వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. చాలా దేశాల వలే ఎన్నో ఘోరమైన గాయాలను ఓర్చుకుంది ఆ దేశం. విముక్తి కోసం వేల మంది వీరుల త్యాగాలతో రక్తపుటేరు ప్రవహించింది ఆ గడ్డపై. ఫలితంగా పేరుకు స్వాతంత్రం వచ్చినా.. గణతంత్రంగా మారే అవకాశం ఇంకా దక్కలేదు వాళ్లకు. అందుకే నిరసన గళాన్ని వినిపించేందుకు తన ప్రమాణ కార్యక్రమానికి వేదికగా చేసుకుంది ఆస్ట్రేలియా సెనేటర్ లిడియా థోర్ప్.
విక్టోరియా ప్రావిన్స్ నుంచి ఆస్ట్రేలియన్ గ్రీన్స్ పార్టీ తరపున సెనేటర్‌గా ఎన్నికైంది లిడియా థోర్ప్(48). చట్ట సభకు ఎంపికైన అబ్‌ఒరిజినల్ ఆస్ట్రేలియన్‌గానూ ఆమె మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సోమవారం చట్టసభ్యురాలిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంది. వాస్తవానికి గత వారం నూతన సెనేటర్లు అందరూ ప్రమాణం చేయగా.. ఈమె మాత్రం కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో సోమవారం ఆమె ఒక్కరితోనే ప్రమాణం చేయించారు.
అయితే ప్రమాణ సమయంలో చదవాల్సిన ప్రింటెడ్ కార్డును ముందు ఉంచి లిడియా.. ‘సార్వభౌమాధికారం’ అని కాకుండా.. ‘వలసదారు’ అంటూ క్వీన్ ఎలిజబెత్ 2ను సంభోధించింది. దీంతో సభలో ఉన్న తోటి చట్టసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నది మాత్రమే చదవాలని, లేకుంటే ప్రమాణం చెల్లదని ఆమెకు సూచించారు. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా ఓ చూపు చూసింది.
ఈలోపు లేబర్ పార్టీ సభ్యురాలు, చాంబర్ ప్రెసిడెంట్ సూ లైన్స్ జోక్యం చేసుకుని.. ప్రమాణం మళ్లీ చేయాలని, ప్రింటెడ్ కార్డు మీద ఏం ఉంటే అదే చదవాలని కోరింది. దీంతో ఈసారి అన్యమనస్కంగా, కాస్త వెటకారం ప్రదర్శిస్తూ ప్రమాణం చేసిందామె.
ఈ ఘటన వీడియో ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. క్వీన్ ఎలిజబెత్-2ను సెనేటర్ లిడియా థోర్ప్ ఘోరంగా అవమానించిందన్నది పలువురి వాదన. అయితే ఆమె మాత్రం తన చేష్టలను సమర్థించుకుంటోంది. అంతేకాదు మిగతా చట్ట సభ్యులకు లేని దమ్ము ఆమెకు మాత్రమే ఉందంటూ పలువురు పౌరులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Lidia Thorpe, a Djab Wurrung and Gunnai Gunditjmara senator with Australia's Green Party, called the country's symbolic head of state, Queen Elizabeth II, a colonizer while taking her oath of office pic.twitter.com/phS9lUcsDp— NowThis (@nowthisnews) August 2, 2022
క్వీన్‌ఎలిజబెత్-2 తమకు సార్వభౌమాధికారం ఎప్పుడూ ఇవ్వలేదని, అందుకే తాను ఆ పదం వాడలేదని స్పష్టం చేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. ఇంకా రాజరికానికి కట్టుబడి ఉండడం ఆస్ట్రేలియా ప్రజలు చేసుకున్న ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని చెప్తోంది ఆమె.
► వందేళ్ల బ్రిటిష్ వలసపాలనలో.. వేల మంది అబ్‌ఒరిజినల్(అక్కడి తెగలు) ఆస్ట్రేలియన్లను దారుణంగా హతమార్చారు. చాలావరకు తెగలను వేరే చోటుకు బలవంతంగా వెల్లగొట్టారు.
► 1901లో ఆస్ట్రేలియాకు స్వాతంత్రం ప్రకటించారు. కానీ, పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోకపోవడంతో టెక్నికల్‌గా ఇంకా బ్రిటన్ రాజరికం కిందే ఉన్నట్లయ్యింది. ఆస్ట్రేలియాకు రాణిగా ఎలిజబెత్-2 కొనసాగుతున్నారు.
► 1999లో రాణి సర్వాధికారాలను తొలగించాలంటూ ఆస్ట్రేలియన్ పౌరులు ఓటేశారు. ఆ సమయంలో తొలగింపు హక్కు చట్ట సభ్యులకు ఉంటుందని, ప్రజలకు ఉండదనే చర్చ నడిచింది.
► ప్రజలంతా తమ దేశం రిపబ్లిక్‌గానే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, రాజ్యాధినేతను ఎలా ఎన్నుకోవడం అనే విషయంలోనే అసలు సమస్య తలెత్తుతోంది.
► మొన్నటి ఎన్నికల్లో ఆంటోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే ‘మినిస్టర్ ఆఫ్ రిపబ్లిక్’గా ఆయన ప్రకటించుకున్నారు.
► అయితే రాజరికపు ఆస్ట్రేలియా.. పూర్తిస్థాయి గణతంత్ర రాజ్యంగా మారేందుకు మరో రెఫరెండమ్ జరగాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment