టూకీగా ప్రపంచ చరిత్ర- 76
ఏలుబడి కూకట్లు
ఇలా, రాచరిక పాలనకు అవకాశమిచ్చిన మొదటి ప్రాంతం ఈజిప్టు కాగా, రెండవది మెసొపొటేమియా, దక్షిణ మెసొపొటేమియాలో ఆధారాలతో చరిత్రకు అందిన మొదటి ఏలిక ‘కిష్’ వంశానికి వారసుడైన ‘ఎన్ మెబరగేసి (Enmeba-ragesi)’ క్రీ.పూ. 27వ శతాబ్దంలో ‘కిష్’ నగరం రాజధానిగా ‘సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని పేరు గిల్‌గమేష్ కావ్యంలో కనిపిస్తుండడం వల్ల, గిల్‌గమేష్ అనే పౌరాణిక ప్రభువు నిజంగా ఉండేవాడనే వాదనలకు తావిచ్చింది. అలాకాక, అతని వంశస్తులకు పౌరాణిక వ్యక్తుల పేర్లను పిల్లలకు పెట్టుకునే సంప్రదాయమే ఉండి ఉండే, ఆ తరహాలో ఇతనికి పురాణంలో పేరు వచ్చిండొచ్చు. ఈ వంశం రాజధాని ‘కిష్’ నగరానికీ, గిల్‌గమేష్ రాజధాని ‘ఉరుక్’ నగరానికి మధ్యదూరం 100 మైళ్ళదాకా ఉండడంతో సహజంగా ఈ అనుమానం కలుగుతుంది. నగరానికి కోటగోడ మొదటిసారిగా నిర్మించిన ఘనత గిల్‌గమేష్ ఆపాదించినా, కిష్ వంశం పాలనలో దక్షిణాది నగరాలకు కోటగోడలు ఏర్పడి, రక్షణ కరువైన గ్రామాలు వాటి పొట్టలో కరిగిపోయాయి.
గిల్‌గమేష్ కావ్యం వివరించే వీరుల దౌర్జన్యాలకు ఏమాత్రం తీసిపోనిది తరువాత ఏర్పడిన ‘లగాష్’ వంశ పరిపాలన. క్రీ.పూ. 2500-2300 కాలానికి చెందిన ఈ రాజుల జ్ఞాపకచిహ్నాలుగా అనేక కట్టడాలు బయటపడ్డాయి. క్రూరమైన విధానాల మూలంగా వీళ్ళ పరిపాలన ఎక్కువ కాలం సాగలేదు. ‘ఉమ్మా’ పట్టణానికి చెందిన ప్రధాన అర్చకుడు ‘లూగల్-జాజే-సి’ నాయకత్వం లగాష్ వంశాన్ని గద్దెదించి, ఉత్తర మెసొపొటేమియా నగరాలను గూడా ఏలుబడిలో కలుపుకుని, పర్షియన్‌గల్ఫ్ మొదలు మధ్యధరా సముద్రం దాకా విస్తరించిన ‘విశాల సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించింది. కానీ, రెప్పపాటులో అతని పాలన కలలాగా కరిగిపోయింది.
దక్షిణాన అరేబియన్ ద్వీపకల్పం నుండి ఉత్తరాన మధ్యధరాసముద్రం దాకా, వ్యవసాయానికి అనువుగాని విస్తారమైన ప్రాంతంలో (ఇప్పటి సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రాంతంలో) సంచరించే తెగలను ‘సెమిటిక్ ’ తెగలు అంటారు. మొత్తంగా ఈ తెగలన్నీ మాట్లాడే భాష ఇంచుమించు ఒకటే. క్రీ.పూ 30వ శతాబ్దా నికి వీటిల్లో కొన్ని కొన్ని తెగలు ఏకమై ఒక కూటమిగా ఏర్పడి, సెమిటిక్ జాతులుగా రూపొందాయి. వాటిలో, దక్షిణ మెసొపొటేమియా పడమటి సరిహద్దు దిగువభాగంలో (ఇప్పటి సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతంలో) మసలే సెమిటిక్‌లది ‘అక్కాడియన్’ జాతి. ఒకప్పుడు దక్షిణ మెసొపొటేమియా నగరాలు ఈ అక్కాడియన్లతో ఒప్పందం కుదుర్చుకుని దాడుల బెడద తప్పించుకున్నాయి. ఉపకారానికి పరిహారంగా ఆ నగరాలు సమర్పించే కానుకలతో అక్కాడియన్లకు ఆర్థిక కొరత తీరిపోయింది.
యుద్ధనైపుణ్యం కోల్పోకుండా ఆర్థికపుష్టి సమకూరిన నేపథ్యంలో, ఆ అక్కాడియన్ జాతిలో ఒక గొప్ప నాయకుడు ఉద్భవించాడు. అతడే ‘సెర్గన్ (్చటజౌ, క్రీ.పూ. 2270-2215). సుమేరియన్ సామ్రాజ్యంలో ఏర్పడిన లొసుగులను ఆసరా చేసుకుని, దక్షిణ సుమేరియాను ఆక్రమించి, ఉత్తరంలోని తిరుగుబాట్లను అణిచివేసి, యూఫ్రటీస్ - టైగ్రిస్ నదుల పీఠభూమికి సమర్థవంతమైన చక్రవర్తగా నిలదొక్కుకున్న ‘సర్గన్ ది గ్రేట్’ లేదా ‘సెర్గన్ 1’ ఇతడే. అతని రాకతో సుమేరియన్ సామ్రాజ్యం అంతరించి, ‘సుమేరియన్-అక్కాడియన్’ సామ్రాజ్యం అవతరించింది.
‘అక్కాడియన్’ సామ్రాజ్యం అనకుండా, అతని ఏలుబడి ప్రాంతాన్ని సుమేరియన్-అక్కాడియన్‌గా పిలవడానికి ఒక కారణముంది. అక్కాడియన్లకు భాషవున్నా దానికి లిపి లేదు. లిపి ఏర్పబడిన సుమేరియన్ భాష సాహిత్యం, విజ్ఞానాలతో ఉన్నతంగా ఎదిగి, పరిపాలనకు అనుకూలమైన సాధనంగా రూపొందింది. ఆ కారణంగా అతడు సుమేరియన్ భాషనూ, లిపినీ అభ్యసించి, దాన్ని రాజభాషగా స్వీకరించాడు. సుమేరియన్ల విశ్వాసం చూరగొనేందుకు వాళ్ళ దేవుళ్ళనే తన దేవుళ్ళుగా శిరసావహించాడు.
రచన: ఎం.వి.రమణారెడ్డి