Mesopotamia
-
టూకీగా ప్రపంచ చరిత్ర 77
మెసొపొటేమియాకు సమాంతరంగా నడిచిన నాగరికత ఈజిప్టుది. క్రీ.పూ 5500 కాలంలో, నైలునది ఎగువప్రాంతాన నగరాల నిర్మాణానికి పూనుకున్న ఈజిప్షియన్లు స్థానికులు కాదేమోనని కొందరి అనుమానం. ఎందుకంటే. క్రీ.పూ. 5000కు ముందు ఆ ప్రాంతంలో నివసించిన మనుషుల అవశేషాలకూ, తరువాతి కాలం అవశేషాలకూ వ్యత్యాసం కనిపిస్తుండడం వల్ల ఆదిమకాలం తరహా సంప్రదాయం ఒక్కసారిగా అంతరించి, పైపొరల్లో ఎదిగిన మనుషుల సంప్రదాయంలోని అవశేషాలు బయటపడుతున్న కారణంగా వీళ్ళు మెసొపొటేమియా నుండి వచ్చిన వలసలై ఉండొచ్చని అనుమానం. దేవాలయాలూ, చిత్రలేఖనం వంటి నేర్పుల్లో మెసొపొటేమియాతో ఈజిప్టుకు పోలికలూ ఉన్నాయి, తేడాలూ ఉన్నాయి. నైలునదీ ప్రాంతంలో రాతికి కొరతలేని కారణంగా ఇక్కడి దేవాలయాలు రాతికట్టడాలు. ఈ దేవుళ్ళ ఆకారాలు వేరు, పేర్లు వేరు. అక్కడిలాగే ఇక్కడ కూడా అర్చకుల ఏలుబడిలో నగరపాలన మొదలైంది గానీ, పెద్ద ఆలస్యం కాకుండా ముగిసి, రాజవంశాల ఏలుబడికి సమాజం గెంతేసింది. అనాది నుండి ఈజిప్టు పాలకులు ‘ఫ్యారో’లుగా ప్రసిద్ధి. ఈ పాలకుల ప్రత్యేకత ఏమంటే - వీళ్ళు దేవుని సేవకులు కాదు; స్వయంగా దేవతామూర్తులు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో నివసించిన ‘మ్యానెథో (క్చ్ఛ్టజిౌ)’ పేరుగల అర్చకుడొకాయన, అనాది కాలం నుండి తన జీవితకాలం దాకా పరిపాలించిన రాజులందరిని 30 వంశాలుగా విభజించాడు. ఆ వంశాలకు విడివిడి పేర్లు లేకపోవడంతో, 1వది, 2వది, 3వది అంటూ లెక్కించడం ఆనవాయితీగా రూపొందింది. ఉత్తర, దక్షిణ నైలునదీ ప్రాంతాలను ఏకం జేసి, ఈజిప్టు మొత్తాన్ని ఒకే సామ్రాజ్యంగా నెలకొల్పిన ఘనతను అతడు ‘మెనెస్’ పేరుగల ప్రభువుకు ఆపాదించాడు. ఐతే, చారిత్రక పరిశోధనల్లో అలాంటి పేరుండే చక్రవర్తి ఆనవాళ్ళు దొరకలేదు. ‘నేర్మెర్ ప్యాలెట్ మీద, రాజలాంఛనాలు ధరించి వేటినో ఏకం చేస్తున్న భంగిమలో కనిపించే క్రీ.పూ. 3150 నాటి ‘ఫ్యారో నేర్మర్’ చక్రవర్తే ఆ మెనెస్ అయ్యుండొచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. అత్యంత విస్తారమైన ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన ‘సింధూ’ పీఠభూమి పరిపాలనా విధానం గురించి చెప్పేందుకు ఎంతైనా ఉందిగానీ, నిరూపించేందుకు ఆధారాలు శూన్యం. తవ్వకాల్లో బయటపడిన కట్టడాల్లో స్మారకచిహ్నాలుగానీ, రాజమందిరాలుగానీ, దేవాలయాలుగానీ మచ్చుకైనా కనిపించవు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం, ప్రామాణీకరించబడిన తూనికలూ, కొలతలూ తదితర విధానాలు పరిపాలన లేకుండా జరిగేవిగావు. అది ఏ తరహా పాలో తెలుసుకునేందుకు గోరంత ఆధారం లేదు. ఆలయాలు గానీ, అర్చక వ్యవస్థగానీ లేకపోవడంతో సింధూ ప్రాంతీయుల ఆధ్యాత్మిక భావాలను గురించి తెలుసుకునేందుకు వీలుపడటం లేదు. ముద్రికల మీద అస్పష్టంగా ఉన్న బొమ్మల ఆధారంగా వాళ్ళు ‘పశుపతి’ని ఆరాధించేవాళ్ళని అన్వయిస్తున్నారేగానీ, యోగ ముద్రలో కూర్చోనున్నట్టు కనిపించే బొమ్మలను దేవుళ్ళతోనూ పోల్చుకోవచ్చు, కళావికాస ప్రయత్నంగానూ భావించొచ్చు. క్రీ.పూ. 5వ శతాబ్దం వాడైన హెరొడొటస్ మొదలు క్రీ.శ.1900 దాకా ఏ చరిత్రకారునికి సింధూ నాగరికత మీద దృష్టి పడకపోయేందుకు కారణం అందులోని పౌరజీవితం నోచుకున్న ప్రశాంతత. వంచితే వంగిపోయేంత బలహీనమైన బరిసెలు, కొన్ని కత్తులు తప్ప అక్కడ ఇతర ఆయుధాల జాడ కనిపించదు. డాలు, ఖడ్గం వంటి పరికరాలు లేకుండా ఆ బరిసెలతో యుద్ధాలు చెయ్యడం సాధ్యపడదు. కొన్ని పట్టణాల చుట్టూ బలమైన గోడలు కనిపించినా, వాటి ప్రయోజనం అనూహ్యమైన వరదను అడ్డుకునేందుకే తప్ప ఆత్మరక్షణ కోసం కట్టుకున్నవిగా కనిపించదు. ఈజిప్టుకుమల్లే సింధూ పీఠభూమిది స్వయం సంరక్షిత నైసర్గిక స్వరూపం. ఉత్తరంలో హిమాలయ పర్వతాలు; పడమట బెలూచీ పర్వతాలు; దక్షిణాన అరేబియా సముద్రం, వింధ్య పర్వతాలు; తూర్పుదిశ నుండే యమునా గంగా మైదానం దట్టమైన అరణ్యం. అందువల్ల, పరాయి దండయాత్రల బెడద ఈ ప్రాంతానికి లేదు. రాచకుటుంబాల మధ్య అధికారం కోసం జరిగిన కుమ్ములాటల వల్ల చరిత్రకారుల దృష్టిని ఆకర్షించగలిగింది ఈజిప్టు. ఇతరుల దృష్టిని ఆకర్షించగల సంఘటనే సింధూ నాగరికతలో కనిపించదు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో హఠాత్తుగానూ, మూకుమ్మడిగానూ, వారసులనైనా మిగల్చకుండా ఈ నాగరికత ఎలా, ఎందుకు అంతరించిందో అంతుదొరకని చిక్కుముడిగా మిగిలిపోయింది. ఆ నాగరికులు మిగిలించిపోయిందల్లా, ‘వాళ్ళు మావాళ్ళే’ నని భారతదేశంలో ఏవొక్కడైనా ఎగబడగల హక్కు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర- 76
ఏలుబడి కూకట్లు ఇలా, రాచరిక పాలనకు అవకాశమిచ్చిన మొదటి ప్రాంతం ఈజిప్టు కాగా, రెండవది మెసొపొటేమియా, దక్షిణ మెసొపొటేమియాలో ఆధారాలతో చరిత్రకు అందిన మొదటి ఏలిక ‘కిష్’ వంశానికి వారసుడైన ‘ఎన్ మెబరగేసి (Enmeba-ragesi)’ క్రీ.పూ. 27వ శతాబ్దంలో ‘కిష్’ నగరం రాజధానిగా ‘సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని పేరు గిల్గమేష్ కావ్యంలో కనిపిస్తుండడం వల్ల, గిల్గమేష్ అనే పౌరాణిక ప్రభువు నిజంగా ఉండేవాడనే వాదనలకు తావిచ్చింది. అలాకాక, అతని వంశస్తులకు పౌరాణిక వ్యక్తుల పేర్లను పిల్లలకు పెట్టుకునే సంప్రదాయమే ఉండి ఉండే, ఆ తరహాలో ఇతనికి పురాణంలో పేరు వచ్చిండొచ్చు. ఈ వంశం రాజధాని ‘కిష్’ నగరానికీ, గిల్గమేష్ రాజధాని ‘ఉరుక్’ నగరానికి మధ్యదూరం 100 మైళ్ళదాకా ఉండడంతో సహజంగా ఈ అనుమానం కలుగుతుంది. నగరానికి కోటగోడ మొదటిసారిగా నిర్మించిన ఘనత గిల్గమేష్ ఆపాదించినా, కిష్ వంశం పాలనలో దక్షిణాది నగరాలకు కోటగోడలు ఏర్పడి, రక్షణ కరువైన గ్రామాలు వాటి పొట్టలో కరిగిపోయాయి. గిల్గమేష్ కావ్యం వివరించే వీరుల దౌర్జన్యాలకు ఏమాత్రం తీసిపోనిది తరువాత ఏర్పడిన ‘లగాష్’ వంశ పరిపాలన. క్రీ.పూ. 2500-2300 కాలానికి చెందిన ఈ రాజుల జ్ఞాపకచిహ్నాలుగా అనేక కట్టడాలు బయటపడ్డాయి. క్రూరమైన విధానాల మూలంగా వీళ్ళ పరిపాలన ఎక్కువ కాలం సాగలేదు. ‘ఉమ్మా’ పట్టణానికి చెందిన ప్రధాన అర్చకుడు ‘లూగల్-జాజే-సి’ నాయకత్వం లగాష్ వంశాన్ని గద్దెదించి, ఉత్తర మెసొపొటేమియా నగరాలను గూడా ఏలుబడిలో కలుపుకుని, పర్షియన్గల్ఫ్ మొదలు మధ్యధరా సముద్రం దాకా విస్తరించిన ‘విశాల సుమేరియన్’ సామ్రాజ్యాన్ని స్థాపించింది. కానీ, రెప్పపాటులో అతని పాలన కలలాగా కరిగిపోయింది. దక్షిణాన అరేబియన్ ద్వీపకల్పం నుండి ఉత్తరాన మధ్యధరాసముద్రం దాకా, వ్యవసాయానికి అనువుగాని విస్తారమైన ప్రాంతంలో (ఇప్పటి సిరియా, జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రాంతంలో) సంచరించే తెగలను ‘సెమిటిక్ ’ తెగలు అంటారు. మొత్తంగా ఈ తెగలన్నీ మాట్లాడే భాష ఇంచుమించు ఒకటే. క్రీ.పూ 30వ శతాబ్దా నికి వీటిల్లో కొన్ని కొన్ని తెగలు ఏకమై ఒక కూటమిగా ఏర్పడి, సెమిటిక్ జాతులుగా రూపొందాయి. వాటిలో, దక్షిణ మెసొపొటేమియా పడమటి సరిహద్దు దిగువభాగంలో (ఇప్పటి సౌదీ అరేబియా ఉత్తర ప్రాంతంలో) మసలే సెమిటిక్లది ‘అక్కాడియన్’ జాతి. ఒకప్పుడు దక్షిణ మెసొపొటేమియా నగరాలు ఈ అక్కాడియన్లతో ఒప్పందం కుదుర్చుకుని దాడుల బెడద తప్పించుకున్నాయి. ఉపకారానికి పరిహారంగా ఆ నగరాలు సమర్పించే కానుకలతో అక్కాడియన్లకు ఆర్థిక కొరత తీరిపోయింది. యుద్ధనైపుణ్యం కోల్పోకుండా ఆర్థికపుష్టి సమకూరిన నేపథ్యంలో, ఆ అక్కాడియన్ జాతిలో ఒక గొప్ప నాయకుడు ఉద్భవించాడు. అతడే ‘సెర్గన్ (్చటజౌ, క్రీ.పూ. 2270-2215). సుమేరియన్ సామ్రాజ్యంలో ఏర్పడిన లొసుగులను ఆసరా చేసుకుని, దక్షిణ సుమేరియాను ఆక్రమించి, ఉత్తరంలోని తిరుగుబాట్లను అణిచివేసి, యూఫ్రటీస్ - టైగ్రిస్ నదుల పీఠభూమికి సమర్థవంతమైన చక్రవర్తగా నిలదొక్కుకున్న ‘సర్గన్ ది గ్రేట్’ లేదా ‘సెర్గన్ 1’ ఇతడే. అతని రాకతో సుమేరియన్ సామ్రాజ్యం అంతరించి, ‘సుమేరియన్-అక్కాడియన్’ సామ్రాజ్యం అవతరించింది. ‘అక్కాడియన్’ సామ్రాజ్యం అనకుండా, అతని ఏలుబడి ప్రాంతాన్ని సుమేరియన్-అక్కాడియన్గా పిలవడానికి ఒక కారణముంది. అక్కాడియన్లకు భాషవున్నా దానికి లిపి లేదు. లిపి ఏర్పబడిన సుమేరియన్ భాష సాహిత్యం, విజ్ఞానాలతో ఉన్నతంగా ఎదిగి, పరిపాలనకు అనుకూలమైన సాధనంగా రూపొందింది. ఆ కారణంగా అతడు సుమేరియన్ భాషనూ, లిపినీ అభ్యసించి, దాన్ని రాజభాషగా స్వీకరించాడు. సుమేరియన్ల విశ్వాసం చూరగొనేందుకు వాళ్ళ దేవుళ్ళనే తన దేవుళ్ళుగా శిరసావహించాడు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 74
ఏలుబడి కూకట్లు మెసొపొటేమియా ఈజిప్టుల్లో చెప్పుకోదగ్గ నగరం ఏర్పడిన ప్రతిచోట ఒక దేవాలయం ఉండే తీరుతుంది. సాధారణంగా అది ఊరికి మధ్యలో ఉంటుంది. దాని గోపురం కంటే ఎత్తై కట్టడం ఆ నగరంలో మరొకటి ఉండదు. చివరకు రాజభవనమైనా సరే, దానికి మించగూడదు. అడపాదడపా సంచారజాతుల దాడులను ఎదుర్కోవడం మినహా, స్థిరనివాసుల జీవితంలో నిలకడ ఏర్పడింది. సంపద పెరగడంతో పాటు విశ్రాంతి పెరిగింది. ఆందోళనలేని విశ్రాంతి మనిషిని వినోదాలవైపు, ఉత్సవాలవైపు నడిపిస్తుంది. ఆ కాలంలో వినోదానికైనా, ఉత్సవానికైనా కేంద్రం దేవాలయమే. గాయకులతో కథాగానాలు జరిపించడమేగాక, తన అనుభవంతో ఇతరులకు సలహాలివ్వడం, మూలికలతో జబ్బులకు చికిత్స చెయ్యడం, నక్షత్రాల గమనాన్ని గుర్తించి రుతువుల రాకపోకలు ఎరిగించడం వంటి సామాజిక కార్యక్రమాలకు దేవాలయం కూడలి కావడంతో, అర్చకుల ప్రాముఖ్యత అత్యున్నత స్థాయికి ఎదిగింది. అరుదుగా వచ్చే పండుగ రోజుల్లోనే కాకుండా, ఏ పని తలపెట్టినా మొదట దేవుణ్ణి బుజ్జగించి ముందుకు సాగటం మంచిదనే నమ్మకాలు పెరిగేకొద్దీ దేవాలయ కార్యక్రమాల్లో రద్దీ పెరిగింది. బ్రతుకుతెరువు విధానాల్లో వైవిధ్యాలు పెరిగేకొద్దీ బుజ్జగించుకోవలసిన దేవుళ్లసంఖ్య అదే నిష్పత్తిలో పెరుగుతూ పోయింది. ప్రతి వృత్తికి ఒక సొంతదేవుడు; ఆ దేవుని ఒక నివాసం, ఒక భార్య, ప్రత్యేక వ్యవస్థగా తయారైంది. అందులో పలురకాల పనులకు వినియోగింపబడే సేవకుల బృందం ఏర్పడింది. ఆ సేవకులు ధరించే దుస్తులు కూడా ఇతరులు ధరించే వాటికి భిన్నంగా మారిపోయాయి. నెత్తురు బంధాలు తెంచుకుని, అర్చకులు కుటుంబరహిత వ్యక్తులుగా మారిపోయారు. దాంతో ఆలయాలది ఒక ప్రత్యేక కుటుంబంగా రూపొందింది. నాగరికత పెరిగేకొద్దీ అదే నిష్పత్తిలో నైతిక విలువలు దిగజారడం సహజం. క్రమబద్ధం చేసేందుకు పాతకాలం ఆనవాయితీలు చాలవు. కొత్త అవసరాలు తీర్చేందుకు సరికొత్త నిబంధనలు అవసరమయ్యాయి. వ్యాపారం విస్తరించడంతో కొలతలూ, తూనికలకు ఒక ప్రామాణికత తీసుకురావడం కూడా అవసరమయింది. ఆ బాధ్యతలు నిర్వహించడం అనుభవజ్ఞులకే సాధ్యం. అందువల్ల అర్చకులు శాసనకర్తలయ్యారు. దేవాలయాలు న్యాయస్థానాలయ్యాయి. దేవాలయ నిర్వహణకు ప్రతి కుటుంబం వస్తురూపంలో కొంత విరాళంగా చేరుతుండటంతో, వాటి జమాఖర్చులూ, అత్యవసరమైన కొన్ని సంఘటనలూ జ్ఞాపకం నుండి జారిపోకుండా ఉండేందుకు ఏదోవొక రూపంలో వాటిని నమోదు చేయవలసిన అవసరం ఏర్పడింది. ఆ అవసరం నుండి చిత్రలిపి పుట్టుకొచ్చింది. అర్చకుల పరస్పర సంప్రదింపులతో చిత్రలిపి వైశాల్యం ఒనగూరదు. వ్రాయగలగడం, చదవగలగడం కలిసి ‘విద్య’. ఆ కాలంలో గుడికీ బడికీ తేడా లేదు. చదవడం, రాయడం ఎంత వేగంగా పెరిగినా, దేవాలయం వెలుపలున్న సమాజమంతా విద్యలేని వాళ్లే. తమ పెద్దరికానికి సవాలు ఎదురయ్యే ఉపద్రవాన్ని నిరోధించేందుకు, ‘విద్య’ తమ హద్దును దాటిపోకుండా అర్చకవర్గం కట్టుదిట్టాలు పాటించింది. ‘అర్చకులంతా సంకుచితులే’ అనేందుకు వీలు లేదు గానీ, సంకుచితులవల్ల శాస్త్రవిజ్ఞానానికి ఎంత హాని జరిగిందో భారతీయులకు తెలిసినంతగా మరొకరికి తెలియరాదు. విద్యలను కుటుంబ పరిధిలో నిబెట్టుకోవాలనే తాపత్రయంతో అమూల్యమైన వైద్యవిజ్ఞానాన్నీ, ఖగోళవిజ్ఞానాన్నీ లోహపరిజ్ఞానాన్నీ చేతులారా ధ్వంసం చేసుకున్న జాతి మనది. తనసంతానం మేథోశక్తి చాలుతుందా చాలదా అనే విచక్షణ వదిలేసి, ఆసక్తిని వారసులకు సంక్రమింపజేసే చాదస్తంతో విద్యల సారాన్ని సంపూర్ణంగా ఇగురబెట్టింది. ఈ విషయంలో ప్రపంచంలోని పురాతన నాగరికతలన్నింటికి భిన్నంగా ప్రవర్తించింది చైనా, ఆ దేశంలో చదవడం, రాయడం ఒక వర్గం సొత్తుగాదు. ఆసక్తి ఉంటే ఎవరైనా అర్హులే. ఆ విధానం వల్ల సమాజంలో వాళ్ల నైపుణ్యాలు విస్తరిస్తూ వచ్చాయి. మెసొపొటేమియా ఆలయాల దృక్పథం పెద్దదైనా, చిన్నదైనా, అవి ఆ నగరవాసుల విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పైగా, సామాజిక వ్యవహారాలను సమన్వయించేందుకు విజ్ఞత కలిగిన కేంద్రంగా వాటి అవసరం రోజు రోజుకు పెరిగిపోయింది. ఇదివరకటి పౌరుల వ్యాపకాలు వ్యవసాయం, పశుపోషణ, ఆత్మరక్షణలకు పరిమితం. ఇప్పుడు లోహపు పనిముట్ల తయారీ, వర్తకం, నౌకాయానం వంటి కొత్త వ్యాపకాలు సమాజంలో ప్రవేశించాయి. ఎవరెవరి వ్యాపకం వాళ్లది కావడంతో నగర రక్షణకు ఒక సైనికదళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమయింది. ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 68
మెసొపొటేమియాలో మొదలైన దేవాలయ సంస్కృతి, అనతి కాలంలోనే పడమరగావున్న ఈజిప్టుకూ, ఉత్తరంగా మధ్యధరాసముద్రానికి ఆవలిగట్టునున్న గ్రీసుకూ ఆగమేగాల మీద ప్రాకిపో?ఇంది. ఐతే, ఈజిప్టు దేవాలయాలకూ మెసొపొటేమియా దేవాలయాలకూ నమునాలో కొంత తేడా ఏర్పడింది. మెసొపొటేమియన్ దేవాలయాలు విధిగా తూప్పు ముఖానివై ఉంటాయి. నిర్దేశించిన పండుగనాడు సూర్యోదయం తొలికిరణాలు, కుడి ఎడమల చీకటి మయంగా ఉండే నడవను ప్రాకి, బలిపీఠం వెనకుండే విగ్రహాన్ని కొన్ని క్షణాలపాటు దేదీప్యమానం చేసే దిశగా ముఖద్వారం ఏర్పాటైవుంటుంది. ఈజిప్టు పిరమిడ్లు కూడా చాలావరకు తూర్పు ముఖానివే. అరుదుగా పడమటి ముఖాలవి కూడా కనిపిస్తాయి. ఈజిప్టు పాలకుడు ‘ఫ్యారో’ తల అమర్చిన సింహం ప్రతిమలు (స్పింక్స్) తూర్పు ముఖంగానే ఉన్నాయి. కానీ, నైలునది దక్షిణ ప్రాంతంలోని గుళ్ళు ‘సిరియస్’ నక్షత్రానికి అభిముఖంగా ఉత్తరానికి తెరుచుకుంటూ ఉన్నాయి. దీన్నిబట్టి, సూర్యునికీ నక్షత్రాలకూ మధ్యనున్న అనుబంధం మీద ఈజిప్షియన్లకు కొంత అవగాహన మొదలైనట్టు తెలుస్తుంది. క్రీ.పూ. 4000 సంవత్సరాలనాడు ఏర్పడిన సంతలకు క్రమేణా ప్రాధాన్యత విస్తరించి, మెసొపొటేమియాకు నలుదిక్కులతో వాణిజ్య సంబంధాలు నెలకొనడంతో, ఈజిప్టు, గ్రీకు, సింధూ నాగరికతల్లోని స్థిరనివాసాలతో అనుబంధం ఏర్పడడమేకాక, దరిదాపుల్లోని సంచారజాతులతో శత్రు-మిత్ర సంబంధాలు ఉనికిలోకొచ్చాయి. దరిమిలా, సరుకుల ఎగుమతి దిగుమతులేగాక, వణిజుల రాకపోకలు కూడా ముమ్మరం కావడంతో సరుకుల రవాణా కంటే వేగంగా సాంస్కృతికమైన అభిప్రాయాలూ, విశ్వాసాలూ విస్తారంగా నెరుసుకునే వాతావరణం ఏర్పడింది. పరాయి ప్రదేశంలో పుట్టిన విశ్వాసాల్లో ఏది అనుకూలమో దాన్ని స్వీకరించడం, ఏది ప్రతికూలమో దాన్ని వదిలెయ్యడం మూలంగా, నాగరికజాతుల సంస్కృతి కలగాపులగమైన మిశ్రమంగా చాలాకాలం మనుగడ సాగించింది. ఆ మధ్యకాలంలో, దేవాలయాల నిర్మాణం సందర్భంగా ‘దేవునికి ఒక రూపం కల్పించడం ఎలా?’ అనే సమస్య తలెత్తింది. ‘మనిషీ, జంతువూ తదితర ప్రాణికోటి సమస్తం ఆయన సృష్టే అయినప్పుడు దేవుని ఆకారం ఒకానొక మానవునికి మల్లే ఎందుకుంటుంది? తన పోలికలోనే వున్న ఆకారం మనిషి నుండి విధేయతను శాసించగలదా?’ అనే చింతన ఈజిప్టు, మెసొపొటేమియాల్లోని విగ్రహాల స్వరూపాన్ని నిర్ణయించింది. ఈ విగ్రహాలు గొంతునుండి కాళ్ళదాకా మానవుని ఆకారంలో వున్నా, తలమాత్రం పక్షిదో పశువుదో అయ్యుంటుంది. చేప దేవతలైతే, బొట్టు కిందిభాగం చేప, పైభాగం మనిషి. ఎందుకోగానీ గ్రీకులు మాత్రం ఈ నమ్మకానికి చోటివ్వలేదు. వాళ్ల దేవతల విగ్రహాలన్నీ మానవుని పోలికలోనే వుంటాయి. దేవునికి ఒట్టిచేతులతో, వినయపూర్వకమైన భంగిమలతో తృప్తిపరచడం చాలదనే ఆలోచన ఆలయాల నిర్మాణానికి పూర్వమే ఏర్పడిందో, తరువాత ఏర్పడిందో గానీ, దేవాలయాల్లో ‘బలి’ అనేది విధిగా ప్రవేశించింది. ప్రతి దేవాలయంలోనూ విగ్రహానికి ఎదురుగా కొంతదూరంలో బలిపీఠం వెలిసింది. బలిని సమర్పించే ముందు, భక్తుని విధేయతను కళ్ళారా చూసేందుకు ఆ దేవుడ్ని ఆహ్వానించాలి. అందుకు తగిన మనిషి కావాలి, తగిన వాగ్ధాటి కావాలి. ఫలితంగా ప్రతి దేవాలయానికీ ఒక అర్చకుడు (పూజారి) అవసరమయ్యాడు. అతను స్థిరంగా పాదుకున్నాడు. ఆ అర్చకుని మూలంగా ఆచారాలూ, నమ్మకాలు మరింత జటిలంగా పెనవేసుకుని, సమాజంలోని కట్టుబాట్లను శాసించడం మొదలెట్టాయి. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 46
ఈజిప్టు, మెసొపొటేమియాల కంటే మిక్కిలి విస్తారమైన ప్రాచీన నాగరికత సింధూ పీఠభూమిది. మెసొపొటేమియాకు మల్లే ఇది జంట నదుల నాగరికత. ఈ జంటలో ప్రధానమైంది సింధూ నది. దీనికి సమాంతరంగా ఒకప్పుడు తూర్పుపార్శ్వంలో ప్రవహించిన ఘగ్గర్-హాక్రా (Ghaggar-Hakra) నది ఇప్పుడు అంతర్థానమైంది. దీని ఉనికి కేవలం శాటిలైట్ చిత్రం ద్వారా తెలుసుకోవలసిందే. బహుకాలంగా చరిత్రకారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో సింధూ నాగరికతకు సంబంధించిన సమాచారం మనకు దొరకుతున్నది అరకొరగానే. దొరికిన కొద్దిపాటి సమాచారంతోనే ప్రపంచానికి అబ్బురపాటు కలిగించిన నాగరికత సింధూ పీఠభూమిది. నేటి పాకిస్థాన్లోని ‘క్వెట్టా’ పట్టణానికి సమీపంలో, క్రీ.పూ. 7000 కాలం నాటి ‘మెహ్గ్రర్ (క్ఛజిటజట్చజి)లో బార్లీతో పాటు గోధుమ సాగైనట్టు తెలియడమే కాకుండా, మొట్టమొదటిగా ‘పత్తి’ (ఇౌౌ్ట్ట) ఆనవాళ్లు కనిపించింది ఇక్కడే. ‘సింధూ’ అనే పదానికి పర్షియన్ భాషలో సమానార్థకం ‘హిందూ’. ఆ కారణంగా గ్రీకులు, ఇరానియన్లు ఈ ప్రాంతాన్ని ‘హిందూ’ దేశంగా వ్యవహరించడంతో ఆ పేరే చరిత్రలో కొనసాగింది. మెసొపొటేమియాకు మల్లే సింధూ నాగరికతలో కూడా ఇంటి నిర్మాణాలకు వాడింది ఇటుకేగాని, ఇవి కాల్చిన ఇటుకలు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం ఈ నాగరికత విశేషాలు. ఆ రోజుల్లో ఎక్కడా కనిపించని విధంగా ఇక్కడ ఇంటింటికి ఒక బావి, ఒక స్నానాల గది ఉండటం చూస్తే, ఇక్కడి వాతావరణంలోని తేమ, వేడి కారణంగా ఈ నాగరికులు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టే కనిపిస్తుంది. వీటికి తోడు నగరం మధ్యలో కోనేరు. దాని ప్రయోజనం తెలీక పాశ్చాత్య పురావస్తు నిపుణులు దాన్ని పుణ్యస్నానాలకు ఉపయోగించే ‘గ్రేట్ బాత్’ (ఎట్ఛ్చ్ట ఆ్చ్టజి)గా భావించారు. వాస్తవానికి అది నగరవాసుల మంచి నీటి సౌకర్యం కోసం ఏర్పాటైన సదుపాయం. ఊట బావి నీరు మట్టిలోని లవణాలను అంతో ఇంతో కరిగించుకోవడంతో జవుకులుగా మారే అవకాశమున్న కారణంగా, వాటిని తాగేందుకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటూ, ఇటుకలతో కట్టిన కాలవద్వారా ఏటి నీరు నేరుగా కోనేటికి చేర్చుకుని, వాటిని తాగేందుకు ఉపయోగించడం ఇటీవలి కాలం దాకా దక్షిణ భారతదేశంలో సంప్రదాయంగా ఉండేది. కోనేర్లు రెండు రకాలవి మనకు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. దేవాలయాల దగ్గర కనిపించే కోనేర్లకు తీరం పొడవునా, చుట్టూరా మెట్లుంటాయి. ఇవి స్నానాలకు ఉపయోగించేవి. మంచి నీటి కోనేర్లు సాధారణంగా దీర్ఘచతురస్రాలు. ఇరువైపులా వెడల్పు తక్కువుండే భుజాల్లో మాత్రమే వీటికి మెట్లుంటాయి. మొహెంజదారోలో కనిపించే గ్రేట్బాత్ అచ్చం ఈ తరహాదే. ప్రపంచంలో ఎక్కడా కనిపించనన్ని ధాన్యపు రకాలకు సింధూ పీఠభూమి ఆలవాలం. గోధుమ, బార్లీ, రాగి, జొన్న, సజ్జలతో పాటు జీలకర్ర ప్రమాణంలో ఉండే బియ్యం తదితరాలు తృణధాన్యాలు; కంది, పెసర, శెనగ, ఉలవ, అనుము, మినుము, అలసంద తదితరాలు పప్పుదినుసులు; నువ్వులు, ఆవాలు, అవిసె, వేరుశనగ వంటివి చమురుగింజలు; వీటికి తోడు పలురకాల దంపులు, కూరగాయలు, పోపుదినుసులు విస్తారంగా పండేవి. పైరుగా కాక, నదీతీరాల్ల పొదలుపొదలుగా చెరుకు యదేచ్ఛగా పెరిగేది. బహుశా ఈ పంటల సమృద్ధి కారణంగా కావచ్చు, శాకాహారానికి ప్రాముఖ్యత పెరిగి, సింధూప్రాంత నివాసాల్లో జంతుబలి ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తుంది. ఖనిజ సంపదలో పలురకాల రంగురాళ్లు కనిపిస్తాయే తప్ప, లోహాలు అరుదు. సింధూ నది ఎగువ ప్రాంతంలో దొరికే కొద్దిపాటి బంగారు మినహా, మిగతా ఏ లోహమూ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటు కాదు. అందువల్లే ఈ పురాతన నగరాల్లో లోహపరిశ్రమకు చెందిన ఆనవాళ్లు తక్కువగానూ, రంగురాళ్లను పూసలుగా తయారుజేసే పరిశ్రమలు ఎక్కువగానూ కనిపిస్తాయి. అనాది నుండి ఈ నాగరికత వైఢూర్యాలకు ప్రసిద్ధి. ఈ రంగుపూసల అమ్మకం కోసమే ఇక్కడి వారికి మెసొపొటేమియాతో వ్యాపార సంబంధం ఏర్పడింది. గిరాకీని అందుకునే స్థాయికి వృత్తికర్మాగారం పెరిగింది. అంతేగాదు, సరుకు నాణ్యతను ధృవీకరించే ‘బ్రాండింగ్ పద్ధతి కూడా అమలులో ఉండేదని నిరూపించే ఆధారాలు ఆ త్రవ్వకాల్లో బయట పడిన ముద్రికా పరికాలు (seals). రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 45
నాగరికత కట్టడాలకు మెసొపొటేమియాలో ఉపయోగించింది ఇటుకలు మాత్రమే. ఆ ప్రాంతాల్లో రాయి అరుదైన పదార్థం. ఎండవేడికి పటిష్టంగా బిగుసుకునే బంకమట్టి కోరినంత దొరుకుతున్న కారణంగా, ఇంటి నిర్మాణానికి ఇటుక తప్ప వేరొకదాన్ని గురించి ఆలోచించే అవసరమే వాళ్లకు కలిగుండకపోవచ్చు. సామూహిక ప్రయత్నంతో తమ పరిసరాలను క్రూరమృగాల నుండి విముక్తి చేసుకోగలగడంతో, బల్లెం చేత్తో పట్టుకుని ఒంటరిగానైనా పొలాల్లో యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛను వాళ్లు సంపాదించుకున్నారు. చీకూ చింతాలేని జీవితం కావడంతో జనసాంద్రత అదివరకు ఎన్నడూ పెరగనంతగా పెరగడం మొదలెట్టింది. దాని మూలంగా గ్రామాల విస్తీర్ణం పెరిగింది, వాటి సంఖ్య పెరిగింది. అక్కడక్కడ కొన్ని జనావాసాలు గ్రామాల స్థాయిని దాటుకుని ‘పురాలు’గానూ, మరికొన్ని ‘నగరాలు’గానూ ఏర్పడ్డాయి. ఇప్పుడివి పచ్చికబయళ్ల కోసం ఇరుగుపొరుగుతో చావు బతుకులు తేల్చుకునేంత పోరాటానికి దిగే జనపథాలు ఎంతమాత్రం కావు. అవసరమైతే చేదోడువాదోడుగా నిలబడటం నేర్చుకున్న గ్రామాలు; పొలాలను తడుపుకునేందుకు ఏటికాలువల త్రవ్వకాలను ఉమ్మడిగా సమన్వయించుకునే గ్రామాలు. వాళ్లకిప్పుడు నరమేథంతో పురుషులను ఖతం చేసే అవసరం తీరిపోయింది. మిథునాల కోసం ఏ జనపథం నుండో స్త్రీ జనాన్ని దోచుకురావడం అనాగరికమైంది. అందుకోసం వరుసలూ, వియ్యాలూ పుట్టుకొచ్చాయి. అంతర్గతంగా ఎంత ప్రశాంతత సాధించినా, చుట్టుపక్కలుండే అనాగరిక తెగలతో మెసొపొటేమియాకు ఆటుపోట్లు తప్పలేదు. ఉత్తరంగా ఉండే ఆసియా మైనర్లో ఆటవికులు, తూర్పు దిశన మధ్య ఆసియాలో సంచార తెగలు, దక్షిణాన అరేబియా ప్రాంతంలో ఎడారి జాతులు - వాళ్ల నుండి క్రూరమైన దాడులను ఎదురుజూస్తూ ఏ పూటకాపూట వాళ్ల జీవితం బిక్కుబిక్కుమని గడుస్తుండేది. పోరాటానికి తెగించింది దాడిచేసే గుంపు. ఐనా, ఆ దాడులను నిగ్రహించుకుని మెసొపొటేమియన్లు నిలదొక్కుకున్నారంటే, అది కేవలం సంఖ్యాబలం, సమన్వయాల మూలంగా సాధించుకున్నదే. ఎంత నిలదొక్కుకున్నా యుద్ధం వల్ల అంతో ఇంతో నష్టం జరిగే తీరుతుంది. ఆ నష్టం కంటే దాడికి పాల్పడే గుంపుతో బేరం కుదుర్చుకోవడం క్షేమమనే ఆలోచన కొన్నిచోట్ల కలిగిందనటానికి మహాభారతంలోని బకాసురుని వృత్తాంతమే ఆధారం. ప్రాణహానిని ఎదుర్కోవడం కంటే, ఎంత అనుభవించినా తరగని సంపదలో ఎంతోకొంత ఎదుటి పక్షానికి ఒప్పందంగా అప్పగించి, అధిక నష్టాన్ని అరికట్టడం లాభదాయకమనే ఆలోచన భారతంలోన ఏకఛత్రపురవాసులకు కలిగినట్టే మరెంతోమందికి కలిగుండొచ్చు. బండి నిండా పంపించే వంటకాలతో తృప్తిపడకుండా, నరమాంసం కోరుకునే దురాశే బకాసురునికి లేకపోతే, అతని భావితరాలకు బహుశా ఈస్టిండియా కంపెనీవాళ్లు అడ్డుకునే దాకా నిరపాయంగా సాగిపోతూ ఉండేదేమో! మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికతల్లో ఏది మిక్కిలి పురాతనమైందో చరిత్రకారులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్న సందేహం. ఇవి ఒకదాన్నుండి మరొకటి పుట్టుకొచ్చినవా లేక దేనికది స్వతంత్రంగా ఎదిగినవా అనేది గూడా జవాబు దొరకని మరో ప్రశ్న. ఇప్పుడు ఉగాండా దేశంగా ఉన్న తావున పుట్టి, ఉత్తర దిశగా సూడాన్ దేశం నిలువునా ప్రవహించి, ఈజిప్టు ద్వారా మధ్యధరా సముద్రంలో కలిసే ‘నైలు నది’ పరీవాహక ప్రాంతం పొడవునా విస్తరించిన నాగరికతను ‘ఈజిప్టు నాగరికత’ లేదా ‘నైలునది నాగరికత’ అంటారు. స్థూలంగా దీనికీ మెసొపొటేమియా నాగరికతకూ వ్యత్యాసం కనిపించదు. మలిచేందుకు ఒదిగే సున్నితమైన రాయి నైలు ప్రాంతంలో దొరుకుతున్న సౌలభ్యం మూలంగా ఇక్కడి నిర్మాణాలకు రాయిని ప్రధానంగానూ, ఇటుకను సహకారంగానూ వాడుకున్నారు. బయటి నుండి జరిగే దాడుల విషయంలో ఇజిప్షియన్లు అదృష్టవంతులు. వాళ్ల రక్షణకు తూర్పున ఎర్రసముద్రం ఉంది, ఉత్తరాన మధ్యధరా సముద్రం ఉంది. పడమటి దిశలో ఎడారిగా మారుతున్న సహారా కాగా, దక్షిణంగా ఉండేది దాడికి సాహసించలేనంతగా వెనుబడిన నీగ్రో తెగలు. రచన: ఎం.వి.రమణారెడ్డి