్కేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించిందని గుర్తు చేసింది. దీనికి సంబంధించిన ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, ఈ సెక్షన్ ప్రస్తుత కాలంలో అవసరమా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సెక్షన్ రాజ్యాంగ చెల్లుబాటుపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది. సెక్షన్ 124ఏ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, విశ్రాంత సైనికాధికారి మేజర్ జనరల్ ఎన్జీ వోంబట్కెరే దాఖలు చేసిన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్‌రాయ్‌ల ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ దేశద్రోహం చట్టం బ్రిటిష్ వారి నుంచి వలస తెచ్చుకున్న చట్టంగా అభివర్ణించింది. ప్రభుత్వాలపై విద్వేషం పెరిగేలా చేసే ప్రసంగాలు లేదా భావ ప్రకటనలను బెయిల్‌కు వీల్లేని నేరంగా పరిగణిస్తూ, ఈ సెక్షన్ కింద జీవితకాల జైలుశిక్ష విధించే అవకాశముంది. ‘ఈ చట్టం వలసరాజ్యం నాటి చట్టం. స్వేచ్ఛను అణచివేయడానికి, గాంధీ, తిలక్ వంటి వారి గొంతు నొక్కేందుకు ఈ చట్టాన్ని బ్రిటిష్‌వారు ప్రయోగించే వారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ చట్టం అవసరమా?’ అని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తరహా కేసులు సుప్రీంకోర్టులో వేర్వేరు ధర్మాసనాల వద్ద పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కేకే వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎడిటర్స్ గిల్డ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. 124ఏ రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో పిటిషన్లో వివరించామన్నారు. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేసిన కేసులే ఎక్కువని, కొయ్య మలచడానికి వడ్రంగికి రంపం ఇస్తే మొత్తం అడవినే నరికినట్లుగా ఉందంటూ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేస్తున్న అంశాన్ని సీజేఐ ఉదహరించారు. చట్టం దుర్వినియోగం అవడంతో పాటు కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ తరహా ఇతర కేసులు కూడా పరిశీలిస్తామన్న సీజేఐ.. అన్ని కేసులను ఒకే చోట విచారిస్తామన్నారు. కాలం చెల్లిన చట్టాలను చాలా వరకూ రద్దు చేస్తున్న కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ను కొట్టివేయాల్సిన అవసరం లేదని, చట్టపరమైన ప్రయోజనాల నిమిత్తం మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిషనర్ ఆర్మీ మేజర్ జనరల్‌గా పనిచేశారని, ఆయన దేశం కోసం త్యాగం చేశారని, ఈ పిటిషన్‌ను ప్రేరేపిత పిటిషన్‌గా భావించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘సెక్షన్ 124ఏ ను పేకాట ఆడేవారిపైనా ప్రయోగిస్తున్నారు. ప్రత్యర్థుల అణచివేతకు రాజకీయ నేతలు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రత్యర్థులపై సెక్షన్ 124ఏ ప్రయోగించేలా ఫ్యాక్షనిస్టులు ప్రవర్తిస్తున్నారు. బెయిల్ రానివ్వకుండా ఈ సెక్షన్‌తో బెదిరిస్తున్నారు’ అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. సెక్షన్ 124ఏ రద్దుపై వైఖరి తెలపాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. విపక్ష నేతల హర్షం దేశద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు, పౌర సమాజ కార్యకర్తలు స్వాగతించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఒకవైపు, ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బుధవారం హరియాణాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న 100 మంది రైతులపై దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర- 76
ఏలుబడి కూకట్లు ఇలా, రాచరిక పాలనకు అవకాశమిచ్చిన మొదటి ప్రాంతం ఈజిప్టు కాగా, రెండవది మెసొపొటేమియా, దక్షిణ మెసొపొటేమియాలో ఆధారాలతో చరిత్రకు అందిన మొదటి ఏలిక ‘కిష్’ వంశానికి వారసుడైన ‘ఎన్ మెబరగేసి (Enmeba-ragesi)’ క్రీ.పూ. 27వ శతాబ్దంలో ‘కిష్’ నగరం రాజధానిగా ‘సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని పేరు గిల్గమేష్ కావ్యంలో కనిపిస్తుండడం వల్ల, గిల్గమేష్ అనే పౌరాణిక ప్రభువు నిజంగా ఉండేవాడనే వాదనలకు తావిచ్చింది. అలాకాక, అతని వంశస్తులకు పౌరాణిక వ్యక్తుల పేర్లను పిల్లలకు పెట్టుకునే సంప్రదాయమే ఉండి ఉండే, ఆ తరహాలో ఇతనికి పురాణంలో పేరు వచ్చిండొచ్చు. ఈ వంశం రాజధాని ‘కిష్’ నగరానికీ, గిల్గమేష్ రాజధాని ‘ఉరుక్’ నగరానికి మధ్యదూరం 100 మైళ్ళదాకా ఉండడంతో సహజంగా ఈ అనుమానం కలుగుతుంది. నగరానికి కోటగోడ మొదటిసారిగా నిర్మించిన ఘనత గిల్గమేష్ ఆపాదించినా, కిష్ వంశం పాలనలో దక్షిణాది నగరాలకు కోటగోడలు ఏర్పడి, రక్షణ కరువైన గ్రామాలు వాటి పొట్టలో కరిగిపోయాయి. గిల్గమేష్ కావ్యం వివరించే వీరుల దౌర్జన్యాలకు ఏమాత్రం తీసిపోనిది తరువాత ఏర్పడిన ‘లగాష్’ వంశ పరిపాలన. క్రీ.పూ. 2500-2300 కాలానికి చెందిన ఈ రాజుల జ్ఞాపకచిహ్నాలుగా అనేక కట్టడాలు బయటపడ్డాయి. క్రూరమైన విధానాల మూలంగా వీళ్ళ పరిపాలన ఎక్కువ కాలం సాగలేదు. ‘ఉమ్మా’ పట్టణానికి చెందిన ప్రధాన అర్చకుడు ‘లూగల్-జాజే-సి’ నాయకత్వం లగాష్ వంశాన్ని గద్దెదించి, ఉత్తర మెసొపొటేమియా నగరాలను గూడా ఏలుబడిలో కలుపుకుని, పర్షియన్‌గల్ఫ్ మొదలు మధ్యధరా సముద్రం దాకా విస్తరించిన ‘విశాల సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించింది. కానీ, రెప్పపాటులో అతని పాలన కలలాగా కరిగిపోయింది. దక్షిణాన అరేబియన్ ద్వీపకల్పం నుండి ఉత్తరాన మధ్యధరాసముద్రం దాకా, వ్యవసాయానికి అనువుగాని విస్తారమైన ప్రాంతంలో (ఇప్పటి సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రాంతంలో) సంచరించే తెగలను ‘సెమిటిక్ ’ తెగలు అంటారు. మొత్తంగా ఈ తెగలన్నీ మాట్లాడే భాష ఇంచుమించు ఒకటే. క్రీ.పూ 30వ శతాబ్దా నికి వీటిల్లో కొన్ని కొన్ని తెగలు ఏకమై ఒక కూటమిగా ఏర్పడి, సెమిటిక్ జాతులుగా రూపొందాయి. వాటిలో, దక్షిణ మెసొపొటేమియా పడమటి సరిహద్దు దిగువభాగంలో (ఇప్పటి సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతంలో) మసలే సెమిటిక్లది ‘అక్కాడియన్’ జాతి. ఒకప్పుడు దక్షిణ మెసొపొటేమియా నగరాలు ఈ అక్కాడియన్లతో ఒప్పందం కుదుర్చుకుని దాడుల బెడద తప్పించుకున్నాయి. ఉపకారానికి పరిహారంగా ఆ నగరాలు సమర్పించే కానుకలతో అక్కాడియన్లకు ఆర్థిక కొరత తీరిపోయింది. యుద్ధనైపుణ్యం కోల్పోకుండా ఆర్థికపుష్టి సమకూరిన నేపథ్యంలో, ఆ అక్కాడియన్ జాతిలో ఒక గొప్ప నాయకుడు ఉద్భవించాడు. అతడే ‘సెర్గన్ (్చటజౌ, క్రీ.పూ. 2270-2215). సుమేరియన్ సామ్రాజ్యంలో ఏర్పడిన లొసుగులను ఆసరా చేసుకుని, దక్షిణ సుమేరియాను ఆక్రమించి, ఉత్తరంలోని తిరుగుబాట్లను అణిచివేసి, యూఫ్రటీస్ - టైగ్రిస్ నదుల పీఠభూమికి సమర్థవంతమైన చక్రవర్తగా నిలదొక్కుకున్న ‘సర్గన్ ది గ్రేట్’ లేదా ‘సెర్గన్ 1’ ఇతడే. అతని రాకతో సుమేరియన్ సామ్రాజ్యం అంతరించి, ‘సుమేరియన్-అక్కాడియన్’ సామ్రాజ్యం అవతరించింది. ‘అక్కాడియన్’ సామ్రాజ్యం అనకుండా, అతని ఏలుబడి ప్రాంతాన్ని సుమేరియన్-అక్కాడియన్‌గా పిలవడానికి ఒక కారణముంది. అక్కాడియన్లకు భాషవున్నా దానికి లిపి లేదు. లిపి ఏర్పబడిన సుమేరియన్ భాష సాహిత్యం, విజ్ఞానాలతో ఉన్నతంగా ఎదిగి, పరిపాలనకు అనుకూలమైన సాధనంగా రూపొందింది. ఆ కారణంగా అతడు సుమేరియన్ భాషనూ, లిపినీ అభ్యసించి, దాన్ని రాజభాషగా స్వీకరించాడు. సుమేరియన్ల విశ్వాసం చూరగొనేందుకు వాళ్ళ దేవుళ్ళనే తన దేవుళ్ళుగా శిరసావహించాడు. రచన: ఎం.వి.రమణారెడ్డి